[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
నీ తర్వాత
~
ఓ నా ఏడవ సంవత్సరమా,
నాకు ఏడేళ్ల వయసు వచ్చినప్పటి ఏడాదీ!
వీడ్కోలును పలికిన ఓ అద్భుతమైన క్షణమా
నీ తర్వాత సంభవించిన ప్రతి సంఘటన
ఉన్మాద పరిస్థితిలో చోటు చేసుకుంది
పక్షికీ మాకూ, పవనానికీ మాకూ మధ్య
స్పష్టమైన వెలుగువంతెనగా ఉండిన కిటికీ
నీ తర్వాత ముక్కలైపోయింది
నీళ్లు నీళ్లు అని తప్ప మరేమీ మాట్లాడని మట్టిబొమ్మ
నీ తర్వాత నీటిలో మునిగిపోయింది
నీ తర్వాత,
మేం చిమ్మట్ల చప్పుళ్లను చంపి
బడిగంటకు అతుక్కుపోయాం –
అ ఆ ఇ ఈ లకు, కర్మాగారాల సైరన్ కూతలకు
పైన శబ్దించిన బడిగంటకు!
నీ తర్వాత,
బల్లల కింది మా ఆటస్థలం డెస్క్‌ల వెనకాలకు,
అక్కణ్నుంచి డెస్క్ ల మీదికి పాకి
ఓ నా ఏడవ సంవత్సరమా,
నీ అందమైన రంగులను మేం కోల్పోయాం
నీ తర్వాత,
మేం ఒకరినొకరం మోసం చేసుకున్నాం
నీ తర్వాత,
సన్నని దారిలోని గుడిగోడల మీద
రాసుకున్న జ్ఞాపకాలను తూటాలతో,
రక్తపు మరకలతో చెరిపేసుకున్నాం
నీ తర్వాత,
మేం చౌరస్తాలకు పోయి
జిందాబాద్, ముర్దాబాద్ అంటూ అరిచాం
అక్కడి గోలలో, నగరానికి వచ్చిన నాణేల కోసం
పొగడ్తలను కురిపించాం
మేం ఒకరినొకరం హత్య చేసుకున్న తర్వాత
ప్రేమ గురించి చర్చించుకున్నాం
మా గుండెలు అశాంతితో మా జేబులలో కూరుకుపోయినప్పుడు
ప్రేమ పేరున తీర్పులు ఇచ్చుకున్నాం
నీ తర్వాత,
మేం శ్మశానాలకు బయల్దేరాం
అప్పుడు మా అమ్మమ్మ చుట్టుకున్న కంబళి కింద
మరణం శ్వాస తీసుకుంది
అపైన అది మహా వృక్షమై నిలిచింది
దాని ఎండిన కొమ్మలకు కొందరు గుడ్డలను
ముడి వేస్తూ కోరికలను కోరుకున్నారు
మరో వైపు, వెలుగులీనే చెట్టువేర్లను
గట్టిగా కరచుకున్నారు మృతులు
పవిత్ర సమాధి మీద మృత్యువు కూర్చుని ఉంది
దాని మూలలలో ఎకాయెకిన
ఒక ‘నీలి ట్యూలిప్ దీపం’ మండింది
ఓ నా ఏడవ సంవత్సరమా,
గాలి శబ్దాన్ని వింటున్నాను నేను
నేను మేల్కొని నీళ్లు తాగి,
నీ కొత్త తోటలు మిడతల దండుకు
ఎలా భయపడిపోయాయో
అదాటున జ్ఞాపకం చేసుకున్నాను
సిమ్మెంటు దిమ్మను నిర్మించేందుకు
ఎంత ఖర్చవుతుంది?
ఎన్నిటినో కోల్పోయాం మేము
ఒక దీపంతో, చందమామతో బయల్దేరాం
ఆడతనాన్ని రంగరించుకున్న ఆ చందమామ
మా బాల్య జ్ఞాపకాలలో ఎప్పుడూ ఉండింది
మట్టిగోడల, గుడిసెల పైకప్పుల తాలూకు జ్ఞాపకం అది
కొత్తగా నాటిన తోటలు
మిడతల దండుకు భయపడినప్పటి జ్ఞాపకం
దానికి ఎంత ఖర్చవుతుంది?
పర్షియన్ మూలం: ఫోరో పరోక్జాద్
ఆంగ్లానువాదం: ఎలిజబెత్ టి. జూనియర్
తెలుగు అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
