Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపూర్వనాదం

[ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయని ఆశా బోస్లేకు నివాళిగా ‘అపూర్వనాదం’ అనే కవితని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

లవోకగా రాగాల నాలపించే
ఆ గొంతు ఆగిపోయింది
సప్తస్వరాలు చిన్నబోయాయి
గాలి శ్వాసించటం మరిచింది
వాయిద్యాలు తడబడ్డాయి
కలాలు చిన్నబోయాయి
గాంధర్వ రాగాలతో
శ్రోతలను మంత్రముగ్ధులను చేసి
మైమరపించిన
ఆ గళమున పలికిన రాగాలెన్నో
ఒలికిన పాటలెన్నో ఎన్నెన్నో
అమృతాన్ని గళసీమన దాచి
మానవలోకంలో
శృంగార విషాద ఆనంద గీతాలను
వేలకొలది ఆలపించి
ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలనందుకొన్న
ఒక అద్భుత అపూర్వనాదం
గాలిలో కలిసి అదృశ్యమైంది
గంధర్వలోకాన కొత్త సంగతులు ఆలపించాలని
దేవలోకాన ఆనందాలను
అందించాలని తరలి వెళ్ళింది
మనిషిగా మన మధ్యనుంచి
కనుమరుగైనా
తన పాటల మాధుర్యంతో
సదా చిరంజీవిగా నిలిచింది
ఇలను మెరిసిన
సంగీత స్వరాల కోయిల.

Exit mobile version