[డా. జడా సుబ్బారావు గారు రచించిన ‘అప్పుడు.. ఇప్పుడు!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఉదయపు సూర్య కిరణాలతో పెరడంతా బంగారురంగులో మెరిసిపోతోంది. తులసికోట దగ్గర దీపం వెలిగించి, తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ మంత్రాలు జపిస్తోంది రవణమ్మ.
ఆమె ముఖంలోని ప్రశాంతత తాండవిస్తోంది. రోజూ చేసే పనే అయినా అలవాటుగానో, మొక్కుబడిగానో కాకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తోంది రవణమ్మ.
అంతలో ఇంటి లోపల నుంచి నవ్వుకుంటూ బయటికి వచ్చింది రమ. చేతిలో ఫోన్.. కళ్లల్లో ఉత్సాహం. రమ నవ్వు గమనించిన రవణమ్మ “ఏమిట్రా రమా.. ఇంత ఉదయాన్నే ఫోన్ చూసుకుని నవ్వుకుంటున్నావు?” అని అడిగింది.
రమ మొహంలో ఎక్కడలేని ఆనందం తన్నుకొచ్చింది. ఆమె వైపు చూస్తూ “ఓ.. అదా నానమ్మా! మా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ ఫిక్స్ అయింది. రేపే షూట్!” అంది ఆనందంగా.
రవణమ్మ కాసేపు అయోమయంగా మనవరాలి వైపు చూసింది.
“ఏంటది.. ప్రీ వెడ్డింగ్ షూటా?” అని నెమ్మదిగా అడిగింది.
“అంటే.. పెళ్లికి ముందే ఫోటోలు, వీడియోలు తీసుకుంటాం. చాలా స్టైలిష్గా, వెరైటీగా. ఇప్పుడంతా అదే ట్రెండ్ కదా నానమ్మా!” అంది రమ ఉత్సాహంగా.
రవణమ్మ చేతిలో ఉన్న కుంకుమ గిన్నె జారిపోయింది. “పెళ్లి కాకముందే.. ఇలాంటివా? ఎవరికైనా తెలిస్తే నవ్విపోరూ?” అంది నోరు తెరచి.
“అవును నానమ్మా! ఇప్పుడిదే ఫ్యాషన్. సోషల్ మీడియాలో పెడితే అందరూ మెచ్చుకుంటారు” అంది రమ. రవణమ్మ ముఖంలో ప్రశాంతత మెల్లగా మసకబారింది.
“ఏది దాచుకోవాలో, ఏది చూపించాలో కూడా తెలియని కాలం వచ్చిందన్నమాట” అంది తనలో తానే.
అంతలో రవణమ్మ కొడుకు అనంతమూర్తి బయటకు వస్తూ “ఏమిటమ్మా.. ఏం జరిగింది?” అన్నాడు.
అడుగుతున్న కొడుకు వైపు కొరకొరా చూస్తూ “నన్నడుగుతావేరా? నీ కూతుర్ని అడుగు. పెళ్లి కాకముందే అబ్బాయితో గుట్టల్లో, పొలాల్లో తిరిగి ఫోటోలు దిగుతానంటోంది” అంది రవణమ్మ ఆవేదనగా.
అనంతమూర్తి నవ్వుతూ “అమ్మా.. కాలం మారింది. ఇవన్నీ ఇప్పుడు మామూలే” అన్నాడు.
రవణమ్మ కొడుకు వైపు గంభీరంగా చూసింది.
“కాలం మారిందా? లేక మన కళ్లకేమైనా పైత్యం కమ్మిందా?” అంది రవణమ్మ.
కొడుకు ఏమీ మట్లాడకపోవడంతో “కాలం మారుతోంది. కాదనను.. కానీ దాంతో పాటే మనిషి విలువలు మారకూడదు కదా. మా కాలంలో పెళ్లి అంటే గౌరవం, బంధుమిత్రులు, కోలాహలం! ఇప్పుడు మాత్రం.. కెమెరా ముందు చేసే నాటకం అయిపోయింది” అంది నెమ్మదిగా.
రమ అసహనంగా “ఇది నాటకం కాదు.. మెమొరీస్. జీవితాంతం గుర్తుండే క్షణాలు! తాతయ్య ఎలా ఉంటాడని అడిగితే తడుముకుంటావే గానీ ఇదిగో ఇలా ఉంటాడని ఎప్పుడైనా పోటో అయినా చూపించావా నానమ్మా? అదేమని అడిగితే ‘మా కాలంలో అలాంటివి లేవు, తీయక తీయక తీసిన ఫొటో ఎక్కడో పోయింది’ అంటావు. అందుకే ఇప్పుడు కాలానికి ముందు జాగ్రత్త ఎక్కువై పోయింది” అంది నవ్వుతూ.
“ఫోటోలు తీసుకుంటేనే మనుషులు గుర్తుంటారా? ఇదెక్కడి చోద్యమే?” అంది నిశ్శబ్దంగా రవణమ్మ.
రమ మాత్రం ఆ మాటలను తేలికగా తీసుకుంది.
“రేపు షూట్ ఉంది. నాకు రెడీ అవ్వాలి” అంటూ లోపలికి వెళ్లిపోయింది.
రవణమ్మ కళ్ళు మూసుకుంది. ‘పొరపాటు చేసేది కాలం కాదు.. మనమే’ అనుకుంది తనలో తానే. తులసి కోట దగ్గర దీపం వెలిగించింది. కానీ ఆమె మనసంతా చీకటిగా అయిపోయింది.
***
“ఇలా ఎంతసేపు కూర్చోవాలి. ముక్కులు బద్దలౌతున్నాయి” అంది రమ.
“ఎంతసేపైనా కూర్చోవాలి. వీడియోలు ఊరికే వస్తాయా మరి?” అన్నాడు వీడియోగ్రాఫర్.
“నువ్వు వీడియో తీసేవరకూ ఆగితే ఈ కంపుకి మా ఊపిరి పోయేటట్లుంది” అంది రమ.
ఆ మాటకి కెమేరా వదిలేసి వాళ్ల వైపు చూస్తూ “అలా వూరికే కూర్చుంటే ఎలా? ఒయ్యారంగా పేడ కలిపి దాన్ని గుండ్రంగా చేయాలి. నిన్ను అతను గట్టిగా పట్టుకుని గోడ వైపు పైకెత్తుతాడు. నువ్వు ఒక్కో పేడ ముద్దను గోడకు కొడుతూ అప్పుడప్పుడు అతని వైపు, నా వైపు చూస్తూ ఉండాలి. మధ్యమధ్యలో చిరునవ్వులు చిందిస్తూ గాలికి ఎగురుతున్న జుట్టును పైకి ఎగదోసుకుంటూ ఉండాలి. చేతిలోంచి వెన్నముద్ద జారినట్లుగా నీ సన్నని నడుము అతని చేతిలోంచి జారిపోతూ ఉండాలి. అప్పుడైతే నా సామిరంగా..”
“ఏంటి ఈ పేడ చేత్తోనే..” చిరాగ్గా ముఖం పెట్టి అడిగింది రమ.
“కాక.. నా చేత్తోనా” అన్నాడు మళ్ళీ భళ్ళున నవ్వుతూ వీడియోగ్రాఫర్.
డబ్బులు ఎదురిచ్చి మరీ తన్నించుకున్నట్లుగా, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉన్న పరిస్థితిని జీర్ణించుకోలేక గిలగిలలాడారు రాజు, రమలిద్దరూ. అందరికన్నా వెరైటీగా ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ఉండాలని అన్నందుకు ‘మంచి శాస్తే’ అయిందనుకున్నది రమ.
“హలో మిమ్మల్నే.. నా ఫొటోగ్రఫీ స్టైల్ చూసి ఇద్దరూ ఏదో లోకంలోకి వెళ్లిపోయినట్లున్నారు. గోడకు పిడకలు కొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇంకో స్టైల్లో వీడియో తీద్దాం” అనడంతో ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చింది రమ.
“ఇదిగో ఇటు చూడండి.. మీరిద్దరూ ఒకర్నొకరు గాఢంగా హత్తుకుని అక్కడ కనిపిస్తున్న అరిటాకుల మీద దొర్లాలి” అన్నాడు వీడియోగ్రాఫర్.
అటు వైపు చూసిన వాళ్ళకి ఎంగిలాకులు వెక్కిరిస్తూ కనిపించాయి. కుక్కలు, కోళ్లు, ఈగలు, దోమలు, ఏవేవో రకరకాల కీటకాలు వాటిమీద అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ కనిపించాయి. ఒక్కసారిగా భళ్లున వాంతి వస్తున్నట్లుగా అనిపించింది రమకి.
“చెప్పింది అర్థం కాలేదా? తొందరగా కానివ్వాలి” అన్నాడు అతను.
ఎంగిలాకుల మీద పొర్లుదండాల ప్రహసనం మొదలయింది. పెంటకుప్పల మీద ఆకులతో పాటూ ముళ్ళు, గాజుపెంకులు గుచ్చుకుని అక్కడక్కడా చేతులకు గాయాలవసాగాయి. వాటిని భరిస్తూనే దొర్లుతున్న వాళ్లను చూస్తూ “ఇలా మూతులు ముడుచుకుని, పళ్ళు బిగపట్టుకుని వీడియో తీయమంటే నా వల్లకాదు. ఇష్టం లేకపోతే చెప్పండి. ఇప్పుడే ఆపేస్తాను..” అన్నాడు చిరుకోపంగా వీడియోగ్రాఫర్.
చేతులు నలుపుకుంటూ వెకిలినవ్వుతో వీడియోగ్రాఫర్ వైపు చూశారిద్దరూ. వాళ్ళ ఇబ్బందేమీ పట్టనట్టుగా “చెప్పింది చెప్పినట్లు చేస్తే, నేను తీయాల్సింది తీసుకుంటాను” అన్నాడు మరోసారి నవ్వుతూ.
ఏమీ అనలేక ఎంగిలాకుల మీద నుంచి ఇద్దరూ ఒకేసారి పైకి లేవబోయారు. “అబ్బెబ్బే.. ఇలా అయితే చాలా కష్టం! అలా ఇద్దరూ ఒకేసారి లేస్తే ఎట్లా? ముందు నువ్వు లేచి తర్వాత ఆ అమ్మాయిని మెల్లిగా సుకుమారంగా పైకి లేపితే వీడియో అద్భుతంగా వస్తుంది. తెలియకపోతే అడగరు, చెప్తే చేయరు” అన్నాడు.
వాసన భరిస్తూ ఇద్దరూ పైకి లేచారు.
“అదిగో అది కనిపిస్తుందా?” అన్నాడు వీడియోగ్రాఫర్.
బిక్కుబిక్కుమంటూ అతను చూపించిన వైపుకి చూశారు.”అమ్మాయ్.. నువ్వా ‘గాబు’ దగ్గరికెళ్ళి నీ చేత్తో కుడితిని కలిపి గేదెకు తాగిస్తూ ఉండాలి. ఆ అబ్బాయి వెనుక నుంచీ వచ్చి నిన్ను కౌగిలించుకుని సుకుమారంగా నీ బుగ్గలపై ముద్దు పెట్టుకుంటాడు. వద్దు వద్దు అంటూనే నువ్వు అతని ముద్దును ఆస్వాదించాలి” అన్నాడు చేతిని అటు చూపిస్తూ.
మగతనిద్రలో లేచి తడబడుతూ నడిచినట్లుగా వెళ్లారు ఇద్దరూ. పిచ్చి పట్టినట్లుగా వీడియోగ్రాఫర్ చెప్పినట్లుగా చేసింది రమ. కుడితెలా కలిపిందో, దాన్ని గేదెకెలా తాగించిందో, రాజు ఎప్పుడొచ్చి తనను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడో.. ఏవీ గుర్తులేవు రమకి. ‘కీ’ ఇస్తే తిరిగే యంత్రంలా అతనెలా చెప్తే అలాగే చేసింది. వీడియోగ్రాఫర్ ‘ఓకే’ చెప్పాక ఏదో ట్రాన్సులో నుంచి బయటికి వచ్చినట్లుగా అతని వైపు చూసింది.
“బాగుంది. ఇద్దరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. వెరీగుడ్.. ఇంకొక్కటి మిగిలింది. అది చేస్తే..” రమ, రాజులిద్దరూ ఒకేసారి అతని వైపు చూశారు.
“అంటే అంత కష్టమైనదేమీ కాదు. ఈసారి ఇద్దరూ బురదగుంటలో దొర్లుతూ ఫోజులివ్వాలి. ఇప్పుడందరూ ఈ తంతును ఎంతో వెరైటీగా చేస్తున్నారు. పైగా ఇలాంటి మట్టిలో కాసేపు దొర్లితే చర్మరోగాలు పోయి శరీరం కాంతివంతమవుతుంది” చెప్పి మరోసారి పళ్ళికిలించాడు వీడియోగ్రాఫర్.
బంకలాగా ఒళ్లంతా చెమటతో పేడతో ఎండిపోయి కనిపిస్తున్న ఒంటివైపు చూసుకుంది రమ. అతన్ని ఏమీ అనలేక “ఇక మా వల్లకాదు. వెరైటీగా ఉండాలని చెప్తే ఇలాంటి ప్లేసుల్లో వీడియో తీస్తున్నావు. ఇక మా వల్లకాదు” అంది రమ కోపంగా.
“సరే అయితే.. ఇప్పటిదాకా తీసింది కూడా అవతల పారేస్తాను. మీరిచ్చిన దానికి, నేను తీసిన దానికి చెల్లు.. మీ చావు మీరు చావండి. ఏదో తక్కువ రేటులో బ్రహ్మాండమైన వీడియో తీద్దామని నానా తంటాలు పడుతుంటే నా టాలెంటును వెక్కిరిస్తున్నారు” అంటూ అక్కడి నుంచి కదిలినట్టుగా ఫోజిచ్చాడు వీడియోగ్రాఫర్.
రమా, రాజులిద్దరూ నీరసంగా అతని వైపు చూసి తప్పదన్నట్లు బురద గుంటవైపు కదిలారు. ఇద్దరూ ఆ గుంటలో దిగుతుంటే దానిమీద వాలిన చిన్నచిన్న పురుగులన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.
“ఒళ్లంతా మట్టి పూసుకుని, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దొర్లుతూ వీడియో షూట్ చేయడమంటే మాటలా? ఎంత కళాత్మకత ఉండాలి! బురద అలా ఒంటిమీద జారుతున్నప్పుడు ఒకసారి, కొంచెం ఆరుతున్నప్పుడు ఒకసారి, పూర్తిగా ఆరిన తర్వాత ఒకసారి వీడియో తీస్తే కేకో కేక!” అన్నాడు భళ్లున నవ్వుతూ.
ఆ నవ్వుకి ఇద్దరికీ వాంతైనంత పనయింది. ఆరుతున్న బురద మీద ఏవో చిన్న చిన్న కీటకాలు వాలి దురద రాసాగింది. ‘బురదా బురదా రాసుకుంటే బురదే రాలుతున్నట్లుగా’ ఉంది ఇద్దరి పరిస్థితి.
“ఇదిగో ఏమ్మా.. కొంచెం బురదను చేత్తో తీసుకుని అతని బుగ్గమీద సుతారంగా రాయి ఒకసారి” అన్నాడు ఫోటోగ్రాఫర్ కమ్ వీడియోగ్రాఫర్.
రమ చేతిలోకి కొంచెం బురద తీసుకుని రాజు బుగ్గమీదకు విసిరింది. అది చూసి వీడియోగ్రాఫరుకి చిర్రెత్తుకొచ్చి “సుతారంగా రాయమంటే గోడకు పిడక కొట్టినట్టుగా రాయకూడదు. గుప్పెడు పౌడరు బుగ్గకు అద్దినట్లుగా సుకుమారంగా రాయాలి” అన్నాడు.
ఒంటిమీద మట్టి ఆరుతుంటే ఎండిపోయిన తర్వాత రాలే గోడకు కొట్టిన పిడకలాగా ఉంది పరిస్థితి. ఒళ్లంతా బిగుసుకుపోతున్నట్లుగా ఉంది. దానికి ఎండ కూడా తోడవడంతో ఒళ్లంతా చిమచిమలాడిపోతోంది.
కొద్ది సేపటి తర్వాత.. బురదతో నిండిన దుస్తులు.. అలసిన ముఖాలు.. రమకు ఉదయం నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
“ఏది దాచుకోవాలో, ఏది చూపించాలో తెలియట్లేదు..” అనే మాటలు చెవుల్లో మార్మోగాయి.
***
రవణమ్మ బయట కూర్చుంది. సూర్యాస్తమయం నిశ్శబ్దంగా వాకిలిని ఆక్రమిస్తోంది. రమ నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చుంది. “నానమ్మా..” అని మృదువుగా పిలిచింది.
రవణమ్మ ఆశ్చర్యంగా చూసింది.
“ప్రీ వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ చేశా” అంది రమ చిరునవ్వుతో.
రవణమ్మ మనవరాలి వంక ఆశ్చర్యంగా చూస్తూ “చాలా ఖర్చు పెట్టారు కదా! అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది కదే బంగారం” అంది.
“పోతే పోయిందిలే వెధవ డబ్బు.. నువ్వు చెప్పినట్లుగా పెళ్లికి ముందే అన్నీ చూపించడానికి అలవాటుపడి దాచుకోవలసినవి దాచుకోలేకపోతున్నాం” అంది రమ.
రవణమ్మ కళ్లలో తృప్తి కనిపించింది. మనవరాలి మొహాన్ని ఆప్యాయంగా తడిమి మెటికలు విరిస్తూ “ఏదో పెద్దదాన్ని చెప్పానని కొట్టి పారేయకుండా విలువ ఇచ్చావు. అదే సంతోషమే రమా” అంది రవణమ్మ.
ఇంతలో అనంతమూర్తి ఇంట్లో నుంచి హడావిడిగా పెరట్లోకి వస్తూ “ఏమిటమ్మా నువ్వు చేసిన పని? ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దన్నావట” అన్నాడు.
రమ ప్రశాంతంగా “అవును నాన్నా.. పెళ్లి అనేది రెండు మనసుల కలయికే గానీ ప్రపంచానికి చూపించే ప్రదర్శన కాదు. మన ఆనందం మనసులో ఉండాలి.. కెమెరాలో కాదు” అంది.
అనంతమూర్తి కోపంగా తల్లిని చూస్తూ “ఏదో పిల్ల ముచ్చట పడిందని ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేస్తే నీ చాదస్తం దానికి కూడా అంటించి అంతా సర్వనాశనం చేశావు కదమ్మా?” అన్నాడు.
రవణమ్మ నెమ్మదిగా తల ఊపింది. కొడుకు వైపు చూస్తూ “కాలం మారుతోందని విలువలకు తిలోదకాలివ్వకూడదురా పిచ్చి సన్నాసి! పెళ్లికి ముందే ఫోటోలు, వీడియోలు తీసి వాటిని ఎక్కడెక్కడో పెట్టి సంప్రదాయాల్ని అటకెక్కించకూడదురా. పెళ్లంటే రెండు కుటుంబాల గౌరవం, రెండు మనసుల గుంభనం! పెళ్లి వేడుకలు కొత్త కొత్త ఫ్యాషన్లతో చేయొచ్చు గానీ ‘పిచ్చి కుదిరింది కానీ రోకలి తలకు చుట్టమన్న’ట్టుగా ఉండకూడదు. పెళ్లితో ఏర్పడే బంధం అనురాగంతో ముడిపడాలి. ఒకరిలో ఒకరు కలిసిపోవాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. లోపలి విలువలే మన జీవితాన్ని వెలిగిస్తాయి, బాగుచేస్తాయి” అంది రవణమ్మ.
తల్లి మాటలకు అనంతమూర్తి నుదురు కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. రమ మాత్రం ఆనందంతో రవణమ్మను అల్లుకుపోయింది.
