Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆర్టిస్టు గోపి – అందమైన బొమ్మలు

‘ఆర్టిస్ట్ గోపి’ మరణ వార్త, రోజూ మరణ వార్తలు వింటూ, మరణ వార్తలకు నిర్లిప్తం అయిపోయిన కాలంలో కూడా బాధ కలిగించింది. ఆర్టిస్ట్ గోపితో ఉన్న అనుబంధం మనసులో మెదిలింది. ఆయన నా కథలకు వేసిన అందమయిన బొమ్మలు మదిలో మెదిలాయి.

ఆర్టిస్టు గోపిని నేను కలసింది రెండు మూడు మార్లే. కానీ మా స్నేహం దాదాపుగా 28 ఏళ్లది. ‘ఆంధ్రప్రభ’లో ‘కథా ప్రభ’ శీర్షికన నేను రాసిన కథ ‘ఇతితే జ్ఞానమాఖ్యాతం’ ప్రచురితమయింది 1993లో. ఆ కథకు బొమ్మ వేసింది ఆర్టిస్ట్ గోపీ. ‘బొమ్మ బాగానే ఉంది కానీ నాకు నచ్చలేదు’ నిర్మొహమాటంగా అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ వాకాటి పాండురంగారావు గారితో అన్నాను. నా కథను అభినందిస్తూ వచ్చిన ఉత్తరాల కట్టను అందజేసేందుకు ఆయన పిలిచినపుడు, అన్ని అభినందన ఉత్తరాలు చూసి సంతోషిస్తూనే బొమ్మ పట్ల అసంతృప్తిని వ్యక్తపరచాను. అది ప్రచురితమయిన నా మూడవ కథనో నాలుగో కథనో. వాకాటిగారు ‘ఇలాంటి మంచి కథలు ఇంకా రాయండి’ అని సున్నితంగా మాట తప్పించారు. నా విమర్శను వదిలేశారు.

అయితే నా కథలకు పత్రికలలో వేసిన బొమ్మలేవీ నాకు నచ్చలేదు. 1996లో రచనలో ప్రచురితమైన నా తొలి కథ, చివరి కథ ‘సాలీడు గూడులో’కు బొమ్మ వేసిన ఆర్టిస్ట్ చంద్రను విమర్శిస్తూ నేను రాసిన ఉత్తరం విశాఖపట్నం సాహిత్య సర్కిల్స్‌లో సంచలనం రేపిందని నాకు తరువాత తెలిసింది. అపుడు నేను నాంపల్లి రైల్వేస్టేషన్లో ఎంక్వయిరీ కౌంటర్లో పని చేస్తూండేవాడిని. గోదావరి ఎక్స్‌ప్రెస్ దిగిన కథా రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు నన్ను వెతుక్కుంటూ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని నేను రాసిన ఉత్తరం గురించి చర్చించటం ఒక చక్కటి అనుభవం. ‘ఉత్తరం గురించి కాదు, కథ గురించి చర్చించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని’ అని నా స్వభావాన్ని అనుసరించి పుల్ల విరుపు మాట అన్నదీ నాకు గుర్తుంది. సహృదయులైన సీతారామారావుగారు ఆమాట అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు గుర్తుండీ ఉండదు ఆయనకు. అన్న వారు మరచిపోతారంటారు. నా విషయంలో నేను అన్యాయంగా అన్న మాటలన్నీ నన్ను అప్పుడప్పుడు ముల్లుల్లా పొడుస్తూంటాయి.

1996 నడుమ ప్రాంతంలో నేను జాగృతి వార పత్రికలో ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’ రాయటం ఆరంభించాను. మొదటి కథ ‘కాశ్మీరాః పార్వతి’ కథకు బొమ్మ చూసి ముగ్ధుడనయ్యాను. మొట్ట మొదటిసారిగా నా కథకు వేసిన బొమ్మ నాకు నచ్చింది. నాకథ ఆత్మను పట్టుకుని వేసిన బొమ్మ అనిపించింది. బొమ్మ వేసింది ‘ఆర్టిస్టు గోపి!’

తరువాత, రెండు మూడు కథలకు వేసిన బొమ్మలు నాకు ఉత్సాహాన్ని కలిగించాయి. అప్పటి జాగృతి ఎడిటర్ వడ్లమూడి రామ్మోహనరావుగారికి ఈ విషయం చెప్పాను. ఆయన ‘గోపి’ ఫోను నెంబరు ఇచ్చి ‘నీ కథను చదివి పాఠకులు మెచ్చుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, కథకు తాను వేసిన బొమ్మ కథకుడే మెచ్చుకుంటే ఆర్టిస్టుకు అంత కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది’ అన్నారు. అయితే, మనుషులను కలవాలన్నా మాట్లాడాలన్నా నాకు స్వతహాగా ఉన్న వైముఖ్యం వల్ల నేను ‘గోపీ’కి ఫోను చెయ్యలేదు. కానీ, ఆయన వేస్తున్న బొమ్మల్ని గమనించి, కథలో బొమ్మలు వేసేందుకు వీలుగా కొన్ని సంఘటనలను కల్పిస్తూ, ఆయన ఏ సంఘటనను ‘పికప్’ చేస్తుంటారో గమనించేవాడిని. ఒకోసారి కావాలని కథ బొమ్మ వేసేందుకు వీలు లేకుండా రాసేవాడిని. కానీ బొమ్మ వేసేందుకు ఆధారాలు సూచ్యప్రాయంగా వదిలే వాడిని. గోపీ సరిగ్గా నేను అనుకున్నదాన్నే, అనుకున్న రీతిలో బొమ్మ వేసేవాడు. మా ఇద్దరి మధ్య అదొక ద్వంద్వయుద్ధం(Duel) లా అయింది. అయినా మేము కలవలేదు. తరువాత రామమోహన రావు గారు చెప్పారు, గోపీ కూడా కథ చదివి ఏ బొమ్మ వేస్తే బాగుంతుందో ఆలోచించి బొమ్మవేసేవాడని, ఈ కథలకు బొమ్మలువేయటం ఎంజాయ్ చేశాడని.

2004లో తెలుగులో కథా రచయితలు సహకార పద్ధతిలో వేసి తొలి కథల సంకలనం 4×5 (నలుగురు రచయితలవి చెరో అయిదు కథలు) సభ చేస్తున్నపుడు ఒక వక్తగా ‘గోపి’ గారిని పిలవాలనుకున్నాను. వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ సహాయంతో ‘గోపీ’ గారిని తొలిసారి కలిశాను. ‘రాజతరంగిణి కథలు’ అనగానే గుర్తు పట్టారు. ‘గొప్ప కథలు’ అన్నారు. ‘ఇంకో భాగం రాస్తే దానికీ బొమ్మలు వేస్తా’ అన్నారు. కానీ సభలో మాట్లాడటానికి ఇష్టపడలేదు. చిరునవ్వుతో తిరస్కరించారు. తరువాత అయిష్టంగా ‘చంద్ర’ గారిని అడగటం, ఆయన ఒప్పుకుని సభకు వచ్చి ‘ఈయన కథలు రాయాలో వద్దో నేను చెప్తా’ననటం, ప్రతిగా ‘ఒకరు చేప్తే రాసి, వద్దంటే మానేసేందుకు నేను మామూలు రచయితను కాదు, బ్రహ్మ కన్నా గొప్పవాడిని’ అని నా కథ (మట్టిగుట్ట-మేరు శిఖరం) లోంచే కొన్ని వాక్యాలు చదివి వినిపించటం, మా వాదన హద్దు దాటకుండా కేబీ లక్ష్మి, సుధామ గార్లు అడ్డుపడటం ఓ చేదు అనుభవం. ఆ తరువాత ఎన్నిమార్లు చంద్ర సహృదయంతో తన వైపు నుంచి స్నేహ హస్తం సాచినా నేను పదడుగులు వెనక్కే వేశాను తప్ప ఒక్క అడుగుకూడా ముందుకువేయలేదు. ఇప్పటికీ ‘చంద్ర’ అంటే ‘ఆ చేదు’ అనుభవం గుర్తుకు వస్తూనే ఉంటుంది.

రాజతరంగిణి కథలను ‘ఎమెస్కో’ వారు పుస్తకరూపంలో వేస్తున్నపుడు ‘గోపి’ బొమ్మలు ఉండాలని పట్టుబట్టాను. ఎమెస్కో విజయకుమార్ గారు సహృదయంతో అంగీకరించారు. జాగృతి లో సీరియల్‌గా వస్తున్నప్పుడు వేసిన బొమ్మలనే పుస్తకంలోనూ అచ్చువేశారు. ఇప్పటి నాలుగో ఎడిషన్లో కూడా గోపీ బొమ్మలు నా కథల సారాన్ని ప్రదర్శిస్తూ సగర్వంగా ఆ పుస్తకం విలువను పెంచుతూనే ఉన్నాయి.

నేను ‘అసిధార’ పుస్తకం ప్రచురిస్తున్నపుడు ముఖచిత్రం ‘గోపీ’తో వేయించాలని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పటికే ఆయన బొమ్మలు వేయటం లేదు. ఆర్ధిక ఇబ్బందులలో వున్నానన్నారు. గోపి బొమ్మ వేయకపోతే ఇంకెవరికీ నా పుస్తకాలకు బొమ్మ వేసే అర్హత లేదన్నది అప్పుడూ, ఇప్పుడూ నా అభిప్రాయం. నేను నా పుస్తకానికి ఇంటెర్నెట్ నుంచి వెతికిన బొమ్మను ‘కవరు’గా ఉంచాను. ఇప్పటికీ ఒక్క ‘కులం కథ’ (కోడీహళ్లి మూరళీమోహన్ ప్రోద్బలంతో బొమ్మ వేయించాము) తప్ప మిగతా ఏ పుస్తకానికీ ఏ ఆర్టిస్టుతో బొమ్మ వేయించలేదు. వేయించను కూడా. ఎందుకంటే, నా కథలకు నాకు సంతృప్తి కలిగించే రీతిలో బొమ్మ వేయగలిగిన ఏకైక కళాకారుడు గోపి. బొమ్మ కోసం అతడిని ఛాలెంజ్ చేసే రీతిలో కథ రాయటం వల్ల నా ‘రచన’ కూడా లాభపడింది. ఒక ఆర్టిస్టు సృజనాత్మకత మరో కళాకారుడి కళలోని ఉత్తమత్వాన్ని ఉత్తేజితం చేయటమన్నదాన్ని మేమిద్దరం పరస్పరం అనుభవించాం.

 ‘అసిధార’ ముఖ చిత్రం కోసం కలిసిందే మేము చివరిసారి కలవటం. తరువాత కలవలేదు. పలకరించలేదు. ఒకసారి ఆంధ్రప్రభ ఆఫీసులో కలిశాము. ఆయన బిజీగా వున్నారు. నేను బిజీగా పరుగుపెడుతున్నాను. పలకరింపుగా నవ్వుకున్నాం. ఆయనదారిలో ఆయన వెళ్ళిపోయారు, నా దారిలోనేను. ‘సోషల్ ఐసోలేషన్’ స్వభావంగా కల నేను, ‘ఒంటరితనం కళాకారుడి స్వభావం’ అని నమ్మిన గోపి, ‘కళ’ ద్వారానే మా అనుబంధాన్ని సజీవంగా నిలుపుకున్నాం. ‘కామన్ ఫ్రెండ్స్’ని కలసినపుడు ఆయన నా గురించి అడిగే వాడట. కథలకు బొమ్మల ప్రసక్తి రాగానే నేను ‘గోపీ’ని తప్ప మరొకరిని చిత్రకారుడిగా ఒప్పుకోకపోవటం మా అనుబంధానికి నిదర్శనం. ‘సంచిక’ ఆరంభించే సమయంలో ‘గోపీ’ గారిని కథలకు బొమ్మలు వేయమని అడగాలనుకున్నాను. కానీ ఆయన బొమ్మలు వేయటం మానుకోవటం వల్ల, నేను డబ్బులిచ్చే స్టేజిలో లేనందువల్ల నెట్ బొమ్మల పైనే ఆధారపడాల్సి వచ్చింది. నా కథకు సరైన బొమ్మలు వేయలేదని కొట్లాడే స్థితి నుంచి నెట్ బొమ్మలతో సంతృప్తి పడే స్థితికి రావటం కాలం నేర్పిన అతి చక్కని గుణపాఠం. ఇది రాజతరంగిణి కథలకు ‘గోపి’ బొమ్మలు చూసినప్పుడల్లా మరింతగా అర్థమవుతుంది. గోపి మరణవార్త బాధ కలిగించినా రాజతరంగిణి కథలకు బొమ్మలద్వారా నా హృదయంలో ఆయన సజీవంగా వున్నారు. వుంటారు కూడా.

Exit mobile version