Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపవిత్రః పవిత్రోవా..

[శ్రీ మైనంపాటి గోవింద రావు గారు రచించిన ‘అపవిత్రః పవిత్రోవా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

నందరావు బయట కుర్చీలో కూర్చొని ఆదుర్దాగా తడవతడవకు గేట్ వైపు చూస్తున్నాడు. ఆయన భార్య పార్వతి కూడా ఆందోళనతో క్షణం, క్షణం బయటకు ఇంట్లోకి తిరుగుతున్నది.

వారి ఆదుర్దాకు, ఆందోళనకు కారణం ఆనందరావు బహి ప్రాణం పరంధామయ్య గారు సతీ సమేతంగా వారింటికి వస్తున్నారనే వార్త.

పరంధామయ్య, ఆనంద రావు చిన్ననాటి నుంచి మిత్రులు. దశాబ్దాలు గడిచినా వారి స్నేహములో ఎటువంటి విపరీతార్ధాలు లేకుండా హాయిగా సాగిపోయింది, పోతున్నది.

వియ్యంకులు కూడా కావలసినది, కానీ ఇద్దరికి ఇరువులు మగపిల్లలు కలగటం వలన ఆ బాంధవ్యం కలగలేదు.

ఆనందరావు, గవర్నమెంట్‌‌లో సెక్రటరీ క్యాడర్‌లో పనిచేసి రిటైర్ అయినాడు. ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు అమెరికాలో, చిన్నవాడు పక్క రాష్ట్రములో కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి లోటు లేకుండా జీవనం సాగిపోతున్నది.

ఆయన స్నేహితుడు పరంధామయ్య రాష్ట్రం లోనే పేరొందిన ఒక సైకియాట్రిస్ట్. ఎందరో మానసిక రోగులకు తనదైన శైలిలో నయం చేసాడు. ఆయన హస్తవాసి మంచిదని ప్రజల విశ్వాసం మరియు ఫీజులు కూడా ఎక్కువ వసూలు చేయడని వారి నోట పలికే సత్య వాక్కు.

అటువంటి పరంధామయ్య మూడు నెలలు విదేశాలలో జరిగిన ప్రపంచ సైకియాట్రిస్ట్ మహాసభలకు పర్యటించి స్వదేశానికి వారం రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. వారి స్వంత కార్యక్రమములు ముగిసిన వెంటనే, ఈ రోజు మీ ఇంటికి వస్తున్నామని తానే ఫోన్ చేసి చెప్పాడు.

పరంధామయ్య దర్శనం కోసమే ఆ దంపతుల ఆదుర్దా, ఆందోళన.

కార్ హారన్ వినగానే, ఆనందరావు, పార్వతి ఇద్దరు హడావిడిగా కారుకి ఎదురేగి వారిని సాదరంగా అహ్వానించారు. కార్ లోంచి పరంధామయ్య, అయన భార్య శైలజ ఇద్దరు నవ్వుకొంటూ దిగారు.

కార్ దిగగానే పరంధామయ్య ఆనందరావుని ఆప్యాయంగా కౌగిలించుకొని తన్మయం చెందాడు.

అందరూ మాట్లాడుకొంటూ లోపలి వెళ్లారు.

వారు మాట్లాడుకుంటూ ఉండగా, ఆడవారు ఇద్దరు కాఫీ తేవటానికి వంటింట్లోకి వెళ్లారు.

ఐదు నిమిషాలలో, కాఫీతో ఆడవారు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు.

పరంధామయ్య కాఫీ తీసుకొంటూ, “ఎలా ఉన్నావు చెల్లెమ్మా?” అంటూ పార్వతిని అడుగగా,

“మీ చెల్లికి ఈ మధ్య బాగా చాదస్తం ఎక్కువయింది. ప్రతి దానికి కర్పూరం, సాంబ్రాణి పొగలు వేయందే ఏ పని చెయ్యటం లేదు” ఆనంద రావు చెప్పగా, ఆ మాటలు విని పరంధామయ్య గారు ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచారు.

ఆనందరావు అది చూసి, “ఏమిటి పరంధామయ్యా?” అని అడగ్గా

“ఏమీ లేదు, ఏమీ లేదు” అని పరంధామయ్య దాట వేసాడు.

“ఏమైంది?”, అని ఆనందరావు మరల అడగ్గా; “నేను విదేశాలకు 15 రోజులలో వెళతాననగా, ఒక విచిత్ర కేసు వచ్చింది. ఆ కేసు గుర్తుకు వచ్చింది” అన్నాడు.

“ఏమిటి ఆ కేసు?” అని ఆనందరావు ఆతురతగా అడగ్గా, పరంధామయ్య చెప్పటం మొదలు పెట్టాడు.

“ఆ రోజు నేను క్లినిక్‍లో ఉండగా నర్స్ ఫోన్ చేసి, ‘ఎవరో పేషెంట్ అపాయింట్మెంట్ అడుగుతున్నది’ అని చెప్పింది.

ఇంకో పదిహేను రోజులు విదేశాల ట్రిప్ ఉండటం వలన, మరీ ముఖ్యమైన కేసులు తప్ప మిగతా కేసులన్నీ నా సన్నిహితుడు డాక్టర్ విజయ్‌కు అప్పగించాను. అందువలన ‘డాక్టర్ విజయ్ అడ్రస్ ఇచ్చి అక్కడకు వెళ్ళమని చెప్పు’ అని నర్స్ తో ఫోన్ లోనే చెప్పాను.

‘చెప్పాను సార్, కానీ మిమ్మల్నే చూడాలని పట్టుపడుతుంది’ అని అటునుంచి నర్స్ చెప్పింది.

కొన్ని క్షణాలు ఆలోచించి, ‘సరే లోపలికి పంపు’ అన్నాను.

రెండు క్షణాలు తరువాత, ‘మే ఐ కమిన్ సార్?’ అని అమాయక గొంతు వినబడగానే; ‘ఎస్ కమిన్’ అంటూ తల ఎత్తి చూసాను.

ముఖములో ఆదుర్దా, కళ్ళలో బేలతనం కలగలిపి ఒక 18 ఏండ్ల అమ్మాయి, 45-50 సంవత్సరముల ఒక ఆమెను చేయి పట్టుకొని ‘నమస్కారం డాక్టర్ గారు’ అంటూ, లోపలికి తీసుకొనివచ్చింది. అమ్మాయి ముఖ కవళికలు, పెద్దామెను ఒద్దికగా పట్టుకొన్న తీరు చూసి ఎందుకో ఆ అమ్మయిని చూసి నాకు ముచ్చట వేసింది.

‘రండమ్మా రండి’ అని వాళ్ళిద్దరిని పిలిచి కూర్చోమని సంజ్ఞ చేసాను.

ఆ అమ్మాయి ఆదుర్ధాగా ‘ఈమె..’ అని ఏదో చెప్పబోతుండగా, ‘కంగారు పడవాకు తల్లీ, నే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాము’ అని నిదానంగా చెప్పి, ‘ఈమె ఎవరు?’ అని అడిగాను.

‘మా అమ్మ’

‘పేరు?’

‘సీతా మహాలక్ష్మి, అందరూ సీతమ్మ అని పిలుస్తారు’ అని చెప్పింది

‘నీ పేరు?’

‘కల్యాణి’

‘మీ నాన్నగారు రాలేదా?’

‘మా నాన్నగారు లేరు, చనిపోయారు.’

‘సారీ, ఏమిటి ఈమె ప్రాబ్లెమ్?’

‘భక్తి ఎక్కువై పోయింది’

ఆ మాట వినగానే నాకు నవ్వొచ్చి, ‘భక్తి ఎక్కువైతే గుడికి వెళ్లాలి గాని, నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు?’ అని సరదాగా అడుగగా

కొద్దిగా భయం పోయి చనువు ఏర్పడినందున, ‘అయ్యో డాక్టర్ గారు, ప్రతి రోజు చుట్టూ ప్రక్కల ఉన్న అన్ని దేవాలయాలకు ప్రదక్షిణలు, వారానికి నాల్గు రోజులు ఉపవాసాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు, అప్పుడప్పుడు తీర్థయాత్రలు అంటూ రాత్రి, పగలు తిరుగుతుండటం వలన, ఆహారం సరిగ్గా తీసుకోనందున నీరసపడి, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నది. నేను భయపడి, బయటకు పోనీయకుండా కట్టుదిట్టం చేశానని, నన్ను కొడుతున్నది, ఇంటిలో వస్తువులు చెల్లా చెదురుచేస్తున్నది, మాకు తెలిసిన డాక్టర్ గారికి చూపించగా, ఈమె శారీరకంగా కన్నా, మానసికంగా బాధపడుతున్నది, కొన్ని రోజులు ఇలానే ఉంచితే మనిషి ట్రాన్స్ లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది అని, మీ దగ్గరకు తీసుకెళ్లమని చెప్పగా మీ దగ్గరకు తీసుకొని వచ్చాను’, అని పాఠo ఒప్పచెప్పినట్లు టక టకమని చెప్పి, ‘అమ్మయ్య చెప్పవలసినది చెప్పాను’ అని ఊపిరి పీల్చుకొన్నది.

నేను నవ్వుతూ, ‘నీవు కూడా మీ అమ్మ వెంట వెళ్ళవచ్చుకదా?’ అని అడిగాను.

‘సారీ సార్, నేను ఇంటర్ పరీక్షలు వ్రాసి, మెడికల్ ఎంట్రన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను. అందువలన..’ అని నసిగింది.

‘అర్థమైంది, వెరీ గుడ్, బాగా ప్రిపేర్ గా, మా ఇద్దరు అబ్బాయిలు నా దగ్గర లేరు. నీవు డాక్టర్ అయి నా దగ్గర చేరు’ అని ప్రోత్సహించగా సిగ్గుపడి నవ్వుతూ తల వంచుకొంది.

సిస్టర్‌ని రమ్మని బెల్ నొక్కగా, సిస్టర్ లోపలికి వచ్చిoది.

‘నీవు కొంచెం సేపు బయట కూర్చో చిట్టి తల్లీ’ అని అమ్మాయికి చెప్పగా, ఆమె తల్లి ‘వద్దు, వద్దు ఇక్కడే ఉండనీయండి’ అని కంగారు పడుతూ అంది.

‘మరేమి భయం లేదు’ అని ఆమెకు నచ్చచెప్పి, ఆమెను ట్రీట్మెంట్ రూమ్‌కు తీసుకెళ్లమని నర్స్‌కి చెప్పి, అమ్మాయి భుజం మీద చేయి వేసి, నెమ్మదిగా బయటకు తీసికెళ్ళి కూర్చోపెట్టి, ‘భయపడకు’ అని చెప్పి నేను ట్రీట్మెంట్ రూమ్ లోకి వెళ్ళాను.

నేను నా పరిధిలో ఉన్న అన్ని టెస్టులు చేసి, ఆ అమ్మాయిని పిలిచి ‘మరేమి భయపడనవసరం లేదు, మందులు వ్రాసి ఇస్తా, నెల రోజులు వాడు. వీలైతే నీవు, లేకుంటే ఎవరి నైనా తోడిచ్చి, గుడికి పంపు. నా ట్రీట్మెంట్ ప్రకారం మీ అమ్మ మామూలు స్థితికి వస్తుంది. మూడు నెలలు నేను అందుబాటులో ఉండను’ అనగానే..

‘డాక్టర్’, అని కంగారు పడుతుండగా

నేను నవ్వుతూ ‘కంగారుపడకు, త్వరలోనే తగ్గిపోతుంది. ఏమన్నా విపరీతంగా ప్రవర్తిస్తే విజయ్ అని డాక్టర్ ఉన్నాడు. అతని అడ్రస్ నర్స్ ఇస్తుంది, ఆయనకు చూపించండి. నేను మీ అమ్మ కేస్ షీట్ ఆయనకు పంపిస్తాను’ అని దైర్యం చెప్పి పంపాను.” చెప్పడం ఆపాడు పరంధామయ్య.

“ఇంతకీ ఆమె ప్రాబ్లమ్ ఏమిటి?” అని ఆదుర్దాగా పార్వతి అడిగింది.

“ఒక మనిషికి ఇంకొక మనిషి మార్గం చూపగలడు కానీ, ఇదే సరియైన మార్గం అని చెప్పలేడు. ఆ మార్గ త్రోవను అన్వేషించుకొంటూ, సాధక బాధలు తెలుసుకొంటూ తన గమ్యాన్ని సకాలములో చేరే వాడు మనిషి. తన చేతకానితనాన్ని చెప్పుకోలేక, ఎవరో అడ్డుపడటం వలననే తాను సాధించలేక పోయాను అనే అనుమాన బీజం ఏర్పరచుకొని తనలో తాను కుమిలిపోతూ, గమ్య స్థానం చేర లేని వాడు మానసిక రోగి.

మొదటినుంచి ఆమెది అనుమాన మనస్వత్వం. ప్రతి విషయములో తర్కవితర్కముగా తనలో తానే చర్చించుకొని ఆవేశపడే తత్వం. తల్లిదండ్రులు ఏదైనా విషయం చెపితే తనను మోసం చేస్తున్నారనే అభధ్రాతా భావనతో ఆలోచించేది. ఆమె కుటుంబంలో ఈ విషయము ఎవ్వరూ గమనించనందున ఆమెతో పాటు, ఈ రకమైన మనసత్త్వం కూడా పెరిగింది. పెండ్లి అయిన తరువాత కూడా, భర్తపై రకరకాల అనుమానాలతో సతమతమైయేది. భర్త ఏమి మాట్లాడినా విపరీత అర్థాల ఆలోచనలతో కాలం గడిపేది.

విచిత్రమేమిటంటే, ప్రక్కనే ఉన్న తల్లిదండ్రలు కానీ భర్త గాని ఆమె ఏదో బాధతో నలిగిపోతున్నదనేది గమనించకపోవటం. ముఖం అమాయకం, అంతరంగం కల్లోల తరంగం.

దానికి తోడు పెండ్లి యైన కొద్ధి సంవత్సరములకే భర్త చనిపోవటం ఆమెను మరింత క్రుంగదీసింది. భర్త మరణముపై కూడా అనుమానమే. అంత ఆరోగ్యముగా ఉండే భర్త సడన్‍౬గా చనిపోవటంతో, ఆయన పనిచేసే ఆఫీస్ వాళ్ళే తన భర్తను చంపేశారని అనుమానం.

ఆ అనుమానంతోనే భర్త ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని తెలిసినా, తనను కూడా చంపేస్తారేమోననే భావనతో ఉద్యోగం చేయటానికి నిరాకరించింది. దానికి తోడు 8 సంవత్సరముల పాప, ఒంటరి అయిపోతుందని, తన బంధువులు పాపని ఏమైనా చేస్తారనే భయం. వచ్చిన బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకొని కాలం గడుపుతున్నారు. ఆ డబ్బులు ఎవరైనా తీసుకెళతారని అభద్రత భావన. భర్త ఉమ్మడి కుటుంబంలో, వంశపార్యముగా వచ్చే పొలాల ఆస్తి వాటాలో మోసం చేస్తారని, అందుకే తన వాటా తనకు పంచి ఇస్తే అమ్ముకొని వచ్చిన సొమ్మును బ్యాంకులో వేద్దామనుకొంటే, వాళ్ళ బoధువులు పడనీయటం లేదు. పైగా, పిల్ల డాక్టర్ చదువుతానని అనటం వలన చదివించగలనో, లేదో అనే అందోళన, ఎవరికైనా చెప్పుకుందామంటే, ఎవ్వరిని నమ్మని తత్వం. ఈ ఆలోచనల సుడిగుండాలలో తనకు తానే కంట్రోల్ తప్పిపోయి, దిక్కులేని వారికీ దేవుడే దిక్కు అనే సిద్ధాంతం ప్రకారం భక్తి మార్గం ఎంచుకొంది.

ఇందులో కూడా ఊరికినే పూజిస్తే భగవంతుడు సహాయం చేస్తాడో లేదో అనుమానం. అందుకే మొక్కులు, ముడుపులు, ఉపవాసాలు, ఉపన్యాసాలు అంటూ తనను తాను హింసించుకొంటూ పాపం వాళ్ళ అమ్మాయిని కూడా హింసించే స్థితికి చేరింది. ఇది విషయము” అని పూర్తి వివరాలు పరంధామయ్య గారు వారికి విశదీకరించాడు.

“మరి ఇప్పుడు ఆమెకు ఎలా ఉన్నదీ?” అని భార్య శైలజ అడగ్గా, “నయం అయినదని మనం అమెరికాలో ఉన్నప్పుడే విజయ్ ఫోన్ చేసాడు. మధ్య మధ్యలో గొడవ చేసేదిట, కానీ నా పర్యవేక్షణలో విజయ్ ట్రీట్మెంట్ వల్ల, పూర్తిగా నయం అయింది. అమ్మాయి కూడా మెడికల్ పరీక్షలు వ్రాసిందట. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నదట. పెద్ద డాక్టర్ గారు వస్తే చెప్పండి, ఆయనను కలుసుకోవాలని అన్నదట. ఒకసారి ఆ అమ్మాయిని కలుసుకోవాలి.” అన్నాడు.

“సడన్‌గా మనుషులు ఇలా ఎందుకు మారిపోతారు?” అని పార్వతి అడగ్గా

“నేను అనంతుణ్ణి, నాకు సాధ్యం కానిది ఏది లేదు అని మనిషి అనుకొంటాడు. కానీ మనిషి ఎంత ఉన్నతుడైనా ఒక విషయములో కంట్రోల్ తప్పుతాడు. అదే మనసు విషయములో. మనల్ని అనుసరిస్తున్న మన నీడను మనం ఎలా పట్టుకోలేమో అలానే మన లోనే ఉన్న మన మనస్సును మనం పట్టుకోలేము. కానీ తన మనస్సు తన ఆధీనంలోనే ఉన్నదీ అనే భ్రాంతిలో మనిషి ఉంటాడు. ఆ భావనతో ప్రపంచాన్ని చూస్తాడు. కానీ ప్రపంచం తన అనుకున్నంతగా తనకు అర్థం కాదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడు.

దానిని అర్థం చేసుకోవాలనే తాపత్రయం కన్నా, తన మాట ప్రపంచం వినటం లేదని ఒక ఆక్రోశం మన మనస్సుని తాకుతుంది. ఆ ఆక్రోశమే అభద్రతా భావనగా ఏర్పడి అందరిని కామెంట్ చేయటం, అనుమానించడం, నేను తప్ప అందరూ మోసగాళ్లు అనే భావన మన మనస్సులో ప్రింట్ అవుతుంది.

వీటి ప్రచండ వేగానికి మనసు తట్టుకోలేక, మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. అందులో ఒకటి భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో ఎంతో పవిత్రతగా ఉంటేనే, భగవంతుడు కోరికలు తీరుస్తాడనే పిచ్చి భ్రమల్లో, తను, తన కుటుంబం, తన శారీరక శక్తీ మర్చిపోయి అలవికాని పనులు చేస్తూ మానసిక రోగిగా మారుతారు.

మన పూజలో ‘అపవిత్రః పవిత్రోవా..’ అంటు చుట్టూ ప్రక్కల జలం చల్లుతూ పూజ మొదలుపెడతాం.

కానీ, ఏది పవిత్రత? ఏది అపవిత్రత? అని మనిషి ఆలోచించడు.

భూమి, నీరు, గాలి, ఆకాశం అన్నీ పవిత్రమైనవే. పవిత్రం కానిది మనం, మన మనస్సు. మనం పవిత్రం కాకుండా అన్ని అపవిత్రం అంటే ఎలా?

ముందు మనలో పాజిటివ్ తత్వం రావాలి. కానీ తెచ్చుకోము. తెచ్చుకోవాలంటే ఒక ఇగో. తాను తప్ప మిగతా వారందరు పాజిటివ్‌గా ఉండాలి అనే ఒక సెగ మనిషిని కాల్చివేస్తూ ఉంటుంది.

ఆ సెగ తట్టుకోలేకనే ఈ మానసిక రుగ్మతలు” అని మనషుల తత్వాన్ని పరంధామయ్య చెప్పాడు.

అందరూ ఆశ్చర్యచకితులై విన్నారు.

మరల పరంధామయ్య మాట్లాడుతూ, “ఆ పేషెంట్ కూతురు కల్యాణికి మెడిసిన్ సీట్ వస్తే గైడెన్స్ ఇద్దామనుకొంటున్నాను. అవసరమైతే ఆర్థిక సహాయం చేదామనుకొంటున్నాను. నా గొప్పతనం కోసం కాదు. మనిషిపై నమ్మక బలం ఎంత ఉపయోగమో అని ఆ పేషెంట్‌కు తెలియాలని. ఈ విషయాన్ని ఒక మనిషిగానే కాకుండా ఒక డాక్టర్‍గా కూడా ఆలోచించాను. ఈ విషయాన్ని ఆ అమ్మాయికి సీట్ వచ్చిన తరువాత శైలజతో మాట్లాడి నిర్ణయం తీసుకొందామనుకొన్నాను. అనుకోకుండా ప్రకటించవలసి వచ్చింది.” అని చెబుతూ ఆగి, “నీ నిర్ణయం ఏమిటి శైలజా?” అని భార్యను అడిగాడు.

“అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీ నిర్ణయమే నా నిర్ణయం” అంటూ శైలజ నవ్వుతూ చెప్పింది.

ఆనంద రావు లేచి పరందామయ్యని కౌగిలించుకొని, “నీవు నిజంగా పరంధాముడవేరా, మనుసులకే కాదు, మనషులకు కూడా తగు ట్రీట్మెంట్ ఇయ్యగలవు” అంటుండగా..

“ఏడ్చేవులే, ఆకలి వేస్తున్నది పద పద” అని పరంధామయ్య అన్నాడు.

అందరు నవ్వుకొంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు.

Exit mobile version