Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-69

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

సామాజిక శాస్త్రపు బాటలో..

~

కవిత్వ ప్రపంచాన్ని
ఫ్రానీ చోయి వైపు తిప్పుతున్నాను
కవిత్వ ప్రపంచాన్ని
ఫ్రానీ చోయికి వదిలేస్తున్నాను
కవిత్వ ప్రపంచాన్ని
ఫ్రానీ చోయికి అప్పగిస్తున్నాను
గొప్ప ఆత్మవిశ్వాసంతో కవిత్వ ప్రపంచాన్ని
ఫ్రానీ చోయికి వదిలిపెడుతున్నాను
కవిత్వ ప్రపంచాన్ని ఫ్రానీ చోయికి
ఇస్తున్నందుకు నాకు దిగులు లేదు
ఫ్రానీ చోయి చేతులలో
కవిత్వం బాగానే ఉంటుందని
అనిపిస్తోంది నాకు
ఫ్రానీ చోయి ఉన్నంత వరకు నాకు భయం లేదు
ఫ్రానీ చోయితో కవిత్వ ప్రపంచం
భిన్నంగా అద్భుతంగా ఉండబోతోంది
ఫ్రానీ చోయితో కవిత్వ ప్రపంచంలో
పిచ్చి ఉత్సాహం ఉద్రేకం
అసాధారణత నెలకొనబోతున్నాయి
కవిత్వం ఫ్రానీ చోయితో
తయారవుతుంది ముక్కలవుతుంది
తిరిగి ఆవిష్కరింపబడుతుంది
కవిత్వమా, ఆగు
ఫ్రానీ చోయి వస్తోంది

ఆంగ్లమూలం: టోయ్ డెరికాట్
అనువాదం: ఎలనాగ

Exit mobile version