Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువంశికతను, జన్యువైవిధ్యాన్ని ప్రపంచానికి అందించిన గ్రెగర్ మెండల్

[బాలబాలికల కోసం ‘అనువంశికతను, జన్యువైవిధ్యాన్ని ప్రపంచానికి అందించిన గ్రెగర్ మెండల్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

న్యుశాస్త్రం గురించి మొదటి సారిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్. జన్యువుల గురించి, జన్యువుల వైవిధ్యం గురించి, అనువంశికత గురించి మెండల్ విస్తృతంగా పరిశోధనలు చేశాడు. తల్లితండ్రుల నుంచి తమ లక్షణాలు తరువాతి తరాలకు అందజేయటాన్నే అనువంశికత అంటారు. జీవులు నెమ్మది నెమ్మదిగా కాలంతో పాటు చెందే మార్పును పరిణామం అంటారు. పరిణామ ప్రక్రియ కొనసాగడానికి  జన్యువులే కారణం. అలాంటి అద్భుత పరిణామ క్రమాన్ని, అనువంశికతను జన్యువైవిధ్యాన్ని అధ్యయనం చేసి ప్రపంచానికి అందించిన ‘గ్రెగర్ మెండల్’ గురించి తెలుసుకుందాం.

‘గ్రెగర్ జోహాన్ మెండల్’ 1822వ సంవత్సరం జూలై 22వ తేదీన ఆస్ట్రియా లోని హిన్ జెన్ డోర్ఫ్ లో జన్మించాడు. ఇతడోక క్రైస్తవ మత ప్రచారకుడు. వియన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకు చెందిన బ్రన్ పట్టణంలో నివసించాడు. ఇతను చేసిన అనేక ప్రయోగాలు పరిశీలనల వలన అభివ్యక్తికరణ ప్రభావ సిద్ధాంతము, విశిష్ట ప్రతిపత్తి సిద్ధాంతము, స్వయం ప్రతిపత్తి సిద్ధాంతము ప్రకటించబడ్డాయి. మెండల్ చేసే ప్రయోగాలు చూడటానికి చాలా సామాన్యంగా కనిపిస్తాయి. తద్వారా వచ్చిన ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి.

పొడుగు రకం బఠాని మొక్కల్ని, పొట్టి రకం బఠాని మొక్కల్ని తీసుకొని వాటి మధ్య సంకరం జరిపించాడు. మొదటి తరాన్ని పరీక్షించగా అన్నీ పొడుగు మొక్కలే ఉద్భవించాయి. ఆ తర్వాత మాతృతరానికి మొదటి తరానికి మధ్య సంకరం జరిపించగా ఈసారి రెండు రకాలైన మొక్కలు ఉద్భవించాయి అంటే పొడుగు పొట్టి మొక్కల నిష్పత్తి 3:1 వచ్చింది. పొడుగును నిర్ధారించే కారకం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నది. పొట్టిని నిర్ధారించే కారకం ఉన్నప్పటికీ పొడుగు కారకమే పైచేయిగా ఉంటుందన్నమాట.

అలాగే మరో రెండు రకాల మొక్కల్ని తీసుకొని మరల ప్రయత్నించాడు. ఈసారి గుండ్రటి విత్తనాలున్న పసుపు రంగు మొక్కలు ఒక రకం కాగా మరొక రకం ముడతలు పడిన విత్తనాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వీటిని కూడా రెండు తరాల వరకూ పరిశోధనలు జరిపాడు. ఇందులో మొదటి తరంలోనీ మొక్కలకు పసుపురంగు, గుండ్రని విత్తనాలు వచ్చాయి అంటే ఇదే ప్రభావంతమైన కారకం అన్నమాట. పోయినసారి వలె మొదటి తరాన్ని మాతృతరంతో సంకరం జరపగా 3:1 నిష్పత్తి లో మొక్కలు వచ్చాయి, అంటే గుండ్రటి విత్తనాలు పసుపు రంగు మొక్కలు మూడు రాగా ఆకుపచ్చ రంగు ముడుతల విత్తనాల మొక్క ఒకటే వచ్చింది.

ఈ పరిశోధనలను బట్టి మెండల్ మూడు రకాల నియమాలను ప్రతిపాదించాడు

  1. లా ఆఫ్ డామినెన్స్ (అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతం)
  2. లా ఆఫ్ సెగ్రిగేషన్ (విశిష్ట ప్రతిపత్తి సిద్ధాంతం)
  3. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్ (స్వయం ప్రతిపత్తి సిద్ధాంతం)

జతగా ఏర్పడే రెండు కారకాలు ఒకే రకానికి చెందినవైతే ఏ సమస్య రాదు. అలాకాక రెండు వేర్వేరు లక్షణాలకు సంబంధించనవైతే ఎక్కువ ప్రభావం చూపినదే బహిర్గతమవుతుంది. రెండవ లక్షణం అంతర్గతంగా ఉంటుంది కానీ దాని విశిష్టతను కోల్పోవడం జరగదు. దేని ప్రతిపత్తిని అదే నిలుపుకుంటుంది. దీనినే ‘విశిష్ట ప్రతిపత్తి సిద్ధాంతం’ అంటారు.

రకరకాల లక్షణాలను ప్రదర్శించే కారకాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా ఉంటాయి. నాలుగైదు లక్షణాలు తమ ప్రత్యేకతను ప్రదర్శించడంలో మరొక లక్షణం అడ్డు పడదు. మూడు, నాలుగైదు లక్షణాలను ప్రదర్శించే కారకాలను కలిపినప్పుడు కూడా ఒకదాని కొకటి అడ్డు పడక దేనికదే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. దీనినే ‘స్వయం ప్రతిపత్తి సిద్ధాంతం’ అంటారు.

పొడుగును నిర్దేశించే కారకాలు రెండు, పొట్టిని నిర్దేశించే కారకాలు రెండు ఉన్నాయనుకోండి. ఇందులో పొడుగు లక్షణానికి అభివ్యక్తికరించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే రెండవ దాన్ని అణచి పెట్టి తన లక్షణాన్నే బయటకు చూపించే లక్షణం ఉంటుంది. అప్పుడు రెండు కారకల్లో ఒకటి పొడుగు రకం, ఒకటి పొట్టి రకం ఉన్నపుడు పొడుగుకే ప్రాధాన్యమేర్పడుతుంది. అంటే పొట్టి లక్షణం రావాలంటే రెండు కారకాలూ పొట్టి రకం ఉంటేనే సాధ్యమవుతుంది. దీనినే ‘అభివ్యక్తికరణ ప్రభావ సిద్ధాంతం’ అంటారు.

మెండల్ ఈ ప్రతిపాదనలను 1865 లోనే చేసినప్పటికీ ఎవరూ గుర్తించలేదు. 1884లో మెండల్ మరణించే నాటికీ కూడా మెండల్ పరిశోధనలు సరైనవేనని పట్టించుకోలేదు. అయన గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపబడకుండానే మరణించాడు. 1900 ప్రాంతంలోనే మెండల్ నియమాలను ఆనాటి శాస్త్రవేత్తలు గుర్తించి వాటిని మరల పరిశోధించారు. ఒకే తల్లిదండ్రుల సంతానం చాలా విషయాలలో ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వైవిధ్యం వలననే పరిణామం జరుగుతుంది. ఇంతటి అమూల్యమైన విషయాలను కనుక్కున్న ‘గ్రెగర్ జోహాన్ మెండల్’ ను ఆనాడు శాస్త్రవేత్తగా గుర్తించకపోవడం దురదృష్టకరం. జన్యువుల అభివృధి, జన్యువుల లక్షణాలు, అనువంశికతలపై పరిశోధించి మెండల్ నియమాలుగా ఈనాడు మనం చదువుకుంటున్న పరిశోధనా ఫలితాలను కనుగొన్న మెండల్ చిరస్మరణీయుడు.

Exit mobile version