Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విభిన్న కవితాపుష్పాల కదంబమాల ‘అనుస్వరం’

[డా. శ్రీమతి మంథా అనూరాధ గారి ‘అనుస్వరం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రవృత్తిరీత్యా సాహిత్యంలో కృషి చేస్తున్న డా. శ్రీమతి మంథా అనూరాధ గారి తొలి కవితా సంపుటి ‘అనుస్వరం’. జ్యోతిషంలో ఎం.ఎ., పి.హెచ్.డి. చేసిన అనూరాధ గారు భక్తి ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తల్లితండ్రులవి పండిత వంశాలు. అనూరాధగారి అమ్మగారు శ్రీమతి మంథా అన్నపూర్ణ గారు స్వయానా కవయిత్రి. తల్లి నుంచి సాహిత్యంలో అభిరుచిని, తండ్రి నుంచి జ్యోతిష్యంలో ప్రావీణ్యం సంపాదించారు డా. అనూరాధ. ఈ పుస్తకంలోని కవితలను 9 విభాగాలుగా వర్గీకరించారు.

‘భక్తి పథం’ అనే మొదటి విభాగంలో 23 కవితలున్నాయి. తొలి కవిత విఘ్నేశుని స్తుతితో ప్రారంభమవుతుంది. పార్వతీపరమేశ్వరుల ప్రార్థన, మహదేవుని శరణు, మారుతి కృప, సాయినాథునికి వినతులు, నవగ్రహ స్తోత్రం తదితర అంశాలలో కవితలల్లారు అనూరాధ. ముఖ్యాంగా చెప్పుకోవలసినది ‘సంక్షిప్త రామాయణం’ అనే కవిత గురించి. విస్తృతమైన రామాయణ కావ్యాన్ని ఔచిత్యం చెడకుండా నలభై పంక్తులలో అందించారు. అలాగే ‘భగవద్గీత’ అనే కవితలో గీతలోని 18 అధ్యాయాల సారాన్ని ఒక్కో పంక్తిలో క్లుప్తంగా అందించారు. అనూరాధ గారికి అనువాదంలోనూ ప్రవేశం ఉంది. హనుమాన్ చాలీసాను సరళంగా అనువదించి, నిత్యం పారాయణం చేసుకునే విధంగా అందించారు. ‘సుందరకాండ’ లోని సారాన్ని సమర్థవంతంగా 24 పంక్తులలో అందించారు. “అయోధ్యాపురి అన్నపూర్ణేశ్వరి సీతారమణిని చూసి/అలల మునక ఆనందముతో ఆకుల మ్రాటున దాగి/రామకీర్తనము చేసి మైథిలి మోములో చిరుకాంతులు చూసి” అంటారు. ఇందులో సీతను అయోధ్యకు అన్నపూర్ణాదేవిగా అభివర్ణించడం కొత్తగా ఉంది.

‘పర్వ ప్రమోదం’ అనే విభాగంలో తెలుగువారు జరుపుకునే పలు వేడుకలు, ఉత్సవాలపైనా, పాటించే సాంప్రదాయాలపైన కవితలు అల్లారు. ఆడవారు చేసే ప్రత్యేక పూజలను, వాటి వెనుక ఉన్న ఆలోచనని ‘మార్గశిరం’ అనే కవితలో వివరించారు. సంక్రాంతి సమయంలో వాకిళ్ళలో అలంకరించే రంగవల్లుల గురించి ‘ముత్యాల ముగ్గులు’ అనే కవితలో భావయుక్తంగా వివరించారు. “అమ్మవారిని అలరించు అష్టదళ పద్మాలు/అయ్యవారిని చేరు హృదయ కమలాలు” అనడం ద్వారా భగవంతునికి మనం సమర్పించుకోవలసిదేమిటే చెప్పకనే చెప్పారు. భోగి, సంక్రాంతి, ఉగాది గురించి చక్కని అభివ్యక్తితో సొంపైన భావాలతో కవితలు అల్లారు.

‘స్ఫూర్తి మేధం’ అన్న విభాగంలో తమ తమ రంగాలలో విజయాలు సాధించి ప్రేరణగా నిలిచిన కొందరిపై కవితలల్లారు. ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళిపై వ్రాసిన కవిత ఆకట్టుకుంటుంది. ఆయనని కలియుగ విశ్వామిత్రుడని ప్రశంసించారు. ఆరుగాలం కష్టాలకోర్చి పంటలు పండించే రైతులు, సరిహద్దులు వద్ద నిలిచి, దేశాన్ని రక్షించే సైనికులను స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాలను మలచుకోవాలని రెండు కవితల ద్వారా సూచించారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే, ముందు మనపై మనకి నమ్మకం ఉండాలని, మనం మనల్ని నమ్మాలని, ఇష్టపడాలని ‘నిన్ను నువ్వే ప్రేమించు’ అనే కవితలో చెప్పారు. “నీ బాధని హవిస్సుగా నీ ఆత్మని నిలబెట్టు/నీ మేధస్సును ఉషస్సుగా కార్యోన్ముఖునివై కదులు” అంటారు. వివాహ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ‘వివాహ ర(బం)ధ చక్రం’ అనే కవితలో చెప్పారు. వివాహ రథ చక్రం, వివాహ బంధం అనే పదబంధాలను మేళవించి ‘వివాహ ర(బం)ధ చక్రం’ అన్నారు. కవితాశీర్షిక అర్థమవడానికి కొన్ని సెకన్లు పట్టవచ్చు.

‘ప్రకృతి సుగంధం’ అనే విభాగంలో శీర్షికకి తగినట్టే, సూర్యోదయాన్ని చక్కని కవితలో వర్ణించారు. గోదావరి గలగలల్ని, సాగరఘోషని వినిపించారు. సాగర ఘోష ఎలాంటిదంటే, “గతాలను స్వగతాలను గర్భంలో కలుపుకునే ఘోష/రత్నాలను గర్భంలో ఉంచుకుని వ్యర్థాలను తోసేసే అవిరామ ఘోష” అట! అందరికీ తెలిసిన విషయమే అయినా వాడిన పదాలు, పదాలతో కూర్చిన భావాలు.. ఈ వాక్యాలని మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. ప్రతి అనుభవమూ ఓ పాఠమే అని ప్రకృతి బోధించిన వైనాన్ని ‘మా బాల్కనీ’ అనే కవితలో గొప్పగా చెప్పారు.

‘మనోరథం’ విభాగంలో విభిన్న అంశాలపై 30 కవితలున్నాయి. మాతృమూర్తికి, నాన్నకి, గురువులకి ఒక్కో కవితలో వందనాలర్పించి, తనని మలచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రణతి పడతీ’ అనే కవితలో స్త్రీని ఉద్దేశించి, “నీవు లేని జగతి శూన్య తిథి” అని అంటారు. శూన్య తిథి అన్న జ్యోతిష్యశాస్త్రపు పదబంధం వాడడం ద్వారా మహిళలు లేని ప్రపంచం విలువ ఏపాటిదో అద్భుతంగా చెప్పారు. ఔంరౌత్ తీసిన రామాయణం అనే సినిమా చిరాకు కలిగించగా, అసలైన రామాయణం గురించి పిల్లలకి ఎలా చెప్పాలో ఒక కవితలో చక్కగా చెప్పారు. ‘పల్లెటూరి బాల్యం’ కవితలలో చిన్ననాటి మిత్రులని పేరుపేరునా పిలుస్తూ, అప్పటి ఆటలని గుర్తుచేసుకుని, కాలంలో వెనక్కి మళ్ళి మళ్ళీ బాల్యానికి వెళ్ళొస్తారు. అంతర్జాలాన్నీ, సాంకేతికని ఎంత వరకూ వినియోగించుకోవాలో ‘శ్రీవాణీ చరవాణీ’ అన్న కవితలో చెప్తారు. ధూమపానం ఎంత ప్రమాదకరమో, స్మోకర్స్‌తో పాటు, పాసివ్ స్మోకర్స్ కూడా ఎలా బలవుతున్నారో ‘యమపాశం’ కవితలో వివరించారు.

‘ప్రణయ సౌధం’ విభాగంలో 11 కవితలున్నాయి. తమ దాంపత్యం “పతీ సతి సహ గమనం చితి వరకూ సాగాలని, రతీమన్మథుల్లా మన పయనం” అని అంటారు ‘కన్నె మనసులో..’ అనే కవితలో. ప్రేమ లేని జీవితం వ్యర్థం అంటూ అసలైన ప్రేమ ఏమిటనేది చెప్తుంది ‘ప్రేమ (ఇం)ధనం’ కవిత. అనువైన సమయంలో దరిచేరని ప్రియుడిని నిందాపూర్వకంగా ప్రశ్నిస్తుందో భామిని ‘ఓ ప్రేమికుడా..’ కవితలో.

‘హృదయ ఖేదం’ విభాగంలో 15 కవితలున్నాయి. వీటిని మనసుకి బాధ కలిగించే అంశాలు, చిరాకు పరిచే మనుషుల స్వభావాలు, భవభందాలకి వీడ్కోలు వంటి అంశాలపై తన భావాలను ప్రదర్శించారు. మహిళ’మన’లేదు అనే కవిత ఆలోచింపజేస్తుంది. విపత్కర పరిస్థితుల మధ్య, జీవనం కొనసాగించటానికి అమ్మవారిని ప్రార్థిస్తూ రాసిన ‘మనోశక్తినివ్వూ..’ అనే కవిత ఎంతో ప్రేరణాత్మకంగా సాగింది.

‘తాత్త్విక పథం’ విభాగంలో నాలుగు కవితలున్నాయి. ‘పంచభూతాలు – పంచేంద్రియాలు’ అనే కవితలో పంచభూతాలు, పంచేంద్రియాలు మానవులకి ఏం నేర్పుతాయో చాలా చక్కగా చెప్పారు. ఈ కవిత చివర్లో “ప్రకృతిని, ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించడమే అజేయం, ఆనందం” అని అద్భుతంగా చెప్పారు. వ్యక్తిత్వవికాస పాఠాలలోని సారమిదే కదా!

‘బంధం – అనుబంధం’ విభాగంలో తమ కుటుంబం గురించి, మేనమామ షష్టిపూర్తి గురించి కవితలల్లారు. ‘నా జీవన స్రవంతిలో మహిళామణులు’ అనే కవితలో అమ్మని, అత్తగారిని, అమ్మమ్మని, నానమ్మని, చెల్లిని ప్రస్తావించి వారెందుకు గొప్పవారో చక్కగా చెప్పారు. తద్వారా కుటుంబమే తన బలమని చెప్పకనే చెప్పారు.

~

ఈ పుస్తకంలో ఏమేం ఉన్నాయి అని చూస్తే, భక్తి, ఆధ్యాత్మికత, జ్యోతిషం, వ్యక్తిత్వ వికాసం, కర్మ, కర్తవ్యపాలన, కుటుంబసభ్యుల ప్రేమ, సామాజిక బాధ్యతలు, ఆదర్శంగా నిలవడం – ఇలా విభిన్న అంశాలతో అల్లిన కవితలున్నాయి. ఎక్కువ కవితల్లో అమ్మవారిని ప్రస్తావించుకున్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని అమ్మవారికై కవితాపుష్పాలతో అల్లిన కదంబమాలగా భావించవచ్చు.

అయితే ఈ పుస్తకంలో ఒక చిన్న పొరపాటు దొర్లింది. ఒకే కవిత వేర్వేరు పేర్లతో రెండు విభాగాలలో చోటు చేసుకుంది. ‘స్ఫూర్తి మేధం’ లోని ‘నిన్ను నువ్వు ప్రేమించు’ కవిత, ‘హృదయ ఖేదం’ విభాగంలోని ‘అపజయాలను అధిరోహించు..’ రెండూ ఒకటే. శీర్షికలు మారాయి. ఇది పెద్ద లోటేం కాదు కానీ, ముందు చూసుకుని ఉంటే, ఒకదాని స్థానంలో మరి మంచి కవితకి చోటు ఉండేది కదా అనిపిస్తుంది పాఠకులకి. ప్రతి విభాగానికి నప్పేలా ముందు సంబంధిత చిత్రం ఒకటి కూర్చారు ప్రచురణకర్తలు. అవి ఔచితీమంతంగా ఉన్నాయి. పుస్తకం ముఖచిత్రం డా. అనూరాధ గారే రూపొందించుకున్నారు. చాలా ఆకర్షణీయంగా అమరింది. కవయిత్రికీ, ప్రచురణకర్తకూ అభినందనలు.

***

అనుస్వరం (కవిత్వం)
రచన: డా. మంథా అనూరాధ సెంథిల్
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 164
వెల: ₹ 150/-
ప్రతులకు:
డా. మంథా అనూరాధ సెంథిల్
ఫ్లాట్ నెం. 45080, బ్లాక్ 4, వింగ్ B,
జనప్రియ ఉటోపియా అపార్ట్‌మెంట్స్,
అత్తాపూర్
హైదరాబాద్ 500048
Ph: 9642903945
Email: anu20345@gmail.com

~
డా. శ్రీమతి మంథా అనూరాధ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-mantha-anuradha/

Exit mobile version