Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-62

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

జాగరూకత గురించి

~

ఇల్లొక ధ్వని
దాన్ని నేను పడమటి పర్వతశ్రేణి లోని
మెడో లార్క్ పక్షి కూతలో,
నేను కారులో పోయే రహదారిలో
సహజంగా వెలసిన గండశిలల్లో,
మా అమ్మ మాట్లాడే భాషలో,
అందులోని యాసలో వినగలను
అది ఆమె సాగదీసే అచ్చులలో,
కలిపి చితక్కొట్టిన పదాలలో,
ఒత్తి పలికే ‘ర్స్’ లలో, ‘రెజ్’ లలో
ఒదిగిపోయి ఉంటుంది

ఈ ‘రెజ్’ యాసను వింటూ పెరిగాను నేను
కానీ అది ఆమె మాటల్లో ఉంటుందని
ఎప్పుడు గ్రహించానంటే,
వేడిమీ ఉక్కపోతా నిండిన దక్షిణ ప్రాంతంలో
ఒక ఏడాది పాటు గడిపి వచ్చింతర్వాత.

అమ్మ కంఠస్వరంలో వ్యోమింగ్ సరస్సునూ
మొగ్గ తొడుగుతున్న రష్యన్ ఆలివ్ చెట్టునూ
ఆఘ్రాణించగలను నేను
నదులలో జడలు కట్టిన నాచు
నా చేతుల్లో కరిగిపోయే అనుభవం అది
మా అమ్మబొమ్మ పాతబడిపోయింది
అమెరికన్ కాలనీల్లోని నా స్నేహితులందరూ
అదే అంటారు
‘మేవరిక్ – 99 సెంట్’ పానీయపు రిఫిల్స్ ను
మనం ఇప్పటికీ రుచి చూడగలం
కీర్తిశేషుడైన నా తాత
ఆ రిఫిల్స్ ను దొంగిలించేవాడు – వాటిని దాచిన స్థలం లోంచి.
ఎండిపోతున్న నదిలో భాగమైన ఈత కొలనులో,
చిరుపాల మొక్కల పసరులో దాన్ని రుచి చూడగలం
తీసేసిన ప్లగ్ పిన్నుల కాలిన ఇత్తడి లాగా,
విడిపోయిన కొన్నింటిలో అవశేషాలుంటాయి

ఆంగ్లమూలం: కూక్సీ బ్లాక్
అనువాదం: ఎలనాగ

Exit mobile version