Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-71

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

స్పర్శించడం

~

అంత ముఖ్యం కాని రాతపనిని ముగించి దాన్ని నీతో పంచుకునేందుకు నేను కుర్చీలో వెనక్కి వాలే దృశ్యానికి నా సల్యూట్. మెట్రో స్టేషన్లో చేతుల్ని జేబుల్లోంచి బయటికి తీసి ఒకరి శ్వాస ఒకరికి తగిలేలా ఇద్దరు వెచ్చగా ఒకరినొకరు తమకంగా ముద్దు పెట్టుకునే దృశ్యానికి నా సల్యూట్. నవంబరు నెలలో మన కళ్లు ఎంత తీక్ష్ణంగా ప్రకాశిస్తాయంటే అప్పుడు మనం ఏడుస్తున్నామా అనిపిస్తుంది. అందుకే వాటిని మూసేయాలేమో. అప్పుడు మనం చూడంలేం.
దేన్నైనా మోయడానికి నా సల్యూట్. అందరికోసం కాఫీ చేయడానికి నా సల్యూట్. మనమందరం కారులో క్రిక్కిరిసేలా కూరుకుపోయి నేను నీ ఒళ్లో కూర్చుని నీ మెడ చుట్టూ చేయి వేసి ఇండిరాక్ సంగీతం ధ్వనిస్తుంటే నా స్కర్ట్ పైకి ఎగరడానికి నా సల్యూట్.
ఒక బీద బాలుడిని చేతులతో పట్టుకుని ‘నోరు తెరువు, నోరు తెరువు’ అంటూ ఔషధపు చుక్కల స్ప్రేను వాడి నోట్లోకి విసురుతుండే దృశ్యానికి నా సల్యూట్.
భగ్నహృదయస్పర్శకు నా సల్యూట్.
నా ఆత్మీయ స్నేహితురాలు చెప్పాపెట్టకుండా తన భర్తతో వచ్చి నా ఇంటి తలుపు తట్టే దృశ్యానికి, అతని చేయిలో పల్లీల పొట్లం ఉండే దృశ్యానికి నా సల్యూట్. వాళ్లిద్దరు లోపలికి వచ్చి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా కలిసికట్టుగా నన్ను వాటేసుకోవడం, చీకటి నిండిన నా హాల్లో మా చేతుల మీద చేతులు కాళ్ల మధ్య కాళ్లు ఉండే దృశ్యానికి నా సల్యూట్.

ఆంగ్లమూలం: ఎస్మే ప్ల్యూస్
స్వేచ్ఛానువాదం: ఎలనాగ

Exit mobile version