[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘అంతరంగ ఆలింగనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అర్థంకాని అంతరంగ భాషలో
అంతులేని అలజడి దాగి ఉంటుంది
ఆ అంతరంగ ఘోష నిండా
నివురు గప్పిన నిప్పుకణికలే..
ఆత్మగాయపు ఆరని ఆవేదనలే..
నీలోకి నీవు తొంగిచూస్తేనే
నిజం నీ మనోనేత్రాలకి కనిపిస్తుంది..
నీలోకి నీవు దూరితేనే
నిశ్శబ్దం నీతో మాట్లాడుతుంది..
తప్పు ఒక మంట అయితే
పాఠం ఒక దీపమవుతుంది,
మనసు ఒప్పుకుంటే వేదన
రోదన కూడా వసంతగీతమౌతుంది..
గులాబిముళ్ళ మధ్యలోనే
సుగంధం పరిమళిస్తుంది కదా,
మన లోపాల నీడలోనే
మానవత్వం వెలుగుతుంది కదా..
క్షమ ఒక చల్లని జలధి
ద్వేషం ఒక ఎండిన ఎడారి
ఎదను ఆలింగనం చేస్తే
ఆత్మ ఔతుంది ఒక అమృతఝరి..
అందుకే మిత్రమా –
నీకు నీవే ఆశ్రయం అవ్వు,
నీ గాయాల్ని నీవే ముద్దాడి
నీ జీవితాన్ని నీ చేత్తోనే వెలిగించు..
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
