[శ్రీమతి జి.ఎస్. లక్ష్మి రచించిన ‘అర్థం చేసుకోరూ..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. డా. నెల్లుట్ల నవీన చంద్ర కథావేదిక కథల పోటీ-2025 లో ₹ 3000/- ప్రథమ బహుమతి పొందిన కథ.]
“రవిబాబూ, ఓ సారిలా రా నాయనా!”
అప్పటికే రాత్రి పదిన్నర దాటింది. పొద్దుట్నించీ డ్యూటీ చేసి, ఎప్పుడు రూమ్‌కి చేరి, మంచం మీద వాలిపోదామా అనుకుంటూ, రూమ్ తలుపు తాళం తీస్తున్న నేను ఒక్కసారి తల తిప్పి పక్క గుమ్మం వైపు చూసేను.
అక్కడ వర్ధనం పిన్నిగారు నాకోసమే కాచుకున్నట్టు నిలబడున్నారు. పిన్నిగారూ, బాబాయిగారూ ఇద్దరూ పెద్దవాళ్ళు. వాళ్ళు నాకు రూమ్ అద్దె కివ్వడానికి ముఖ్య కారణం వాళ్లకి డబ్బు అవసరమై కాదు. పెద్దవాళ్ళిద్దరే వుంటున్నారు కనక, పిలిస్తే పలికేలా ఒక కుర్రాడు ఇంట్లో వుంటే బాగుంటుందనే వుద్దేశంతో ఆ రూమ్ నాకు అద్దె కిచ్చేరు. అంతేకాకుండా వాళ్ళకీ మాకూ కాస్తంత బంధుత్వం కూడా వుండడం వల్ల మా అమ్మానాన్నా కూడా ఎలాగైనా ఆ రూమ్ లోనే అద్దెకుండమనీ, పెద్దవాళ్లకి అవసరమైనప్పుడు కాస్త సహాయంగా వుండమనీ చెప్పడం వల్ల ఆ రూమ్ మా ఆఫీసుకి దూరమైనా అందులోనే జేరిపోయేను.
అందుకనే ఇంత రాత్రిదాకా నాకోసమే కాచుకున్న పిన్నిగారు రమ్మంటుంటే పెద్దవాళ్లకి ఏమి అవసరం వచ్చిందో అనుకుంటూ అటు వెళ్ళేను.
“ఏం లేదు నాయినా, కాస్త కూరుందీ, పట్టికెళ్ళి అన్నంతో తింటావని పిలిచేను.” అన్నారు పిన్నిగారు. నాకు పెద్దవాళ్ళిద్దరూ బాగానే వున్నందుకు కాస్త హాయిగా అనిపించింది. మళ్ళీ అంతలోనే పిన్నిగారు అంతసేపు నాకు కూర ఇవ్వడానికి మెలకువగా కాచుకుని కూర్చున్నందుకు సంతోషంగా కూడా అనిపించింది.
హైదరాబాదులో ఒక ప్రైవేటు ఫాక్టరీలో నేను చేసేది షిఫ్ట్ డ్యూటీ. ఒకసారి రూమ్ వదిలితే ఎనిమిది గంటల డ్యూటీ చేసుకుని, ఆఫీస్ నుంచి ఇంటికి చేరేసరికి మరో గంట పడుతుంది. అందులోనూ ఇవాళ బస్సులు దొరకడం ఆలస్యమయి మరింత లేటయింది. బైట ఏమైనా తినేసి వద్దామనుకున్న నాకు నేను వచ్చే దారిలో తినడానికి ఏమీ కనపడలేదు. అందుకే పిన్నిగారు కూర ఇస్తాననగానే “ఇవ్వండి పిన్నిగారూ” అనేసేను సంబరంగా. పొద్దున్న వండిన అన్నం కాస్తుంది, ఈ కూర, పెరుగు వేసుకుని తినేస్తే ఈ పూటకి సరిపోతుంది అనుకుంటూ.
పిన్నిగారు వెంటనే పక్కనే స్టూల్ మీద పెట్టిన ఒక స్టీలు కటోరీలాంటిది నా చేతిలో పెడుతూ, “ఇవాళ బెండకాయ కూర బాగా కుదిరింది. నువ్వు కూడా రుచి చూస్తావని అట్టిపెట్టేను.” అన్నారు.
నేను ఎంతొ సంబరపడిపోతూ ఆ కటోరీ పుచ్చుకుని, పిన్నిగారికి థాంక్స్ చెప్పి రూమ్ లోకి వచ్చేను.
అసలే ఆకలి దంచేస్తోంది. గబగబా కాళ్ళూచేతులూ కడుక్కుని, పొద్దుటి అన్నం ఇంక వేడి చేసుకునే ఓపిక కూడా లేక కంచంలో వడ్డించుకుని, పిన్నిగారిచ్చిన కటోరీలోని కూరని కంచంలోకి వంచుకున్న నేను ఆ కూరని చూసి తెల్లబోయేను.
బెండకాయకూర అన్న పిన్నిగారి మాటలు తల్చుకుంటూ, ఆ కూరని వేళ్ళతో విడదీసిన నాకు అందులో పోపులో వేగిన ఓ పది మినపగింజలూ, ఆరు సెనగపప్పు పలుకులూ, రెండు ఎండు మిరపముక్కలూ, ఓ పది మెంతిగింజలూ, కాసిన్ని జీలకర్రపాయలూ, ఓ పదిహేను కరివేపాకు ఆకులూ, బాగా వెతికితే వాటిలో కల్సిపోయి ఓ నాలుగు మాడిపోయిన బెండకాయముక్కలూ కనిపించేయి.
ఇది బెండకాయకూరా లేక కూరలో అడుగున మిగిలిన పోపుగింజలా అనుకుంటూ కంచంలో పెట్టుకున్న అన్నంలో ఆ పూటకి ఊరగాయ కలుపుకుని, పెరుగుతో భోజనం ముగించేను.
అమ్మానాన్నల మాట కాదనలేక ఆ రూమ్‌లో అద్దెకి చేరేనన్న మాటే కానీ ఎంత ఆలోచించినా నాకు ఈ పిన్నీ, బాబాయిల ధోరణేవీ అర్థం కాలేదు. బాబాయిగారికి డెభ్భైయేళ్ళు దాటుంటాయి. పిన్నిగారు కూడా డెభ్భైల్లోకి అడుగు పెట్టబోతున్నారేమో కూడానూ. ఆయనేదో గవర్నమెంటుద్యోగమే చేసేరు కనక నెలనెలా పింఛను వస్తుంది. స్వంతిల్లు. పిల్లలు లేకపోయినా, మూడుపూట్లా కావల్సినవి వండుకు తింటూ, ఏ చీకూచింతా లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్నారు.
పిన్నిగారికి పాపం చెవుడు. బాబాయిగారు ముందుగదిలో పడక్కుర్చీలోంచి లేవకుండా ఏ మాటైనా అక్కణ్ణించే వంటింట్లో ఆవిడకి వినపడేలా గట్టిగా చెపుతుండేవారు. ఎంత వద్దనుకున్నా ఆ మాటలు నా చెవిలో పడుతూనే వుండేవి.
“నేను టీ పెట్టమంటే కాఫీ తెచ్చేవేవిటే చెవిటిమొహవా! ఈ కాఫీ పట్టుకుపోయి టీ చేసి పట్రా..”
పాపం ఆ పెద్దావిడ ఆ కాఫీగ్లాసు పట్టుకుపోయి, మళ్ళీ టీ చేసి తీసుకొచ్చేదాయనకి.
బాబాయిగారు భోజనప్రియులు. వయసు మీద పడినా ఆయన నాలుక రుచులకి మటుకు ఎక్కడా తగ్గలేదు. భోజనంలో రోజూ పప్పూ, కూరా, పులుసుతోపాటు రోటి పచ్చడి కూడా వుండాల్సిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం ఏదో టిఫిను వుండాల్సిందే. మళ్ళీ దానికి ఎన్నెన్ని వంకలో!
“బజ్జీలు చెయ్యమంటే పకోడీలు వేసేవేంటే! వినపడకపోతే ఇంకోసారి అడగొచ్చుగా. ఫో.. ఇవి పట్టుకుపోయి అరటికాయి బజ్జీలు వేసి తీసుకురా.”
పాపం పిన్నిగారు విసుక్కుంటూ, గొణుక్కుంటూ బజ్జీలు వేసి తీసుకొచ్చేదాకా అలా సాధిస్తూనే వుండేవారు.
“చింతకాయ లొచ్చేయి, పచ్చడి పెడతావేంటే!.
పండుమిరపకాయలు కనపడ్డాయే బజార్లో, తెస్తాను కొరివికారం చెయ్యి.
ఉసిరికాయల సీజన్ వచ్చిందే. ఓ రెండుకిలోలు తెస్తాను. కాస్త తొక్కి ఉప్పూ, పసుపూ వేసి పెట్టు. కావల్సినప్పుడు కొత్తిమీర వేసి నూరుకోవచ్చు.”
అంటూ ఆయన ఇలా ఏ సీజన్‌లో దొరికేవాటి రుచి ఆ సీజన్‌లో చూసి తీరాల్సిందే.
ఇంక ఊరగాయల సీజన్ వచ్చిందంటే వాళ్ళింట్లో ఓ పండగ వాతావరణమే వచ్చేసేది. మావిడికాయ రావడం మొదలు, అవి ఎప్పటికి టెంక కడతాయో చూసేదాకా బాబాయిగారు మార్కెట్‌కి వెళ్ళొస్తూనే వుండేవారు. దానికి కావల్సిన వరంగల్ మిరపకాయ, మాడుగుల ఆవాలు, నూపప్పు నూనె, అన్నీ శ్రేష్ఠమైనవి తెచ్చేవారు. అలా బజారు వెడుతున్నప్పుడల్లా పెద్దాయన నన్ను సాయంగా తీసికెడుతుండేవారు.
ఇన్నీ తెచ్చి ఇంట్లో పడేసి ఆవిడ చేసినవి తినొచ్చు కదా.. హబ్బే ఎప్పుడు చూసినా ఆ ముందుగదిలో పడక్కుర్చీలోంచి కదలకుండా “చెవిటమొహవా! నేను ఉప్మా చెయ్యమంటే నువ్వు అట్లేసు కొచ్చేవేంటే! వెళ్ళు వెళ్ళి దీన్ని పొయిలో పడేసి ఉప్మా చేసి తీసుకురా..” అంటూ, ఆవిడ చేసి తెచ్చింది తినకుండా పట్టుకుపోయి మళ్ళీ ఇంకోటి చేసుకు రమ్మనడం ఎందుకో నాకు నచ్చేది కాదు.
పాపం, పిన్నిగారు కూడా పెద్దావిడై పోయేరు కదా! విసుక్కుంటూ, గొణుక్కుంటూ, బాబాయిగారిని తిట్టుకుంటూ అన్నిసార్లు ముందు గదిలోంచి వంటింట్లోకీ, అక్కణ్ణించి ఆయన చెప్పినవి చేసుకుని మళ్ళీ ముందుగదిలోకీ కాళ్ళు నెప్పులు పెడుతున్నా అలా తిరుగుతూనే వుండేవారు. నాకైతే బాబయ్యగారిని చూస్తే పీకలదాకా కోపం వచ్చేసేది. అలా చేసిపెడుతున్నకొద్దీ ఇలా ఈయన పురమాయింపులు కూడా ఎక్కువై పోతుండేవి. గట్టిగా ఏవైనా అనాలంటే పెద్దవారనే గౌరవం నన్ను మాట్లాడనిచ్చేది కాదు.
ఆ రోజు కూడా బాబాయిగారు బజారు వెడుతూ నన్ను సాయంగా రమ్మన్నారు. ఎప్పట్లాగే పక్కనే నడుస్తున్నాను.
“ఈ సీజన్‌లో వాక్కాయలు బాగుంటాయోయ్. ఓ కిలో కొనుక్కుపోతే పప్పులోకీ, పచ్చట్లోకీ కూడా బ్రహ్మాండంగా వుంటాయి.”
బాబాయిగారు వాక్కాయలనగానే నాకు ఒక్కసారిగా పిన్నిగారు గుర్తు కొచ్చేరు. పాపం, నడుం వంగిపోయిన ఆ పెద్దావిడ, ఈ వాక్కాయల్లో గింజలు తియ్యడానికి పడే శ్రమ తల్చుకుంటే నాకు కడుపులోంచి బాధొచ్చేసింది.
“పిన్నిగారు చెయ్యలేరేమోనండీ.” అన్నాను నెమ్మదిగానే బాబాయిగారితో.
“బ్రహ్మాండంగా చేస్తుందోయ్.” అంటూ ఆ బండి వైపు నడవబోతున్న బాబాయిగారిని ఎలాగైనా ఆ వాక్కాయలు కొనడం ఆపించాలనుకున్నాను.
“అది కాదు బాబాయిగారూ. మీరూ పెద్దవారైపోయేరు కదా.. ఈ పచ్చళ్ళూ అవీ ఎక్కువగా తింటూంటే బీపీ వచ్చే అవకాశం వుంది. ఈ వయసులో ఉప్పూ కారాలు తగ్గించుకుంటే మంచిదండీ.”
నా మాటలకి భళ్ళున నవ్వేసేరు బాబాయిగారు.
“నాది రాయిలాంటి శరీరవోయ్. నాకలాంటివేవీ రావు. ఆ భయమేవీ లేదు. పద పద. ఆ వాక్కాయలు ఎలా ఇస్తున్నాడో చూద్దాం.”
మరింక ఊరుకోలేకపోయేను.
“అదికాదు బాబాయిగారూ. ఇలా మీరు బజార్లో కనపడ్దవన్నీకొని తెచ్చి వండమంటే, పాపం పిన్నిగారు ఎలా చెయ్యగలరండీ. ‘ఇది వండూ, అది వద్దూ’ అంటూ మీరు ఆవిణ్ణి అన్ని మాటలంటుంటే వినేవాళ్ల దృష్టిలో మీరెంత చులకనైపోతారండీ. ఆవిడ కూడా పెద్దవారైపోయేరు. ఆవిడ గురించి కూడా కాస్త ఆలోచించాలి కదండీ.”
కాస్త ధైర్యం కూడదీసుకుని నెమ్మదిగా అన్నాను.
బాబాయిగారు ఒక్కసారిగా అక్కడే నిలబడిపోయేరు. సూటిగా నా మూహంలోకి చూసేరు. పెద్దాయనని ఏమైనా అనకూడని మాట అన్నానేమోనని కాస్త తల దించుకున్నాను.
బాబాయిగారు నెమ్మదిగా నా చెయ్యి పట్టుకుని పక్కనే వున్న గట్టు వైపు నడిపించేరు. అక్కడ కూర్చుని నెమ్మదిగా చెప్పడం మొదలెట్టేరు.
“చూడు రవీ, మా పెళ్ళయి ఇప్పటికి యాభైయేళ్ళు దాటేయి. మీ పిన్ని గురించి నాకన్న ఎక్కువ ఎవరికీ తెలిసుండదు కదా! అందుకే ఇవాళ నేను మీ పిన్ని గురించి నేను నీకో విషయం చెపుతాను. నీ మనసులో వుంచుకుంటావు కదూ!”
నేను ఉత్సుకతతో కాస్త ముందుకు వంగేను.
“మీ కందరికీ పైకి కనిపించేది ఆవిడ చెవిటి మనిషని మాత్రమే. కానీ ఆవిడ అసలు స్వభావం నాకు తెలుసు. ఆవిడ వట్టి పొదుపరే కాదు. మహా పిసినారి. డబ్బు ఖర్చు పెట్టడంలోనే కాదు, ఏదైనా వస్తువును వాడడంలో కూడా ఆవిడది అదే స్వభావం. ఎంగిలిచేత్తో కాకికి విదల్చక పోవడవే కాదు, డబ్బులు ఖర్చైపోతాయని తన కడుపుకి కూడా తినదు. వంట చేసిందంటే అనవసరంగా ఎందుకనుకుంటూ నాకు ఒక్కడికీ సరిపడ కూర మాత్రమే వండుతుంది. తనకి కాఫీ ఇష్టం. కానీ కాఫీపొడీ, పాలూ ఖర్చైపోతాయని కలుపుకోదు. అందుకని ముందు కాఫీ కావాలని అడుగుతాను. తీరా కాఫీ తెచ్చేక, తను చెవిటి మనిషని గుర్తు చేస్తూ, టీ తెమ్మని కాఫీ పట్టుకు పొమ్మంటాను. ఆ కాఫీని పారబొయ్యడం ఇష్టం లేక అప్పుడు తను కాఫీ తాగుతుంది. మీ పిన్నికి పకోడీ లంటే ఇష్టం. కానీ వృథా ఖర్చని ఎప్పుడూ చేసుకోదు. అందుకని నాకు కావాలని చెయ్యమంటాను. అదే పకోడీలే అడిగాననుకో.. సరిగ్గా నాకు సరిపడ మాత్రవే చేస్తుంది. అందుకని, అవి తినకుండా వద్దని మళ్ళీ బజ్జీలు చేసుకు రమ్మంటాను. అప్పుడు ఆ నాలుగు పకోడీలు పడెయ్యలేక తను నోట్లో వేసుకుంటుంది.
ఇప్పుడు కూడా ఈ ఊరగాయలన్నీ నాకోసవనుకున్నావా! నాకు అన్నంలోకి కూరా, పులుసూ చాలు. కానీ మీ పిన్నికి అన్నంలో పచ్చళ్ళు కలుపుకోవడం ఇష్టం. అందుకని నాకోసవని చెప్పి ఇవన్నీ చేయిస్తున్నాను. చిన్నపిల్లలకి నయాన్నో భయాన్నో తల్లి అన్నం తినిపించినట్టు మీ పిన్నిచేత ఈ విధంగా నేను ఆవిడ కిష్టమైనవి తినేలా చేస్తున్నాను. అందరూ నన్ను చెడ్డవాడనుకున్నా పరవాలేదు, మీ పిన్ని తనకి కావల్సినవి తింటే చాలు.”
గద్గదమౌతున్న బాబాయి గొంతుతో పాటు, ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదిలింది.
నేను స్తబ్ధుణ్ణయేను.
ఆ సంఘటన జరిగి ఇప్పటికి పదేళ్ళైంది.
ఇప్పటికీ నేను ఆ ఇంట్లోనే వుంటున్నాను. ఎటొచ్చీ ఇదివరకు ఒక రూమ్ లో వుండేవాణ్ణి. ఇప్పుడు ఆ ఒక్క రూమ్ లోనూ పిన్నిగారు వుంటున్నారు. వాళ్ళుండే పెద్దవాటాలో నేనుంటున్నాను, నా భార్యా పిల్లలతో. ఇప్పుడు నాకు పిన్నిగారితో కలిసి ముగ్గురు పిల్లలు.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
