Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-42

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ప్రళయం గురించిన పాట

~

అవని అంతమయ్యే రోజు
తుమ్మిమొక్క చుట్టు తుమ్మెద తిరుగుతుంది
ఒక జాలరి మెరిసే తన వలను
మరమ్మత్తు చేస్తుంటాడు
తూరమీనులు సముద్రంలో తుళ్లిపడుతుంటై
ఇంకుడుగుంత పక్కన పిచ్చుక పిల్లలు
ఆటలాడుతుంటాయి
ఎప్పుడూ ఉన్నట్టే బంగారు వర్ణపు పాము
అందే రంగులో ఉంటుంది

ప్రపంచం అంతమయ్యే రోజు
చేలల్లో స్త్రీలు గొడుగులు పట్టుకుని
వాటి నీడలో నడుస్తుంటారు
ఒక లాన్ పక్కన తాగుబోతు
నిద్రలో జోగుతుంటాడు
కూరగాయలమ్మేవాళ్లు వీధిలో అరుస్తుంటారు
పసుప్పచ్చ తెరచాపలున్న పడవ ఒకటి
సముద్రం లోని ద్వీపాన్ని సమీపిస్తుంది
వాయ్‌లిన్ నుండి వెలువడిన స్వరం
గాలిలో నిలిచి తారకలు నిండిన
రాత్రిలోకి తరలిపోతుంది

ఉరుములు వినిపిస్తాయని, మెరుపులు కనిపిస్తాయని
ఆశించినవారికి ఆశాభంగమే మిగులుతుంది
యముని మహిషపు లోహఘంటికలు
అప్పుడే వినిపించవని అనుకుంటారు కొందరు
సూర్యచంద్రులు పైన పరిభ్రమించినంత కాలం
గులాబిపువ్వు మీద తుమ్మెద వాలినంత కాలం
పండంటి పాపలు జన్మించినంత కాలం
ప్రళయం వెంటనే రాదనుకుంటారు

తీరిక లేనంత పనిలో మునిగిన వృద్ధుడొకడు
రాబోయే కాలంలో ప్రవక్త కావలసినవాడు
టమాటలను మూటగట్టుకుంటూ
పదే పదే ప్రవచిస్తుంటాడు ఇలా:
“ఇప్పుడు రాబోయేది తప్ప
మరో ప్రళయమంటూ ఉండదు”

పోలిష్ మూలం: Czeslaw Milosz
ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ

Exit mobile version