Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్ముఖీన

[డా. సి. భవానీదేవి రచించిన ‘అంతర్ముఖీన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

బాల్యాకాశం అమ్మ-నాన్నలను మింగేసింది
పుస్తకాలకంటే కన్నీటినే చదివింది
అనాథ బాధల బంగారుబాల్యంలో
అడుగడుగునా అవమానాల అడ్డుగోడలే!
పెద్దింటి గడప దాటించినప్పుడు
పెద్ద కుటుంబపు కొలిమిలో కాపురం
అరిచేతులనిండా వంటమసి
ఇల్లలుకుతున్నప్పటి అనుభవశూన్యత లోంచి
మనసు పలకపై బాధల పిచ్చిగీతలు
నిశ్సబ్దమే భాషగా.. నడకగా.. జీవించింది!

రెక్కలు వచ్చి పిట్టకూనలు ఎగిరిపోతే
నాతిచరామి మరచి నాన్న నిష్క్రమిస్తే
అయినవాళ్ళంతా మొహం చాటేస్తే
ఒంటరితనం ముళ్లదారి కాకేమవుతుంది?
పలకరింపులన్నీ గడ్డకట్టిన మంచుచినుకులై
మాటలన్నీ మౌనంలోనే కరిగిపోయాయి

ఆంగ్లంరాని అమ్మకి మందుబిళ్ళల పేర్లు ఎలా తెలుస్తాయి?
చదవలేని అక్షరాల కోసం సహాయం అర్థించినప్పుడు
ముసుగుల సంఖ్య పెరిగి అసలు రూపాలు బయటపడ్డాయి
అమ్మ అంతరంగంలో పాకిన ఎడారి దారుల్లో
నిప్పునూ.. నొప్పినీ అదిమిపెట్టి
మౌనం ముందు కన్నీటిశిల్పంలా మోకరిల్లింది
చివరివరకు అంతరముఖీనత్వమే ఆసరా!

తల్లీ తండ్రి లేని బాల్యం.. ఆవేదనల యౌవనం
నిరాశ్రయ వృద్ధాప్యంలో నిలువెల్లా దహించుకుంది
చివరకు ఆమెను మోసింది మాత్రం
ప్రేమానురాగాలూ.. నోట్లకట్టలూ కాదు
గాఢమైన జీవననేస్తాలయిన ఓర్పు.. సహనాలే!
మౌనమే మాటగా పాటగా అమ్మకు చిరవిశ్రాంతి
అక్షరాలన్నీ అమ్మను మర్చిపోయినా..
సహనం మాత్రం ఆమె చరిత్రను శిలాక్షరంగా రాస్తున్నది!!

Exit mobile version