Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-58

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

పాకుడు

~

1
పర్వతాలు దహించుకుపోయినా,
బతికి బయట పడ్డవాళ్లు
ఒకరినొకరు చంపుకున్నా
గొర్రెల కాపరీ, నిద్ర పో –
అది యెక్కడైనా ఫరవా లేదు.
నేను నీ పొడ గంటాను
నా నిద్ర నీ నిద్రకు సమానం
వెలుగులీనే కొండవాలు మీద
మన మందలు గడ్డిని మేస్తుంటాయి
నిలువుగా లేచిన కొండల బండలమీద
వాటి మేత కొనసాగుతుంది
2
బయట,
భూమిలోపలికి కుంగిపోయిన
నదీ గర్భాలలో ఖననపు గోతులు నిండుతాయి
పగులువారే గండశిల చీలిపోయే ఆకాశానికి సోదరి.
ఆ సంఘటనకు ముందు శకునాలు కనపడుతై:
ఒక పక్షి మరొక పక్షిమీద దాడి చేస్తుంది
లోపల, భూమికింద
అప్పుడప్పుడే చిక్కనవుతున్న
రంగులను నూరుతాయి నా చేతులు
3
నేను దేన్నైతే చూసి రహస్యంగా ఉంచుతానో
అది నాకు విభ్రమం కలిగిస్తుంది
అర్థం చేసుకోకుండా నేను మాట్లాడిన మాట
నన్ను ఎదుటివారికి చేరవేస్తుంది
గుడ్డివెలుతురు ముక్కలు చేయగా
మిణుకు మిణుకుమంటున్న అగోచర వదనమా!
వెలుగు నిండిన ఈ విద్యుల్లతను ధ్వంసం చేసేందుకు
నా రాత్రులన్నీ కలిసినా సరిపోతాయా?
4
గోధుమ లాకల కట్టలు
నా బంధాలను తిరస్కరిస్తాయి
అనంతమైన ఈ అనైక్యతలో
ప్రతి గోధుమ వెన్ను, ప్రతి రక్తపు బొట్టు
తన భాషను మాట్లాడి తప్పుకుంటుంది
అగాధాన్ని వెలుగుతో నింపి మూసివేసే కాగడా
తనే ఒక అగాధం అవుతుంది
5
మద్యం తాగి నాగలిని నాశనం చేసిన నువ్వు
దాని కర్రును నక్షత్రంగా పొరబడినావు
భూమి దాన్ని ఆమోదించింది
గడ్డి ఇప్పుడు ఎంత ఏపుగా పెరిగిందంటే
నేను ప్రాణంతో ఉన్నానా, నడుస్తున్నానా
అన్నది తెలియదు

కొండెక్కిన దీపపు ఉధృతి తగ్గియిందా?
6
కళ్లు చూడగలిగినంత మేరకు
విస్తరించాయి రాళ్లు నిండిన నేలలు,
మనను కలుపుతూ మనలాగా ఉండని
ఈ భరించలేని ఆనందం లాగా.
నేను నీకు సంబంధించినవాడిని
నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు
వేడిమి మనను గుడ్డివాళ్లను చేసింది

రాత్రి రాత్రిగా ఉండాలంటే
మనకు ఆశనూ సంతృప్తినీ ప్రదానం చేసే అది
దాని ఆశను నాశనం చేసుకోవాలి
7
నడక సాధ్యం కానప్పుడు
విరిగిపోయేది పథం కాదు, పాదం
నువ్వు వంచించబడ్డావు
వెలుతురు అంత గొప్పగా ఏం లేదు
కొండలు దగ్గర్లోనే ఉన్నై
ఈ రాత్రి నేను పొరపాటున
నీ ఇంటితలుపును తడితే
నన్ను వెంటనే లోపలికి రానివ్వకు
నీ ముఖరాహిత్యం నా ఒకే ఒక చీకటి తునక
8
నిన్ను అధిరోహించేందుకు,
అధిరోహించి, పదాలకు వెలుతురు అంటుకోకుండా
కూలిపోయి దొర్లిపోయినప్పుడు
మళ్లీ అధిరోహించాలి నిన్ను –
అంటే మరో కొండకొమ్మును మరో అంతస్తును.

నాలో భయం పెరిగింది కనుక
నేనూ నా అగాధాలూ నా బంధాలూ
నా అడుగులూ పర్వతానికి అవసరం
9
గుట్ట మీద జాగరూకత..
కిందికి దిగకూడదు
నిశ్శబ్దంగా ఉండకూడదు
ఆర్తి వద్దు, అనుభవం వద్దు
ఇరుకు స్థలంలో ప్రతి మనిషి దృష్టిలోకి
పోవడం, బయటికి రావడం – అంతే చాలు
గుట్టమీది జాగరూకత నాకు దొరకదు
కానీ ఎప్పుడైతే నా చూపు
ఎగురుతుందో, వ్యాపిస్తుందో
అప్పుడు అంతా అభేద్యమైన ఆనందమే

ఫ్రెంచి మూలం: జాక్ డ్యూపిన్
ఆంగ్లానువాదం: హ్యారీ మాత్యూస్
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version