[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
ప్రసిద్ధం
~
చేపల దృష్టిలో నది ప్రసిద్ధమైనది
పెద్ద శబ్దాన్ని పేరెన్నిక గన్నదిగా
భావిస్తుంది నిశ్శబ్దం
కానీ దానికి తెలుసు,
ఎవరూ సిఫార్సు చేయకపోయినా
తనకు సంపద సిద్ధిస్తుందని.
గూడు లోంచి చూస్తున్న పక్షులకు
గోడ మీద నిద్రిస్తున్న పిల్లి గొప్పది
కపోలానికి కన్నీరు ప్రసిద్ధం –
తాత్కాలికంగానైనా.
నీ ఛాతీని కరచుకున్న నీ ఊహ
గొప్పదని భావిస్తుంది నీ గుండె
భూమికి పాదరక్షలు ప్రసిద్ధం –
పలకనేలకు మాత్రమే పనికొచ్చే
బూట్లకన్న ఎక్కువగా.
వంకర తిరిగిన ఫోటోను మోసేవాడికి
అందులోని మనిషికన్న
ఆ ఫోటో ఎక్కువ విలువైనది
మార్గంలో మందహాసం చేసే పురుషులకు,
మార్కెట్లో అల్లరి చేసే పిల్లలకు
బదులుగా మందహాసం చేసే మనిషిగా
నేను ప్రసిద్ధం కావడం నాకిష్టం
గిలక, చొక్కా లోని కాజా
ఎలా ప్రసిద్ధమో అలానే ఖ్యాతిని
గడించాలని నాకోరిక
అవి ఏదో గొప్ప పని చేశాయని కాదు
తాము ఏం చేయగలవో మరవవు అవి
ఆంగ్లమూలం: నెయోమీ షీహాబ్ నై
అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
