Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనివార్యం

[శ్రీ రాజ మోహన్ ఇవటూరి రచించిన ‘అనివార్యం’ అనే కథని అందిస్తున్నాము.]

లనొప్పి దంచేస్తోంది. ఒక కాఫీ కొడితే గానీ తగ్గదు. ఒక్కొక్కప్పుడు కాఫీ కొట్టినా దిక్కుమాలిన తలనొప్పి తగ్గదు.

ఇంతలోనే చూసాను. ‘వచ్చేసింది ఈ అమ్మాయి’ అనుకున్నాను.

ఆ పిల్ల పేరు తెలియదు. ఎవరు అని ఒకసారి మూర్తిని అడిగితే “ఏమో రా! రోజూ మా ఆసుపత్రికి వస్తుంది. ఆమెకి పరిచయం లేని రోగులని కూడా పలకరిస్తుంది. ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది ఉందో ఆ రోగుల దగ్గర ఎక్కువ సేపు ఉండి వారు కొంతసేపయినా బాధలు మరిచిపోయేలా నవ్వుతూ మాటాడుతుంది.” అన్నాడు వాడు.

“చిత్రంగా ఉందే. ఎందుకలా?” అన్నాను.

“తెలియదు. సంఘ సంస్కర్తేమో” నవ్వాడు.

అప్పటినుంచి గమనించాను.

రోగులతో మాత్రమే కాదు. కొంత మంది వైద్యులనీ, కొంతమంది ఆసుపత్రి సిబ్బందిని కూడా కలుస్తూ ఉంటుంది. కానీ అందరితో కాదు! కొంతమంది మీదే ఏమిటీ ప్రత్యేక అభిమానం? వైద్యుడు బెనర్జీతో ఏమిటి మాటలు? ఆ ముసలి దాది డిసౌజాతో ఏమిటి అవసరం?

“అడిగేస్తే పోలా?” అన్నాడు మూర్తి.

ఓరి వీడి ముఖం కాల్చా? నా మనసులో అనుకున్నది వీడికేలా తెలిసిపోతుంది? అనుకుని “అవును. అడిగేస్తా” అన్నాను.

ఆమె వస్తోంది. దగ్గరికి వచ్చాక పలకరించాలని అనుకుంటుంటే నా ఫోన్ మోగింది.

నేనెంత పనికిమాలినవాడినో ఎన్నో రకాలుగా చెప్పే హక్కుని రెండేళ్ల క్రితమే పొందిన మాలతి ఫోన్ చేసిందని తెలియగానే ‘ఎంత చక్కటి సమయం ఎంచుకుంది’ అనుకుంటూ కట్ చేసేసాను.

ఆ విచిత్రమైన అమ్మాయి ఎదురుగా వస్తూ నన్ను దాటుకునే సమయానికి మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి ఫోన్ తీసి “డ్యూటీలో ఉన్నపుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను?” అని కోపంగా చెప్పి అవతల మాట వినకుండానే కట్ చేసాను.

ఎంత త్వరగా సంభాషణ ముగించినా అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. నేను నిట్టూర్చి పనిలో పడ్డాను. నేను ఆసుపత్రిలో అకౌంట్స్ చూస్తూ ఉంటాను. అంచేత రోగులతో వైద్యులతో ఎక్కువ పని ఉండదు. అయినా అటూ ఇటూ తిరిగేటపుడు ఆ పిల్ల కనపడుతుంది.

***

బెనర్జీ చనిపోయాడు. గుండెపోటు అట. డాక్టర్ అయి ఉండీ ప్రమాదం తెలుసుకోలేకపోయాడు. ఒక వేడివేడి కాఫీ తాగి తలనెప్పి తగ్గించుకుందాం అనుకుంటుండగా ఈ వార్త. తప్పనిసరిగా మా హాస్పిటల్ ఆవరణలో జరుగుతున్న సంతాప సభకి బయల్దేరాను.

అనుకోకుండా ఆ పిల్ల కనిపించింది. కలిసిన సందర్భం చాలా అసహ్యంగా ఉన్నా ఎప్పటినుంచో మాటాడాలనుకుంటున్నాను కనుక పలకరించాను.

“రోజూ మీరు చేస్తున్న సేవలు గమనిస్తున్నాను. మీరు చాలా మంచివారు” అన్నాను.

ఆమె కనిపించనట్టు నవ్వింది. “ఇదేమీ సేవ కాదులెండి. నా బాధ్యత” అంది.

అల్లాంటి పడికట్టు మాటలు చికాకు కనుక పట్టించుకోకుండా “మీ ఆప్తుల్లో నన్ను కూడా చేర్చుకోండి. నేను ఇక్కడే పని చేస్తున్నాను” అన్నాను.

అంతవరకూ చిరునవ్వుతో మాట్టాడుతున్న ఆమె ముఖంలో నవ్వు మాయమయింది. “ఇంకెప్పుడూ నాతో ఇలా మాటాడకండి. మీరు నాకు కనిపించటం ఒక దురదృష్టం అనుకుంటాను.” అని చెప్పి అక్కడనుంచి కదిలింది.

నాకు ఒళ్ళు మండిపోయింది. ‘అశ్లీలత మీ మగాళ్లలో ఉంది, మాలో కాదు’ అంటూ మాటాడే ఈ మహిళామణులు ఇప్పుడు నేను చాలా నిజాయితీగా మాట్లాడిన మాటల్లో వేరే అర్థం ఎందుకు తీసుకుంటారు? ఇలాంటప్పుడు మా మగాళ్ళకి కూడా ఒళ్ళు మండదా?

నాకు పెళ్లయింది. కొంచెం చికాకు మనిషయినా భార్యని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి పద్ధతి నచ్చి స్నేహం చెయ్యమంటే వెంటనే ఇలాంటి అర్థం లేని మాటలు అనేస్తారా? అని కోపంగా నేను జవాబు చెప్పబోతుంటే మళ్ళీ ఫోన్ మోగింది.

“ఇంకో పది నిముషాల్లో వస్తున్నాను. సెలవు” అని ఫోన్ నోరు నొక్కేసాను. ఈలోపున ఆ అమ్మాయి వెళ్లిపోయింది. ఆమెకి దీటైన జవాబు చెప్పేలోపలే మళ్ళీ వెళ్లిపోయిందని నిట్టూర్చాను.

అదే పనిగా ఫోన్ చేసే భార్యని తిట్టుకున్నాను. నాకు భార్య పైన కోపం లేదు. కానీ ఒక నిర్లిప్తత. నాకు తలనెప్పిగా ఉన్నపుడు తనే అర్థం చేసుకుని తల పట్టచ్చు కదా అనుకుంటాను. అప్పుడు పొద్దుట్నుంచి పని చేసిన అలసట పేరు చెప్పి పడుకుని కనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలోనే ఇలాంటివి జరిగాక నాకు విరక్తి కలిగింది. తలనొప్పొస్తే మందేసుకుంటాను. కాఫీ కావాలంటే బైటికి పోయి తాగి వస్తాను. గంటకి పదిసార్లు కాల్ చేసి తింగరి ప్రశ్నలు అడిగే తనతో మాట్లాడటం కూడా తగ్గించేసాను.

రోజులు గడుస్తున్నాయి. ఈ సంఘ సంస్కర్తని అప్పుడప్పుడు చూస్తున్నాను. కానీ కోపంతో మాటాడలేదు.

మేడం డిసౌజా ఆసుపత్రిలోనే మరణించిన రోజు ఆమె కూడా ఆఖరు చూపుకి వచ్చింది. ఆమె చుట్టూ ఎక్కువ మంది లేరు. అయినా మాటాడదలచుకోలేదు.

డిసౌజా శరీరాన్ని ఖననానికి తీసుకెళ్ళాక నేను వెళ్లిపోతుంటే ఆమే నవ్వుతూ పలకరించింది.

ఇప్పుడు నేను గట్టిగా జవాబిస్తాను!!!

అదేమి ఖర్మో మళ్ళీ ఫోన్ మోగింది.

ఎప్పటిలాగే విసుగ్గా నేను ఫోన్ ఆపెయ్యబోతుంటే ఆమె నన్ను కళ్ళతోనే వారించి నా ఫోన్ అందుకుంది. ఎప్పుడూ భార్యని విసుక్కోవటం ఈవిడ కూడా గమనించినట్టుంది. అవతలివైపు మాటలు వినపడకుండా ఒక క్షణం ఫోన్ మూసేసి “మీ భార్య ఏమి చెప్తుందో ఒకసారి వినచ్చుకదా!” అంది.

ప్రతిసారీ ఫోనులో విసుక్కోవటం గమనించి అవతలనుంచి మాట్లాడేది నా భార్య అని బాగానే ఊహించింది. ఆ పిల్ల మాటలకి అడ్డు చెప్పాలని ఉన్నా ఏదో శక్తి నన్ను ఆపింది. మౌనంగా ఫోన్ అందుకున్నాను.

“చెప్పు” నిర్లిప్తంగా అన్నాను మాలతితో.

“అమ్మయ్య ఇన్నాళ్ళకి మీకు ఆసుపత్రిలో తీరిక దొరికింది. అక్కడ పని బాగా ఉంటుంది కదా! రోజు మీకు వేడివేడిగా భోజనం పెట్టాలనుకుంటాను. అందుకే మీరొచ్చాక వంట మొదలు పెడతాను. కానీ అలా చేస్తే వంట పూర్తయ్యే వరకూ ఆకలిగా కూర్చుంటున్నారు. ఈ రోజు అక్కడ పని కాగానే బైక్ ఎక్కే ముందు నాకు కాల్ చెయ్యండి. మీరు ఇంటికి వచ్చే టైం నా వంటకి సరిగ్గా సరిపోతుంది.” అంది మాలతి.

“అంత ఓవరాక్షన్ వద్దులే” అన్నాను.

ఆ మాటలు పట్టించుకోకుండా “ఈరోజు మీకోసం ముల్లంగి పులుసు, తెలకపిండి కూరా చేస్తాను” అంది.

వెంటనే ఆశ్చర్యపోయి “ఈ రెండూ నాకు ఇష్టమని నీకెలా తెలుసు?” అని అడిగాను.

“మొన్న మీ అన్నగారింట్లో రెండు సార్లు వేసుకుని తిన్నారు కదా” అంది అర్ధాంగి.

ఇటువంటి సందర్భాలు చూసి నాటకీయమని వేరేవాళ్లని చూసి నవ్వుకున్న నాకు ఈ రోజు నాటకీయంగానే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

“నువ్వు భలేదానివి హనీ!” ముద్దు పేరుతో భార్యని సంబోధిస్తూ అన్నాను. ఎదురుగా ఉన్న అమ్మాయి పకాలుమని నవ్వింది.

“ఎవరండీ అక్కడ?” అడిగింది హనీ.

“నీ కొత్త ఆడపడుచు. ఆమె పేరు లోకకల్యాణం.” అన్నాను నవ్వుతూ.

“ఆమెని కూడా రమ్మనండి ఈరోజు” అంది.

మా మాటలు విని “భోజనమా! వద్దండి. నేను రాకూడదు” అంది ఆడపడుచు.

“ఆవిడకేదో ఇబ్బంది ఉన్నట్టుంది. మరోసారి పిలుస్తాలే. ఫోన్ పెట్టెయ్యనా?” అన్నాను మాలతితో.

“అలాగే” ఆ తర్వాత మ్చ్ అని వినపడింది. ‘అమ్మ దొంగా నీకు ఇన్ని కళలు ఉన్నాయా?’ అనుకున్నాను.

అంతా నవ్వుతూ వింది ఆడపడుచు.

“మీకు మీ భార్యతో పాటు ఉద్యోగం, వేరే వ్యాపకాలూ ఉన్నాయి. తనకి మీరు తప్ప వేరే ఎవరూ లేరు. తనతో ఎక్కువ సేపు గడపండి. ఎప్పుడో సెలవు రోజు గడపచ్చు అని ఆలస్యం చెయ్యకండి. కొన్ని అనుభూతులు ఆ క్షణంలో కలిగితేనే బావుంటుంది.”

ఆమె నా వ్యక్తిగత విషయాలు మాటాడుతున్నా కొన్ని విషయాలు ఆమె ఊహించి మాట్లాడినా నాకు అభ్యంతరం అనిపించలేదు. అనుకోకుండా ఆమె నిజమే చెప్పింది కదా!

నా భార్యలో వేరే కోణం చూసిన నాకు రోజులు ఎంతో మధురంగా గడుస్తున్నాయి. నా భార్యకి కూడా కాలక్షేపం ఉండాలి కదా! ఆమె పేరున బ్యాంకు అకౌంట్ తెరిచాను. ఆమెని ఆ కాలనీలో మహిళామండలికి పరిచయం చేసాను. ఈ మద్యే వాళ్ళ ప్రోత్సాహంతో కుట్టుపనులు మొదలుపెట్టింది. డబ్బుల కోసం కాకపోయినా ఆమె స్వతంత్రంగా ఏదో చేసుకుంటే సంతోషం అనుకుని నేను కూడా ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆ పనుల్లో చాలా బిజీ అయిపోయి బాగానే సంపాదించుకుంటోంది. ఎన్ని చేసినా నేను ఇంటికి వచ్చాక అన్నీ బంద్! ఇంతకంటే నాకేం కావాలి?

నా కొత్త ఆడపడుచు కూడా తరుచూ ఆసుపత్రిలో కలుస్తుంది. నవ్వుతూ పలకరించి క్షేమసమాచారాలు వింటుంది.

భార్య కోసం అప్పుడప్పుడు సెలవు తీసుకున్న రోజులు కూడా ఎక్కడో దుకాణంలోనో గుడిలోనో ఖచ్చితంగా ఆ పిల్ల కనిపించి మాటాడుతోంది.

ఒక రోజు ఆమెతో చాలా పరిచయం పెరిగాక “చాలా సంతోషం అండి. నేనంత చెడ్డవాడిని కాదు అని చాలా రోజుల తర్వాత గ్రహించారన్న మాట. కొన్నాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేసినా చివరికి మీరు మనసు మార్చుకున్నారు.” అన్నాను.

“నిర్లక్ష్యం చేయటం ఏమీ ఉండదు. ప్రతివారినీ నేను ఎప్పుడో ఒకసారి కలుసుకోవాలి. మిమ్మల్ని కలవటం నా మనసుకి ఇష్టం లేకపోయినా తప్పలేదు.” అని నవ్వింది. పరిహాసమేమో అని తలెత్తి చూసాను. ఆమె నవ్వు సంతోషంగా లేదు.

ఎందుకిలా అంటోంది?

హఠాత్తుగా మనసుకు తోచింది. ఇంతవరకూ ఆమె కలిసిన రోగులందరూ చనిపోయారు. ఆమె కలుసుకున్న వెద్యులూ, సహాయకులూ ఈ మధ్య మరణించిన మేడం డిసౌజా వరకూ అందరూ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన వారే! ఆమె అలాంటి వారితో మాత్రమే మాట్లాడుతోంది.

అంటే???

నా సమయం కూడా అయిపోయిందా? ఈ అమ్మాయి మృత్యుదేవతా???

సరిగా అప్పుడే నాకు మెదడులో అప్పుడప్పుడు కలిగే తలనొప్పి పెద్దదయింది. తల పగిలిపోతోంది. అయిదు ప్రాణాలలో ఒక్కొక్కటీ నా శరీరాన్ని వదిలేస్తున్నాయి.

ఇంకో యాభయ్ అరవై ఏళ్ళు బ్రతకవలసిన నేను ఇలా అర్ధాంతరంగా పోతున్నానా?

లేదు. లేదు. కొన్నిరోజుల క్రితమయితే చనిపోయి ఉండేవాడిని.

ఇప్పుడు నేను నా జీవితం జీవించి వెళ్ళిపోతున్నాను. ఈ దేవతకి ధన్యవాదాలు.

Exit mobile version