Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనుభవాలే పాఠాలు..

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘అనుభవాలే పాఠాలు..’ అనే కవితని అందిస్తున్నాము.]

అనుభవాలు తరచి చూడ..
అనేక రకాలు..! జీవనగమనాన
అవి తప్పనివి.. తప్పించుకోలేనివి..!
తీపివి కొన్ని.. చేదు తినిపించేవి కొన్ని..!

ఆహ్లాదాన్నిస్తూ తీయనివి..
పలకరిస్తాయి.. అప్పుడప్పుడు..
మదిని పులకరింపజేస్తాయి..!
మనోవేదనకు చోటు లేని
మధురానుభూతులవి!!

చేదు అనుభవం.. తద్భిన్నం..!
చెరిగిపోదు.. గాయం మానదు..
గుండెల్లో దిగబడ్డ ముల్లు కనిపించదు
గుచ్చుకుంటూనే ఉంటుంది..
గతంలోకి లాగుతూనే ఉంటుంది..
అవమానాల భారం పెంచే
ఆ బాధకు మరణం లేదు.. ఉండదు..

అయితే.. మనిషికి తెలియందొక్కటే..
చేదు నుండీ నేర్చుకునే పాఠాలుంటాయని..!!
ఏది మంచి.. ఏది చెడు.. తెలిపేది
చేదు అనుభవాలే అని..!
స్నేహ హస్తాలు.. కుటిల మనస్తత్వాలు..
తెలిసేది వాటితోనే అని..!

నిజస్వరూపాలు తేటతెల్లమయ్యాక..
తేలిక పడటం ఎంత తేలిక!!
తెలుసుకో నేస్తం.. నేర్చుకుందాం
చేదు నుండి పాఠాలు.. ఆ పాఠాలు గుణపాఠాలై..
మరిక పడనేపడవుగా.. తప్పుటడుగులు..!!

Exit mobile version