[శ్రీ దోసపాటి వేంకట రామచంద్ర రావు గారు రచించిన ‘అర్ధాంగి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
గడియారంలో అలారం మ్రోగుతోంది. ఉదయం ఆరుగంటలైంది. అప్పుడే ఈగోలేమిటని అరుణ ఆపేసింది.
సుబ్బారావు ఉదయం ఉదయపు నడకకు వెళ్తాడు. ఆయనకు షుగర్. ఈ రోజు మాత్రం షుగర్ టెస్టుకు వెళ్ళడానికి లేచాడు.
“నేను షుగర్ టెస్టుకు వెళ్తున్నా” భార్యకు చెప్పాడు.
“సరే!” అని మళ్ళీ అలారం మోగితే టైము చూసింది.
ఆరుంపావైంది. అప్పుడే ఆరుంపావా అనుకొని వస్తున్న ఆవులింతని ఆపుకొని లేచింది. పనమ్మాయి రాదన్న సంగతి గుర్తుకు వచ్చింది. లేచి వాకిలి కడిగి ముగ్గువేసి వచ్చి వంటగదిలోకి దూరింది. పాచి సామాన్లు కడగడానికి. ఆ పని పూర్తిచేసి దంతదావనం పూర్తిచేసుకొని పరగడుపునే వేసుకోవాల్సిన థైరాయిడ్ మాత్రలున్న సంచీ తీసి వేసుకుంది.
ఆ తరువాత కాపీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఈలోగా షుగర్ టెస్ట్ చేయించుకొని వచ్చిన సుబ్బారావు
“నేను స్నానానికి వెళ్తున్నా. ఆ రాగిజావ సిద్ధం చేసి వుంచు. అది తాగిన రెండుగంటలలోపు మళ్ళీ మరో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి.” భార్యకు చెప్పి స్నానం గదిలోకి వెళ్ళిపోతున్న భర్తని ఉడికించడానికి, “ఓ కప్పు కాఫీ ఇవ్వనా” అంది.
“చాల్లే! నీ వెటకారం. నేను తాగనని తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడుగుతావు” భార్యతో అని వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి.
ఓ పది నిమిషాల్లో స్నానం పూర్తిచేసి దేవుడి గదిలోకి దూరాడు. తూతూ మంత్రాలేవో చదివేసి వచ్చేశాడు. మామూలుగానైతే ఒక గంట వరకు రాడు. ఒక్క షుగర్ టెస్టుకు వెళ్ళినప్పుడే ఈ వెసులుబాటు.
“అదిగో టేబిల్ మీద మీ జావ సిద్ధంగా వుంది. నేను స్నానానికి వెళ్తున్నా” అని అరుణ వెళ్ళింది.
అరుణ వచ్చే లోపు జావ తాగేసి ఉదయం వేసుకోవాల్సిన షుగర్ మాత్రవేసుకొని డాక్టర్ని కలవడానికి టోకెన్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. టైము చూసాడు ఎనిమిది దాటి పదినిమిషాలైంది. అంటే మళ్ళీ పదిగంటల లోపు రెండో టెస్టుకు వెళ్ళాలని అనుకున్నాడు. టోకెన్ తెచ్చుకున్నాడు.
పదిహేనో నెంబరు ఉంది. టెస్టు రిపోర్టు వచ్చాక డాక్టరుని కలవడానికి తాను రెండో బేచులో వెళ్తాడు, పరవలేదనుకున్నాడు. ఇంటికి వచ్చి సెల్ పట్టుకొని కూర్చున్నాడు.
“ఆరంభించారా మీ సెల్లు పురాణం. కాస్త ఆ సెల్లు వాడకం తగ్గించుకొని ఇంటి విషయాలు పట్టించుకుంటే బాగుంటుంది.” అరుణ భర్తను సతాయించింది.
“ఇప్పుడు ఇంటి విషయాలు ఏమిటి పట్టించుకోవడం లేదోయ్. కూరలు ఇంటి దగ్గరకే వస్తున్నాయి. కిరాణా సరుకులు లిస్టు వాట్సాప్ లో పెడితే ఆ దుకాణం వాడు తెచ్చేస్తున్నాడు. ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా తేవాలంటే ఇద్దరం వెళ్ళి తెచ్చుకుంటున్నాము. ఇంకేమిటి పట్టించుకోవడం లేదో చెప్పు.” భార్యకి సమాధానం చెప్పాడు.
“సరే లెండి! ఇదెప్పుడూ మనిద్దరికి ఉండే తంటాయే కదా? ఇక రెండో టెస్టుకు వెళ్ళాలేమో టైము చూసుకోండి. నేను వంటపని చూడాలి.” అరుణ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
టైము చూసుకొని రెండోసారి షుగర్ టెస్టుకు సుబ్బారావు బయలుదేరాడు.
***
రెండోసారి షుగర్ టెస్టుకు వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఆ నెల వచ్చిన ‘మిసిమి’ పత్రిక అందుకున్నాడు. మరో అరగంట తరువాతగాని టెస్టు రిపోర్టు రాదు. అది వచ్చాక గాని డాక్టర్ను కలవడానికి కుదరదు. పదిన్నర దాటాక వెళ్ళాలి.
అలవాటు ప్రకారం అరుణ షుగర్ లెస్సు పవుడరు కలిపి తెచ్చి ఇచ్చింది. అది తాగేసి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు.
“మహానుభావా! టైము చూసుకున్నారా? సెల్లు, పుస్తకాలు తప్పితే మీ మీద మీకు ధ్యాసే ఉండదు. పదకొండు దాటింది. ఆ రిపోర్టు తీసుకొని డాక్టర్ను కలవండి. బయలుదేరండి బాబూ!” అరుణ భర్తను తట్టి చెప్పింది.
ఒక్కసారి ఉలిక్కిపడి “అప్పుడే పదకొండు దాటిపోయిందా? సరే! వెళ్తున్నా” అని పాత రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్, ముఖ్యంగా మాస్కు పట్టుకొని బయలుదేరాడు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అది అందరికీ మాస్కు ఒక అలంకారమైంది. అది లేకుండా ఏ డాక్టరు అనుమతించడం లేదు.
టెస్టు రిపోర్టు తీసుకొని చూసాడు. ‘అమ్మో ఎఫ్బిఎస్ 140 ఎమ్జిడిల్, పిపిబిస్ 280 ఎమ్జిడిల్ ఉంది. ఇంతెలా పెరిగిందేమిటి?తీపి పదార్థాలు తినడం లేదు, బ్రౌను రైసే తింటున్నాడు, జాయకాయ జూస్ తాగుతున్నాడు.ఎంతో జాగ్రత్తగా డైటు పాటిస్తున్నా ఇంతలా పెరిగిందేమిటి? ఈ మధ్యన ఓ రెండు ఫంక్షన్లలో కూడా ఎక్కువగా ఏమి తినలేదు. వైశాఖమాసం మామిడిపండ్లు సీజన్లో ఏదో అరుణ పూజ చేసి పళ్ళు ఇచ్చుకుంటే తనని తినమని చెప్పినా చిన్నముక్క మాత్రమే తిన్నానే? సరే! ఏమైతే ఏమిటి, డాక్టర్ చెప్పింది చేయడం తప్ప మరో మార్గం లేదు’ అనుకుంటూ డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు. మొదటి బేచువాళ్ళు లోపలికి వెళ్ళారు. రెండో బేచుని సిద్దం చేస్తున్నారు. తన నెంబరు పిలవడంతో వెళ్ళి కూర్చున్నాడు. పన్నెండన్నరకి రెండో బేచు వాళ్ళని లోపలికి పంపారు. తన వంతు వచ్చినప్పటికీ ఒంటిగంటైంది. డాక్టరు అంతా పరీక్ష చేసి టెస్టు రిపోర్టు చూసి “ఏమిటి మాష్టారు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి? మాత్రలు వేసుకోవడం లేదా? డైటు సరిగ్గా పాటించడంలేదా?” ప్రశ్నల వర్షం కురిపించారు.
సుబ్బారావు “అదేమి లేదండి?మాత్రలు డైటు సరిగ్గా పాటిస్తున్నాను.” జవాబిచ్చాడు.
“అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా! ఏమైనా కొంచెం జీహ్వరుచిని కంట్రోల్ లేకుండా ఏమైనా తినేసుంటారు. అందులో విందులు మామూలుగా ఉండవు కదా! సరేలెండి మాత్రలు పవరు పెంచి రాస్తున్నాను. ఒక నెలరోజులు వాడండి. నడక మాత్రం మానకండి. ఇంట్లో గంటల తరబడి టివి చూడడం, కూర్చోని వుండడం చేయకండి.” సలహా ఇచ్చి కొత్తగా ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసారు డాక్టరుగారు. “సరేనండి” అని చెప్పి మందులు కొనుక్కొని ఇంటికి వచ్చేసాడు సుబ్బారావు.
***
“ఏమైంది షుగర్ లెవెల్స్ తగ్గాయా? డాక్టరుగారు ఏమన్నారు” ఇంట్లోకి అడుగుపెట్టగానే అరుణ అడిగింది భర్తను.
“లేదోయ్! పెరిగింది. డాక్టరుగారు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు పెరిగిందని? మందులు పవరు పెంచి రాసిచ్చి వాడుమన్నారు. నడక మాత్రం మానవొద్దన్నారు.” భార్యకు చెప్పాడు సుబ్బారావు.
“నాకు తెలుసండి. మీరు సెల్లులో అర్ధరాత్రి వరకు టిక్కు టిక్కుమని టైపు చేసినంత కాలం తగ్గదు. కవిత్వం, కథలు రాయడం మాననంతవరకు తగ్గదు. పుస్తకాలు చదవడం గంటల కొద్ది కుర్చీలో కూర్చోనున్నంతకాలం తగ్గదు కాక తగ్గదు. మీకు షుగర్ తగ్గకపోవడం అన్నది డైటు లోపం వల్లనో మాత్రలు పవరు తగ్గడం వల్లనో కాదు. ఒక్క నెలరోజులు ఇవన్నీ మానేయండి. ఎందుకు షుగర్ తగ్గదో నేనూ చూస్తాను.” డాక్టరు కోర్సు చదవని భార్య అరుణ ఉద్బోధ.
“అవన్నీ మానేసి మూగిమొద్దులా కూర్చోవాలా? అది నా వల్ల కాదు. ఇంకేదేమైనా ఆలోచన వుంటే చెప్పు. అయినా డాక్టరు గారిని రెగ్యులర్ గా కలుస్తున్నాను కదా!” సుబ్బారావు భార్యకు చెప్పాడు.
“అదేం కాదు. నేను చెప్పినట్టు చెయ్యండి. ఒక్క నెలరోజులపాటు వాటిని ఎడం పెట్టండి. ఇంట్లొనే చిన్న చిన్న పనులు చేయండి. మనవరాలిని ఆడిస్తూ గడపండి. నడక పేరుతో కిలోమీటర్లు నడవాల్సిన పనిలేదు. ఇంట్లోనే మీ పుస్తకాలన షెల్పును శుభ్రం చేసుకోండి. శరీర వ్యాయామం అంటూ బస్కీలు దండీలు చేయనక్కర్లేదు. ఒక పావుగంట అదేదో యోగా అంటారు కదా అది చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని, దూరంగావున్న మన పిల్లలు, మనవలతో మాట్లాడండి కొంతసేపు. మీ స్నేహితులతో మాట్లాడండి. రోజు కాకపోయినా మన బంధువుల ఇళ్ళకి వెళ్ళి పలకరించండి. ఇక్కడున్న స్నేహితులతో అప్పుడప్పుడూ మాట్లాడండి. మీ దినచర్యను మార్చుకొని చూడండి. ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ తగ్గకపోతే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అంటూ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి “సరే కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం చేద్దాం” భర్తకు చెప్పింది అరుణ.
ఇద్దరూ భోజనం చేయడానికి లేచారు.
***
ప్రతిరోజులా గడియారం అలారం మోగితే సుబ్బారావు ఆపేసి తన గదిలో ఒక మూల కూర్చొని యోగా చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత నిత్యకృత్యాలు తీర్చుకొని దైవప్రార్థన ముగించి ఒకసారి అపార్టుమెంటు సెల్లారులోకి మనవరాలిని తీసుకొని వెళ్ళి తిప్పి తీసుకొని వచ్చాడు.
బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రలు వేసుకున్నాడు. భార్యని పిలిచి బజారుకెళ్లి ఏమైనా తేవాలా అని అడిగాడు. ఏవో తెమ్మని చెబితే బజార్లోకి వెళ్ళి వచ్చాడు. తరువాత ఏమిటి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ మనవరాలొచ్చి “తాతా ఆచ్చి” అంటూ రెండు చేతుల్ని చాచింది.
“ఇప్పుడొద్దమ్మా! బయట ఎండగా వుంది. నీ బొమ్మలు తే, ఆటాడుకుందాం” అన్నాడు. అది వినకపోతే బొమ్మల పుస్తకం తెచ్చి మనవరాలికి బొమ్మలు చూపించి అవేమిటో చెప్పాడు.
పొద్దున్నుంచి భర్తని గమనిస్తూనే వుంది. కాస్సేపు తాత మనవరాలితో గడపడం అయిన తరువాత మనవరాలిని తాను తీసుకొని “ఆ మధ్యన ఏవో మీ ముఖ్యమైన కాగితాలు కనపడలేదన్నారుగా ఒకసారి చూసుకోవచ్చుగా” అని భర్తతో అంది.
“అవునవును సుమీ!” తన గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచి తాను ఉంచిన కాగితాలసంచిలు ఒక మూడు పట్టుకొని అన్ని ఒక్కొక్కటి వెదకడం చేయసాగాడు. ఒక గంట తరువాత తనకు కావాల్సిన కాగితాలు దొరకడంతో అవన్ని వేరే ఇంకొక సంచిలో పెట్టి అల్మారాలో పెట్టెసాడు. ఈలోగా భోజనానికి సమయమవడంతో భార్య పిలవడంతో వెళ్ళాడు. భార్య చెప్పినట్టుగా ఆరోజు నుంచి తన దినచర్యను మార్చుకొని సెల్లుతోను, పుస్తకాలతోను కాలక్షేపం తగ్గించుకున్నాడు.
అర్ధాంగి మాటలు కొంతమంది మగవారు పట్టించుకోకుండా అదేమిటి చెప్పేది మనమినేదేమిటి అనుకుంటారు. కొందరూ తమకంటే భార్యలకేమి తెలియదని కూడా అనుకుంటారు. మగవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భార్య ముఖ్యంగా గృహిణి అయిన స్త్రీ ఇంట్లో వాళ్ళని దగ్గరగా గమనిస్తుంది. ముఖ్యంగా భర్తని. కనుక భార్య మాటలు వినడంలో తప్పులేదు.
నెలరోజుల్లో సుబ్బారావులో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడో గాని సెల్లు తీయడంలేదు. రాతలు బాగా తగ్గించేసాడు. అర్ధరాత్రుల వరకు పుస్తకాలు చదవడం కూడా తగ్గించేసాడు. అప్పుడప్పుడు బయటకివెళ్ళి బంధువులను స్నేహితులను కలుస్తున్నాడు.
నెలరోజుల తరువాత డాక్టర్ని కలవడానికి షుగర్ టెస్ట్ చేయించుకున్నాడు. నిజంగానే షుగర్ లెవెల్స్ తగ్గాయి. డాక్టరు పవరు తగ్గించి మాత్రలు రాసిచ్చిన వాడమన్నారు. కొన్నాళ్ళ మార్పు కోసం పెద్ద కొడుకు దగ్గరికి బెంగళూరు భార్యతో బయలుదేరాడు.
సమాప్తం
