Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతా కాంతిమయం..

[శ్రీ పి. నిర్మల రాజు రచించిన ‘అంతా కాంతిమయం..’ అనే కవితని అందిస్తున్నాము.]


అంతా కాంతిమయం..
అవని అంతా కాంతిమయం!
మహిలో మహిళలు మణిదీప కాంతులై వెలిగితే,
లోకమంతా కాంతిమయం!

నీ చేతలు, చేతులు, చేయూతలు కలిస్తే,
శక్తిగా.. అపరశక్తిగా నిలిస్తే,
అసాధ్యమన్నది లేనే లేదు
అంతా సుసాధ్యమే.
స్త్రీమూర్తులారా వందనం!
శతకోటి అభివందనం!!

“యత్ర నార్యస్తు పూజ్యంతే” మ్రోగిన వేదం,
వేదం నుండి నేటి వరకు అదే ధర్మ ప్రబోధం.
నాడైనా.. నేడైనా.. ఏనాడైనా వెలుగునిచ్చేది నువ్వే,
అవని అంతా కాంతిమయం చేసేది కాంతామణులే.
నాటి నుండి నేటి వరకు నీ మహిమే శాశ్వతం,
నిన్ను ఆరాధించిన పుణ్యభూమి పావనం.

కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ.. క్షమయా ధరిత్రీ!
భోజ్యేషు మాతా.. శయనేషు రంభా,
షడ్గుణ సంపన్నురాలై వంశోద్ధారిణీ అంబా!
సృష్టి మొత్తం నీ శ్వాసపై ఆధారం,
సేవే నీ స్వభావం – ప్రేమే నీ ధర్మం.
అమ్మ రూపంలో వెలిసిన పరమాత్మ స్వరూపం,
ఆది కాలం నుండి ఆరాధిత రూపం.

సరోజినీ నాయుడు స్వరంలో స్వాతంత్ర్య గానం,
ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యంలో వీర నినాదం.
సావిత్రిబాయి ఫూలే విద్యలో వెలుగు దీపం,
ఇందిరా గాంధీ నాయకత్వంలో దృఢ సంకల్ప బలం.
కల్పనా చావ్లా ఆకాశంలో కలల విహారం,
పీవీ సింధు విజయంలో భారత గర్వ శిఖరం.
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో విజయ గర్జన
ప్రతి రంగంలో నేటి మహిళ జ్యోతి, మహాశక్తి సాక్షాత్కారం.

అమ్మగా.. అక్కగా.. గురువుగా.. నేత్రిగా,
సమాజానికి అర్పణ నీ జీవన గాథగా.
నాటి నుండి నేటి వరకు నీ అడుగే చరిత్ర,
నువ్వే నీ శక్తి – సృష్టే నీ స్మృతి!

చేతలు కలిపి ఓ శక్తిగా నిలుద్దాం,
అపరశక్తిగా ప్రపంచాన ప్రభంజనం సృష్టిద్దాం.
అవని అంతా కాంతిమయం చేద్దాం,
స్త్రీశక్తికి శతకోటి నమస్సులు అర్పిద్దాం!
అంతా కాంతిమయం..
అవని అంతా కాంతిమయం!
మహిలో మహిళలు మణిదీపాలై వెలిగితే
లోకమంతా కాంతిమయం!

Exit mobile version