[వి. నాగజ్యోతి గారు రచించిన ‘అంతరంగావలోకనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒకింత తెరిపిన పడనీ
రోజూ పరుగుల జీవితమే
నాకోసం నన్ను ఆలోచించుకోనీ
నాఇల్లు నావాళ్ళనే బంధంలో
నన్ను నేను మరిచానెపుడో
ఎందరివో జీవిత కథలు చదివాను
ఎన్నో జీవితపాఠాలు నేర్చాను
ఏదో చేయాలనుకున్నాను
నానుంచి నాఆలోచనలు ఎప్పుడు
దూరమయ్యాయే తెలుసుకోలేకపోయా
నా అంతరంగంలోకి నేనెప్పుడు
తరచి చూడలేదు
చిత్రంగా అది నామాట
ఈరోజు వినటంలేదు
నాకు ఎదురు తిరుగుతోంది
నిన్ను నువ్వు తెలుసుకోవాలంటోంది
కాస్త విశ్రమించా అంతే
భావాల ఉప్పెన చుట్టుముట్టింది
మనోభావాలను వ్యక్తం చేస్తూ
ఒకింత తెరిపిన పడమంది

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.