Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోగ్యమె మన భాగ్యము.. కావాలది నినాదము..

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘ఆరోగ్యమె మన భాగ్యము.. కావాలది నినాదము..’ అనే కవితని అందిస్తున్నాము.]

జీవముంది తెలుసుకో ఆహారంలో
జీవితానికాధారం అదే సుమా తెలుసుకో
ప్రతి అడుగు పదిలంగా చూసుకో
ప్రతీక్షణం విలువైనది వాడుకో.. వాడుకో
ఆరోగ్యమే మన భాగ్యము వినరా..
కావాలది అందరి నినాదమూ సోదరా..
అందులోన దాగి ఉన్న ఆనందం కనరా..
సందేశం అందుకునీ పాటిస్తూ సాగరా..

కంటిచూపు కోసం తిందాం పద క్యారెట్లు
ఐరనెంతొ వస్తుంది ఆకుకూరలివిగో
తోటకూర పప్పుతోటి.. పాలకూర వేపుడేసి
పలురకాల కూరలతో పసందైన విందులే..
ఆరగించు తమ్ముడూ తీపితీపి రుచులతో
తరగని సంతోషము సొంతమౌను పుచ్చుకో..

పాలు పెరుగు తినేద్దాము కండరాల బలిమికి
అరటిపండు జోడిద్దాం ప్రతిపూట వాటికి..
మామిడి.. బొప్పాయి.. నిమ్మా.. నారింజ తోటి
రోగాలే దరిజేరవు పారిపోవు తోకముడిచి..
మంచినీరు మరిచిపోకు.. మరల మరల సేవించు
సత్వరమే పాటించు.. జీర్ణక్రియను మెరుగుపరుచు

ఎండలోన నిలబడితే సూర్యరశ్మి సోకేను
దివ్యమైన ఔషధం ‘డి’ విటమిన్ అందేను
ఖర్చెరుగని వైద్యమది.. వైద్యునితో పనిలేనిది
ప్రతీదినం అవసరం పలురకాల పోషకాలు
అంతకన్న అవసరం అవయవాల కదలికలు
నిరంతరం నియమాలతో జీవితమే సుఖమయం

గుడ్డులోని పచ్చసొన ‘వెరీ గుడ్డు’ పాపలూ
పోషకాల గనులవీ వద్దనక పుచ్చుకొనుము
చికెన్ కూర..మటన్ కూర నిండుగా ప్రోటీనులు
మరిచిపోకు ఒక్కమాట.. ఉండాలీ పరిమితులు
హద్దులే దాటావా.. జతజేరును జబ్బులు
గుమికూడి తడతాయి నీ గుండె తలుపులు..

జీవముంది తెలుసుకో ఆహారంలో
జీవితానికాధారం అదే సుమా తెలుసుకో
ప్రతీ అడుగు పదిలంగా చూసుకో..
ప్రతీక్షణం విలువైనది వాడుకో.. వాడుకో..
ఆరోగ్యమే మన భాగ్యము వినరా
కావాలది అందరి నినాదమూ సోదరా..
అందులోన దాగి ఉన్న ఆనందం కనరా
సందేశం అందుకునీ పాటిస్తూ సాగరా..

Exit mobile version