[కొమ్మవరపు విల్సన్‍రావు గారు నిర్వహించిన ముఖాముఖీల పుస్తకం ‘అంతరంగ వీక్షణం’ను సమీక్షిస్తున్నారు డా. కె. జి. వేణు.]
ఒక పట్టకంలోకి ప్రవేశించే తెల్లటి కాంతిలా ప్రశ్నలు, ఆ పట్టకం నుంచి విడుదలయ్యే సప్తవర్ణాలుగా జవాబులు ముఖాముఖిలో దర్శనమిస్తాయి. ముఖాముఖి, రెండు మనసుల కరచాలనం లాంటిది. ఆ స్పర్శ సాహిత్యపరమైనప్పుడు ముఖాముఖి ప్రయోజనం బహుముఖీయంగా తన ఉనికిని నమోదు చేసుకుంటుంది. ఆ చర్చ ఒక జీవనది రూపంలోకి పరావర్తనం చెంది, పలు విధానాలైన ప్రయోజనానికి ఒక శాశ్వత వేదికను సిద్ధం చేసుకుంటుంది. ఆ వేదికల మీద ఆత్మకథలు అత్యంత రసవత్తరంగా ఆవిష్కరించబడుతాయి. అలాంటి 35 ఆవిష్కరణల అపురూప అక్షర రూపమే ఈతకోట సుబ్బారావు, డా. సుంకర గోపాలయ్య సంపాదకత్వంలో వెలువడిన, కొమ్మవరపు విల్సన్ రావు ‘అంతరంగ వీక్షణం’. దాదాపు మూడు సంవత్సరాల పాటు విశాలాక్షి మాసపత్రికలో క్రమం తప్పకుండా పలకరించిన ముఖాముఖి ముఖాలే 440 పైగా పేజీలలో అధ్యాయాలుగా తమ స్థిర నివాసానికి సంతకాలు చేశాయి. ఆ సంతకాల తడి జీవనదులై ఈ గ్రంథంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భమిది.
ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయం ఒక పాఠమే. సాహిత్యపరంగా నేర్చుకోవాలనుకునే తత్వం, తెలుసుకోవాలనుకునే ఆసక్తి కలిగిన ఏ వ్యక్తికైనా ఈ పుస్తకం, ఒక విశ్వవిద్యాలయ స్థాయి సమాచారాన్ని అందించటానికి తన తలుపులు తెరిచి సాదరంగా లోనికి ఆహ్వానిస్తోంది. ఈ గ్రంథంలోకి ఆసక్తిగా ప్రవేశించాక అందరూ ప్రేక్షకుల్లా మారిపోతారు. 35 చలనచిత్రాలు వివిధ విశేషాలతో ఎంతో ఉత్కంఠంగా ప్రదర్శించబడుతాయి. చివరి సినిమా పూర్తయ్యాక ఒక సారస్వత సంపద మన ఖాతాలలో తరగని నిక్షేపాల్లా చేరిపోతుంది.
‘నేను సమాజ వారసుణ్ణి’ అంటూ ప్రకటించుకున్న ‘పద్మశ్రీ’ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, అమరావతిని రాజధానిగా పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిగారి సైన్యాధ్యక్షుడిగా, దుర్గాధిపతిగా వ్యవహరించిన భుజంగరాయుడు గారి మునిమనవడని ఆయన ముఖాముఖిలోని అక్షరాలు శంఖాలు పూరించాక, ‘జాషువా అంటే పిచ్చి ఇష్టం’ అంటూ పలికిన ఇనాక్ గారి మనసు పొరల్లోని జాషువా చిత్రపటం వేలాది దీపకాంతులతో దర్శనమిస్తోంది. విశ్వనాథ సత్యనారాయణగారికి, తనకు మధ్యనున్న తేడాలను చాలా సూక్ష్మంగా వెల్లడిస్తూ ‘ఆయన నిన్నటి మనిషి, నేను నేటి జీవిని’ అంటూ పలికిన ఇనాక్ గారు.. ‘నిబిడత’ ప్రక్రియ లక్షణాలను వివరించి, చివరగా ‘నా జీవితమే నా సాహిత్యం. నా కన్నీరే నా సందేశం’ అంటూ తన ముఖాముఖిని ముగించినా ఆ మాటలు మాత్రం పాఠకుల్ని నిత్యం పలకరిస్తూనే వుంటాయి.
‘కవిత్వం రాయడమంటే/ఖడ్గంతో సహజీవనం చెయ్యటం/మొద్దుబారటానికి వీల్లేదు/మోడుగా మిగలడానికి వీల్లేదు’ అంటూ తన స్వరాన్ని ఆకాశం ప్రతిధ్వనించేలా వినిపించిన శివారెడ్డిగారు, ‘వేకువ’ అనే త్రై మాసపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకుడుగా వ్యవహరించిన విశేషం, చేతిమీద గోరింటాకులా పండింది. అస్తిత్వ వాదాలను సమర్థించిన శివారెడ్డిగారు ‘కులము, మతము సమాజ పురోగతికి ప్రతిబంధకాలని, వాటిని ధ్వసించకుండా కొత్త సమాజం, కొత్త లోకం నిర్మాణమౌతుందా?’ అంటూ ప్రశ్నించిన శివారెడ్డిగారు ‘బతకండి, బతికించండి. జీవితం కంటే గొప్పది ఏదీ లేదు’ అంటూ సూచన చేసి ముఖాముఖికి సెలవు ప్రకటించినా, ‘కవులేంజేస్తారు.. గోడలకు నోరిస్తారు.. చెట్లకు కళ్లిస్తారు.. గాలికి గొంతిస్తారు.. ప్రజలకు చేతులిస్తారు.. ప్రజల చేతుల్లో అనంతశక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు..’ అంటూ మారుమ్రోగిన ఆయన కవిత్వ పంక్తులు మన గుండె సవ్వడితో స్నేహం చేస్తూనే వుంటాయి.
భారతీయ సామాజిక తత్వవేత్తల్లో ఒకరిగా ముఖ్యమైన వారిగా గుర్తింపు పొంది, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ తొలి చైర్మన్‌గా చరిత్ర పుటల్లోకెక్కిన బి.ఎస్. రాములుగారు తెలుగులో దళితవాద, స్త్రీవాద రచనల గురించి వాటి పురోగతి గురించి అందించిన ప్రతి మాట నడిచిన, నడుస్తున్న చరిత్ర పుటల్ని దగ్గరుండి చదివించినట్లుగా వుంది. ‘జ్ఞానాన్ని నేటి, రేపటి ఆచరణకు అనువుగా సాధారణీకరించుకోవడం తత్త్వదర్శనం’ అంటూ కవి, రచయితలు రాసే పదాలన్నీ ఎలా తాత్వీకరణలవుతాయో ఆ నడకను దగ్గరుండి సమగ్రంగా వివరించిన బి.ఎస్. రాములుగారి విలువైన మాటల సంపద ఒక నిధిలా మన ఖాతాలలో చేరుతున్న సందర్భంలో ‘రచయిత నిరంతరం విద్యార్ధిగా వుండాలి, భిన్న అభిప్రాయాలను సహించి, గౌరవించి, వ్యక్తం చేసుకునే హక్కును గౌరవించే శక్తిని, స్థయిర్యాన్ని, ఉదాత్తతనీ సంపాదించుకోవాలి’ అంటూ హితవు పలికిన ఆ గుండె శబ్దాల తరంగాలు అవసరమైన జ్ఞానానికి అద్దాల మేడల్ని అందిస్తున్నాయి.
సాహితీ లోకంలో సంచలనం రేపిన విమర్శ వ్యాస సంపుటి ‘ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు’ గ్రంథ రచయిత శ్రీరామకవచం సాగర్ గారు ఎంతో సాహిత్య విమర్శ రాసిన నేపథ్యంలో ‘వినిర్మాణ విమర్శ’ గురించి ప్రస్తావించిన సందర్భంలో ఆ వాదానికి సృష్టికర్త ‘జాక్వియేస్ డెర్రిడా’ ను గుర్తుచేయడం మూలాలను తీసి మెడలో మాలగా వేసినట్లుగా వుంది. పద్య కవిగా మొదలై, కథకునిగా, వచన కవిగా, నవలాకారునిగా, విమర్శకునిగా ఆయనలో జరిగిన పరిణామక్రమాన్ని అందించిన ప్రతి పలుకు, సాహితీమూర్తులు నడిచిన దారుల వెంట దీపాలుగా వెలుగుతున్నాయి.
యాభై ఏళ్ల సాహిత్య అనుభవజ్ఞాని రంగనాథ రామచంద్రరావు గారి అంతరంగం ఒక రంగస్థలమై ప్రదర్శించిన పోలీస్ ఫైల్ కథలు, ఆంధ్రజ్యోతిలో పదేళ్లుపాటు రాసిన క్రైమ్ కథలు, ఘోస్ట్ కథలు, పునర్జన్మ కథలు, కర్ణాటక మహిళా ఖైదీల కథల సమాహార సమాచారం ఆయన కలం పదునుకు లెక్కలు కడుతున్నాయి. అనువాద ప్రక్రియలో ఉన్న సౌలభ్యాలు, ఇబ్బందులు తదితర ఖాతాలను గురించి జరిగిన చర్చ, సారవంతమైన సాహిత్య విషయాల పంటల దిగుబడికి నల్లరేగడి నేలలా మారిపోయింది.
మూడు దశాబ్దాలుగా కవిత్వంలో గాఢమైన అభివ్యక్తికి తన చిరునామాను స్పష్టత పరచుకున్న చిన్ని నారాయణరావు గారు, తన కొన్ని కవితల్లో వాడిన అధిక్షేప వాక్యాల వాడకం గురించి సంధించిన ప్రశ్నకు జవాబుగా ‘సామాన్యుని బ్రతుకులో క్షామం ఇక క్షేమం’ అనే వాక్యం భగ్గుమన్న కడుపు మంటలో నుంచి ఉద్భవించిందని వెల్లడించిన ఆయన అర్థవంతమైన ఆలోచనల తీవ్రత, మనల్ని కాసేపు ఆలోచింపజేసింది. ‘దాహం.. దాహం’ దీర్ఘ కవిత ఒక నిరసన కావ్యంగా సాగిన సంగతుల్ని వివరిస్తూ దీర్ఘ కవితకు, దీర్ఘ కావ్యానికి లక్షణాలలో కనిపించే తేడాలను ముడిని విప్పి అందించిన విషయాలు ఆసక్తికి దాహం తీర్చినట్లుగా వుంది.
చాలా ఏళ్లుగా విశాలాక్షి మాసపత్రికకు సమర్థవంతమైన సంపాదకుడిగా కొనసాగుతూ, కవిగా, కథకుడిగా, స్థానిక చరిత్ర రచయితగా బహు గ్రంథాలను వెలువరించిన ఈతకోట సుబ్బారావు గారు, ఆయన కథలలోని ఏక సూత్రత గురించి ‘సమాజ ఉన్నతీకరణ ప్రయత్నంలో ఉన్నతంగా ఆలోచింపచేయాలనే ప్రయత్నం చేయటమే నా కథలలో ఏక సూత్రత’ అంటూ అందించిన అక్షరాల నిండా సుబ్బారావుగారి సాహిత్య దృష్టికోణం నిటారుగా నిలబడిన దృశ్యాన్ని అందిస్తోంది.
‘సమాంతర ఛాయలు’తో మొదలై ‘అనితరుడు@366’ వరకు అనేక గ్రంథాలకు ప్రచురణ పతాకాలను ఎగురవేసి, నిచ్చెనమెట్ల సమాజ ధ్వంసమే నా సాహిత్య లక్ష్యమంటూ శంఖాన్ని ఊది, కరోనా కలాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా భావించి ‘వైరాయణం’ పేరుతో దీర్ఘ కావ్యం రాసిన మువ్వా శ్రీనివాసరావు గారు, తనది కాంగ్రెస్ కుటుంబమని చెప్పుతూ.. తన కవితా సంపుటి ‘వాక్యాంతం’ లో ‘కూడికలు తీసివేతలు’ కవితలో తాను వాడిన శైలి సౌందర్య అంతరార్థం గురించి ఇచ్చిన వివరణ అగ్రతాంబూలపు అర్హతను పొందింది.
కవిగా, విమర్శకుడిగా, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయితగా, దళిత కవిత్వంలో ఉన్న ధిక్కారతను, ఆత్మవిశ్వాసాన్ని పోరాట పటిమను పుణికి పుచ్చుకున్న డా. వూటుకూరి వరప్రసాద్ గారు, దళిత సాహిత్యంపై ఎందుకు తాను పరిశోధనను సాగించారో వెల్లడించిన నేపథ్యంలో దళిత బాధితుల జాబితాలో ఆయన కన్నీళ్లు మనల్ని తాకుతూ, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని, సమకాలీన జీవనాన్ని ఎవ్వరు ఏ రూపంలో రాసినా ప్రజలకు చేరువైపోతారని భాషించిన ఆయన సంభాషణ చాలా రోజులు గుర్తుండిపోతుంది.
తన స్కూలు ఫీజు కట్టి, ఆగిపోయిన తన చదువు ప్రవాహాన్ని ఒక వరద ప్రవాహంలా మార్చిన తెలుగు మాష్టారు శాస్త్రి గారికి కృతజ్ఞలు తెలుపుకుంటూ తన పేరు చివర శాస్త్రి నామాన్ని చేర్చుకోవడం తన సంతృప్తికి కిరీటాలు తొడిగినట్లుగా భావించే ఎజ్రా శాస్త్రిగారు, తాను దళిత నుడికారానికి చిరునామాగా ఎదిగిన మెట్ల నిర్మాణాన్ని గురించి వివరించినప్పుడు, ఆయన గొంతుకలో దళితుల గురించి తపన, దళిత తాత్వికత ఆయన కవితల్లో అంతఃసూత్రంగా ఎలా కొనసాగుతుందో పలికిన ధ్వని, జాతరలో డప్పుల వాయిద్యంతో జతకూడినట్లుగా వుంది.
గుణాత్మక పరిణతి సాధించిన కథకుడిగా, కవిగా, ఆలోచనాపరుడిగా, భేషజం ఎరుగని నిఖార్సైన భౌతికవాదిగా గుర్తించబడిన జి. వెంకటకృష్ణగారు తన మొదటి కథ ‘పామును మింగిన కప్ప’, ‘లోగొంతుక’ కవితా సంపుటిలను గురించి ప్రస్తావించినప్పుడు బడుగు జీవుల వేదనను అక్షరీకరించడంలో ఆయన తాత్వికత మాననీయ స్వరంతో ఎలా సాహిత్యగానం చేసిందో, ఆ గుణాత్మక పరిణతిని పఠించినప్పుడు ఒక పులకరింత మన మనసు దస్తావేజుల్లో సంతకం పెడుతోంది. దూరాన్నుంచి ‘సారం పీల్చేసిన పేగులా ఉంది ఈ నది’ అంటూ వెంకటకృష్ణ గారు వెలువరించిన రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ దీర్ఘకవిత ‘హంద్రీగానం’ బిగ్గరగా తన గొంతును వినిపించడం మొదలుపెట్టింది.
సాహిత్యంలో తనను తాను సంలీనం చేసుకుంటూ, నాలుగున్నర దశాబ్దాల సాహిత్య ప్రయాణంలోని వివిధ దశలలోకి వంశీకృష్ణ గారు మనల్ని నడిపించినప్పుడు, స్వాతి మాసపత్రిక అనుబంధ నవలలుగా ప్రచురించిన ‘కాందిశీకులు’, ‘ఉనికి’ పెద్ద కథలు జంటగా మనముందు తమ హాజరును ఘనంగా ప్రకటించుకుంటున్నాయి. జాతీయంగాను, అంతర్జాతీయంగాను వివిధ భాషల్లో వచ్చిన కవిత్వాన్ని అనువాదం చేస్తున్న వంశీకృష్ణగారు, తాను చేపట్టిన సాహిత్య ప్రక్రియలలో తనకు బాగా పేరు తెచ్చిన ప్రక్రియ సినిమా వ్యాసాలంటూ ప్రకటించినప్పుడు, సినిమా విమర్శ వ్యాసాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అందించిన ‘నంది’ పురస్కారం తలనిండా పువ్వులతో అక్షరాల పల్లకీలో ఊరేగుతూ రావటం ఒక విశేషం.
కవిత్వంలో స్పష్టత, సాంద్రత, నిర్దిష్టతల అవసరాన్ని సరైన కొలతలతో అధ్యయనం చేసి, వాటిని పాటించడంలో నిబద్ధతను అనుసరించిన కరిపె రాజ్ కుమార్ గారు, సాహిత్యమే తన సాహిత్య గురువంటూ ప్రకటించుకొన్న సమయంలో, ‘నిరంతరం ప్రవహించే నదీపాయలు/నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నాయి!/వేయిరేకల వెన్నెల పువ్వు/నేల వైపు వాలుచూపు చూస్తోంది..’ అంటూ ఆయన కవితలోని వరుసలు అడవులు, ఆదివాసులు, వన్యమృగాలతో అలరారే అటవీప్రాంతంలో నడిచిన ఆయన జీవిత పాదముద్రలను అక్షరాల సాక్షిగా నమోదు చేస్తున్నాయి.
ఆరు కవితా సంపుటాలకు సంపాదకత్వం వహించి, ఎంతో విలువైన గ్రంథాలను వెలువరించి, తన సాహిత్య కృషికి ఇరవైకి పైగా పురస్కారాలను దక్కించుకున్న నిత్య నూతన సృజనకారుడు, జాతీయోద్యమ గీతాలపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించిన డా. ఏనుగు నరసింహారెడ్డిగారు, అధిక సంఖ్యలో రుబాయిలు రాసిన ఘట్టాలను ఉటంకిస్తూ, బేసిక్‌గా తాను మార్క్సిస్టునని, గతితర్కం తనను బాగా ఆకర్షించిందని, మతం విషయంలో మార్క్స్ చెప్పిన అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్న ఈ సృజనకారుడు, తన ‘బోయడు కుట్టిన వల’ కవితలో అద్భుతమైన శిల్పంతో నడిచిన కారణాన్ని వివరించిన దృశ్యలో లంచం తీసుకొని, జైలుశిక్ష అనుభవిస్తూ జైలులోనే మరణించిన ఒక ఉద్యోగి సంఘటన తనను తీవ్రంగా కలచివేసిన నేపథ్యం నుండి వెలువడిన ‘ఎవరి కళ్లలోనూ/నీటి చుక్కలు ఉబకకుండా/జాగ్రత్త పడాలి మరి/ఏ ఊహాదర్పణం భళ్లుమనకుండా/నిలువరించి తీరాలి..’ అంటూ వెలువడిన కవితా స్వరాలు ఆయన సున్నిత హృదయాన్ని ఒక చిత్రపటంగా రూపాంతరం చెందిస్తున్నాయి.
కొత్తదనాన్ని కాంక్షిస్తూ, బాధిత బతుకుల పక్షాన నిలబడి సాహిత్య సృజన చేస్తూ, భావ సాంధ్రత కలిగిన సుమారు రెండు వందల కవితలు, వందకు పైగా కళాత్మక కథలు, యాభైపైగా సాహిత్య వ్యాసాలు రాసి, సాహిత్య జీవితాన్ని ఉన్నతీకరిస్తున్న ఎమ్వీ రామిరెడ్డిగారు, తాను కవితను రాసే పద్ధతిని వివరిస్తూ అందించిన విషయాలు, కవిత్వం బలంగా రాయటానికి ఉపయుక్తమైన పాఠ్యపుస్తకాలుగా పాఠకుల చేతుల్లోకి రాలుతున్నాయి. కథలోనూ, కవితలోనూ వస్తువుకు, శిల్పానికి మధ్య సామరస్యత ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తూ, ఆ రెండింటి మధ్య సామరస్యం అత్యంత సహజంగా జరగాలని, ఒకదానిలో మరొకటి అంతర్భాగంగా అల్లుకుపోయి, సాహిత్య సౌందర్యానికి తలుపులు తీయాలని తలించిన ఆయన భావనలు నిండు వర్షంలా ముఖాముఖి నిండా కురిశాయి.
మనిషిని మనిషిగా ప్రేమించడమే తన తత్వమంటూ ప్రకటించుకున్న గోపగాని రవీందర్ గారు, శ్రీశ్రీ ‘జయభేరి’, ‘దేశ చరితలు’, అలాగే శివసాగర్ ‘నా కోసం ఎదురుచూపు’ కవితలు తన సాహిత్య అభిరుచికి తెరదీసిన మహారూపాలుగా కీర్తించారు. ‘అన్యాయాన్నెదిరిస్తే/నా గొడవకు సంతృప్తి/అన్యాయం అంతరిస్తే/నా గొడవకు ముక్తి ప్రాప్తి/అన్యాయాన్నెదిరించినోడు/నాకు ఆరాధ్యుడు..’ అంటూ కాళోజీ, విత్తనాల్లా విసిరిన భావాలు మహావృక్షాలై ఆ నీడన తన వ్యాస రచన ఇష్టాన్ని సేద తీర్చుకున్న ఈ సాహితీవేత్త సుద్దాల అశోక్ తేజ గారి ‘నేలమ్మ నేలమ్మ’ గేయ రూప కవిత్వంపై పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా పొందిన విశేషాలు, తాము అందించే స్ఫూర్తికి కాగడాల వెలుగుల్ని తోడు తెచ్చుకున్నాయి.
వస్తువు, అభివ్యక్తి, శిల్పం, ఎత్తుగడ, ముగింపులను తన కవిత్వానికి ప్రాణాలుగా ఎంచుకుని ‘నల్లవసంతం, గాజుపూలు, కలల వంతెన, గొడుగు కింద వాన’ కవితా సంపుటాలను వెలువరించిన సాహిత్య సేద్యకుడు మణిందర్ గారు, పదవతరగతి నుండి కవిత్వం రాస్తున్నారని, కవిత్వానికి తన నాన్నగారే తొలి గురువంటూ వెల్లడించిన వీరు ‘ఈస్తటిక్ పోయట్రీ, పోస్ట్ మోడర్న్ పోయట్రీ’ లను ఇష్టపడుతున్నట్లు, తాను ఎప్పుడూ ఒకేలా రాయటానికి వ్యతిరేకమని, ఆ కారణాలవల్లే ఒకే ఛాయలు తన కవితల నిండా కనిపించవని, గాఢమైన స్పష్టీకరణ చేస్తున్నారు. సామాజిక వైరుధ్యాల చిత్రణే తన సాహిత్య దృక్పథమని తేల్చిన మణిందర్ గారు కవిత్వంలో ‘చైతన్య స్రవంతి’ టెక్నిక్ గురించి వివరించిన విషయాలు, సాహిత్య ప్రయోగాల దిశవైపు కేంద్రీకరించిన మన అడుగులను, భుజం తట్టి సాగమంటున్నాయి.
ఎటువంటి వాదనలకు లొంగకుండా భావ కవిత్వాన్ని ఆశ్రయించి తన సృజనను కొనసాగిస్తున్న కవయిత్రి లక్ష్మి కందిమళ్ళ గారు. ఎందరో సాహితీవేత్తల మన్ననలు పొందిన తన కవిత ‘పాల మీగడను తొడుక్కున్న సంధ్య కాంతి’ నేపథ్యాన్ని గంభీరంగా వెల్లడిస్తూ.. తన మనసులో కలిగిన అలజడుల, సంఘర్షణల రూపానికి పరిష్కారం చూపే దిశలే కవిత్వంగా మార్పు చెందుతుంటాయని, కవిత, కథలు రాయటానికి తనకు ప్రత్యేకమైన ప్రణాళికలంటూ ఏవీ వుండవని, మనసులో మథనాన్ని బట్టి వాటి సృజన సహజంగా జరిగిపోతుందని ఎంతో సంతోషంగా వెల్లడించిన ఆమె మాటల్లో సత్యాలన్నీ, నిజాయితీ తలపాగాలతో కవాతు చేస్తున్నాయి.
సాహిత్యం పట్ల క్రమశిక్షణ, నిబద్ధతతో పాటు నిత్యం బాధితుల సమూహాల పక్షాన తన గళం విప్పి చైతన్యపరచడాన్ని ప్రవృత్తిగా చెప్పుకుంటున్న వైష్ణవిశ్రీ ‘తాను కవిత్వం కోసం నిత్యం పుడుతూనే వుంటాను’ అంటూ కాలం కాగితాల మీద సంతకాలు పెడుతూ, తన మొదటి కవిత ‘మట్టి వీరుడు’ 2016లో ఆంధ్రప్రభలో అచ్చయిందని, కవిత్వం మీద ఇష్టం, తపన పెరగటానికి ‘తనకున్న పరిధి మేర ప్రేరణాత్మక సామాజిక కవిత్వాన్ని ఒడిసి పట్టుకోవడమే’ కారణమని, హుస్సేన్ హైద్రీ రాసిన హిందీ కవితను తెలుగులోకి అనువాదం చేసిన సంగతులను వెల్లడించినప్పుడు ‘ఆమె విశ్వాసానికి వందేళ్లు’ అన్న శబ్దం బిగ్గరగానే ఆమె అక్షరాలలో వినిపించడం మొదలుపెట్టింది.
అనేక సమస్యలతో సతమతమవుతున్న రాయలసీమ జీవితాల జాబితాలో తన పేరును సైతం నమోదు చేసుకున్న యాములపల్లి నరసిరెడ్డి, తాను కథలకంటే ముందు కవిత్వమే రాశానని, మొదటి కవిత 2012లో ఆంధ్రజ్యోతిలో అచ్చయిందని, మొదటి కథ ‘ఉజ్వల’ సాహితీకిరణంలో అచ్చయిందని ప్రాథమికదశ వివరాలను అందించారు. ‘తెలుగు సార్వభౌమ’ ఏకపాత్రను రాసి, తానే నటుడుగా దాన్ని శ్రీకృష్ణదేవరాయలు 503 శతాబ్ది ఉత్సవాలలో అభినయించి పెద్దల మెప్పును పొందిన శుభసందర్భాలు ఆయన మాటల్లో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాయి
తన కవిత్వం నిండా వైయక్తిక అనుభవాల హృదయ స్పందనను దట్టిస్తూ, కవిత్వానికి పలు పురస్కారాలతో పాటు, గజల్ సాహిత్యానికి ‘కలహంస గజల్ పురస్కారం’ అందుకున్న మెట్టా నాగేశ్వరరావు గారు, ‘సమాజాన్ని సక్రమగతిలో నడిపించిందే మంచి కవిత్వం’ అంటూ తిరుగులేని నిర్వచనానికి సంతకం చేస్తున్నారు. తన కవిత్వంలో మానవసంబంధాల కోణాన్ని విపరీతంగా ప్రేమించే ఈ కవి, తనకు కూతురు పుడితే ‘కూతురమ్మ పద్యం’, ‘పాప అలంకారాలు’, ‘ఊపిరిరాగం’ కవితలు రాసినట్లు, కొడుకు అభిరుచుల్ని పరిశీలించి ‘కొడుకు పద్యం’ రాయడం విశ్లేషణ అవసరం లేని విశేషంగా పలకరిస్తోంది. చిద్రమైన బతుకుల్ని చిత్రీకరించడంలో ఈ కవి ఉపయోగించే పదచిత్రాలు చాలా ఔచితీమంతంగా ఉండటం ఎలా సాధ్యమయిందో వివరాలు అందిస్తూ, ఆయన ఎక్కువగా నోస్టాల్జియా కవిత్వం రాయడంలో పొందిన సంతృప్తిని, అందుకు కారణాలను తన కవితా పంక్తుల ఆధారాలతో అందమైన చిత్తరువులా జరిగిన ముఖాముఖిలో అందించారు.
***
నిరంతరం చలనశీలంగా వుంటూ అనునిత్యం సాహిత్యంతో మమేకమవుతూ, కవిత్వం, కథ, పాట, వ్యాసం.. ఏది రాసినా ఒక ప్రత్యేక రచనా శైలిని తనకు మాత్రమే సొంతమన్న రీతిలో సాహితీ పరిశీలకుల నుంచి ప్రశంసలు పొందుతున్న సృజనకారుడు డా. జడా సుబ్బారావుగారు. డెబ్బై కథలు, వంద కవితలు, వంద వ్యాసాల పంటలను సమర్థవంతంగా సాగుచేసిన ఈ తెలుగు అధ్యాపకుడు ‘ఆకుపచ్చని కన్నీళ్ళు’ కథ నిర్మాణం విషయంలోనూ, శైలి పరంగానూ, చైతన్య స్రవంతి పద్ధతిలో సాగిన విశేషాలను అందిస్తూ ‘ఆత్మహత్యకన్నా ఆత్మవిశ్వాసం గొప్పది’ అంటూ ఒక లోకహిత వాక్యం కథలో ఎలా కేంద్రబిందువుగా మెరిసిందో చెప్పిన మాటలు మైమరపించాయి. ‘తెలుగులో వ్యాఖ్యాన సంప్రదాయం ప్రసిద్ధ కావ్యాల వ్యాఖ్యానానుశీలనం’ అనే అంశంపై పరిశోధన చేసిన వీరు, మానవ జీవితాన్ని అత్యంత స్పష్టంగా చూపించేది కథ’ అంటూ తన వాదనకు బలాన్నిచ్చే అంశాలను గురిపెట్టిన బాణాల్లా వదిలిన సందర్భం ఉత్సాహానికి పరుగులు నేర్పింది.
2022లో కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ రైటర్స్ మీట్’ లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతినిధిగా పాల్గొన్న బిల్ల మహేందర్ గారు, ఆత్మ విశ్వాసాన్ని కవితాయుధంగా మలచుకొని భాషను వడగట్టి సముచిత ప్రతీకల్ని వాడుతూ, కాలాన్ని గెలుస్తూ అక్షర యాత్ర చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి దుస్సంఘటన జరిగినా వెంటనే స్పందించి కవిత్వాన్ని తన గొంతుగా మార్చి గర్జించటం మహేందర్ గారి దినచర్యల్లో ఒక భాగంగా తన ఉనికిని స్థిరపరచుకుంది.
‘కవిత్వమంటే ఆత్మ భాషే..’ అంటూ నిరంతరం ఆ భాషకు ప్రణమిల్లే సాంబమూర్తి లండగారు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ, జీవితం కన్నా గొప్ప గురువు, సమయం కన్నా గొప్ప ప్రేరణ ఉండవన్న ఉత్తమ భావనను భుజాన మోస్తున్న వీరు సమకాలీన వాస్తవికతకు, సామాజిక వాస్తవికతకు మధ్యగల తేడాను స్పష్టమైన మాటల్లో తూకం వేసిన తీరు అభినందనీయం. సిమిలీ, మెటఫర్, అనాలజీ ఈ మూడింటి పని ఒక్కటేనని, వాటి పంథాలో రాసిన తన కవితలను పరిచయం చేసి వాటితో మన స్నేహానికి వేదికను అందించిన ఈ ముఖాముఖిలో ఆయన కవిత ‘మొలకెత్తుతున్న ఇల్లు’ లో ‘అతిథుల్లారా/కొంచెం మెత్తమెత్తగా నడవండి/ఇంట్లో నేలంతా నా గుండెను తాపడం చేశాను/కిటికీలన్నీ సున్నితంగా తెరవండి/నా కనురెప్పల్ని కర్టెన్లుగా ఉంచాను..’ అంటూ తమ గొంతులు విప్పి మాట్లాడుతున్న ఆ పంక్తులు, మళ్లీ, మళ్లీ వినిపించడానికి మన అనుమతి అక్కరలేని జాగాలను సొంతం చేసుకుంటున్నాయి.
‘ఏడ్చి, ఏడ్చి ఎక్కిళ్లు పెడుతున్న మట్టి.. నిరాదరణకు గురై అభాగ్యులున్న దిగులు నేల..’ ఈ రెండింటి సమన్విత రూపంతో కవిత్వ సాధన చేస్తూ, మంచి కవిత్వం రాసే వాళ్లల్లో ముందు వరుసలో వుంటున్న కంచరాన భుజంగరావుగారు, తనకు రైతు కవిత్వమంటే మహా ఇష్టమని, తన కవిత్వంలో మేనిఫెస్టోలాంటి కవిత ‘ఆశయ వాక్యం’ అంటూ, ‘కవిత్వమే నా కుడిచేయి. కవిత్వంతోనే నా ఊపిరి వెలిగించుకుంటాను. కవిత్వంతోనే నా ఆయువు పొడిగించుకుంటాను. నా కవిత్వానికి నేనే వాక్యాంతాన్నవుతాను..’ అంటూ ప్రకటించిన ఆ భావాల్లో భుజంగరావుగారి స్పష్టమైన దృక్పథం నాలుగు దిక్కుల్లో జెండాలను ఎగురవేస్తోంది.
కవిత అంటే ‘ఏమీ కాదు/మరుగుతున్న పాలు/పొంగిపోయింతర్వాత/పాత్రలో మిగిలిన పాలే..’ అంటూ కవిత్వానికి కొత్త నిర్వచనాల తలపాగాలు చుట్టిన ఈ. రాఘవేంద్ర గారు, తాను వెలువరించిన ‘గాయపడ్డ విత్తనం’ కవితా సంపుటిలోని ‘మకుటపు’ కవితలోని ‘ఊర్లో ధ్వంసమై/మొలకెత్తని విత్తనమొకటి/పట్నంలో ఓ ఇంటి గేటు ముందు/గ్రీష్మం కురిసిన చెట్టయ్ నిలబడింది..’ అంటూ ఈ కవితా పంక్తులు రాఘవేంద్రరావుగారి కవిత్వ సత్తాకు దండోరాలు మ్రోగిస్తున్నాయి.
కవిత్వాన్ని తన అస్తిత్వ గొంతుకగా మార్చుకున్న మెర్సీ మార్గరెట్ గారు, ‘మాటల మడుగు’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన క్షణాలలో ఆమె పొందిన మానసిక ఉద్వేగాన్ని పాఠకులతో పంచుకున్న సందర్భం చాలా విలువైనదిగా కాలం భావిస్తోంది. సుమారు 200 కవితలు రాసిన వీరు.. నాటక రచనలో సైతం సిద్ధహస్తులు. దానికి కొనసాగింపుగా షార్ట్ ఫిలిమ్స్ స్క్రిప్ట్ రైటర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇంతటితో ఆగక హైదరాబాదులోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవాలు ముఖాముఖిలో తారాజువ్వల్లా వెలిగాయి.
కవిత్వాన్ని ఒక కళాత్మక రూపంగా భావించిన డా. సుంకర గోపాలయ్యగారు, కవిత్వ తత్వాన్ని తెలుసుకుని ప్రతి అక్షరాన్ని తూకంవేసి మరీ మంచి కవిత్వాన్ని పండిస్తున్న వాస్తవాలు వర్షపు ధారలా ముఖాముఖిలో కురుస్తున్నాయి. తన కవిత్వంలో జీవిత మూలాలకు సంబంధించిన అనుభవాలు, భాష ఎక్కువగా కనిపించటానికి కారణం ‘పుట్టుకతోనే గ్రామీణ నేపథ్యం బలంగా వుండటమేన’ని స్పష్టపరుస్తున్నారు. ‘వచన కవిత్వంలో స్మృతి కవిత’ శీర్షికతో సాహిత్య పరిశోధన చేసిన వీరు, మార్క్సిస్ట్ దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ప్రకృతిని బాగా పరిశీలించాలని నమ్ముతున్నారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమం ముగిసినా ఆయన కవిత ‘ఖాళీ అయిన ఇల్లు’ లోని ‘ప్రతి ఇంట్లోనూ ఒక సముద్రముంటుంది/దాటేయడానికి/పడవల్లాంటి మనుషులు కావాలి..’ ఈ ముగింపు వాక్యాలు నీడలా మనవెంట ఎప్పటికీ నడుస్తూనే వుంటాయి.
కవిత్వం రాయడం, కవిత్వాన్ని చదవడం ప్రధాన అభిరుచులుగా కొనసాగిస్తున్న డా. పెళ్లూరు సునీల్ గారు ‘దీర్ఘకవితా వికాసం’ అనే అంశంపై పరిశోధన చేసి వెలువరించిన గ్రంథం అనేకమంది సాహితీవేత్తల, సాహితీ విమర్శకుల మన్ననలను పొంది, దీర్ఘ కవిత రాయాలనే కవులకు ‘దారిదీపం’లా ఉపయోగడుతున్న శుభ సందర్భాలను అందించిన ముఖాముఖిలో, కవిత్వంలో మార్మికత ఒక టెక్నిక్‌గా భావించాలే తప్ప, అదే మాధ్యమం కారాదని వెల్లడించిన సునీల్ గారి మాటలు అందరికీ చాలా ఇష్టమైన వాక్యాలుగా మిగిలిపోతున్నాయి. ఎన్.టి.ఆర్ వ్యక్తిత్వంపై సునీల్ గారు రాసిన ‘తెలుగు అక్షరం’ అనే కవితకు అంతర్జాతీయ స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి బహుమతిని పొందిన విశేషాలు చాలా స్ఫూర్తిదాయకంగా వున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం విమర్శ’ అంశంపై పరిశోధన చేసిన డా. తండ హరీష్ గౌడ్ గారు, ఒక కులం తాలూకా వృత్తి పనిముట్లను కవిత్వంలో ఉటంకిస్తూ రాస్తున్న కవిత్వ సంగతుల్ని అందించిన సందర్భంలో తన కలంనుంచి వెలువడిన ‘తాటివనం’ కవిత ఎత్తుగడలోనే కల్లుతీసే తన కులవృత్తికి సంబంధించిన పనిముట్ల ప్రస్తావనకు తెరదీసినట్లు పేర్కొంటూ, కులవృత్తిలో బతుకులకు కనీస భరోసా లేని వేదనలోంచి తన కవితలు తమ పుట్టుకను నిర్దేశించుకున్నాయని, ఆ కోవలోని కవితలు సైతం సాహిత్యాభిమానుల అభిమానాన్ని ఆస్తులుగా అందించాయని పలికినప్పుడు ఆయన కళ్లల్లో సంతృప్తి ఒక మెరుపులా మెరవటం గమనించవచ్చు. వ్యక్తిగత సంబంధిత అంశాలు, భావుకతల మేళవింపుతో కూడినది ‘ఆత్మాశ్రయ కవిత్వమని, సమాజహితం కోరుకుంటూనో లేక ఇంకేదైనా వస్తువును కవిత్వం చేయడాన్నో అనాత్మశ్రయ కవిత్వమని నిర్వచించిన హరిష్ గౌడ్ గారి కవితలు ఎక్కువ శాతం అనాత్మాశ్రయ కోవ హాజరు పట్టికలో సంతకం చేయడాన్ని మన గమనిక నమోదు చేస్తోంది.
అనేక పదబంధాల్ని ఎంతో ఔచితీమంతంగా ఉపయోగిస్తూ, రోజురోజుకూ ఒక గుణాత్మకమైన మార్పును సంతరించుకుంటూ, ఛిద్రమైన బతుకుల్ని చిత్రించుకుంటూ.. సాహితీయాత్ర చేస్తున్న యువకవి పల్లిపట్టు నాగరాజు గారు. తన తొలి కవితా సంపుటి ‘యాలై పూడ్సింది’తో తెలుగు కవితా లోకపు ప్రశంసలను బహుమతులుగా పొందిన వీరు, నగరాలను శుభ్రం చేస్తున్న సపాయితల్లుల వ్యథల్ని, వృత్తి గౌరవాన్ని, చెప్పులు కుట్టే తాత వంటి ఇప్పటికీ వెనక్కి నెట్టివేయబడిన దళిత సమాజాన్ని, పనితనపు నైపుణ్యాన్ని, చేపలమ్మే బెస్త కుటుంబ ఇల్లాలి కథ, ఆ నేపథ్యపు మానవ సంబంధాలు.. వీటితోనే నాగరాజుగారు అద్భుత కవితల నిర్మాణాల్ని అత్యంత నేర్పుగా కొనసాగిస్తున్నారు. ఈయన కవితల్లో మాండలికపు సొగసు అబ్బురమనిపిస్తుంది. కవితల్లో వాటి వాడకాన్ని సమర్థించుకుంటూ, ఏ సాహిత్య సృజన అయినా భాషకు కొంత చేర్పును ఇవ్వాలన్న నాగరాజుగారి భావనతో అందరం ఇష్టంగా చేతులు కలుపుతాం.
‘బతికిన క్షణాలన్నీ కవిత్వంతోనే’ అంటూ, ‘ఆకు కదలని చోట’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన బాలసుధాకర్ మౌళిగారు, అస్తిత్వ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడే కాలంలో కలం చేపట్టిన తన సాహిత్యానుభవాల చిట్టాను విప్పుతూ.. అస్తిత్వం లేనిదే బ్రతుకు లేదని, అస్తిత్వ ఉద్యమాలన్నీ ఒక దారంలోకి పూలన్నీ కూర్చబడినట్టు అన్నీ రాగలవని, ఆ దారం పేరు చైతన్యమో, తిరుగుబాటో, విప్లవమో ఏదైనా సరే బతుకును మహోన్నతం చేస్తుందని ఆశిస్తున్న ఈ కవి, పాశ్చాత్య సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన దాఖలాలను నిర్ధారపరుస్తూ, ఆ అధ్యయనం, ఆ సాహిత్యాలలోని వస్తువు, అభివ్యక్తీ తనకెంతో ఇష్టమని, తన కవితలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, బెంగాలీ, అరబిక్ భాషల్లోకి అనువాదమయ్యాయని, ప్రజా దృక్పథమే తన సాహిత్య దృక్పథమంటూ.. తన విశేషాలను కరచాలనం ద్వారా అందించిన సందర్భంలో వీరు సంపాదకత్వం వహిస్తున్న ‘చర్య’ బులిటెన్ నేరుగా వచ్చి చేతుల్లో వాలిపోతోంది.
‘అమ్మ నన్ను కన్నది, కవిత్వం నాకు ఊపిరి పోసింది’ అంటూ సగౌరవంగా ప్రకటించుకున్న తగుళ్ళ గోపాల్ గారు ఒంటి మీద సొమ్ములు లేని తన అమ్మ తన వాక్యాలకు మట్టిపూతని, అన్ని సందర్భాలలోనూ తన చెల్లెలే నిజానికి అన్నగా ఆదుకుందని చెప్పుతూ వుంటే ఆయన కనురెప్పల మధ్య తడి.. సిరా చుక్కలై కవితల రూపానికి వడివడిగా చేరుకుంటున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ వారి నుంచి యువ పురస్కారం పొందిన నాటి భావోద్వేగం గురించి వెల్లడిస్తూ.. తన ‘దండ కడియం’ కవిత్వ సంపుటికి ఆ పురస్కారం దక్కిందని, ఆ వార్త విన్న క్షణాల్లో తన కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదని, ఈ సందర్భంగా తనకు తెలియకుండానే తిరిగి ఆ దృశ్యాలలో తన పాదముద్రల్ని చూసుకున్న తగుళ్ళ గోపాల్ గారు, తన కవిత్వంలో ఎక్కువగా కనిపించే ‘సెన్సిబిలిటి’ పాళ్లు గురించి చెప్పుతూ.. తనకు ‘అమ్మ అణుకువ నేర్పితే, సాహిత్యం శ్వాసనిచ్చిందని, సెన్సిటివ్‌గా లేకపోతే ఏ సృజనకారుడు మంచి సాహిత్యాన్ని సృజన చేయలేడన్న సిద్ధాంతానికి ఆయన సాక్షి సంతకాలు చేస్తున్నారు.
రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున ఆచి తూచి రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కిరణ్ విభావరి గారు అందించిన ‘నఖాబ్’ కథల సంపుటిలోని తొమ్మిది కథలూ, ఒక కొత్త సుగంధ పరిమళంతో సామాజిక సమస్యలకు చిరునామాగా నిలిచిన కథలే. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసి, కరోనా కాలాన్ని సృజన సాహిత్యం చదవడం కోసం, రాయడం కోసం వినియోగించుకున్న కిరణ్ విభావరి గారు, కవితలకంటే తాను కథలనే ఎక్కువగా రాశానని, పోటికి పంపిన కథలు బహుమతులు గెల్చుకుని తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయని, వందలాది ఉత్తమ కథలు చదివి కథల్లో కవితాత్మక వాక్య శైలిని మెరుగు పరుచుకున్నట్లు వెల్లడించారు. తానెప్పుడూ కథల్లో తాదాత్మ్యం చెంది రాస్తూ ఉంటారని, వ్యావహారిక భాషలో రాసిన రచనలకన్నా మాండలిక రచనల్లో దగ్గరతనం కనిపిస్తుందని, రాసే రచన.. రచయిత జీవితానికి సంబంధించాల్సిన అవసరం లేదని, కల్పనా చాతుర్యమే రచయితకు ఉండాల్సిన ప్రథమ లక్షణమన్న ఆమె అభిప్రాయం నదిలో ప్రవాహంలా ముందుకు సాగిపోతూ వుంది.
ఈ గ్రంథ సమర్పకుడు కొమ్మవరపు విల్సన్ రావు గారితో అంతర్జాల పత్రిక ‘సంచిక’ కోసం ప్రముఖ దంత వైద్యులు డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు జరిపిన ముఖాముఖి, అలాగే అదే ‘సంచిక’ పత్రిక విల్సన్ రావుగారి ‘నాగలి కూడా ఆయుధమే’ కవితా సంపుటి మీద నిర్వహించిన ముఖాముఖి విశేషాలు తమ, తమ స్థానాలలో ద్వారాలు తెరిచి పాఠకులను ఆహ్వానిస్తున్నాయి. ఎక్స్-రే, మల్లెతీగ, రంజని కుందుర్తి, వేకువ, విశాలాక్షి, నెలవంక -నెమలీక మొదలైన సాహితీ సంస్థల నుండి ఉత్తమ కవితా పురస్కారాలు పొందిన వీరు వృత్తిరీత్యా జీవిత బీమా సంస్థలో ఉన్నత అధికారిగా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యమున్నా, ప్రవృత్తిరీత్యా ఆయన సహజ కవి, ఏదో రాయాలన్న తపనతో అల్లాడే తత్త్వం గల కవి. రాయడం కన్నా చదవడంలోనే ఎక్కువగా నిమగ్నమయ్యే సృజనశీలి ఈయన. నాలుగేళ్లపాటు సృజన ప్రియ, సృజననేడు పత్రికలలో సాహితీ సంపాదకులుగా పనిచేసి, ప్రస్తుతం సృజనక్రాంతి దినపత్రికకు సాహితీ సంపాదకులుగా వున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారు టాక్ ది బుక్ శీర్షికలో తన నాలుగవ కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ పై హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి ఆచార్యులు డా. దార్ల వెంకటేశ్వరరావు గారితో గంటపాటు సమీక్ష చేయించి, తద్వారా విల్సన్‌రావు గారి కవిత్వం నలభై వేలమంది విద్యార్థులకు చేరిన అపురూపమైన సందర్భం తన జీవితంలో మరుపురాని ఘట్టంగా ఈ కవి భావిస్తున్నారు. కవితాభివ్యక్తిలో రామణీయకత, సృజన సౌందర్యం వెల్లివిరుస్తున్న ఈయన కలం నుంచి వెలువడిన ‘నాగలి కూడా ఆయుధమే’ పై దాదాపు ఇరవై సమీక్షలు వివిధ పత్రికలో ప్రచురితమైన విషయం, సాధారణ విషయాలను దాటి అసాధారణంగా నిలిచింది. ‘జీతే రహెూ బేటీ’, ‘తాళాలు లేని వేకువ దేహం’, ‘స్వప్న శిశువు’, ‘మహా సంకల్పం’ మొదలైన కవితలు రెక్కలు విప్పుకొని మనముందు వాలిపోతున్నాయి. ముక్కున తాము కరిచి తెచ్చిన గింజల్ని విసిరేసి మనల్ని ఏరుకోమంటున్నాయి.
34 మంది సాహితీవేత్తలతో కొమ్మవరపు విల్సన్ రావు గారి ముఖాముఖి ‘అంతరంగ వీక్షణం’ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే స్థానానికి సంపూర్ణత అర్హత సాధించిందని చెప్పటానికి గర్వపడుతున్నాను. సాహితీవేత్తల కుటుంబ నేపథ్యాలలో ఆశ్చర్యపరిచే ఎన్నో సంగతులు వరుసలు కడుతున్నాయి. కష్టాలు, నష్టాలు, పేదరికం, పులిపంజా దాడిలో గాయాలైన బ్రతుకులు, తండ్రి గతించి, తల్లి పడే కష్టానికి కొందరు కవుల బాల్యం కార్చిన కన్నీళ్ల ఆనవాళ్లు మన భుజాలను తడుతూనే వున్నాయి. గ్రామాలలో కుల వివక్ష గొడ్డలి వేటుకు ముక్కలయిన గుండె స్వరాల గీతాలాపనలు గుండెల్ని కరిగిస్తున్నాయి. కొందరు బాలకార్మికులుగా చిందించిన చెమట చుక్కల తడి పలకరించినప్పుడు మన కనురెప్పల మధ్య తడి ఒక ప్రవాహ దిశను ఎన్నుకుంటోంది. మధ్యతరగతి కుటుంబాల నేపథ్యాలలో చాలామంది ప్రతిబింబాలు కనపడిన సందర్భంలో ఒక అనుభూతి గాలి మనసును తాకడం, సాహితీవేత్తల వృత్తి, ప్రవృత్తుల సమన్వయ సంబంధాలు, కవుల సాహితీ ప్రయాణంలోని వివిధ మలుపులు వాటి దారుల్లో మనల్ని నడిపించడానికి ఆహ్వానాలు అందుతున్నాయి.
ఈ గ్రంథంలో కవుల సాహిత్య ప్రస్థానాలు, సాధించిన విజయాలు, సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, పురస్కార విశేషాలు, సాహిత్య జీవితంలో జరిగిన సంఘటనలు, రచనలు చేయటానికి ఎలాంటి వాతావరణాన్ని, ఎలాంటి మానసిక స్థితిని రచయితలు ఇష్టపడుతారు, కవులు చేపట్టిన వివిధ ఇతివృత్తాలు, అనుసరించే అభివ్యక్తి, ప్రేమించే వైవిధ్య ప్రక్రియలు, కవులు నేర్చుకున్న భాషలు, రాస్తున్న భాషలు, తమ సాహిత్య ప్రారంభానికి ప్రేరణ కల్పించిన వ్యక్తులు, సంఘటనలు, సందర్భాలు, పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన సాహితీవేత్తల సేవలు, సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చడం సాధ్యమేనా? లాంటి ఆసక్తికర విషయాల మీద చర్చలు, లయాత్మకంగా నిర్మించే కవితా నిర్మాణ పద్ధతుల వివరాలు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకు కావ్య గౌరవాన్ని ప్రకటించిన కవుల అంతరంగ భాషణాలు, విప్లవ సాహిత్య మంచి చెడ్డలు, సాహిత్యంలో మాండలిక భాషా ప్రయోగాల మీద వివిధ భావనల ఆవిష్కరణలు, తెలుగులో దళితవాద, స్త్రీవాద రచనలు వాటి పురోగతి, వాటి రచయితలు పట్టించుకోని విషయాల జాబితా, నేటి రచయితలలో క్రాంతదర్శకుల చిరునామాల చర్చ, ప్రస్తుతం సాహిత్యంలో చెలామణి అవుతున్న వాదాల మీద సాహితీవేత్తల మనోగతాలు, కవిత్వంపై వస్తున్న విమర్శలో, కథపై వస్తున్న విమర్శలో కనిపించే తారతమ్యాల ప్రదర్శన, మార్క్సిస్ట్ భావజాలానికి, ఆధునికానంతర భావజాలానికి మధ్యనున్న తేడాల సంగతులు, వినిర్మాణ విమర్శ తీరుతెన్నులు.. ఇలా వందలాది సాహిత్య సంబంధ విషయాలు మనసారా పలకరించటానికి తగిన వేదికల్ని ఈ గ్రంథంలో సిద్ధం చేసుకున్నాయి.
రచయితల అనువాద సాహిత్య వివరాలతో అనువాద ప్రక్రియలోని ఇబ్బందులు, సౌలభ్యాల గురించిన చర్చలు, ఇప్పటి తరానికి పెద్దలు ఇచ్చే సందేశాల దొంతరలు, కొందరు కన్ఫెషనల్ కథలను ఎందుకు ఎక్కువగా రాస్తారు, కరోనా కాలాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా భావించి విడుదలైన సాహిత్య సంపద విశేషాలు, వివిధ అంశాలపై సాహితీవేత్తలు జరిపిన పరిశోధన విశేషాలు, మార్క్సిజం-అంబేద్కరిజం నుంచి నేర్చుకున్న అంశాల ప్రభావాలు, కథలలో చైతన్య స్రవంతి శిల్పం ప్రయోగ వివరాలు, ఉత్తమ పురుష కథా లక్షణాలు, సంగీతాన్ని అమితంగా ఇష్టపడే సాహితీవేత్తల అభిరుచి శిలాఫలకాలు, జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించేలా జరిగిన ఇంద్రవెల్లి దురంతర నేపథ్యంలో పురుడుపోసుకున్న రచనల విశేషాలు, కవిత్వంలో – స్పష్టత, సాంద్రత, నిర్దిష్టత, శబ్దమార్మికత, శిల్ప రీతులు, ఆధునిక అభివ్యక్తి.. ఇలా ఎన్నో అంశాల మీద సాధికారిక చర్చలు, రుబాయిలు, గజల్స్ సృజనలో కవులు సాధించిన విజయాల పట్టిక, మానవ మనోనైజాలను గాఢంగా అధ్యయనం చేస్తూ, భవిష్యత్తు వైపు అభిముఖ ప్రయాణం చేస్తున్న రచయితల పాదముద్రల చిత్రపటాలు.. వగైరా, వగైరా. విశాల వైశాల్యాలను కలిగిన అసంఖ్యాక అంశాల మీద సమగ్రమైన సమాచార సంపదను ఉన్నత ప్రమాణాలతో ఈ గ్రంథం అందిస్తోంది.
ఇంతటి మహోత్తర గ్రంథం జీవం పోసుకోవడానికి తన జీవితకాలంలో కొమ్మవరపు విల్సన్‌రావుగారు వెచ్చించిన సమయ, శ్రమ విలువలను తూకం వేయటానికి కొత్త సాధనాల కోసం అన్వేషించవలసిన అవసరం ఏర్పడుతోంది. ఒక్క రోజులో, ఒక్క మాసంలో తీరిన కార్యక్రమం కాదిది. మరో ప్రత్యేకత ఏమిటంటే ముఖాముఖి కోసం ఎన్నుకున్న సాహితీవేత్తలందరూ అనేక కోణాల్లో మెరుస్తున్న ధృవ నక్షత్రాలే. విల్సన్ రావు గారు సంధించిన ప్రశ్నల బాణాలు గనులను త్రవ్వి అమూల్యమైన సాహితీ సంపదను బహుమతిగా ఇచ్చిన ఈ సందర్భం వందేళ్లదాకా జీవనదిలా ప్రవహిస్తూనే వుంటుంది. 35 సాహిత్య జీవనదుల్ని ఒకే మైదానం మీద ప్రవహింపజేసిన విల్సన్ రావు గారి కృషి, కాలం క్యాలెండర్ లోని ప్రతి తేదీని తన గుడారంగా మార్చుకోబోతోంది.
తెలుగు సాహిత్యంలో ఒక చరిత్ర సృష్టించిన ఈ పుస్తకాన్ని చదవటం, చెప్పటానికి సాధ్యంకాని గొప్ప అనుభూతులకు ద్వారాలు తెరుస్తోంది. నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అసంఖ్యాక విషయాలకు పాఠశాలగా ఆహ్వానాలు పలుకుతోంది. ఈ గ్రంథంలో కవుల కవితలోని పంక్తులు, తెలుగు కవిత్వ పుష్టికి జెండాలు ఎగురవేస్తుంటే నిలబడి నమస్కారం చేయటం కనీస సంస్కారంగా అనిపిస్తోంది. కొన్ని పద ప్రయోగాలలోని గాఢతలు సాహిత్య దీపాలుగా వెలుగుతున్నాయి. వెరసి ఇదొక మహారూపం దాల్చుకున్న గ్రంథమని ప్రకటించడానికి నా శ్వాస గర్వపడుతోంది. ఈ గ్రంథ పరంగా చెల్లించుకుంటున్న అభినందనలు, కృతజ్ఞతలు చాలా చిన్న పదాలైనా ‘అంతరంగ వీక్షణం’ సమర్పకులు కొమ్మవరపు విల్సన్ వుగారికి, సంపాదక బాధ్యతలు వహించిన ఈతకోట సుబ్బారావు, డా. సుంకర గోపాలయ్య గార్లకు, ఈ ముఖాముఖి అంశాలను మూడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నెల, నెల పాఠకులకు అందించిన విశాలాక్షి మాస పత్రిక యాజమాన్య సౌజన్య సౌశీలతకు తెలుగు సాహితీలోకం తరపున ధన్యవాదాలతో కూడిన అభినందన, మందారాలను సమర్పించుకుంటున్నాను.
***
(సాహితీవేత్తలతో కొమ్మవరపు విల్సన్‌రావు ముఖాముఖి)
సంపాదకులు: ఈతకోట సుబ్బారావు, సుంకర గోపాలయ్య
ప్రచురణ: మల్లెతీగ ముద్రణలు
పేజీలు: 450
వెల: ₹ 400
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000 413 413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/antharanga-veekshanam
డాక్టర్ కె. జి. వేణు, రచయిత, కవి, ఉపన్యాసకులు, నటులు, దర్శకులు, ప్రయోక్త, గుణనిర్ణేత కూడా. ‘సాహితీ ప్రపూర్ణ’ డా. వేణు ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇప్పటిదాకా 12 నాటకాలు, 22 నాటికలు, 53 రేడియో నాటికలు, 25 కథలు, 50 సాహిత్య వ్యాసాలు, 232 మినీ కవితలు రాశారు. 3 సినిమాలకు రచనా సహకారాన్ని కూడా అందించారు. వీరి కవితలు, కథలు హిందీ, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. 28 అవార్డులు పొందారు. ప్రస్తుతం అనేక దినపత్రికలకు, మాస పత్రికలకు కథలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు వ్రాస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో జరిగే నాటక పరిషత్‌కు గత 19 సంవత్సరాలుగా చీఫ్ కన్వీనర్‌గా ప్రతి ఏడాది విశాఖలో జరిగే బహుభాషా నాటకోత్సవాలకు సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు.