రాగ రంజితమైనదీ ప్రకృతి.
దీని అందాలు – అనంతం.
దీని – సోయగాలను ఆస్వాదించేప్పుడు –
స్థాయీ భేదపు అర ఉండదు.
కన్నులున్న ప్రతి ప్రాణీ కన్నుల పండుగగా పరికించి –
ఆనందానుభూతిని పొందగలదు.
మమైకపు స్థితిని చేరుకోనూ గలదు.
అయితే –
ఆనందాన్ని పొందే స్థితిన.
వారి వారి receiving nature (ఆస్వాదించే శక్తి) ని బట్టి ఫలితం దొరకుతుంది, అలరిస్తుంది.
శాంతమ్మ దేవాలయానికి వెళ్తూంది.
పొద్దు వాలిపోయింది.
సూరీడి ఎఱుపుదనం పూర్తిగా కరిగిపోతూ కొత్త అందాల్నిస్తుంది.
ప్రొద్దు పొడుపులో కలిగే ఆహ్లాదం
ఇక్కడే దొరుకుతుంది ఆస్వాదించే మనసుంటే
కానీ..
దాని వెంట ప్రకృతి చీకటి ఒడిలోకి జారి విశ్రమిస్తుంది.
గంభీర ప్రశాంతత అలముకుంటుంది. తిరిగి పొద్దుపోడుపు
అసలెందుకీ, పొద్దు పొడవడం?
వాలిపోవడాలూ??
ఈ వెలుగు చీకట్లేమిటి?
ఈ క్రమం తప్పనితనమేటి?
అంటే-
మనకు అందే సమాధానం ఒక్కటే-
‘ప్రకృతి క్రమం అది’ అని
వీని నడకను చూసి ఈ మాట అనే బదులు వీని విధాయకమేమిటి?
ఇలా నడచేందుకు కారణమేమిటి?
అని విశ్లేషించుకుంటూ పోతే,
ఏదో మనకు తెలీనిది, అందనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది.
లేకపోతే-
ఇంత ఖచ్చితంగా నియమంగా సృష్టి క్రమానికి దోహదకారిగా- గతి తప్పక నడవాల్సిన పనేముంది? ఎందుకు నడుస్తుంది?
అందుకే-
‘భగవంతుడు’ అనేవాడు ఉన్నా లేకున్నా-
‘ఉన్నాడామో?’ అన్న భ్రమలో
మానసికపు అశాంతికి దూరంగా జరగడం శాంతిని పొందడం అసలు దేముడెవరు?
ఉన్నాడా?
అంటే ఎలా ఉంటాడు? ఈ విగ్రహలేంటి ?
వాటి రూపకల్పనకు హేతువేమిటి?
రూపం ఉన్నట్లుగా (ఉందో లేదో తెలికపోయినా) భావన ఎందుకు కల్గింది?
తను మనిషి గనుక తనలానే ఉంటాడని బావించాడా?
లేక-
శిల్పాచార్యులకు భగవంతుడు కన్పించాడా?
ప్రత్యక్షమై ముద్ర తెలిపాడా?
అలా కానప్పుడు
వారి ఉహలకు ఇలాంటి స్వరూపాలేలా తట్టినాయి.
ముక్కోటి దెవతల స్వరూప స్వభావాలని ఎలా ఊహించగలిగారు.
ఇన్ని రకాల ఆకారాలతో మనిషి మనస్సుకెలా తట్టారు.
అసలీ పురాణాల సృష్టేమిటి?
ఎందుకు జరిగింది?
ఎందుకు జరిగినా ఏమయినా ఏదో ఆధారంతో మాత్రమే రూపకల్పన జరిగింది .
వ్యాసుడెవరు?
దేవ దానవుల గురించి చెపుతూ
ఆ స్వభావ ఆహార్యాలను ఎలా సృష్టించగలిగారు.
అంతకు ముందు మనిషికి రూప కల్పనలు తెలుసా?
అస్సలెవరైనా లీలగానైనా చూసారా?
కవి – ఆలోచన నుండి రూప స్వభావ భావనా సృష్టి దొరికితే దాన్ని ఆధారం చేసుకొని జరిగిన సృష్టా ఇది?
అంతుపట్టదు.
కానీ మన వాళ్ళు అందరి స్వరూప స్వభావాలను స్పష్టంగా చెప్పగలిగారు.
వారి ఫలితమే ఈ అపురూపమైన శిల్ప సృష్టి కావచ్చు.
శాంతమ్మ గుడికి ఎడమ బాగాన ఉన్న కోనేటి ప్రక్కన విరిగి పడి ఉన్న ఓ విగ్రహం ముందు ఆగింది.
దానిలో ఈవిడ నీడ కనిపించింది.
న్యాయానికా విగ్రహం పూజాదికాలలో లేదు. విరగగొట్టబడి అస్థవ్యస్థంగా పడి ఉంది. విరిగిన అన్యాభాగాలు కూడా అక్కడ లేవు.
అయినా
మమైకంగా చూసింది.
దాని అపురూపపు అందాలను మలచిన తీరును చూసి
నమస్కరించి గుడిలోకి వెళ్ళింది.
పూజరయ్య ఏం కావాలో అడిగి చెప్పిన పద్ధతులలో అర్చనలు చేసి పూలు ప్రసాదం ఇచ్చాడు. గుడి అరుగుపైన నాలుగు నిమిషాలు కూర్చుని లేచింది.
శ్రావణి గుడి మెట్లు ఎక్కుతూ కన్పించింది.
ఆ పిల్లను చూడగానే గుండె కలుక్కుమంది.
కళ్ళ నిండా నీరు కమ్మింది.
విధి ఎంతటి క్రూరమైందో –
ఆ పిల్ల కళ్ళ పడ్డాక మరొసారి నెమరకు వచ్చింది.
మెట్లెక్కడం పూర్తయింది.
గర్భాలయం దాక వంచిన తలెత్తకుండా నడిచింది.
శాంతమ్మను గాని మరెవరినిగాని ఆ పిల్ల చూడలేదు.
‘శ్రావణి’ అని పిలిచింది శాంతమ్మ.
గొంతులో జీర ఉంది
తనను ఇంత ఆత్మీయతగా పిలిచేవారు కూడా ఉన్నారా అన్నట్లుగా తల ఎత్తింది శ్రావణి.
‘శాంతమ్మ’కన్నతల్లిలా చూస్తూ కనిపించింది.
“అమ్మా నువ్వా” అంటూ మెడ తమ్మె వదలిన లేగలా పరుగున పచ్చి చేరింది. శాంతమ్మ దగ్గరకు తీసుకొని తల నిమిరి “బావున్నావా తల్లీ?” అని అడిగింది.
కనిపిస్తునే ఉన్నాను గదా అన్నట్లు తల ఊపింది శ్రావణి.
కన్నెచెర విడకండా విధవరాలయ్యే ఆడకూతురుంటుందా?
ఉండదు.
కాని ఉంది.
ఎవరో కాదు ఈ శ్రావణే –
భగవంతుడనే వాడు ఉండి ఉంటే – ఇలా జరగదేమో?
ఇంత చెడు ఏ కర్కోటకుడూ చేయలేడనిపించింది.
అన్నెంపున్నెం ఎఱుగని ముగ్ధ – శ్రావణి – ఆ అమాయక మరి ఇలా ఏమనాలో తోచదు. పెద్దలు నిర్మయించిన ఒక శుభముహుర్తాన పంచభూతాల సాక్షిగా నిర్ణయించిన శుభలగ్నాన. మంగళ వాయిద్యల మధ్యన అయిన పెళ్ళి పసుపు బట్టలు మార్చక మందే కొంగుకు వేసిన ముడి పూర్తిగా విప్పక ముందే గుడి కెళ్ళి భగవాన్ ఆశీస్సులు నిండా పొంది మూడు నిద్రలకు వెళ్తుండగా తోవన జరిగిన కారు ప్రమాదంలో ప్రక్క ప్రక్కనే కూర్చుని ఊహల హర్మ్యాలలో కెళ్తున సమయాన వరుడు నెత్తుటి మడుగులో
వధువు స్పృహ కోల్పోయన దశలోన కెళ్ళడం.
ఇదెక్కడి అమానుషం.
ఊహకందని స్థితి గదా.
“మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది తల్లీ?” అడిగింది శాంతమ్మ.
“నా కోసమే బ్రతుకుతున్నట్లుగా – గుటుకు ఉంది.”
“బొంది నొదిలి పోలేనంత బలమైందమ్మా తల్లి బంధం. ఎంత కాలమైనా అలా నిలచి ఉండినా ఆశ్చర్యపోనక్కరలేదు” అని దగ్గరకు తీసుకొని
“శ్రావణీ అమ్మను జాగ్రత్తగా చూస్తూండు.
నీ విధి లిఖితాన్ని చూస్తూ కూడా గుండె పగలక పోవడమే గొప్ప. అలాంటిది ఇంకా నీ కోసం శ్వాస పీల్చుతుంది. మమతానుభంధం అంటారు. ఇదే మీ పసితనాన మిమ్మల్నెలా కాచుకుంటూ వచ్చాయో ఇప్పుడు మిమ్మల్నిలా చూడగలగాలో. మీ చేతులలో చేతగాని దశకు వచ్చిన మేము నిజంగా పసివాళ్ళమే. మా నుంచి జరిగే పొరపాట్లను ప్రేమతో కడుపున దాచుకొని సాదరంగా చూడగల్గిగ పిల్లలు ఉన్న తల్లితండ్రులు ఎంత అదృష్టవంతులు” అని శ్రావణి వంక చూసి.
‘శ్రావణీ అక్కడి ఆస్తి పాస్తులు నీకేమైనా సంక్రమించాయా? డబ్బుగా ఏమైనా ముట్ట చప్పారా?’
తల ఊపింది.
‘కుటుంబం బాగా జరుగుతున్నట్లే గదా.’
ఫర్వాలేదు.
ఇంత జరిగాక కూడా ఆ పిల్లకు భగవంతుని పైన చెదరని ప్రేమ.
నింజగా ‘ముచ్చట’ అనిపించింది.
అయినా అడిగింది శాంతమ్మ ‘శ్రావణీ, ఇంకా ఈ రాతి దేవుణ్ణి ?’
రాతను ఎవరు మార్చగలరు?
ఏమిటన్నట్లు చూసింది శాంతమ్మ.
“దేవుడు ఉన్నాడో లేడో తేలీదు?
‘ఉన్నాడు’ అనుకోవడంలో ఉండే దండి
‘లేడు’ అనుకోవడంలో దొరకడం లేదు.
ఈ గుళ్ళునూ, గోపరాలనూ అంత ఎత్తు పర్వతాల పైనడవులలోనూ ఎందుకు కట్టారా? అనుకునేదాన్ని?
కానీ
మన పడమటింట్లోని దేవుని పటానికి నమస్కరిస్తే కలిగే తృప్తి కన్నా తిరుపతి వెళ్ళి వరుసన నిల్చొని ఏడు కొండలవాని దర్శనం అరకొరగా దొరికినా అపురూపమైన తృప్తి వేరు.
ఎంతో కొంత శ్రమపడ్డాక ఆయన మూర్తి కనిపిస్తే-
మనసంతా ఆనందంతో ఎందుకో నిండిపోతుంది.
తెలీని తృప్తి మొదలవుతది – ఎందుకో తెలీదు.
ఇంతెందుకు ఓ చిన్న విషయం చెపుతాను-
‘కనకం’ అని మాకు పని పిల్ల ఉంది. దానికి కడుపు నొప్పి వదలకుండా వస్తుంటుంది. వచ్చినప్పుడల్లా దొరికిన వైద్యుడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళి అతగాడిచ్చిన మాత్రలు మింగుతూనే ఉంటుంది. ఇక్కడ వైద్యుల దగ్గర ఇలా ఎంత కాలం తిన్నా వ్యాధి నయమవదు మళ్ళీ వస్తూనే ఉంటుంది అనే అభిప్రాయానికొచ్చింది. అంచేత టౌనుకు ప్రయాణమయింది. పెద్ద డాక్టరు వద్దకు వెళ్ళింది. అక్కడ క్యూలో నిల్చోని చిట్టీ తీసుకుంది. మళ్ళీ క్యూలో నిల్చుని డాక్టరును కలిసింది. ఆయన ఫీజు తీసుకొని చిట్టీ వ్రాసిచ్చాడు. ఆ చిట్టీలో మందులు లేవు, పరీక్షలున్నాయి. వాని ప్రకారం ఒక్కరోజు అక్కడే ఉండి పరీక్షలు చేయించుకుంది. వాళ్ళు test report లు ఆ మర్నాడికి గాని ఇవ్వలేదు. వాటికి డబ్బు కట్టి తీసుకొని మళ్ళీ డాక్టరు దగ్గర క్యూలో కెళ్ళింది. ఆయన పరీక్షల్ని చూసి అప్పడే రోగ నిర్ణయం చేసి మందు వ్రాసి ఇచ్చాడు. ఆ గోలీలు తీసుకొని వచ్చి వాడింది.
ఇవి వాడినప్పటి తృప్తి మాములుగా ఊళ్ళో ఇచ్చే వైద్యుడికి చెయ్యి ఇచ్చినపుడు కల్గలేదు. ఇన్ని పరీక్షలు చెసిన డాక్టరు ఊళ్ళో వైద్యుడు వ్రాసి ఇచ్చిన గోలీలే వ్రాసాడు. కాకపోతే జనరల్ టానిక్ ఒకటి అదనం. జనరల్ టానిక్కులు సర్వరోగ నివారిణి లాంటివి. డాక్టరుకు ఏ ప్రోడక్టు వల్ల ఎక్కువ లాభం కల్గితే అవే – అవే వ్రాసి పారేస్తుంటారు. అయినా అక్కడి తృప్తి సగం రోగాన్ని తగ్గిస్తుంది.
అందుకు తగ్గట్టు స్థిమితాన్ని ధైర్యాన్ని ఇస్తుంది.
కనుక
ఇప్పుడు తినే మందులు పూర్తిగా వంటపడతాయి.
వంట పట్టమంటే ఫలితం ఉంటుంది గదా” అంది నవ్వుతూ.
“మాటలు బాగానే నేర్చావు ‘భడవా’” అని, “ఇక నేను వెళ్తాను వీలు చూసుకొని వస్తుండు” అంటూ లేచింది.
తల ఊపి దైవసన్నిధికి నడిచింది శ్రావణి.
తెల్ల చీరలో అదే రకం బ్లౌజు వేసుకొని కుందనపు బొమ్మలా అనిపించింది శ్రావణి.
“ఇది నీకు న్యాయమా స్వామీ?” అనుకుంటూ మెట్లు దిగింది శాంతమ్మ.
(ఇంకా ఉంది)