[శ్రీ బి.ఆర్.కె.వి. భాస్కర రావు గారు వ్రాసిన ‘అంతా మన మంచికే..’ అనే కథని అందిస్తున్నాము.]
ఉదయం నుంచి నారాయణకు కాళ్లాడటం లేదు. నెల్లాళ్ళనుంచి సిస్టమ్ ముందు కూర్చుని ఎంతో కష్టపడినదంతా వృథా కావడంతో మనసంతా కల్లోలితమైంది.
గతంలో తన తప్పులు ఎన్ని చేసినా ఎలాగోలా కవర్ చేసి కడిగిన ముత్యంలా బయటపడేవాడు. కానీ ప్రస్తుతం తన పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో దిక్కు తోచని స్థితిలో ఉంది.
ఇంతకి నారాయణ కుడితిలో పడ్డ ఎలుకలా ఎందుకు అలా గిలగిలా కొట్టుకుంటున్నాడో తెలుసుకుందాం.
***
మూడు వేల జనాభా ఉన్న ఆ పల్లెటూరులో నారాయణ తాత తండ్రులు ఎలక్ట్రీషియన్లే. పల్లెటూరి మొహమాటం వల్లను చాలా వరకు చుట్టరికాల వల్లను డబ్బులు అడగక వాళ్ళు ఇచ్చిందే తీసుకుని కాలక్షేపం చేశారు. కూడుకు గుడ్డకు లోటు లేకుండా సంసారం సాగేది.
కానీ పాతికేళ్ల నారాయణ వాళ్ళ బాట అనుసరించినా అన్ని రేట్లు పెరిగి పోవడంతో వచ్చే డబ్బు చాలక కరెంటు పనులతో పాటు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వీడియోలు తీయడం మొదలుపెట్టాడు.
ఈ మధ్యకాలంలో డ్రోన్లతో పొలాలకు పురుగు మందులు చల్లడం కూడా వెలగబెట్టుతున్నాడు. చుట్టుప్రక్కల పది గ్రామాలకు ఇది ఒక్కటే డ్రోన్. పైగా కూలి మనిషి కంటే డ్రోన్‌తో పురుగు మందు చల్లితే ప్రతి వరి దుబ్బుకు బాగా అంటుతుందని రైతులు తెలుసుకుని డబ్బు సమయం కూడా కలసి వస్తుందని నారాయణ కోసం ఎగబడ్డారు.
ప్రతి పని సమర్థవంతంగానే చెయ్యగలడు. కానీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు మొహమాటం అతని పాలిట శాపంగా పరిణమించింది. ఎవరి మాట కాదనలేడు. దానివల్ల కస్టమర్లను ఇబ్బంది పెట్టి తాను ఇబ్బంది పాలవడం అతనికి నిత్యకృత్యమయ్యింది.
ఎవరైనా వీడియో తియ్యమంటే సరే అని మాటిచ్చి ఈ లోపుగా వేరేవాళ్ళు మొహమాట పెడితే ముందు వాళ్ళను ముంచేస్తాడు. వాళ్ళు కాస్త లబోదిబోమంటారు. ఒకవేళ వీడియో తీసినా దానిని వాళ్లకు ఇవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది, కొండొకచో కొన్ని సంవత్సరాలు పడుతుంది కూడా. ఒకసారి నారాయణ ఉంటున్న ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరిలో షష్టిపూర్తి వేడుకను వీడియో తీయడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళ ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు. చాలావరకు మనవళ్ళు, మనుమరాళ్ళు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు కావడంతో చాలా ఖర్చు పెట్టి ఆ తంతు చేస్తున్నారు. ముందుగానే నారాయణని ‘వీడియో నభూతో నభవిష్యతి’ అనేలా ఉండాలని హెచ్చరించారు కూడా. వారి కండిషన్స్ కు ఒప్పుకున్న నారాయణ చాలా కష్టపడి వీడియో షూట్ చేశాడు. నారాయణ పనితనాన్ని చూసి వాళ్ళు మొత్తం డబ్బు షూటింగ్ అయ్యిన వెంఠనే ఇచ్చేశారు. పని బద్ధకం లేని నారాయణ మరునాడే వీడియో ఎడిట్ చేయటానికి టేబుల్ ముందు కూర్చున్నాడు. గంట పనిచేసేడో లేదో ఓ రైతు దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది ‘తన చేనులో ముడత పురుగు పట్టింది, అర్జంటుగా వచ్చి డ్రోన్‌తో పురుగు మందు చల్లమని’.
వెంఠనే టేబుల్ ముందు నుంచి లేచి డ్రోన్ తీసుకుని అటుగా పరుగెత్తాడు. అలా వెళ్ళడం వెళ్ళడం ఆరు నెలలపాటు పొలాల మధ్యనే కాపురం చేశాడు. పైగా అవి దాళవా పంటలు కావడంతో రసాయనాలు వినియోగం ఎక్కువగా ఉపయోగిస్తారు రైతులు.
తిరిగి వీడియో ఎడిట్ చేయడం మొదలు పెట్టి నెల రోజుల్లో పూర్తిచేసి దాన్ని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి ఓ ఉదయం వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వెళ్ళాడు. తీరా అక్కడకు వెళ్ళేసరికి ఇంటినిండా జనం. ఎవరి ముఖాల్లోనూ చిరునవ్వులేదు. కొందరైతే గంభీరంగాను, మరికొందరైతే ఏడుపు ముఖాలతోను ఉన్నారు. నారాయణ మనసు కీడు శంకించింది. తిరిగి వచ్చేద్దామనుకున్నాడు, కానీ తెచ్చిన వీడియో ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా అని ధైర్యం చేసి లోపలకు వెళ్ళి ఆ దృశ్యం చూసి రాయిలా నిలబడి పోయాడు. హాల్లో షష్టిపూర్తి చేసుకున్న మనిషి శవమై కనిపించాడు. అతనిమీద పడి ఎంతోమంది ఏడుస్తున్నారు. నారాయణకు ఏమి చేయాలో తోచలేదు. నెమ్మదిగా అక్కణ్ణుంచి జారిపోయే క్రమంలో ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ బయట పడబోయేసరికి నారాయణకు వీడియో గురించి హెచ్చరించిన వారిలో ఒక మనవడు నారాయణ భుజం మీద చెయ్య వేసేసరికి నారాయణపై ప్రాణాలు పైనే పోయాయి. ఆ కుర్రాడు మాట్లాడే లోపుగానే బిక్కముఖం పెట్టుకున్న నారాయణ కాళ్ళమీద పడిపోయేసరికి ఆ కుర్రాడు నాలుగు తిట్లు తిట్టి తానున్న పరిస్థితి గురించి చెప్పి లేకపోతే చంపేసేవాణ్ణి అని పంపించేసాడు.
కానీ ఇప్పుడు అంతకంటే ప్రమాదకర స్థితి. పైగా డబ్బుకూడా బోలెడంత నష్టం కూడా.
సరిగ్గా ఏడాదిక్రితం తానున్న మందలాధ్యక్షుని కూతురి పెళ్లి వీడియో తీశాడు. ఆయన తన కూతుర్ని ఎమ్మెల్యే కొడుక్కి చేశాడు. లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసిన ఆయన నారాయణతో వీడియో బాగా రావాలని, మరీ ముఖ్యంగా నెలలోపుగా పెన్ డ్రైవ్ ఇవ్వాలని హెచ్చరించాడు. బుద్ధిమంతుడిలా తల ఊపి వచ్చేశాడు నారాయణ.
అలసటగా ఉండటంతో ఆ రోజుకు రెస్ట్ తీసుకున్న నారాయణ రాత్రి పన్నెండు అయ్యేసరికి లండన్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ మురళి ఫోన్ చేసి “ఒరేయ్! ఇక్కడ మన తెలుగువాళ్ళవి రెండు పెళ్లిళ్ళు ఉన్నాయి. రెండిటి మధ్యలో మనవాళ్ళు కట్టిన శ్రీకృష్ణుని గుడికూడ ప్రతిష్ఠ ఉంది. నాలుగు రోజులు ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఈ మూడు పూర్తయ్యేసరికి ఓ నెల పడుతుంది. సుమారు ఓ మూడు లక్షలు వరకు ముడుతుంది నీకు. పైగా రానుపోను ఖర్చులు వాళ్ళవే. ఇక్కడ ఎంతో మంది వచ్చినా నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో వారందర్నీ తరిమేసి నీకు ఈ ప్రోగ్రామ్స్ వచ్చేలా చేసాను. నువ్వు నాలుగు రోజుల్లో బయల్దేరి వచ్చేసేయి. ఏం మాట్లాడవే?” గట్టిగా గడిచేసరికి ఏదో ఆలోచిస్తున్నవాడల్లా “అలాగే. అలాగేరా..” అని కంగారుగా సమాధానమిచ్చాడు.
ఫోన్ కట్ అయ్యాక చాలాసేపు మండలాధ్యక్షుడి హెచ్చరికే గుర్తుకు వచ్చింది. పెద్దవాళ్ళతో వ్యవహారమిది. పైగా పెళ్ళి కొడుకు ఎమ్మెల్యే కొడుకాయే. తేడా వస్తే తను ఉండడు, తన వ్యాపారం ఉండదు. మరోప్రక్క పెద్ద ఎత్తున డబ్బు వస్తోంది. ఏమి చేయాలో తోచక రాత్రంతా ఆలోచించి చివరికి గతంలోలా అంతగా పరిస్థితి చెయ్యజారితే తనకున్న ఆయుధం కాళ్ళ మీద పడటం వున్నదే కదా, అని లండన్ వెళ్ళడానికి మొగ్గు చూపాడు. వారం అయ్యేసరికి లండన్ చేరుకున్న నారాయణ స్నేహితుని రూంలో నాలుగు రోజులు గడిపేసరికి మొదటి పెళ్ళి వచ్చింది. దిగ్విజయంగా దాన్ని పూర్తి చేశాడు. మరో పది రోజులకు గుడి ప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలుపెట్టి ఐదు రోజుల్లో పూర్తి చేశారు. అది కూడా ఏ అడ్డులేకుండా పూర్తి అయ్యింది.
రెండు రోజుల్లో ఒప్పుకున్న మరో పెళ్లి అయిపోతుంది అనగా పిడుగు లాంటి వార్త నారాయణ చెవిన పడింది. ‘పెళ్లి కూతురి నానమ్మ హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది’.
పెళ్లి పదిహేను రోజులు వాయిదా పడింది. నారాయణ గుండెలు జారిపోయి పొట్టలోకి వచ్చేశాయి. మురళితో తాను వెంఠనే బయల్దేరతానని చెప్పాడు. అతను పదిహేను రోజులే కదాయని బ్రతిమాలితే ఒప్పుకున్నాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా మండలాధ్యక్షుడే గుర్తుకు వస్తున్నాడు.
ఏదో విధంగా పదిహేను రోజులు గడిచేసరికి నారాయణ నెత్తి మీద మరో పిడుగు పడింది. ముసలావిడ కార్యక్రమాలు అయిన మరుసటి రోజు నుంచే ఆషాఢ మాసం మొదలయ్యింది. ఇహ తన వల్ల కాదని ఎయిర్‌పోర్టుకు వచ్చిన నారాయణను నెలే కదాని మురళితో సహా అందరూ బ్రతిమాలి వెనక్కు తీసుకుని వెళ్లిపోయారు. కానీ నారాయణకు తన చావు సెవెంటీ ఎం.ఎం. స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికే వందలాది ఫోన్లు వస్తున్నా అవి ఇవి చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సమాధానం చెప్పడం తన వల్ల అయ్యేపని కాదని నెంబర్ బ్లాక్ చేసేడు. నెల రోజుల తర్వాత శ్రావణ మాసంలో పెళ్లి చేసేరు. తరువాత తనకు ఫ్లైట్‌లో టికెట్ దొరకడం లేటవ్వడంతో పదిరోజులకు ఇండియా వచ్చేడు నారాయణ. అప్పటికే తన చావు దగ్గర్లోనే ఉందని డిసైడ్ అయ్యేడు. ఇంటికి వచ్చిన తరువాత రాత్రింపగలు అనే తేడ లేకుండా నెల్లాళ్ళు శ్రమించి వీడియో ఎడిట్ చేసి హై క్వాలిటీతో సర్వాంగ సుందరంగా వీడియో తయారు చేసి రెండు పెన్ డ్రైవ్ లలో కాపీ చేసి ముందుగా మండలాధ్యక్షుని ఇంటికి వెళ్ళాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.
అప్పటికే ఆయన ఆఫీసులో కూర్చుని నారాయణ లోపలకు వెళ్ళేసరికి కోపంగా చూసేడు. నారాయణ వేరే మాటలు చెప్పకుండా పెన్ డ్రైవ్‌ను టేబుల్ మీద పెట్టి “సార్ అనుకోని పరిస్థిల వల్ల కొంచం లేటయ్యింది. క్షమించండి. అమౌంట్ ఇప్పిస్తే వెళ్ళిపోతాను.” అంటూ భయం భయంగా నసిగేడు.
“ఏరా ఎదవా.. ఎంతమంది వీడియోగ్రాఫర్లు వచ్చినా వాళ్లను కాదని నువ్వేమో పెద్దపోటుగాడివని ఛాన్స్ నీకిస్తే మూడునెలలు దాటిన్తర్వాత ఇప్పుడు వీడియో తీసుకు వచ్చి సారీ చెప్తావా.. లుచ్చా నాకొడకా. నీకు డబ్బులు కావాలా? అవతలకు పో. డబ్బా! నీ మొఖమా రూపాయి ఇవ్వను. వెళ్ళి మగపెల్లోళ్ల దగ్గర తీసుకో” అని మండలాధ్యక్షుడు మర్యాద లేకుండా మాట్లాడేసరికి నారాయణ నోట మాట రాలేదు. కొద్దిసేపు అలాగే నిల్చున్నాడు.
“ఏరా! చెప్పానుకదా పొమ్మని, కదలవే? మా అమ్మాయికి వాళ్ల అబ్బాయికి తెగతెంపులు అయిపోయాయి. విడాకుల కోసం కోర్టులో కేసు యేసేసుకున్నాం. వాళ్ళ ఇంటి మీద కాకి మా ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాలడానికి వీల్లేదు”.
తిట్టి తిట్టి చివరలో డబ్బు ఇస్తాడేమోనని ఎదురు చూసిన నారాయణ ఆశల ఆవిరిమీద నీళ్లు జల్లినట్టు అయ్యింది, అతని వరస చూసేసరికి. అతను కోపం చల్లారేలా లేకపోవడంతో నెమ్మదిగా తన తెచ్చిన పెన్ డ్రైవ్ అతని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టేసి వెనక్కి తిరిగేశాడు.
“ఈ దరిద్రం నాకేందుకు?” అని పెన్ డ్రైవ్ గిరాటేయ బోయేసరికి “ఉంచండి సార్! దాన్ని తీసుకు వెళ్ళి నేనేం చేసుకోను?” అని వెనక్కు తిరగకుండానే అని వెళ్ళిపోయాడు నారాయణ. మండలాధ్యక్షుడు దాన్ని తీసుకువెళ్ళి కూతురికి ఇచ్చాడు.
ఇన్ని తిట్లు తిన్నా ఆశ చావక ఇంటికి రాకుండా అలాగే ఎమ్మెల్యే ఇంటి ముఖం పట్టాడు.
అదృష్టం కొద్ది ఎమ్మెల్యే ఇంటిదగ్గరే ఉన్నాడు. నారాయణ ఆఫీసు గదిలోకి వెళ్ళేసరికి అలవాటైన కోపం ముఖాన్ని తగిలించుకుని ఏమిటన్నట్టు కనుబొమ్మలేగరేశాడు.
నారాయణ తన్న తాను పరిచయం చేసుకునివచ్చిన పని చెప్పాడు. అంతే.. పూనకం వచ్చినవాడిలా ఒక్కసారిగా కుర్చీ లోంచి లేచి “వాడు బుద్ధి లేకుండా చెబితే నువ్వు సిగ్గులేకుండా వచ్చావా?” అంటూ కొట్టేవానిలా మీదకు వచ్చేసరికి నారాయణ భయంతో వెనక్కి జరిగేడు.
ఇద్దరి మధ్య కాసేపు మౌనం వచ్చి చేరింది.
“సార్ ఎందుకు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే తమ అబ్బాయి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు?” ఎలాగోలా ధైర్యం చేసి నారాయణ గొంతు పెగల్చుకుని అడిగేడు.
“ఎందుకా మా వియ్యంకుడు ఎదవ కట్నంగా పది ఎకరాలు పంట భూమి ఇస్తానని పెళ్ళయ్యాక మాట తప్పి బీడు భూమి రాసిచ్చాడు. అందుకునే ఆడి కూతుర్ని పంపించేసెను. ఇంకా విడాకులు రావడమే లేటు” అని కోపంగా అన్నాడు ఎమ్మెల్యే.
తన కష్టం, డబ్బు ఇక తిరిగిరాదని నిర్ణయించుకున్న నారాయణ ఇంకా అలా నిల్చున్నాడు.
“పోనీ నా కష్టాన్ని తమరు గుర్తించి దయతలచి సగమైన డబ్బులు ఇస్తారేమోనని..” చివరి మాటల్ని నెమ్మదిగా అన్నాడు నారాయణ.
“ఏంట్రా నేను డబ్బు ఇవ్వాలా? నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. పోయి వాణ్ణే అడుక్కో నిన్ను బుక్ చేసింది ఆడే కదా! నన్ను మోసం చేసేడు. నిన్ను కూడా చేస్తాడు చూడు.” అనేసి “ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావంటే జైల్లో యేయించేస్తాను ఖబడ్దార్” అని గట్టిగాఎమ్మెల్యే గద్దించేసరికి డబ్బులు ఎలాగూ రావు కాబట్టి చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ ఎమ్మెల్యే ఎదుర్గా ఉన్న టేబుల్‌పై పెట్టి పావు గంటలో ఇంటికి చేరాడు నారాయణ.
***
ఇదీ నారాయణ మనసు కల్లోలవడానికి కారణం..
ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఓ ఉదయం పోలీసులు నారాయణ ఇంటికి వచ్చి ‘ఎమ్మెల్యే గారు అర్జంటుగా తీసుకురమ్మాన్నార’ని కారు వేసుకుని వచ్చేసరికి నారాయణ ‘ఇక తన జీవితం జైలులోనే ముగిసిపోతుంద’ని నిర్ణయించుకుని బయల్దేరాడు.
తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పోలీసులు నారాయణని పెద్ద కళ్యాణ మండపంలోకి తీసుకు వెళ్లారు. లోపల ఉన్న స్టేజీపై మండలాధ్యక్షుని కూతురు, ఎమ్మెల్యే కొడుకు పెద్ద సోఫాపై రిసెప్షన్ జరుగుతున్నట్టుగా కొత్త దుస్తులు ధరించి కూర్చున్నారు. ఎంతోమంది అతిథులు రావడం వాళ్లను గౌరవించి లోపలకు తీసుకెళ్లి భోజనాలు పెట్టించడం వియ్యంకుళ్దరూ చేస్తున్నారు. బిక్కు బిక్కు మంటూ స్టేజ్ దగ్గరకు వెళ్ళిన నారాయణను వియ్యంకులిద్దరూ కిందకు దిగివచ్చి గట్టిగా కౌగిలించుకుని పైకి తీసుకువెళ్లారు.
ఎమ్మెల్యే ప్రక్కనున్న మైక్ తీసుకుని “ఈ రోజు నారాయణ వలన మా పిల్లలిద్దరూ తిరిగి కలిసారు. చిన్న కారణం వల్ల విడిపోయిన మా రెండు కుటుంబాలు ఇతని పుణ్యమా అని కలసిపోయాం. కోర్టుకు వెళ్లిన మేము మా పిల్లలు ఇతను ఇచ్చిన వీడియో చూసి పెళ్లిలో తాము చేసుకున్న బాసలు, ప్రమాణాలకు మనస్సులు కరిగి మా మనస్సులు కరిగించి మా ఈ గోలను శాంతింపచేసి ఒకటయ్యారు. అందుకు ఇతనికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరుతూ ఈ రెండు లక్షలు ఇస్తున్నాము..” అంటూ చెక్కును నారాయణ చేతిలో పెట్టేసరికి నోట మాట లేని నారాయణ దాన్ని నవ్వుతూ అందుకున్నాడు.
