[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
మీరా విరమించుకుంది
~
సఖీ, పోనీ అతణ్ని.
యోగి తనవాడు అని ఏ పడతి అంటుంది?
చెల్లీ, అతడెప్పుడూ
నాపట్ల ఉదాసీనంగా ఉంటాడు
అతనిది అర్థం లేని వృథా ప్రలాపం
పిల్లా, ఒక యోగి నా వాడు కాలేడు
వదిలి పోదాం
తీపి మాటలతో సంతృప్తి పరుస్తాడే తప్ప
అతడు నాకు మూడు ముళ్లు వేయడు
వదిలెయ్ చెలీ,
ఒక యోగిని బంధించి ఉంచలేం
నేను వేచి ఉండాలా, వదిలి పోవాలా?
అతడు నన్ను ఎక్కడా ఉండనివ్వడు
యోగి ఎందుకు ప్రియసఖీ?
వదిలేద్దాం అతణ్ని
మీరా ప్రభువు మేఘశ్యాముడు,
నల్లనివాడు, మానస చోరుడు
ఆరాధ్యుడు, ప్రేమికుడు, స్నేహితుడు
బ్రజ మూలం: భక్త మీరా బాయి
ఆంగ్లానువాదం: క్లో మార్టినెజ్
తెలుగు అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
