Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అంతర్ శ్వాస’ కథా సంపుటి ఆవిష్కరణ – నివేదిక

విశాఖపట్టణం పౌర గ్రంథాలయంలో దూసి శ్రీరామమూర్తి రచించిన కథా సంపుటి ‘అంతర్ శ్వాస’ ఆవిష్కరణ సభ 10-5-2026 న ‘వి.సా.1971’ నిర్వహణలో జరిగింది. సభకు సిక్కిం రాష్ట్ర విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అత్తిలి సుధాకర్, ఐ.పి.ఎస్., అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని ‘వి.సా.1971’ నిర్వాహకులు, ప్రముఖ కథా రచయిత, కవి మల్లాప్రగడ రామారావు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ‘రైటర్స్ అకాడమీ’ అధ్యక్షులు, ‘లీడర్’ దినపత్రిక సంపాదకులు వి.వి.రమణమూర్తి పాల్గొన్నారు.

అధ్యక్షులు సుధాకర్ తనకు రచయితతో ఉన్న చిరకాల అనుబంధాన్ని ప్రస్తావించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగ ఆచార్యులుగా విధులు నిర్వర్తించిన తన తండ్రి, కృష్ణారావు గారికి శ్రీరామమూర్తి సన్నిహితులని, నాటకం రంగంలో కలిసి పని చేసారని తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

కథా సంపుటిని ఆవిష్కరించిన మల్లాప్రగడ, దూసివారు ‘విశాఖ సాహితి’ తొలి తరం సభ్యులని, అప్పట్లో నటుడుగా, రంగస్థల నిర్వాహకుడుగా రాణించారని, నాటకరంగంపై మక్కువతో ఆయన రచనా వ్యాసంగంపై పెద్దగా దృష్టి పెట్టలేదని అన్నారు. గ్రామీణ నేపథ్యం లోంచి, పల్లె జనం పలుకుబడిలో మంచి కథలు అందించారని, కొన్ని కథల్ని ప్రస్తావించి, రచయితను అభినందించారు.

నటుడుగా, రంగస్థల ఉద్దేపనకారుడిగా, పలువురు ప్రముఖులతో కలిసి పనిచేసి, 60 ఏళ్లుగా విశాఖ నాటకరంగానికి ఎనలేని సేవలు అందించిన శ్రీరామమూర్తి గారిని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని రమణమూర్తి అన్నారు.

‘అంతర్ శ్వాస’ కథా సంపుటిని సమీక్షించిన సాహితీవేత్త, ‘కళారత్న’ పురస్కార గ్రహీత డా. డి.వి. సూర్యారావు, రచయిత అనుభవాలు కథలుగా రూపొందాయని, తరాల అంతరాల్ని, బలహీనమవుతున్న కుటుంబ సంబంధాలను, పట్టణాల్లోని బడుగు బతుకుల్ని కథకుడు కళ్ళకు కట్టించారని చెప్పారు. పాత్రోచిత భాష, సంభాషణ, శిల్పం, కథలకు వన్నె తెచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న మహారాజా వైద్య కళాశాల పూర్వ ఆచార్యులు డా. ఈమని సీతారామం దూసి వారి కొన్ని కథలు ఇచ్చే సందేశాన్ని తెలిపారు.

దూసి శ్రీరామమూర్తి తన స్పందనలో తన ప్రియమిత్రులు, ప్రసిద్ధ రచయిత విరియాల లక్ష్మీపతిరావు, తనకు గురుతుల్యులు, కథకుడు, కవి, నాటకకర్త, నటుడు, ‘కళాప్రపూర్ణ’ గణపతిరాజు అచ్యుతరామరాజు గారలు పలుమార్లు హెచ్చరించినా, వారిద్దరూ జీవించి ఉండగా సాధ్యపడని పుస్తక ప్రచురణ, ఇప్పటికైనా నెరవేరినందుకు సంతోషం వ్యక్తపరిచారు. అందుకు దోహదకారులైన వారందరికీ‌ తన కృతజ్ఞతలు తెలియజేసారు.

తొలుత, కథకులు, ‘వి సా.1971’ సహ నిర్వాహకులు ఆడారి గణేశ్వరరావు స్వాగతంతో ప్రారంభమైన సభ, శ్రీరామమూర్తి గారి తనయుడు శ్రీ కమల్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది.

తదనంతరం దూసి శ్రీరామమూర్తి, భ్రమరాంబ దంపతులను బంధు మిత్రులు ఘనంగా సత్కరించారు.

Exit mobile version