Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్ముఖ గగనం

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘అంతర్ముఖ గగనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నిషి ఎదుగుదల
ఎత్తుల కొలత కాదు,
ఆలోచనల విస్తృతి.
ఆలోచన విస్తరించిన చోటే
ఆకాశం అర్థం కోల్పోతుంది.

విజయం శిఖరమైతే
అపజయం ఉపాధ్యాయుడు,
రెండూ కలిసిన వేళ
మేధస్సు పరిపక్వత పొందుతుంది,
అనుభవమే జ్ఞానమవుతుంది.

భయాన్ని హద్దుగా చేసుకున్నవాడికి
అడుగడుగునా అడ్డంకులే,
నమ్మకాన్ని దారిగా మలచుకున్నవాడికి
అడ్డుగోడలే మెట్లు,
సంకల్పమే దిక్సూచి.

కష్టం శాపమని భావించినవాడు
స్థబ్ధతలో నిలిచిపోతాడు,
కష్టాన్ని సాధనగా మలచుకున్నవాడు
తనలోని శక్తిని ఆవిష్కరిస్తాడు,
వేదనే విజ్ఞానమవుతుంది.

సూర్యునికి ఆకాశం హద్దు కానట్లే
మేధస్సుకి కొలతలుండవు,
ఆలోచన ఎగిరినంతవరకు
ఎదుగుదలకు అంతమే లేదు.

అందుకే..
ఆకాశం కాదు నీ పరిమితి,
నీ అంతర్ముఖ గగనం
నీ నిజమైన అభివృద్ధి హద్దు.

Exit mobile version