Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-52

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

 

జూన్ నెలలో బంతిపూలు

~

జీవితమా!
నా కలల మీద సుతారంగా నడువు
తేలియాడే మబ్బుల నీడల్లో కూర్చుని
లయాన్వితంగా ప్రవహించే నదుల
గుసగుసలను వింటూ
నేనిక్కడే ఉండిపోతాను

పరిచిత, అపరిచిత ప్రాంతాలనుండి
కంఠస్వరాలు గాలిలో తేలివచ్చి
నా గుండెలో ఆటలాడుతాయి
నిట్టూర్పుల, మూలుగుల, అరుపుల
ప్రేమనూ, పోగొట్టుకున్నతనాన్నీ
మోసుకుంటూ వచ్చే గీతాలు కూడా..

నేను కాలపు లోతుల్లోకి చూపును సారిస్తాను
డిసెంబర్ లో గులాబీలనూ, జూన్ లో బంతిపూలనూ
తెచ్చే విలువైన క్షణాలను వెతుకుతాను
నింగిరంగును నింపుకుంటాను హృదయంలో.
ఆ క్షణాలు ఆనందంతో నా కళ్లముందు
స్వేచ్ఛగా నాట్యం చేస్తాయి

నా ఊరి చెరువునూ అందులో ఈదే చంద్రుడినీ
మళ్లీ చూడాలనుకుంటాను
దుమ్ము నిండిన తోవనూ దానిమీద
మెల్లగా సాగే ఎద్దులబండినీ కూడా.
నా తోటలోని తాటిచెట్లు
వెన్నెలలో మౌనంగా అనుసరిస్తాయి దాన్ని

పరిణత కాంక్షల రూపం దాల్చే
ఏకాంతపు పరిమళాన్ని పీల్చాలనుకుంటాను
విజయ గీతాన్ని ఆలపించే
నా గుండెచప్పుళ్లను వినేందుకు
కళ్లు మూసుకోవాలనుకుంటాను

జీవితమా!
వేగంగా సాగే వాహనంలో వెళ్లు నువ్వు
నేను నీకు వీడ్కోలు పలుకుతాను
నా కలల నీడలు పరుచుకున్న
తోవను చూస్తూ కూర్చుంటానిక్కడ
కనపడని దేవకన్యలు
కదలాడే సంగీతానికి అనుగుణంగా
నాట్యం చేస్తుంటే చూస్తుంటాను
నా పాత ప్రేమికులు
నా దగ్గరికి తిరిగి వస్తారు

ఆంగ్లమూలం: మృత్యుంజయ్ సారంగి
అనువాదం: ఎలనాగ

Exit mobile version