Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-38

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ప్రియమైన అమాయకుడా

~
నాలోని ఖాళీ అడుగున
పాలు కోలా బీరు మొదలైన ఎన్నో
ప్రకృతుల ద్రవాలు నిండిన సరస్సు ఉంది

రాత్రివేళ
ద్రవీకృత స్వభావాలు
నెలకొని ఉంటాయి అందులో.
తూములన్నీ వర్షపు నీళ్ల ప్రవాహాలతో
ముంచెత్తబడి ఉంటాయి

నా ఖాళీలో ఒక కాలువ ఉంటుంది
స్వభావాలు తూముల్లోంచి
ఉధృతంగా వెలువడుతుంటాయి –
విడతలు విడతలుగా కడిగేస్తూ.

నా ఖాళీలో ఒక చేప ఉంది
సముద్రంలో నాచు లాగా.
అదొక తేలే తెప్ప,
గండశిలల మధ్య ఇరుకు గండి

రాత్రంతా స్వభావాలన్నీ
నదీ సముద్ర సంగమ స్థలిలో
పదే పదే ముక్కలౌతుంటాయి
ఆ రాత్రిముంపు నుండి
నల్లగా మెరిసే జలాల నుండి
తప్పించుకోలేవు నువ్వు

నా ఖాళీకి సరిహద్దుగా ఎక్కడా
ఎత్తైన కొండల అడ్డువరుస లేదు
రాత్రిపూట అదొక ద్వీపం
ముంపుజలాలు వేగంగా
ఎకాయెకిన వచ్చి ముంచేస్తాయి
అవి ఒక్కసారిగా
స్వభావాలను కడిగేస్తాయి

ఆంగ్లమూలం: డెబోరా లాండా
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version