[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
సిలికాన్ వ్యాలీలో, టెస్లా వెనుకసీటులో
~
వెనుకసీటులో ఇద్దరు టెక్సాస్ వాసుల మధ్య నేను..
బ్లాక్ చెయిన్ ఎలా పని చేస్తుందో
నాకు తెలియదని వాళ్లు నమ్మలేరు
అదేంటో గానీ నేనెప్పుడూ నాకన్న ఎక్కువ
తెలిసిన పురుషుల మధ్యనే ఉంటాను
రేఖాగణితం తెలియని నేను నా కూతురుకు ఇంట్లో
ట్యూషన్ చెప్పవద్దంటాడు నా ఇంజినీరింగ్ ప్రొఫెసర్
ఇంజిన్లో కందెన వేయటం గురించి
ఉపన్యాసమిచ్చాడాయన నాకు
గుడారంలో, నిలువనీరులో, పెద్ద అహంలో ఉన్న నేను
మార్పు చెందడానికి ప్రయత్నించాలి
నేను ఆత్మగౌరవం కోసం వచ్చాను సాన్ హోజేకు
కానీ నాకు ఆతిథ్యమిచ్చిన యజమాని
మరో స్త్రీ పేరు మీద సెక్రెటరీ యాప్‌ను విడుదల చేశాడు
ఎంత తొందరగా యువకులను వదిలిపెట్టి
నా తండ్రి వయసున్న వృద్ధులతో పార్టీలకు వెళ్లాను నేను!
వారిలో అత్యంత ధనికుడెవరు?
ఎవరు నన్ను ఆదుకోగలరు?
ఎప్పుడూ ఇలా వెనకనే ఉండిపోతాను నేను
చిత్రం! పూలడిజైనున్న కోటు తొడుక్కుని
వాళ్ల ఫామ్ హౌజ్ లలో వాలిపోతాను
బిట్ కాయిన్ గురించి ఆలోచించే అవసరముండదు
“ఈ కారు తనను తానే డ్రైవ్ చేసుకుంటుంది”
అంటారు వాళ్లు అనతి కాలంలోనే.
ఆంగ్లమూలం: కార్సన్ వోల్ఫ్
అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
