Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరాజిత

[తాటికోల పద్మావతి గారు రచించిన ‘అపరాజిత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మౌనాన్ని చూసి ఏమీ తెలియదు అనుకోకండి
ఆడదంటే ఆత్మాభిమానం
నిశ్శబ్దం బద్దలైతే ప్రళయమే పుట్టుకొస్తుంది.
తలవంచుకు పోతుంటే గెలవలేనని కాదు.
చుట్టూ ఉన్న ప్రపంచం నిలదీస్తే
నిన్నటిదాకా నిన్ను చూసి నవ్విన వాళ్లు
ఈరోజు నీ వెనుకనే చెవుల కోరుకుంటున్నారు
నీవు నిజం చెప్పిన క్షణం.
నిన్ను దోషిగా నిలబెడుతున్నారు.
నీ కుటుంబ సభ్యులందరి ముందు
నీ విధేయతను ప్రకటించినా
ఇది కూడా నీ బలహీనతే అంటారు.
అందరూ చెప్పినట్లు వినాలి.
నువ్వు చెప్పింది ఎవరు విన్నా
వినకపోయినా పర్వాలేదు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా
కిచెన్‌లో పోరాటం
ఆఫీసులో ఉద్యోగపర్వం
సాయంత్రం ఇంటికి రాగానే
పిల్లల బాధ్యత అంతా కలిపి
నీ అస్తిత్వాన్ని నిలుపుకోమంటున్నాయి.
పగటి శ్రమకు రాత్రి విశ్రాంతి
నీ హక్కుల్ని కాలరాస్తారు
నీ హద్దుల్ని చెరిపేస్తారు
నీ సహనాన్ని వెన్నుపోటు పొడుస్తూ
ఆకాశానికి ఎత్తి అభినందనల హారం వేస్తారు
అన్నిటినీ దాటుకొని పోతేనే
విజయం నీ సొంతం అవుతుంది.
ప్రగతిపథంలో వేసే ప్రతి అడుగు
అది ఒక సోపానం కావాలి.
తరుముకొస్తున్న సమస్యల్ని
ఎదుర్కొనే అపరాజితవు కావాలి.
ఆయుధాలు లేకపోయినా
ఆత్మస్థైర్యం నింపుకోవాలి.
వ్యవస్థలు మారకపోయినా
వ్యక్తిగతంగా ప్రశంసలు కురిపిస్తాయి
దారి మంచిదైతే నీ నిర్ణయం సరియైనదే
ఆ దారిలో నడవాలా వద్ద అన్నదే నీ నిర్ణయం.
కాటు వేసే పాములుంటాయి.
అణగదొక్కే సుడిగుండాలు ఉంటాయి.
కొన్ని చిరునవ్వుల వెనక
విషపూరితమైన గొంతులు లేస్తాయి.
చూసే చూపును బట్టి మసులుకో
ఆడదాని మనసు నది లాంటిదని మరచిపోకు.
రాళ్లు అడ్డుకట్టలు వేసినా
ఆగిపోని ప్రవాహంలా ముందుకు సాగిపో!
గాయపడే కొద్ది అనుభవం గేయంగా మలుచుకుంటుంది.
పడి లేచే కిరణం లాంటి ఉనికిని మార్చుకుంటుంది.
నది గమ్యం సముద్రం అని తెలుసుకో.
ఆటుపోట్లను ఎదుర్కొనే అపరాజితవు కావాలి.

Exit mobile version