Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-8

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

వార్తలు

~

రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని
నేర్చుకో – అంటారు జ్ఞానులు

మనం ప్రయత్నం చేస్తాం

ఇవాళ్టి వార్త ఏమిటంటే,
షాంజే లీజేలో ఎవ్వరూ లేరు

గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర
ఎవరూ లేరు
ఇస్తాంబుల్ లోని సుగంధ ద్రవ్యాల
అంగడిలో అలెప్పో లోని బజారులో
ఒక్కరు కూడా లేరు

ఇంకా..
ప్రపంచంలోని పెద్దపెద్ద సినిమాహాళ్లు,
జీవకళతో తొణకిసలాడే
నాటకాశాలల మేకప్ రూములు
చీకటిలో మునిగివున్నాయి

శాన్ మార్కో లోని చౌక్‌లో పావురాలు
పైన గాలిలో రంగుకాయితాల
ముక్కలలాగా తేలియాడుతున్నాయి

ఈస్ట్ విలేజ్ లోని కెఫేలలో ఎవరూ
ఎస్ప్రెస్సో కాఫీని ఆర్డర్ చేయడం లేదు

ఒక స్త్రీ తెలంగాణలోని గ్రామంనుండి
తన ఊరికి తిరిగిపోతూ తిండి లేక
ఛత్తీస్‌గడ్ లోని అడవిలో చనిపోయింది

ఆమె చెప్పే వార్త ఏమిటంటే,
తను ఎప్పుడూ సొంత ఊరిని
విడిచిన వలస బెంగతో తల్లడిల్లుతుంది
(ఈ బాధ తాలూకు వార్త ఆమెకు కొత్తేం కాదు)

ఆంగ్లమూలం: అరుంధతీ సుబ్రమనియం
అనువాదం: ఎలనాగ

Exit mobile version