Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-82

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

~

క్షమాపణ కోరుతూ ప్రేమపద్యం

~

కొన్నిసార్లు నువ్వు నా చెత్తరూపాన్ని చూస్తావనుకుంటాను – నేను బాగా ఇష్టపడే ట్రాక్ ప్యాంట్లు, బ్రా లేని పొడవాటి రోజులు, చిక్కులు పడిపోయిన మొరటు వెంట్రుకలు, దెయ్యాల్లాంటి ఊహలు గిట్టలతో నల్లని నా కనుబొమలలోంచి మెదడు మీద నాట్యం చేయడం.. వీటన్నిటితో. అలా ఉంటే నిన్ను ప్రేమిస్తున్నట్టు అని చెప్పాలనిపిస్తుంది. తెల్లని కాటన్ టీషర్టు, కన్నీళ్లు, పిస్తా పెంకుల పొట్టు, నా టేబులు మీద చిందరవందరగా పడివున్న సంత్రా తొక్కలు – ఈ పరిస్థితి కొంచెం భిన్నమైనది. నా ఊహలలో ఎలా నడుస్తుంటానో ఈ యింట్లో కూడా అలానే తిరుగుతుంటాను – సౌందర్య పంజరపు ఏ బాదరబందీ లేకుండా. ఎత్తుగా పెరిగిన గడ్డిలో జంతువు నడిచినట్టు నడుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాననేది నిజం కాదేమో. కానీ కరెంటు పోయి కర్టెన్ల మధ్యనుండి అతి చల్లని గాలి వీస్తున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అంటే, అప్పుడు బహుశా జీవితంలో మొదటిసారిగా నీ ఆ మాటను నమ్ముతాను.

ఆంగ్లమూలం: అడా లిమాన్
అనువాదం: ఎలనాగ

Exit mobile version