12 జనవరి, 1971న స్టార్ అండ్ స్టైల్ మాగజిన్ ఓ వ్యాసం ప్రచురించించి. బల్‌రాజ్ సహ్ని తన ఇరవై సంవత్సరాల సినీ జీవితం గురించి రాసుకున్న వ్యాసం అది. ఆంగ్లంలో రాసిన ఆ వ్యాసం పేరు TWENTY YEARS WASTED? – BALRAJ SAHNI. ఆ వ్యాసం చదువుతుంటే ఆయన మనసు, నిజాయితీ అర్థం అవుతాయి. అంత నిజాయితీతో తమ కథ తాము చెప్పుకునే వ్యక్తులు ఏ రంగంలోనయినా చాలా తక్కువ ఉంటారు.
“నేను ప్రేమించింది స్టేజిని. స్టేజిని వదిలి నేను తప్పు చేశాను. నా జీవితంలోని మధుర స్మృతులు నేను స్టేజి మీద గడిపినవే” అని ఆయన చెప్పుకొస్తారు. “ఆర్థిక భద్రత (Financial Security) కోసం నేను భావోద్వేగ భద్రత (Emotional security) ని వదులుకున్నాను. ఈ రోజు కూడా రిహార్సల్ చేస్తున్న చిన్న పిల్లల్ని చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఈ ఔత్సాహిక నటులలో వృత్తి పట్ల గొప్ప చిత్తశుద్ధి, సరళత, సాధారణత ఉంటుంది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. సినిమా స్టార్లల్లో అది కనిపించదు. నేను స్టేజినే నమ్ముకుని ఉండి ఉంటే ఆ రంగానికి నా వంతుగా ఏదో చేసే వాడినేమో.
సినిమా రంగానికి వచ్చి వెనుక తిరిగి చూసుకుంటే నేను చేసిన అన్ని పాత్రలు అప్పటికన్నా ఇప్పుడే బాగా చేయగలను అనిపిస్తుంది. ఈ కళను ఒంట పట్టించుకుని చూస్తే నాకు దొరుకుతున్నవి ప్రాముఖ్యత లేని హీరో లేదా హీరోయిన్ తండ్రి పాత్రలు. విదేశాలలో ఈ వయసులోనే గొప్ప పాత్రలు వస్తాయి. నటులలో పరిపక్వత వస్తుందని యాభై దాటిన వారిని గౌరవించి మంచి పాత్రలు ఇస్తారు. కాని మన దేశంలో మన సినిమాలలో ఈ వయసుకు నట జీవితం ముగుస్తుంది.
నాకు రచన అంటే చాలా ఇష్టం. గురు దత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘బాజీ’కి రచన చేసింది నేనే. రచయితగా నన్ను నేను తీర్చిదిద్దుకొని ఉంటే ఇప్పటి కన్నా ఎంతో తృప్తిగా ఉండేవాడిని. ఆర్థికంగా వెనుకబడినా ఈ వయసుకు వచ్చేసరికి అది నా బలం అయి ఉండేది. కాని ‘హమ్ లోగ్’ సినిమా తరువాత వరుసగా వచ్చిన అవకాశాలు నన్ను సినిమా రంగం వైపుకు లాగాయి.
అయినా నేను నా పరిధిలో కొంత సినీ రంగానికి, రచనా రంగానికి, సామాజిక రంగానికి ఏదో చేసాననే అనుకుంటున్నాను. నా కన్నా ఎంతో విద్వత్తు ఉన్నవారికన్నా నాకు అవకాశాలు బాగానే వచ్చాయని నేను నమ్ముతున్నాను. జీవితం యాభై తరువాత ఆగిపోదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జీవితాన్ని మొదలెట్టవచ్చు. నేను నా వంతు చేసాను. చేస్తాను..”
సినీ రంగంలో తన ఇరవై సంవత్సరాల అనుభవంలోనించి జనించిన అసంతృప్తి, ఆనందాలను ఆయన ఇలా పంచుకుంటూ తన ఇష్టాలను మనకు తెలియ జేశారు. అసలు నటుడిని స్టేజ్‌పై దొరికే తృప్తి కెమెరా ముందు రాదు అన్నది బల్‌రాజ్ సహ్ని చాలా సార్లు చెప్పిన మాట. అపురూపమైన జీవనం స్టేజిపై అనుభవిస్తాడు నటుడు అన్నది ఆయన అభిప్రాయం. హిందీ సినిమాలలో రొటీన్ పాత్రలు, ఫార్ములా సినిమాల పట్ల వారికి ఎప్పుడూ అసంతృప్తే ఉండేది. ఆ వాతావరణంలో కూడా తనకు నచ్చిన పాత్రలని అయన ఎన్నుకుని చేసి మెప్పించారు. స్టార్ హీరోల మధ్య ఆయనకు అతి తక్కువ మంది గుర్తించేవారు కాని, గుర్తించినవారు వారి వ్యక్తిత్వానికి, పాత్రలకు వారు ప్రాణం పోసే విధానానికి అచ్చెరువు చెందుతారు.
తనకు నటన నేర్పించమని ఆయన కొడుకు పరిక్షిత్ సహ్నీ అడిగితే, “నీవు మంచి వ్యక్తివి కానంత వరకు మంచి నటుడివి కాలేవు. వ్యక్తిత్వం నటుడికి చాలా అవసరం” అన్నారట. ప్రతి కళ కూడా ఆ కళాకారుడిని కూడా ఉన్నతమైన మానసిక ఎదుగుదలకు ప్రోత్సహించాలి, అప్పుడే ఆయన సరి అయిన పద్ధతిలో సృజన చేస్తున్నట్లు అని చెప్పారట. అందుకే అమితాబ్ బచ్చన్ లాంటి నటులు ‘బల్‌రాజ్ సహ్నిని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఆ పాత్రల కన్నా ఆయన మంచి మనసు నాకు కనిపిస్తూ ఉంటుంది’ అన్నారు.
డిల్లీలో ప్రేమ్ క్రిపాల్ని అనే ఓ పెద్ద మనిషి బల్‌రాజ్‌ని ఓ పార్టీకి పిలిచారట. అక్కడకు వచ్చిన వారందరూ సూట్లతో కళ్ళు చెదిరిపోయే వేషధారణలో ఉన్నారట. కాని బల్‌రాజ్ ఓ మామూలు రైతుగా లుంగీ కుర్తాలో ఆ పార్టీలో అంత మందిలోను ఆత్మవిశ్వాసంతో తిరిగారట. అంతగా శ్రామికుల మనిషిగా మిగిలిపోవాలని కోరుకున్న వ్యక్తి బల్‌రాజ్. అదే పార్టీలో ‘నేను కేవలం విదేశి సినిమాలనే చూస్తాను’ అని గొప్ప ప్రదర్శించబోయిన ఓ హై సొసైటి మహిళను తన ప్రెంచ్ సినిమా జ్ఞానంతో నోరు మూయించారట. ఇలాంటి వ్యక్తి సినీ రంగు తళుకు బెళుకుల మధ్య తన విశ్వాసాన్ని, ఆదర్శాలను, నమ్మకాలని నిలిపి ఉంచుకోవాడానికి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
1958 నాటికి నర్గిస్ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. నటనపై వారికి కోరిక పోయింది. మోహన్ సెగల్ బల్‌రాజ్ గారి మిత్రుడు. బల్‌రాజ్ సహ్ని మొదటి రచన ‘జాదూ కీ కుర్సీ’ని రెండు రోజుల్లో దర్శకత్వం వహించి స్టేజి కోసం తయారు చేసారు ఆయన. కొన్ని ప్రదర్శనల తరువాత ఇది బాన్ అయిందట. అయితే నాటకాల రోజుల నుండి బల్‌రాజ్ సహ్నికి ఓ మిత్ర బృందం ఉండేది. మోహన్ సెహగల్ ఆ బృందంలో ఓ మిత్రుడు. ఆయనే ‘లాజ్వంతి’ సినిమాను నిర్మించారు.
నర్గిస్ దత్ ఈ సినిమాలో ప్రధాన పాత పోషించడానికి ఒప్పుకున్నారు.
సినిమా కథకు వస్తే నిర్మల్ కుమార్ నగరంలో పేరున్న ఓ పెద్ద లాయర్. ఇరవై నాలుగు గంటలూ పని అంటూ ఇంటిని భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. భార్య కవిత అంటే ప్రేమ ఉన్నా ఆమెకు కొంత సమయం ఇవ్వాలనే ఆలోచన అతనికి రాదు. కవిత నిర్మల్‌తో కొంత సమయం గడపాలని కోరుకుని ప్రతిసారీ భంగపడుతూ ఉంటుంది. వీరిద్దరి కాలేజ్ స్నేహితుడు సునీల్. ఇతనో చిత్రకారుడు. ఏవో దేశాలు తిరుగుతూ ఉంటాడు. సునీల్ చాలా రోజుల తరువాత ఇండియా వస్తాడు. అతనితో గడపడానికి నిర్మల్‌కు సమయం లేదు. కవిత సునీల్‌కు ఊరు చూపిస్తుంది. ఇంతకు ముందు నిర్మల్ పెయింటింగ్‌ను సునీల్ వేసి బహుకరిస్తాడు. ఆ చిత్రం పక్కన కవిత చిత్రం కూడా ఉండాలని తన కోరిక అని నిర్మల్ చెబుతాడు. తన భర్త పుట్టిన రోజుకు అతనికి తన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరచాలని కవిత అనుకుంటుంది. అందుకని భర్తకు తెలియకుండా సునీల్ గదికి ప్రతి రోజు వెళుతుంది.
సునీల్, కవితలను చాలా చోట్ల చూసిన జనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కవిత వదిన కూడా ఆ ఇద్దరిని రెండు మూడు సందర్భాలలో కలిసి చూస్తుంది. ఆమె తమ్ముడిని మందలిస్తుంది. ముందు ఇవన్నీ నమ్మడు నిర్మల్. ఒక రోజు మధ్యాహ్నం ఇంటికి వస్తాడు. కవిత తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందని చెపుతుంది పని మనిషి. ఆ స్నేహితురాలు ఊరిలోనే లేదని నిర్మల్ తెలుసుకుంటాడు. సునీల్ గదికి వెళతాడు నిర్మల్. కిటికీ నుండి ఇద్దరినీ చూస్తాడు. సునీల్ కవిత ముఖాన్ని తనకు కావల్సిన వైపుకు తిప్పుతూ ఉంటారు. వారిద్దరినీ అలా చూసి నిర్మల్ అనుమానం గట్టిపడుతుంది. ఇంటికి వచ్చిన భార్యను ఎక్కడికి వెళ్లావు అంటే ఆమె అబద్ధం చెబుతుంది. ఇక దానితో కవితకు సునీల్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని నిర్ధారించుకుని ఆలోచించక కవితను ఇంటి నుండి గెంటేస్తాడు నిర్మల్. సంవత్సరం వయసున్న కూతురిని తన దగ్గరే ఉంచేసుకుంటాడు.
కవిత తన అన్నగారింటికి వెళుతుంది. అప్పటిదాకా ఆమె ద్వారా ఎంతో సహాయం పొందిన అందరూ మొహం చాటేస్తారు. వదిన ప్రవర్తన, తనకు సహాయపడాలని ప్రయత్నించే అన్న ఇబ్బంది చూసి కవిత ఆ ఇల్లు వదిలి ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన సునీల్ ద్వారా విషయం తెలుసుకుని నిర్మల్ పశ్చాత్తాపపడతాడు. భార్య కోసం వెతకాలంటే కోపంతో ఆమె ఫోటోలన్నీ చించేయడం వల్ల కవిత ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో ఉండదు. అయినా సునీల్, నిర్మల్ ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తారు. చాలా రోజులు వెతుకుతారు. కవిత ఓ స్కూలులో టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి అక్కడకు వీళ్లు వెళ్ళేసరికి కవిత ఆ స్కూల్ వదిలి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన రైలు ప్రమాదానికి గురి అయిందని తెలిసి కవిత మరణించిందని నిర్ధారణకు వస్తాడు నిర్మల్.
ఇక ఆ ఇంట్లో ఉండలేక నిర్మల్ కూడా కూతురిని తీసుకుని మరో చోటికి వెళ్లిపోతాడు. ప్రాణం అంతా కూతురుపై పెట్టుకుని జీవిస్తుంటాడు. తండ్రీ కూతురి మధ్య చాలా గట్టి అనుబంధం ఏర్పడుతుంది. పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రికి తల్లిగా అన్నీ తానే అయి చూసుకుంటుంది నిర్మల్ కూతురు రేణు.
తల్లి చనిపోయిందనే నమ్ముతుంది రేణు. కాని ప్రమాదం నుండి బైటపడిన కవిత మరో ఊరిలో రేడియో స్టేషన్‌లో పని చేస్తూ ఉంటుంది. ఆ ఊరికి ఈ కేసు కోసం వెళ్లిన నిర్మల్ కవిత గొంతు రేడియోలో విని రేడియో స్టేషన్‌కు వెళతాడు మనసు విరిగి జీవిస్తున్న కవితను క్షమించమని అడుగుతాడు. కవిత ఆ ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉంటుంది. కాని కూతురు పేరు వినగానే ఆమెలో తల్లి మనసు బిడ్డను చేరాలని తపిస్తుంది. కవితను ఇంటికి తీసుకువస్తాడు నిర్మల్. ఆమెను రేణుకి పరిచయం చేస్తాడు. రేణు తన తల్లి మరణించిందని, తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడని నమ్ముతుంది. కవితను తల్లిగా అంగీకరించదు. ఎవరెన్ని చెప్పినా వినదు. బిడ్డను తన దానిగా చేసుకోలేక కవిత ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో ఇంటికి వచ్చిన సునీల్ ఏదో పాత మేగజిన్‌లో కవిత చిన్నప్పటి రేణుతో దిగిన ఫోటోను చూపించినప్పుడు ఆమె తన కన్న తల్లి అని నమ్మి రేణు తల్లిని చేరడం సినిమా ముగింపు.
సినిమా అంతా ఫక్తు ఫార్ములాతోనే నడుస్తుంది. కాని రేణు, కవితల మధ్య నడిచిన సంఘర్షణ హిందీ సినిమాలలో కొత్త పాయింట్. సినిమా అంతా నర్గిస్ చుట్టూ నడిచినా ఆమెకు అప్పుడు సినిమాల పై తగ్గిన శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. నర్గిస్ నటన పెద్దగా ఆకట్టుకోదు. కాని సినిమా మొత్తం నడిపించేది రేణు పాత్రలో నటించిన బేబీ నాజ్, బల్‌రాజ్ సహ్నీలు. బేబీ నాజ్ నటన హేమాహేమీలను మించిపోతుంది. అంత ఈజ్‌తో ఆమె ఆ వయసులో నటించడం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక బల్‌రాజ్ సహ్ని ఏ పాత్రలోనూ నిరాశపరచని నటుడు. ఎంత కన్విన్సింగ్‌గా ఈ పాత్రను నడిపిస్తారంటే భార్యను అతను అనుమానించి ఇంటి నుండి బైటకు నెట్టేయడం కూడా చాలా సహజంగా ఉంటుంది. అంత కోపాన్ని చివర్లో పశ్చాత్తాపాన్ని ఒకే స్థాయిలో చూపిస్తారు ఆయన. అంటే కోపంగా నటించేటప్పుడు ఆయన శరీర భాష, పశ్చత్తాప పడేటప్పుడు ఆ శరీర భాషలో ఒకే స్థాయిని మెయిన్‌టెయిన్ చేస్తారు ఆయన. ఎక్కడా లౌడ్‌నెస్ ఉండదు. ఒక బాలెన్స్ కనిపిస్తుంది. ఓ సీన్‌లో రెచ్చిపోయినట్లు, మరో సీన్‌లో మహాత్ముడి స్థాయిలో ఆయన ప్రవర్తించరు. ఈ బాలెన్స్ బల్‌రాజ్ సహ్ని ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది. కోపంలో హై పిచ్‌లో మాట్లాడే వాళ్లు, అరిచే వాళ్ళు, మిగతా ఎమోషన్లలో కూడా అదే స్థాయి కనపరుస్తారు. ఇది మర్చి ఒకో సీన్‌లో ఒకో విధంగా స్పందించే నటులను భారతీయ సినిమాలో చూపిస్తారు. దాన్నే నాటకీయత అంటారు. కోపం అనేది ఓ ఎమోషన్ అప్పుడు కంట్రోల్ తప్పి విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యే వ్యక్తులు మిగతా ఎమోషన్లలో అంటే ప్రేమ, ఆనందం లాంటి చోట్ల కూడా అదే రకమైన ఉద్వేగ స్థితిని ప్రదర్శిస్తారు. కాని సినిమాలలో ఓ చోట అతి శాంతంగా, ఓ చోట అతి ఎనర్జెటిక్‌గా మరో చోట అతి నెమ్మదిగా ఒకే వ్యక్తిని చూపించడం, మనం దాన్నే నటన అనుకోవడమే కాక నిజ జీవితాలలో అలా ఉండాలని అనుకోవడం చేస్తూ ఉంటాం. అది అసహజం అని అర్థం చేసుకోం.
భార్యను అనుమానించి ప్రశ్నించేటప్పుడు గమనిస్తే, బల్‌రాజ్ కన్నా నర్గిస్ గొంతు పై స్థాయిలో ఉంటుంది. ఆమె చివరి దాకా అదే టెంపో మెయిన్‌టెయిన్ చేస్తుంది. ఆ సీన్‌లో ఆమె నిర్దోషి. తప్పు చేస్తుంది భర్త. కాని ఆయన స్వభావరీత్యా సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి. చాలా గట్టిగా వాదిస్తాడు భార్య తప్పు చేసిందని, కాని గొంతు పెంచడు. తప్పు చేస్తున్నాడు కాని తాను చూసింది నిజం అనే నమ్మకంతో చేస్తున్నాడు. ఇక్కడ అహం కన్నా భార్య తప్పి చేసిందన్న కోపం అతనిలో ఉంటుంది. ఆమెను చెంపదెబ్బ వేస్తాడు. అడ్డు వచ్చిన పని మనిషిని లాగి పడేస్తాడు. కాని ఆ చర్యలలో క్రౌర్యం కన్నా వేగం ఉంటుంది. తొందరపాటు కనిపిస్తూ ఉంటుంది. నర్గిస్‌లో ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం చివరి దాకా ఆమె పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఆమెలో అపరిమితమైన శాంతమూ ఉంటుంది. అదీ ఆవేశం మాటున దాగి ఉంటుంది. చివరి దాకా బల్‌రాజ్ సహ్నిలో అదే తొందరపాటు కనిపిస్తూ ఉంటుంది. భార్యను లాగి గడపవతల పడేసేటప్పుడు కూడా అదే బాలెన్స్ ఆప్ కారెక్టర్ ఆయన ప్రదర్శిస్తారు.
సాధారణంగా నటులు చెడ్డతనాన్ని లౌడ్ గాను మంచితనాన్ని అతి సున్నితంగానూ చూపిస్తారు. కాని ఒకే వ్యక్తి ఏ రకమైన ఉద్వేగాన్నయినా ఒకే రకమైన శరీర భాషతో ప్రదర్శిస్తాడు. అది అతని కేరెక్టర్. ఉద్వేగాన్ని బట్టి కేరెక్టర్ మార్చుకోవడం నిజజీవితంలో జరగదు. ఈ అబ్జర్వేషన్‌తో నటుడు నటించాలంటే ఆ పాత్ర తాను అవాలి. కాని చాలా మంది నటులు ప్రేక్షకుల కోసం నటిస్తూ ఉంటారు. వారి స్పందన వీరిని ఉత్తేజపరుస్తూ లౌడ్ ఫర్మామెన్స్ వైపుకు తీసుకెళుతుంది. కాని అది సహజమైన వ్యక్తీకరణ కాదు అని కేవలం నటన అని నటనను నటనలా కాక సహజంగా ప్రదర్శించడమే నిజమైన నటన అని నమ్మిన వ్యక్తులలో బల్‌రాజ్ సహ్ని ఒకరు.
ఈ వివరణ అర్థం చేసుకోవాలంటే పాశ్చాత్య సినిమాలను చూసే వారు ‘గాడ్ ఫాదర్’ సినిమా మొదటి భాగంలో మార్లన్ బ్రాండో నటనను గమనించండి. అంత పెద్ద మాఫియా కింగ్ లోగొంతుకతో అదే మాడ్యులేషన్‌తో ఆనందాన్ని, కోపాన్ని, లౌక్యాన్ని, ఆక్రోశాన్ని, విషాదాన్ని పలికించిన విధానాన్ని గమనించండి. ఆ మాఫియా కింగ్ నైజాన్ని ఎక్కడా ఏ ఉద్వేగమైన సీన్‌లో కూడా దాటకుండా అద్భుతమైన బాలెన్స్ చూపిస్తారు బ్రాండో. ప్రపంచం మొట్టమొదటి మెథడ్ యాక్టర్‌గా గుర్తించిన బ్రాండో పాటించిన బాలెన్స్‌ను ఆయన కన్నా ముందే చేసి చూపించిన నటులు మన దగ్గర ఉన్నారు. దిలీప్ కుమార్, బల్‌రాజ్ సహ్ని, తరువాత సంజీవ కుమార్ లాంటి నటులు ఆ కోవకు చెందుతారు. భారతీయ సినీ పాత్రల స్థాయి కారణంగా బల్‌రాజ్ సహ్ని లాంటి నటుల కష్టం చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఆయన మన దేశంలో నటుడిగా పుట్టడం ఆయన దురదృష్టం.
తరువాత సునీల్‌తో మాట్లాడుతూ తన తప్పు తెలుసుకున్నప్పుడు కూడా అదే బాలెన్స్ ఈ నటుడిలో చూస్తాం. పోలీస్ స్టేషన్‌లో సునీల్‌ని నిర్మల్ తనతో స్నేహం మానవద్దని కోరుతున్న సీన్, కవితను ఇంటిని రమ్మని బ్రతిమాలే సీన్, కూతురిని కోప్పడి ఆమెని కొట్టే సీన్ అన్నిటిలో ఇకే రకమైన బాలెన్స్ కాని వాచకంలో ఎన్నో భావాలు పలికించడం బల్‌రాజ్ సహ్ని గొప్పతనం.
ఇదే బాలెన్స్ నర్గిస్ కూడా ఒకే టెంపోలో మెయిన్‌టెయిన్ చేసారు కాని, వారి నటనలో ఇతర సినిమాలలో ఉండే లోతు కనిపించదు. ఈ సినిమా పాటలన్నీ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆశా భోంస్లే, అన్ని పాటలు పాడగా మన్నాడే, గీతా దత్‌లు చెరొక పాట పాడారు. ఎస్.డి. బర్మన్ సంగీతం బావుంటుంది. ‘కోయే ఆయా’, ‘గా మేరే మన్ గా’ పాటలు ఈ రోజుకీ తరుచుగా వినిపిస్తూ ఉంటాయి.
నరేంద్ర సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరియర్లో ఈయన కేవలం ఆరు సినిమాలకు దర్శకత్వం చేసారు. ‘లాజ్వంతి’ వీరి రెండవ సినిమా. 1959లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు సెలెక్ట్ అయిన ‘లాజ్వంతి’ – ‘పాల్మ్ డీ ఓర్’ అవార్డుకు ఎంపిక అయింది కూడా. ఈ సినిమా కథతో అక్కినేని నాగేశ్వరరావు అంజలీ దేవి ప్రధాన పాత్రధారులుగా 1969లో ‘ఎంగల్ సెల్వి’ అని తమిళ సినిమా తీసారు. దీన్నే తెలుగులో ‘కన్న కూతురు’ పేరుతో డబ్ చేసారు.