[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అన్నీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చిటారు కొమ్మ నిటారు చేతులు
నేలనుంచి అమాతంగా
దగ్గరకు పిలిచిన వైనం
చూస్తే కళ రాస్తే కవిత
పైకెత్తిన తలలు నింగిలో చుక్కల లెక్కలో బిజీబిజి
దింపని తలతో భారంగా చెట్టు
భూమిని ముద్దాడేదే మనిషి బాధ్యత
అన్నీ తానై
మేలుకొలుపు గీతం ఆలపించే చోట
ఆకలి దాహం ఉండదు
తనలో దాగే సముద్రం అలలు
పడిలేవడమే జీవితం
గెలుపూ ఓటమిలతో పనిలేని ప్రయాణంలో
నడక ఒక్కటే గరిమనాభి
బతుకంటే గాయంలేని
అన్నీ మోసుకొచ్చే జీవ నజరానా
చెలుకా చెరువూ చెట్టూ
అన్నీ
నన్నూ నిన్నూ బతికించే రూపాంతరంలో
మట్టి నీరు నీడ
జీవగంజి పోసిన ప్రకృతి కీర్తనలే
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
