మా ఫ్రెండ్ వినీల గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా కొనుక్కుంది. గృహప్రవేశం అయి వారం రోజులయింది. ఎంత బాగుందో. అన్ని ఫిటింగ్సూ అయ్యాక వచ్చే నెలలో ఆ ఇంటికి మారిపోతామని చెప్పింది. ఎప్పట్నించో వినీలకి అలాంటి విల్లా కొనుక్కోవాలని కల. మొత్తానికి సాధించింది. కళ్లకి ఆహ్లాదంగా ఉండేలాంటి పెయింటింగ్ వేయించింది. ఇంక ఇంట్లో అలంకరణ మాత్రం మిగిలుంది. కొత్త సోఫాసెట్టూ, కొత్త డైనింగ్ టేబులూ, కొత్త మంచాలూ, ఎంచక్క బాల్కనీలో ఉయ్యాలా అన్నీ పదిషాపులు తిరిగి, ఏరి ఏరి కొనుక్కుంది. కర్టెన్లు మటుకు వినీల ఎన్ని షాపులు తిరిగినా తనకి నచ్చిన రంగూ, బట్టా దొరకటం లేదు. ఆ రోజు ఫోను చేసి అదే వాపోయింది.
“ఈ కర్టెన్ల సెలక్షన్ ఇంత కష్టం అనుకోలేదే… రంగు బాగుంటే బట్ట బాగుండటం లేదు. బట్ట బాగుంటే డిజైన్ నచ్చటం లేదు. డిజైన్ నచ్చితే ఫాల్ కుదరటం లేదు. అన్నీ సరిపోతే మా వాల్ కలర్స్‌కి మాచ్ అవటం లేదు… నీకేవైనా షాపులు తెలిస్తే చెప్పవే… అక్కడ కూడా చూస్తానూ…” అంది.
నాకు చాలా చాలా జాలేసేసింది. ఎలాగైనా దానికి సాయం చెయ్యాలనుకున్న నాకు ఫ్లాష్‌లా మొన్న గిరిజింట్లో జరిగిన పార్టీ గుర్తొచ్చింది. గిరిజ మా కొలీగ్. వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళింట్లో పెద్ద పార్టీ ఇచ్చింది. అప్పుడే మేం గిరిజ ఇల్లు చూడడం. అంత పెద్ద ఇంట్లోనూ ప్రతి గుమ్మానికీ, కిటికీకీ ఊగే పరదాలు చూసి అప్పుడు అందరం అబ్బురపడిపోయాం. కంటికింపైన రంగులతో, చక్కటి ఎంబ్రాయిడరీ డిజైన్లతో, ఎంచక్కటి ఫాల్‌తో ఆ పరదాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇంటి గురించీ, గిరిజ అందించిన విందు గురించీ ఎంత గొప్పగా మాట్లాడుకున్నామో అంత గొప్పగానూ ఆ పరదాల గురించీ మాట్లాడుకున్నాం. ఆ విషయం గుర్తు రాగానే వినీలతో చెప్పాను, “వినీలా, మా కొలీగ్ గిరిజింట్లో మంచి కర్టెన్స్ చూసాను, రేపొచ్చేయి, వాళ్ళింటికి తీసికెడతాను…” అని చెప్పగానే వినీల తెగ సంతోషపడిపోయింది.
మర్నాడు ఆదివారం. వినీలని తీసుకుని గిరిజింటికి వెళ్ళాను. ముందుగానే వస్తామని చెప్పటం వల్ల మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఇల్లంతా చూపించి, చక్కటి అతిథి సత్కారం చేసింది గిరిజ. కానీ, మేం అక్కడికి సత్కారాలందుకుందుకు వెళ్ళలేదు కదా! వెళ్ళినప్పట్నించీ నేనూ, వినీలా ఆ ఇంటి గుమ్మాలూ, కిటికీలూ చూస్తూ కూర్చున్నాం. కానీ అదేవిటో… ఒక్క కిటికీకి కానీ, గుమ్మానికి కానీ ఎక్కడా కర్టెనన్న మాటే కనిపించలేదు. అన్నీ అప్పుడే సబ్బెట్టి శుభ్రంగా కడుక్కున్న మొహాల్లా వున్నాయి. వినీలా నా వైపు ప్రశ్నార్ధకంగా చూసింది అక్కడికి నేనేదో అబధ్ధం చెప్పినట్టు. ఇంకిది పని కాదనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని, “గిరిజా, మొన్న మీ ఇంట్లో పార్టీ కొచ్చినప్పుడు వీటన్నింటికీ కర్టెన్లున్నట్టున్నాయి…” అన్నాను నేను ఆకుకి అందకుండా పోకకి పొందకుండా. ఒక్కక్షణం గిరిజ మొహం పాలిపోయింది. వెంటనే మొహం మీదకి నవ్వు తెచ్చుకుని, “అవా… కాస్త మాసినట్టుంటే డ్రైక్లీనింగ్‌కి ఇచ్చాను” అంది. కామోసనుకుని ఇంకేం మాట్లాడకుండా వచ్చేసాం.
మర్నాడు ఆఫీసులో ఈ సంగతంతా వెంకటలక్ష్మితో చెపితే… “అయ్యో, నీకింకా గిరిజ సంగతి తెలీదా!” అంది ఆశ్చర్యంగా. ఏమా సంగతి అన్నట్లు చూసాను.
“గిరిజ ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది, నీకు తెలుసుగా… ” అంది.
“ఇందులో వింతేవుందీ… అందరం చేస్తాంగా…” అన్నాను.
“అక్కడే ఉంది తనకీ, మనకీ తేడా…” అంది వెంకటలక్ష్మి. నేను కుతూహలంగా ముందుకి వంగాను.
“ఇంట్లో ఏదైనా పార్టీ ఉంటే గిరిజ ఆన్లైన్లో చాలా ఖరీదైన కట్లెరీ, కర్టెన్సూ, బెడ్ షీట్లూ కొంటుంది. అవన్నీ పార్టీకి ఒకటి రెండురోజులు ముందొచ్చేలాగా ఆర్డర్ చేస్తుంది. పార్టీలో అందరూ అవి చూసి అబ్బ, ఎంత బాగున్నాయో, ఎంత ఖరీదువి కొందో అనుకుంటారు. అంతే పార్టీ అయిపోయిన మర్నాడు వాటిని నేనడిగింది ఈ కలర్ కాదంటూ మళ్ళీ ఆ షాపులకే రిటర్న్ పంపేస్తుంది.”
నాకు మతిపోయింది. “అలాగెలాగ… నచ్చే కదా తెప్పించుకుంటాం. మరి వాళ్ళు వెనక్కి పుచ్చుకుంటారా…” అన్న నా ప్రశ్నకి, “ఎందుకు పుచ్చుకోరూ, పెద్ద పెద్ద షాపులవాళ్ళు ఆన్లైన్లో ఏదైనా వస్తువుని అమ్మకానికి పెట్టినప్పుడు, ఆ వస్తువు కింద “Easy Returns Available In Case Of Any Issue” అని రాస్తారు. దానికోసం రెండు వారాలో, మూడు వారాలో టైమ్ ఇస్తారు. అలాంటి వాళ్లనే గిరిజ ఎంచుకుంటుంది. మడత నలక్కుండా జాగ్రత్తగా వాడి, ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ వాటిని వెనక్కి పంపేస్తుంది. అంతదాకా ఎందుకూ, ఆ గిరిజ ప్రతి ఫంక్షనుకీ ఒక్కొక్క కొత్త డిజైనర్ శారీ కట్టుకొస్తుంది కదా.. అవేమైనా కొంటుందనుకుంటున్నావా. ఇలాగే ఆన్లైన్లో తెప్పించుకుని, ఫంక్షన్ అయిపోయేక రిటర్న్ పంపించేస్తుంది.”
“మరి డబ్బూ…” అంటున్న నన్నో వెర్రి మొహాన్ని చూసినట్టు చూసి, “డబ్బు కూడా ఆన్లైన్ లోనే పంపుతుంది కనక వాళ్ళు కూడా మళ్ళీ గిరిజ అకౌంట్‌కి ఆ డబ్బు రిటర్న్ పంపేస్తారు.”
“ఓర్నాయనో… మనిషి కనిపించకుండా ఎన్ని రకాల మాయలు చెయ్యొచ్చూ..” అని ఆశ్చర్యపడిపోతున్న నన్ను చూసి,
“అదే మరి ఈ ఆన్లైన్లో ఉన్న మాయ. మనుషులు కనపడకుండా పరిచయాలూ, ప్రేమలూ, డబ్బులు పంపుకోడాలూ లాంటిదే ఇది కూడా. కావాలంటే నువ్వూ చేసుకోవచ్చు” అన్న వెంకట లక్ష్మి మాటలకి “అమ్మో, నేనా!” అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నాను.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.