[ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలు సందర్శించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు పాణ్యం దత్తశర్మ.]
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం ట్రస్ట్, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం వారి ఆహ్వానంపై, కార్తీకమాసపు చివరి సోమవారం, ఉదయం – కార్తీక వైభవం, శ్రీనాధుని హరవిలాసంపై; సాయంత్రం వీర బ్రహ్మేంద్ర దివ్యతత్వంపై, రెండ్రెండు గంటలపాటు ప్రవచనాలు చేశాను. కర్నాటక లోని ‘యాద్గిర్’ నుండి నా బాల్యమిత్రుడు యోగానంద హైదరాబాద్‌కు వచ్చాడు. మహబూబ్‌నగర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ముందుగానే స్లీపర్ క్లాస్‌లో బెర్తులు రిజర్వు చేయించుకుని ఉన్నాం.
మా యోగా యాద్గిర్ నుంచి మెత్తని జొన్న రొట్టెలు నాలుగు తెచ్చాడు. నేను మా యింటి నుండి వైట్ రైస్ (అన్నం అనొచ్చుగా!), నువ్వుల పొడి తెచ్చాను. రైలు సాయత్రం 6 గంటల 10 నిమిషాలకి కాచిగూడలో. టైం ఉండడంతో స్టేషన్ దగ్గరగా ఒక గుట్ట మీద వెలసిన ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నాము. హైదరాబాదు లోని ప్రసిద్ధ దేవాలయాలలో అదీ ఒకటి. దాన్ని హనుమాన్ మందిర్ అంటారు. మార్వాడీల నిర్వహణ. దీనికి ‘శ్యామ్ మందిర్’ అని కూడాడా పేరు. స్వామి వెలసిన గుట్టను ‘వీరన్నగుట్ట’ అంటారు. అక్కడ ఒక మార్వాడీ గురువు గారి మందిరం ఉంది. చాలా రిచ్‌గా ఉంటుంది. ప్రధాన ద్వారానికి ఒకవైపు లక్ష్మీనారాయణులు, మరో వైపు రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలున్న ఉపాలయాలున్నాయి. విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతూంది. కాని, ఉత్తర భారతశైలి!
గుట్టమీదికి వెళ్లడం కోసం ఒక ముఫై, నలభై మెట్లున్నాయి. కాని, లిఫ్ట్ కూడా ఉంది. పైన విశాలమైన ఆవరణ, చెట్లు, శివాలయం. ప్రశాంతంగా ఉంది. మా యోగానంద ముగ్ధుడైనాడు.
***
రైలు ఒకటవ నంబరు ప్లాట్‌ఫారానికే వచ్చింది. 10 నిమిషాలు ముందుగా. ఎక్కి కూర్చున్నాం. తోటి ప్రయాణీకుల్లో ఒకాయన “ఇది విజయవాడకు వెళ్లదు” అని ప్రకటించాడు. ఇంకో ఆయన ఒప్పుకోలేదు. “విజయవాడ అంత పెద్ద జంక్షను, అక్కడికి వెళ్లకుండా ఉంటుందాండి?” అన్నాడు. నేను కల్పించుకొని “నిజమేనండి . విజయవాడ స్టేషన్ రాదు. బైపాస్ లైన్‌లో వెళుతుంది. ఖమ్మం వదిలితే ఏలూరే!” అన్నా.
“విశాఖపట్నం స్టేషన్‌కు కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ రైళ్ళు వెళ్లవండి. దువ్వాడ నుండి డైరెక్ట్‌గా విజయనగరమే. వైజాగ్ వాళ్లు దువ్వాడ దిగాల్సిందే” అన్నాను.
‘చూసావా, నాకెన్ని విషయాలు తెలుసో!’ అన్నట్టుగా మా యోగా గాడి వైపు చూశాను. వాడు అదేం పెద్ద విషయం కాదన్నట్లు ముఖం పెట్టాడు. దొంగ వెధవ!
జొన్నరొట్టెలు, అన్నం తిన్నాం. పెరుగు పాకెట్ ఉండనే ఉంది. తిని హాయిగా పడుకున్నాం. మేం తునిలో దిగి నర్సీపట్నం వెళ్లాలి. రైలు ఉదయం 4.40కి తుని చేరుతుంది. నర్సీపట్నంలో నా ఇంకో ప్రాణమిత్రుడు డా. జెట్టి యల్లమంద ఉన్నాడు. మా ముగ్గురం ఒక టీమ్. ముగ్గురు మరాఠీలన్నమాట.
“ఉదయం తుని స్టేషనుకు కారు పంపిస్తాను, కొడుకుతో” అని యల్లమంద అంటే వద్దన్నాను. “తెల్లవారుజామున చలిలో ఆ కుర్రవాడిని ఇబ్బందిపెట్టద్దు” అన్నాను. పిల్లలు ఎంత మంచివాళ్లయినా వారి సేవలను అవసరం ఉంటేనే ఉపయోగించుకోవాలి కదా!
తుని దిగి స్టేషన్ బయటకు వచ్చాము. కొంచెం దూరంలో నర్సీపట్నం బస్సులు ఉంటాయి. కాని బయటే ‘టాటా మ్యాజిక్ ఏస్’ సెవెన్ సీటర్ వ్యాన్ ఉంది. “నర్సీపట్నం! నర్సీపట్నం!” అని అరుస్తున్నాడు! నాన్-స్టాప్ అట పైగా! ఇంకేం? ఎక్కి కూర్చున్నాం. 40 కి.మీ. గంట లోపే చేరాం. యల్లమంద కొడుకు వంశీకృష్ణ కారు తీసుకొని వచ్చాడు వ్యాన్ ఆషిన చోటుకు. దాన్ని శ్రీకన్య డౌన్ అంటారు. వాడు బంగారు కొండ. నేనంటే ఇష్టం. “అంకుల్! వచ్చేశారా!” అని రోడ్డు మీదే నా పాదాలు తాకాడు. ఆప్యాయంగా కౌగిలించుకున్నా. యోగాను పరిచయం చేశా.
యల్లమంద భార్య, నా చెల్లెలు భారతమ్మ, కోడలు (వంశీ భార్య) సంధ్య, కూతురు ప్రణవి మమ్మల్ని సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అద్భుతమైన ఆతిథ్యం, ఆదరణ! మా అమ్మాయి పేరు కూడా ప్రణవే. ఇద్దరూ మేం పలాస కాలేజీలో పని చేస్తున్నప్పుడు పుట్టారు. వాళ్ళు చంటిపిల్లలుగా ఉన్నపుడు శాస్త్రి డాక్టరు గారని, ఆయన వద్దకు చిన్న చిన్న సిక్‌నెస్‌లు వస్తే తీసుకువెళ్ళే వాళ్లం. ఆయన “నిన్ననే తెలుగు ప్రణవి వచ్చి వెళ్లింది, ఈరోజు ఇంగ్లీషు ప్రణవి వచ్చింది!” అనేవారు. నా సబ్జెక్ట్ ఇంగ్లీషు! యల్లమంద సబ్జెక్ట్ తెలుగు!
రెండు ప్రవచనాలూ చక్కగా జరిగాయి. మర్నాడు ఉదయం స్నానాలు చేసి, కాఫీలు తాగి, 7 గంటలకు బయలుదేరాం. వంశీయే మా రథసారథి. బ్రేజా కారది. కొత్తది! గ్రే కలర్ మెరుస్తూంది. దారిలో తాండవ జంక్షన్ దగ్గర ఒక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేశాం. పూరీలు చాలా పెద్దవి. సింగిల్ పూరీ తిన్నాము (ఒక్కొక్కరము), ఊతప్పాలు చాలా చిన్నవి. అవీ తలా ఒకటి తిన్నాం.
తుని దగ్గర హైవే ఎక్కింది మా కారు. వంశీ స్థితప్రజ్ఞుడు. కుర్రాడైనా బ్యాలెన్స్‌డ్‌గా డ్రయివ్ చేస్తున్నాడు. మేం అన్నవరం చేరేసరికి తొమ్మిది దాటింది. కార్తీకమాసం, ఏకాదశి! అన్నవరం కొండ భక్తులతో కిటకిటలాడుతూంది. నేను పాయకరావుపేటలో ప్రిన్సిపాల్‌గా ఐదేళ్ళు చేశాను. అప్పుడు నా దగ్గర వొకేషనల్ లెక్చరర్‌గా పని చేసిన పొన్నాడ శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఉన్నా. ‘కొండబాబు’ అని దేవస్థానం ఉద్యోగి తన శిష్యుడనీ, అతనికి మేం వస్తున్నట్లు చెప్పాననీ, అతని నంబరు పంపాడు శ్రీను. నేను కారులో నుంచే ఆ కొండబాబుకు ఫోన్ చేశాను. “సార్ పడమటి రాజగోపురం దగ్గరికి రండి. నేనక్కడ ఉంటాను. అక్కడ కార్ పార్కింగ్ లేదు. కారు పార్కింగ్ క్రింద ఉంది. పైకి రావడానికి ‘ఉచిత వాహనం’ అని వ్యాన్లు ఉంటాయి. దానిలో వచ్చేయండి” అన్నాడు.
సత్యనారాయణస్వామి వారి వైభవం చెప్పనలవి కాదు. ఘాట్ రోడ్ ఇరువైపులా ఆకుపచ్చని కొండలు. ఒక వైపు నీలిరంగు నీరున్న పెద్ద సరస్సు. ‘శంకరాభరణం’ సినిమాలో చంద్రమోహన్, రాజ్యలక్ష్మిలు, మెట్ల దారి మీద కలుసుకోవడం, తొలిచూపులోనే వారి మదిలో అనురాగం అంకురించడం, నిర్మలమ్మగారు మనుమడిని మందలించటం.. అద్భుతంగా తీశారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. అవన్నీ మేము గుర్తుకు తెచ్చుకొని ఆనందించాము. కొండబాబు పుణ్యమా అని మాకు అరగంట లోనే వి.ఐ.పి. దర్శనం అయింది. వెండి మీసాలు ధరించి తులసి మాలాలంకృతులై, ఇరువురు దేవేరులతో సన్నిధి చేసియున్న సత్యదేవుని కనులారా దర్శించుకుని, ధన్యులమయ్యాము.
ఒకచోట కాసేపు కూర్చున్నాం. కొండబాబు మాకు స్వామి వారి ప్రసాదాల ప్యాకెట్స్ తెచ్చి ఇచ్చాడు. అన్నవరం సత్యనారాయణస్వామి ప్రసాదం పవిత్రం, ప్రత్యేకం, రుచికరం. దొడ్డు గోధుమ రవ్వ, బెల్లం, కొంచెం పచ్చకర్పూరం కలిపి ‘హల్వా’ లా చేసి, ఒక విస్తరాకులో పెట్టి, మడత వేస్తారు. దాని రుచి అమోఘం.
ఆంధ్ర దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అన్నవరం ఒకటి. స్వామి వారిని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారు అని పిలుస్తారు. ఇది కాకినాడ జిల్లాలో ఉంది. స్వామి విష్ణు స్వరూపమే. వైష్ణవ సంప్రదాయమే. 1891వ సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠ జరిగింది. చాలా సార్లు దేవాలయాన్ని విస్తరణ, పునరుద్ధరణ చేశారు. క్షేత్రం జాతీయ రహదారి 16 పైనే ఉంటుంది, చెన్నై – కోల్‍కతా మార్గంలో. రైల్వే స్టేషన్ కొండకు 3 కి.మీ. దూరం. ప్రతి ట్రెయిన్‌కు అనుసంధానంగా దేవస్థానం బస్ సిద్ధంగా ఉంటుంది. ప్రయివేటు వాహనాలు, షేర్ ఆటోలు కోకొల్లలు.
ఈరంకి ప్రకాశరావు గారనే సద్బ్రాహ్మణుడు ఇక్కడ నివసించేవారట. ఆయనకు, రాజా ఇనుగంటి వెంకట రామరాయణిం గారనే సంస్థానాధీశునికి, ఒకేసారి విష్ణుమూర్తి కలలో కనబడి ఇలా చెప్పారట –
“వచ్చే శ్రావణ శుక్ల విదియ, మఖా నక్షత్రం, బృహసృతివాసరం (గురువారం) నాడు, నేను రత్నగిరి కొండపై వెలుస్తాను. నా విగ్రహన్ని శాస్త్రీయమైన విధానంలో ప్రతిష్ఠ చేయవలసినది.”
రత్నగిరి కొండ మీద వెదుకగా, వారికి ఒక కృష్ణకూటజ (అంకుడు) వృక్షం క్రింద, సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న స్వామి వారి విగ్రహం కనబడింది. 1891 ఆగస్టు 6వ తేదీన విష్ణు పంచాయతన సంప్రదాయంలో స్వామివారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దానితోపాటు, వారణాసి నుంచి తెచ్చిన ‘శ్రీ మాత్ర పాద విభూతి మహా వైకుంఠ నారాయణ’ యంత్రాన్ని కూడా. మొదట గుడి ఒక సాధారణ షెడ్ మాత్రమే. 1933-34 ప్రాంతంలో అద్భుతమైన శిల్పకళాశోభితమైన దివ్యమైన, భవ్యమైన మందిరాన్ని నిర్మించారు.
రత్నగిరి పేరునే విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వేవారు ‘రత్నాచల్ ఎక్స్‌ప్రెస్’ అని పేరుపెట్టారు. అది కేవలం ఆరు గంటల్లో గమ్యం చేరుకుంటుంది. చాలా డిమాండ్ ఉన్న ట్రెయిన్.
హిందూ పురాణాల పుకారం, మేరు పర్వతరాజు, తన భార్య మేనకతో సహా, విష్ణువును గురించి ఘోర తపస్సు చేశాడట. విష్ణుమూర్తి వారి తపస్సుకు సంతసించి, ఇద్దరు కుమారులను ప్రసాదించాడు. వారే భద్రుడు, రత్నాకరుడు. వారు కూడా పర్వతాలే. భద్రుడే భద్రాచలమనీ రత్నాకరుడే రత్నగిరి అని ఐతిహ్యం.
కొండ పైకి 3 కి.మీ. నిడివి గల ఘాట్ రోడ్, మలుపులతో కూడా ఉంటుంది మెట్లమార్గం కూడా ఉంది. సత్యనారాయణుని మందిరం ఒక రథాన్ని పోలి ఉంటుంది. నాలుగు వైపులా చక్రాలుంటాయి. నిరంతర పరిభ్రమణశీలమైన కాలానికి (Eternity) ఇది సంకేతం. ముఖద్వారానికి బంగారు రేకులతో తాపడం చేశారు.
అగ్నిపురాణంలోని నిర్మాణ సిద్ధాంతాలకు అనుగుణంగా మందిరాన్ని నిర్మించారు. గర్భగుడి లోని మూల విరాట్టు పరమాత్మ స్వరూపం. ‘వైకుంఠ మహానారాయణ యంత్రం’ అత్యంత మహిమాన్వితమైనది. దాని చుట్టూ గణపతి, సూర్యనారాయణస్వామి, బాలాత్రిపురసుందరీ దేవి, పరమేశ్వరుడు పరివేష్టించి ఉన్నారు.
మూలవిరాట్టు విగ్రహం దాదాపు 13 అడుగుల ఎత్తు ఉంది, స్తంభాకారంలో ఉంటుంది. శ్రీ మూర్తి స్వరూపం. బ్రహ్మ అడుగున, శివుడు మధ్య, విష్ణువు పైన ఉంటారు. మందిరం మొదటి అంతస్తులో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు సన్నిధి చేసి ఉంటారు. పక్కన అనంతలక్ష్మి అమ్మవారు, ఉంటారు. సమీపంలో శ్రీ రామమందిరం ఉంది. ఆయనే క్షేత్ర పాలకుడు. అక్కడే స్వామివారి స్వయంభూ విగ్రహం దొరికింది.
విశాలమైన మండపాలను అత్యంత కళాత్మకంగా నిర్మించారు. అక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. వనదుర్గా దేవాలయం, కనకదుర్గమ్మ గుడి, నేరేలమ్మగుడి, రత్నగిరి కొండపై చూడవలసిన ఆలయాలు.
శంకరాభరణం, నువ్వే నువ్వే, మిసెస్ శైలజా కృష్ణమూర్తి, గీత గోవిందం మొదలగు సినిమాలలో కొంతభాగాన్ని రత్నగిరి కొండపైనే తీశారు.
శ్లో॥
“సత్యనారాయణో విష్ణుః వాంఛితార్ధ ఫలప్రదః
తస్యత్వం పూజనం విప్ర కురుష్వ వ్రతముత్తమమ్
యత్కృత్వా సర్వ దుఃఖేభ్యో ముక్తో భవతి మానవః”
తా: సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన సత్యనారాయణ స్వామి, మనం కోరుకొన్న వరాలను అనుగ్రహిస్తాడు. ఆయన వ్రతం అత్యుత్తమం. దాన్ని ఆచరిస్తే మానవులు సమస్త దుఃఖాల నుండి విముక్తులవుతారు.
పైన పేర్కొన్న విషయాలన్న నా మిత్రులకు వివరించాను.
వారు సంతోషించారు. మేం కొండ దిగి హైవే మీదకు చేరి, ‘టీ టాక్’ అన్న చోట టీ తాగాము. చాలా బాగుంది. అక్కడ సీసాలోని పప్పు చేగోడీలు తలా రెండు నమిలాం. కరకరలాడుతూ బాగున్నాయి.
పెద్దాపురంలో మా సోదరులు శ్రీ డా. జోస్యుల కృష్ణబాబుగారున్నారు. మహారాణీ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పని చేసి విశ్రాంతులైనారు. మహాపండితుడు, వక్త. దారిలో అక్కడ ఆగి నేను రచించిన ‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ అన్న పద్యకావ్య ప్రతిని ఆయనకు అందజేసి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మా సంకల్పం. అందులోని గుణ దోషపరిశీలన చేయమని ఆయనను అభ్యర్ధించాలని కూడా. ఆయనకు ముందే ఫోన్ చేసి ఉన్నాను.
కత్తిపూడి వద్ద హైవే దిగి ఎడమవైపు తిరిగింది మా బ్రేజా. వంశీకృష్ణుడు హుషారుగా సారథ్యం వహిస్తున్నాడు. మధ్యలో పద్యాలు, పాటలు, జోకులు! మేం పిఠాపురం చేరేసరికి పన్నెండు. సామర్లకోట మీదుగా పిఠాపురం వెళ్ళాలి. పక్కనే పాదగయా క్షేత్రం. కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా అమ్మవారి సన్నిధి కూడా అక్కడ ఉంది. కారు గుడి ముందు పెట్టి లోపలికి వెళ్లాం. గుడి ముందు పెద్ద పుష్కరిణి. చాలా పెద్దది. దానిలో దిగి, కాళ్లు చేతులు కడుగుకొని, కార్తీకమాసం, ఏకాదశి పర్వదినాన, శివదర్శనం, పురుహూతికా దేవి దర్శనం చేసుకున్నాము. అక్కడ దత్తాత్రేయ స్వామివారి మందిరం, పక్కనే వారి అంశ ఐన శ్రీపాద శ్రీవల్లభయోగి దర్శనం చేసుకోన్నాము. అక్కడ ప్రసాద వితరణ చేస్తున్నారు. పులిహోర, దద్ధోజనం. చాలా రుచిగా ఉన్నాయి. అదే మా లంచ్ అన్నమాట!
ప్రసాదం తిని, ఒక చోట విశ్రాంతిగా కూర్చున్నాం. మా యోగా అన్నాడు – “శర్మా! అద్భుతమైన దేవాలయం! దీని గురించి చెప్పు మరి!” మా యల్లమంద నవ్వుతూ “మిత్రమా! నీవు సూతుడివి, మేం శౌనకాదిమహామునులం” అన్నాడు.
“మనకంత సీన్ లేదుకాని, ఏదో నాకు తెలిసినంత చెపుతాను, వినండి.”
“నీకు తెలియనిది ఎలా చెబుతావులే” అన్నాడు యోగాగాడు నన్ను ఉడికించాలని.
“అతి తెలివి చూపకురోయ్!” అన్నా కోపంగా. వాడి వీపున ఒక దెచ్చ వేయాలని చూస్తే, వాడు యల్లమంద వెనక దాక్కున్నాడు
“తన కొలది తానె యెరిగిన వాడి విజ్ఞుడు” అన్నాడు యల్లమంద.
“అలా అన్నావు బాగుంది. ‘తనకేమీ తెలియదని తెలుసుకున్నవాడే జ్ఞాని’ అని కదా జనక రాజర్షి ఉవాచ” అన్నాను.
తర్వాత చెప్పసాగాను “ఆంధ్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి నియోజకవర్గం ఇది. దీనికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. అతి పురాతనమైన పట్టణం. 4వ శతాబ్దం నుండి వివిధ ఆంధ్ర రాజ్యాలకు రాజధానిగా ఉండేది. ఈ ‘పాదగయ’ చాలా పవిత్రమైన క్షేత్రం. కుక్కుటేశ్వరస్వామి వారు ఇక్కడ వెలసి ఉన్నారు. పురుహూతికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. శ్రీవల్లభయోగి జన్మస్థలం. స్కాంద పురాణం లోను, శ్రీనాథమహాకవి భీమేశ్వరపురాణంలోను, పాదగయ ప్రసక్తి ఉంది. సముద్రగుప్త చక్రవర్తి ప్రయాగ శిలాశాసనంలో దీని గురించి ఉంది.
తూర్పు చాళుక్యుల రాజధానిగా వినుతికెక్కింది పిఠాపురం. వెలనాటి చోళులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తర్వాత పిఠాపురం సంస్థానంగా మారింది. పిఠాపురం జమీందార్లు 1571లో గోదావరి జిల్లాలకు వచ్చారు. వారికి అనపర్తి జాగీరుగా లభించింది. 1749లో నిజాం నవాబు రుస్తుంఖాన్ వారికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చాడు. వారి కాలం లోనే తెలుగు ‘శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు’ తయారైంది. తొలి తెలుగు టైప్ రైటర్ కూడా వారి కాలంలోనే రూపొందింది.
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి గుడి, అనఘాదత్తక్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పుష్కరిణిలో పితరులకు పిండప్రదానం చేస్తే, కాశీలో చేసిన ఫలితం లభిస్తుంది. ప్రముఖ కవివరేణ్యులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, ద్రోణంరాజు కృష్ణారావు గారు, పిఠాపురానికి చెందినవారే.
పిఠాపురాన్ని పూర్వం ‘పీఠికాపురం’ అనేవారు. ఈ ఊరికి అధినేత్రి పీఠాంబ అమ్మ వారు.”
వంశీ కూడా నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. నాకు ముచ్చటిసింది. “ఒరే నాన్నా, మీ జనరేషన్ వాళ్లు ఇంత శ్రద్ధ చూపరు రా. నువ్వు గుడ్ బాయ్!” అన్నాను.
“మా డాడీ నాకు, అక్కకు అన్నీ చెబుతూ ఉంటారు అంకుల్!” అన్నాడు వాడు వినయంగా
“ఆయన చెప్పినంత మాత్రాన, మీరు వినాలి కదా!” అన్నాను.
“మిత్రమా! నీ పెంపకం బాగుంది” అని యల్లమందను మెచ్చుకున్నాను.
***
అక్కడి నుండి సామర్లకోట మీదుగా పెద్దాపురం చేరుకుని, సోదరులు జోస్యుల కృష్ణబాబు గారింటికి వెళ్లాము. ఆయన మమ్మల్ని సాదరంగా రిసీవ్ చేసుకుని, మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. అంత పండితుడైనా, జీన్స్ పాంటు, చెక్స్ షర్ట్ వేసుకుని చాలా సింపుల్‌గా, యంగ్‌గా ఉన్నారు ఆయన. ‘తెలుగులో హరిశ్చంద్ర నాటకాలు’ అన్న అంశంపై ఆయన పి.హెచ్.డి చేశారు. ఆంధ్ర యూనివర్సిటిలో మా యల్లమందకు సహధ్యాయి. విచిత్రం ఏమంటే, ఆయనతో నా పరిచయం ఫేస్‌బుక్ ద్వారా! ‘భావ స్థిరాణి జననాంతర సౌహృదాని’ అని కాళిదాసుల వారన్నట్లు, కొన్ని బంధాలు అలా ఏర్పడి, నిలిచిపోతాయి.
ఒక గంట సాహిత్య చర్చలు, పద్య పఠనం చేశాము. మా నాన్నగారు అవధాని అని తెలిపాను. వెంటనే ఆయన తన వద్దనున్న ‘అవధాన విద్యాసర్వస్వము’ అన్న బృహద్గ్రంథాన్ని తెచ్చి, అందులో మా నాన్నగారి అవధానాల గురించిన ప్రత్యేక వ్యాసాన్ని చూపారు. అది ఉన్నట్లు కూడా నాకు తెలియదు. దాన్ని ఫోటోలు తీసుకున్నాం.
కృష్ణబాబు అన్నయ్యకు నా పద్యకావ్య ప్రతిని అందచేసి, ఆయన పాదాలకు నమస్కరించాను. మేము ఆయనకు చిరుసత్కారం చేశాం. ఆయన కూడా మమ్మల్ని సన్మానించారు. అది ఆయన సంస్కారం. మేం కారు ఎక్కే ముందు ఆయన నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. నాకు కళ్ళు చెమ్మగిల్లాయి.
(తరువాయి వచ్చే వారం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.