Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరుద్ర సినీ గీత వైభవం!-1

[శ్రీ కుంతి రచించిన ‘ఆరుద్ర సినీ గీత వైభవం!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

ప్రేక్షకుల, శ్రోతల ఆత్మానందం కోసం, సన్నివేశానుగుణంగా రాసేది సినిమా పాట.

అయినా దానికి సాహిత్య సౌరభం, శాశ్వతత్వం కల్పించగలిగే సినీ రచయితల్లో గొప్పగా చెప్పుకోదగిన వారు, ఎంతగానో మెచ్చుకోదగినవారు శ్రీ (భాగవతుల శంకర శాస్త్రి) ఆరుద్ర గారు.

మనసు పాటలకు ఆత్రేయ, వీణ పాటలకు దాశరథి, మనసున మల్లెలు మాలలూగించే పాటలతో దేవులపల్లి, జానపద పాటలకు కొసరాజు, కవితా, భాషా పద ప్రయోగాలకు మల్లాది, అలతి అలతి లలితమైన భావనలతో, రుచికరమైన చక్కెర పొంగలి వంటి పాటలు రాసిన పింగళి, భక్తి రస భద్ర గీతాలకు సముద్రాల ఎలా పేరు పొందారో.. అలాగే అంత్య ప్రాసలతో గీతాలు రాయడంలో అందేవేసిన చేయిగా ఆరుద్రగారు వన్నెకెక్కారు.

బాపూ, రమణల ఆస్థానకవులైన వీరు, వారిచే “సంతకం అక్కరలేని కవి ఆరుద్ర. అంత్య ప్రాసలె ఆయన వాలుముద్ర” ప్రశంసింపబడేవారు.

“మంచి రచన చదివాక బాగా భోంచేసినట్టు ఉండాలి.. కొంచెం బాధపడాలి.. జ్వరం రావాలి..” ఇవి వారి మాటలు.. వారి పాటలు వింటుంటే శ్రోతకు ఈ అనుభవాలు అన్నీ కలుగుతాయి.

లోకం లోని వెలుగూ నీడా లోతులు చెబుతూ రేపటి రూపును లోపలి కళ్ళకు నేడే చూపేవి వీరి సినీ గీతాలు. అలాంటి ఆ గీతాలలో ఈ రుద్రుడు ఎలా చెలరేగిపోయారో చెప్పడమే నా ఈ వ్యాస ఉద్దేశ్యం.

ముందుగా వారి సినీ గీతాలను స్థూలంగా విభజించుకొని ముందుకు వెళదాము.

పదండి అలా వారి సినీ కవనమనే అందాల బృందావనంలో విహరిద్దాం.

కవిత కోసం పుట్టి క్రాంతి కోసం కలం పట్టిన ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించారు.

అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం సాగించారు. తదుపరి కాలేజీ విద్య కోసమై 1942 లో విజయనగరానికి చేరారు. శ్రీ యుతులు రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజులు వంటి రచయితల ప్రభావం చేత కమ్యూనిజం వైపు ఆకర్షితులైనారు. 1943 నుండి 1947 వరకు భారత వైమానిక దళంలో పనిచేసారు. ఆ తర్వాత, మద్రాస్‌కు మకాం మార్చి,’ఆనందవాణి’ అనే పత్రికకు రెండేళ్ళు సంపాదకునిగా పనిచేసారు.

వీరు అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి తెలుగు రచయిత్రి. ఆరుద్ర రచనలు విలక్షణమైనది. వారు సాహిత్యంలో అనేక ప్రక్రియలు చేపట్టారు.

కవిగా రచయితగా

మధ్యతరగతి జీవనం, నగర జీవన చిత్రణమైన సినీవాలి, ప్రతి పదరమణీయాలైన కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, గురజాడ గురు పీఠం, మన వేమన, వేమన వేదం వంటి విమర్శక వ్యాసాలు, గాయాలు గేయాలు, పైలా పచ్చీసు, శుద్ధ మధ్యాక్కరాలు, సాలభంజికలు, రాముడికి సీత ఏమవుతుంది, గుడిలో సెక్స్, చదరంగం.. వంటి రచనలే కాక వెన్నెల వేసవి, దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు, రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించారు.

నాటి తెలంగాణలో రజాకార్ల దుశ్చర్యలకు స్పందించి రాసిన ‘త్వమేవాహం’ (ఈ కావ్యం చదివినాక.. ఇక నేను రాయవలసిన పని లేదు” అని శ్రీశ్రీ గారు అన్నారట).. అన్నిటికీ మించి వారి తెలుగు భాషా సాహిత్యసేవలో మకుటాయమానమైనది 13 సంపుటాల సమగ్ర ఆంధ్రసాహిత్యం.. ఇవీ వారు తెలుగు సాహిత్యం లో మిగిల్చిన ఆణిముత్యాలు.

ఆరుద్ర గారి సినీగీతాలు వారి శ్రీమతి అయిన కె.రామలక్శ్మి నేతృత్వంలో..వలపుల కథకిది తొలి వలపు, మిలమిలాపగటి పూటవెన్నెలా, నవ్వుల నదిలో పువ్వులపడవ, సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా, కురిసే చిరుజల్లులో అన్న 5 సంపుటాలుగా వెలువడ్డాయి.

సినీ గీత/మాటల రచయితగా ప్రస్థానం

1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో.. “ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు” అనే గీతంతో మొదలైన వారి సినీ గీతప్రయాణం ‘వారెక్కాల్సిన సినీ ట్రైన్ జీవిత కాలం లేటు’ కాకుండడంతో నాలుగు వేల పాటలతో వందలాది సినిమాలకు సంభాషణలు రాయడంతో ముగిసింది.

1953లో ప్రముఖ హిందీ నటుడు రాజ్‌క‌పూర్‌ సినిమా ‌’ఆహ్‌’‌కి తెలుగు అను‌వాద చిత్రంగా వచ్చిన ‌’ప్రేమ‌లే‌ఖల‌’కు మాటలు, పాటలు రాసే అవ‌కాశం దొరి‌కింది.‌ ‘రాజాకీ ఆయేగి బారాత్‌ రంగోలి హోగి రాత్‌’’ పాటను ‌’పందిట్లో పెళ్ళవు‌తు‌న్నాది, కను‌వింద‌వు‌తు‌న్నాది’‌గా, ‘యే షామ్‌కి తన్హా‌యియా−‌ ఐసె మై తేరా ‌ఘమ్‌’ పాటను ‘ఏకాంతమూ సాయం‌త్రమూ ఎద నీకై వేగేనూ’ అంటూ అర్థవంతంగా పాటలు రాసి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా ‌’మురి‌పించే మువ్వలు’‌ చిత్రంలో ‘సింగార వేలనే దేవా‌’ పాటను వీరు ‌‘నీ లీల పాడేద దేవా..‌ మనవి ఆలించ వేడెద దేవా’గా రాశారు. దానితో వీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

నాస్తికుడు రాసిన భక్తి గీతాలు

మార్క్సిస్ట్ సిద్దాంతాల ద్వారా ప్రభావితమైన ఆరుద్రగారు అభ్యుదయ కవిగా సుపరిచితులు.

ఆయన రచనలలో సామాజిక అసమానతలు, శ్రామికవర్గ సమస్యలు, విప్లవాత్మక ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. కాని ఆరుద్ర గారి కవితా కలానికి రెండోవైపు భక్తితత్వం కూడా ఉంది.

1972 లో వచ్చిన సంపూర్ణ రామాయణం అనే సినిమాకి ఆయన రాసిన మాటలు, పాటలు ఆయనలోని రామభక్తికి నెలువెత్తు నిదర్శనాలు. రాముడికి సీత ఏమౌతుంది? అనే ప్రశ్నకి ప్రపంచం లోని వివిధ

ప్రాంత్రాలలోని రామాయణాలని ఒక చోట చేర్చి సమాధానం ఇచ్చారు.

భౌతికవాదిగా పేరు గాంచిన ఆరుద్రగారు రామగానం చేయడంలో హనుమను మించినవారు.

వారి భక్తి గీతాలు, భక్త జనహృదయాల్లో దైవం పట్ల అనితర విశ్వాసం నెలకొలిపే భక్తి జ్ఞాన దీప కళికలు.

రాముని పైన రాసిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే ‘గోరంతదీపము’లో ఆయన రాసిన ‘రాయినైనా కాక పోతిని’ అన్న పాట భక్తులకు రామునిపై ఉన్న ముగ్ధ భక్తికి, దేవుని ప్రేమించే జీవుల మధుర భక్తికి ఉదాహరణగా చెప్ప వచ్చు.

గోరంత దీపము

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా.. బోయెనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా
అడివి లోపల పక్షి నైతే అతివ సీతను గాచనా.. అందువలనా రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలి గట్టున ఉడుతనైతే బుడత సాయము చేయనా కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ గడ్డపోచను శరముచేసి ఘనత రాముడు చూపగా మహిని అల్పజీవులే యీ మహిమలన్నీ నోచగా
మనిషనై జన్మించినానే మత్సరంబులు రేపగా మద మత్సరమ్ములు ‘రేపగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా.. పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

ఈ పాటలో మరొక ప్రత్యేకత ఉంది. జాగ్రత్తగా ఈ పాటను ట్రిమ్ చేస్తే ఇది ఉత్సాహ వృత్తం అవుతుంది.

ఉదా – రాయి/ నయిన/ కాక/ పోతి/ రామ/ పదము /సోక/ గా ..
బోయ /నయిన/ కాక/ పోతి/ పుణ్య/ చరిత/ రాయ/ గా..

చక్కగా 7 సూర్యగణాలు చివర ఒక గురువు కూర్చుంటుంది.. 5వ గణము మొదటి అక్షరం యతి కుదురుతుంది.

ఈ పాటలో మరొక విశేషము.. మొదటి నాలుగు పాదాలు.. భక్తి రసాన్ని ఒలికిస్తే.. మహిని అల్పజీవులే యీ మహిమలన్నీ నోచగా.. అన్న పాదం.. సృష్టిలో ఉన్న పశుపక్ష్యాదులు ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గంలో వెళుతుంటే మనిషిగా పుట్టినా వాడు మత్సరం పాలు అవుతున్నాడు.. అలా ఉండకూడదు అని అన్యాపదేశంగా చెబుతున్నారు.

మీనా – శ్రీరామ నామాలు శత‌కోటి.. ఇది అత్యద్భుతమైన భక్తి గీతం. గుడిలో.. భక్తుల మదిలో మోగే పాట.. అయితే ఈ పాటకు ఒక నేపథ్యం ఉన్నదట..

(నేను ఎక్కడో చదివిన అంశం .. ఆరుద్ర గారి మాటల్లో..)

“నేను ఎప్పుడో చిన్నప్పుడు, హిందీలో వచ్చిన ‘రామరాజ్’ అనే సినిమా చూసాను. అందులో మహీపాల్ రాముని వేషం వేసారు. ఆ సినిమాలో శ్రీరాముడు, లక్ష్మణుడుని పిలిచి, గర్భవతి అయిన సీతా మహాసాద్విని కారడవులలో దించి రమ్మని కఠినంగా ఆజ్ఞాపించారు. అదే పని లక్ష్మణుడు ఆచరించి, అన్నగారికి చెప్పగానే, శ్రీరామచంద్ర ప్రభువు, భోరున విలపిస్తాడు. అప్పుడు, లక్ష్మణ స్వామి, “అన్నా! ఇంతకు ముందే అడవులలో దించి రమ్మని కఠినంగా చెప్పిన వాడవు, ఇప్పుడు అతి బేలగా విలపించటానికి కారణం ఏమిటి?” అని అడుగగానే, రామచంద్ర ప్రభువు, ‘ఆ ఆజ్ఞ ఇచ్చినపుడు, నేను రాజారాముణ్ణి, ఇప్పుడు జానకిరాముణ్ణి’ అని చెప్పారట.

ఈ భావం నా మనసులో నాటుకు పోయింది. ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని పాటగా వ్రాయాలని నా కోరిక. అయితే, నా కన్నా ముందుగానే తమిళంలో కణ్ణదాసన్ ఆ ఇతివృత్తంతో ఒక పాట వ్రాయటం జరిగింది. ఆ పాట చాలా జనాదరణ పొందింది!

ఆఖరికి, ‘మీనా’ సినిమాలో ఆ పాట వ్రాసి కోరిక తీర్చుకున్నాను. ఇది నా స్వంత పాట కాదు, హిందీ, తమిళ రచయితలకే ఆ గౌరవం దక్కాలి” అని వారు వినయంగా అన్నారు.

ఇది వారి సంస్కారం. కవులకుండాల్సిన క్రమ శిక్షణ.

వీరి రామ భక్తి గీతాలను చూస్తుంటే.. వెంకటేశ్వర స్వామి అన్నమయ్యతో కీర్తనలు రాయించుకున్నట్లు, రాములవారు తనపై ఆరుద్రగారిచే పాటలు రాయించుకున్నాడేమో అనిపిస్తుంది

వీరు రామ భక్తి గీతాలే కాకుండా.. తెలుగు వారికి ఇష్టమైన ప్రతీ దైవ స్వరూపంపై పాటలు రాశారు.

చెంచులక్ష్మి – నారదుడు పాడే ‘కరు‌ణా‌ల‌వాలా, ఇది నీకు లీలా..‌ అంత‌యును వింత, పొగ‌డగ నేనెంత’.. ఇక్కడ కూడా .. వారి అంత్య ప్రాసల జోరు కనిపిస్తుంది.

‘పర‌స‌తు‌లను చెర‌బట్టే అంధుడు−‌ ఆ సుర‌లోకం పాలించే ఇంద్రుడు;
పదవి మీద ఆశ‌చేత ప్రభు‌వా‌యెను పశువు −‌ పాపం తన‌నేమి చేసె కడు‌పు‌లోని శిశువు’ ..

శ్రీవేంకటే‌శ్వర వైభవం ‘శ్రీ వేంక‌టా‌చ‌ల‌వాసా −‌ నినుసేవింతుమో శ్రీని‌వాసా..

బాల‌భా‌రతం నారా‌యణ నీ లీలా నవ‌ర‌స‌భ‌రితం..

యశోద కృష్ణ నోము‌పం‌డింది మా నోము పండింది కృష్ణా

భక్త కన్నప్ప శ్రీకా‌ళ‌హ‌స్తీ‌శ్వరా హర‌హర−‌ కరు‌ణించి నను బ్రోవరా‌

ముద్దు‌బిడ్డ జయ మంగళ గౌరీ దేవి−‌ దయ‌చూ‌డుము చల్లని తల్లీ

నోము – అందరి దైవము నీవన్నా ఆశలు తీర్చన్నా నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా..

వంటి విభిన్న మైన భక్తి గీతాలు రచించారు. కవి అన్నాక అన్నీ రకాల రచనలుచేయాలీ. ఇక సినీ కవికి తప్పేది అసలే లేదు.

మసక మసక చీకటిలో పాటలు

అప్పుడు.. ఇపుడూ ఎపుడూ సినిమా అనేది వ్యాపార కళ. నిర్మాతకు కాసులు గలగల కావాలంటే తెరపై గ్లాసులు గలగలలాడాలి. తక్కువ దుస్తులతో అంగాంగ విన్యాసాలతో యువతులు అర్ధనగ్న,లేదా కురచైన వస్త్రధారణలతో పాటలు పాడాలి. అందులో కళ, పాత్ర చిత్రణ, ఔచిత్యం పేరున అశ్లీలత, అసభ్యత ఉండాలి. అవి పైకి కనిపించకూడదు. సెన్సార్ వారికి కనిపించినట్లుగా ఉండకూడదు. అదేమిటో మనకు కనిపించినట్లుగా వారికి కనిపించదు.

సూక్ష్మంగా చెప్పాలి అంటే సెన్సార్ వారికి కనిపించినా అనిపించవద్దు. ప్రేక్షకులకు అనిపించినా కనిపించవద్దు.. ఈ కనికట్టు, మాయాజాలం రచయితలు, దర్శకులు చేయాలి.. ఆ కనికట్టు తెలిసినవారు ఆరుద్రగారు.

అయితే ఆరుద్ర వంటి వారు క్లబ్బు పాటలు, నేటి భాషలో ఐటం సాంగ్స్ రాసినా అంతో యింతో సాహిత్యం గౌరవం ఆ పాటలు కలిగిఉండేవి. వర్జించదగినదే వర్జీనియా పొగాకు అని తమాషాగా చెప్పే ఆరుద్ర గారి క్లబ్బు పాటల్లో పెగ్గులు, హగ్గులు, రగ్గులు, బుగ్గలు.. సిగరెట్ పొగలు, చిలిపి వలపు సెగలు.. నిండుగా ఉంటాయి..

అలాంటి పాటల్లో బాగా చెప్పుకోదగినది – మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల.. పాట

దేవుడు చేసిన మనుషులు

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేళ కలుసుకో..
నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

చరణం 1:
మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా మా దేశం వచ్చినవాడా
తరతరాల అందాల తరగని తొలి చందాల తరతరాల అందాల ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా

చరణం 2:
చోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల
నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా అయితే.. ఏ ఏ..
రౌడీ‌లకు రౌడీలు తీస్కో కోకా‌కోలా−‌ ఏస్కో రమ్ము సారా’..

చిట్టి తమ్ముడు
ఏస్కో నా రాజా ఏస్కో−‌ ఆకేస్కో, వక్కేస్కో, ఆపైన చూస్కో..

శ్రీమం‌తుడు
మొదటి పెగ్గులో మజా −‌ వేడి ముద్దులో నిషా.. కొత్త వలపుల రుచీ.. రుచీ అనుభవిస్తే ఖుషీ.. ఖుషీ
రేపు సంగతి మనకేల.. నేడు సుఖపడు మనసారా పండితే నీ మోజు.. పండుగే ప్రతి రోజూ
పండితే నీ మోజు.. పండుగే ప్రతి రోజూ

ఇందులోనే మరొక పాట ..

కొంటె చూపు లెందుకులేరా.. జుంటె తేనెలందిస్తారా
కొంటె చూపు లెందుకులేరా.. జుంటె తేనెలందిస్తారా
నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా
కొంటె చూపు లెందుకులేరా.. జుంటె తేనె లందిస్తారా

అదృష్టవంతుడు
ముమ్ము.. ముమ్ము.. ముద్దంటే చేదా ఇపుడా ఉద్దేశం లేదా –

ఈ పాట అప్పట్లో సంచలనం.. కల్చరల్ షాక్‌కు గురిచేసిన గీతం.

జరిగిన కథ
లౌలౌ లౌమీ నెఱజాణా నౌ నౌ కిస్ మీ చినదానా సుఖములు సొగసులు అందించే ఖజానా..

సినారె గారు ‘ఎంత వారు కానీ వేదాంతులైన కానీ వాలుచూపు సోకగానే సోలిపోదూరోయి..’ అంటే ఆరా‌ధన చిత్రంలో ఆరుద్ర గారు.. ‘ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్, నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్’ అన్నారు.

బుద్ధిమంతుడు
ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదని..

మైకపు గీతాలలో వేదాంతం కూడా కలగలిపి రాసినది.

నిజానికి ఈ పాటలు ఆధునిక నగరాల్లోని సామాజిక జీవనంలో నుంచి పుట్టుకొచ్చినవి. విభిన్న సాంస్కృతిక రీతులకు తగినట్లుగా, కాలానుగుణంగా మారుతున్న సామాజిక నేపథ్యాన్ని, సాంస్కృతిక విలువలను తెలియజేసేవి.

స్థల పురాణ గీతాల స్పెషలిస్టు

సినిమాలలో కథ, సన్నివేశానుగుణంగా యేవైన స్థలాల గొప్పతనం వర్ణించాల్సి వచ్చినపుడు దర్శక నిర్మాతలు ఆరుద్ర వైపు చూసేవారు. వారు రాసిన ..

‌ఎంఎల్‌‌ఏ
‘ఇదే‌నండి ఇదే‌నండి భాగ్యన‌గరం−‌ మూడు‌కోట్ల ఆంధ్రు‌లకు ముఖ్య పట్టణం’ హైదారాబాద్ గురించి..

బాలరాజు కథ
మహాబలిపురం మహాబలిపురం తమిళనాడులో గల మహాబలిపురం గురించి..

ఈ పాటలో వచ్చే ఒక అభివ్యక్తి.. మరలా వారి ‘వేదంలా ఘోషించే గోదావరి’ పాటలో ‘..కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు.. వీరేశ లింగమొకడు మిగిలెను చాలు..’ అన్న చోట కనిపిస్తుంది.

మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు

చరణం 1:
కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు
తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు
పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు మహబలిపురం మహబలిపురం మహబలిపురం

చరణం 2:
పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండి శిలలనుండి మలచపడ్డవి
వీటి మీద బొమ్మలన్ని వాటమైనవి తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
మహిషాసురమర్ధనం.. గోవర్ధనమెత్తడం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి

చరణం 3:
పాశుపతం కోరెను పార్ధుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను
దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం

ఆంధ్ర కేసరి

వేదంలా ప్రవహించే గోదావరి.. గోదావరి,రాజమండ్రి గురించి ..
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

చరణం 1:
రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు

చరణం 2:
ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించె నందనవనము

చరణం 3:
దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు

ఈ పాటలు చక్కగా గైడ్ వ్యవహరిస్తూ మన చేయి పట్టుకొని ఆ ప్రదేశాల గొప్పతనం చెబుతాయి.

ఈ పాటలో మరొక విశేషం నన్నయ నుండి ప్రారంభమయిన తెలుగు సాహిత్య వైభవం రానురాను క్షీణించినా అదే ప్రాంతంలో పుట్టిన కందుకూరి వారి వల్ల తిరిగి తెలుగు భాష పునర్ వైభవం పొందిందని అన్యాపదేశంగా చెప్పారు. పై రెండు పాటల్లో

సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను – ‘మహా బలిపురం..’ పాట

కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు – ‘వేదంలా’.. పాటలో దాదాపు ఒకే రకమైన అభివ్యక్తి కనబడుతుంది.

సంస్కృతీ సంప్రదాయ గీతాలు

వారికి అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను వర్ణిస్తూ కలకాలం నిలిచిపోయే చక్కని గీతాలు రాశారు.

ముత్యాల ముగ్గు

పల్లవి:
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ

చరణం 1:
ఆరనయిదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపదా ఎవరింట నుండు.. తీరైన సంపదా ఎవరింట నుండు..
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

చరణం 2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కొలిచేవారి కొంగు బంగారూ..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు.. కోరినంత పాడి నిండు కడవళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3:
మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభోగం

ఈ పాటను గమనిస్తే ముఖానికి పసుపు పూసుకున్న ముగ్ధలు, పసుపురాసిన కడపలు, ముగ్గుల లోగిళ్లు, ఇంటి ముందు తులసి కోటలు, పక్కనే గోమాతలు.. అదీ తెలుగు వారి లోగిలి.. అదీ తెలుగు వారి సంస్కృతి.. మొగిలిపూలా గాలి, ముత్యాల వాన, మగాడు మెచ్చిన చాన గమనించాల్సిన పదాలు.. అలాగే
తీరైన సంపద ఎవరింటనుండు.. దినదినము ముగ్గుల్ల లోగిళ్ళ నుండు..

తెలుగు లోగిళ్లు, తెలుగు వారి సంస్కృతులను విశ్వాసాలను, తెలుగుతనం కలగలిపి ఇంత అందంగా వర్ణించిన మరొకగీతం అంతగా కనబడదు.

వివాహ గీతాలు

తెలుగు వారి వివాహ సంప్రదాయాలు, పెళ్లి వేడుకలు చాలా విశిష్టమైనవి. వీరు రాసిన వివాహగీతాలలో రెండు చాల ప్రధానమైనవి. అవి తెలుగు వారి వివాహానికి థీమ్ సాంగ్స్ లాంటివి..

ఆరుద్ర ‘సాక్షి’ సినిమా కోసం రాసిన ‘అమ్మ కడుపుచల్లగా’ పాట, అలాగే ‘పెళ్ళిపుస్తకం’ సినిమా కోసం రాసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే పాట. రెండింటిలోనూ పెళ్ళి తంతు వర్ణించబడుతుంది.

అయితే ‘అమ్మ కడుపు చల్లగా’ పాట బరువైన సన్నివేశ నుండి పుట్టగా, రెండవది పూర్తిగా సంతోషకరమైన సందర్భం లోనిది. కానీ రెండూ తెలుగు వారి వివాహ సంస్కృతిని, క్రతువును, పరమార్ధాన్ని, ప్రాముఖ్యతను మరియు కొత్తగా పెళ్ళైన జంట వ్యవహరించాల్సిన విధానాన్ని తెలుపుతాయి.

శ్రీరస్తూ.. శుభమస్తూ గీతం వివాహ గీతాలలో థీమ్ సాంగ్‌గా ప్రాచుర్యం పొందింది.

ఈ రెండు పాటల్లోనూ, తెలుగు పెళ్ళితంతులో ఉండే వివిధ అంశాలు, వాటి క్రమం మీద ఆయనకున్న పట్టు తెలుస్తుంది.

పెళ్ళి పుస్తకం

శ్రీరస్తూ శుభమస్తు…శ్రీకారం చుట్టుకుంది.. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం..
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
తల మీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికి నింపుకో

ఈ పాటలో మొదటి నాలుగైదు పాదాలు తెలుగు వారి వివాహ క్రతువును వర్ణించినా, ‘మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం’ అనడంలో.. ‘ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికినింపుకో’ అనడంలో.. పెళ్లి మంత్రాల పరమార్థం.. పెళ్ళైన కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలో సందేశాన్ని ఇచ్చారు.

సాక్షి

అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

చరణం 1:
నా మెడలో తాళిబొట్టు కట్టరా.. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా.. నా సిగపూవుల రేకైనా వాడదురా.. వాడదురా..

చరణం 2:
చల్లని అయిరేణికి మొక్కరా.. సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా.. నా నల్ల పూసలే నీకు రక్షరా.. రక్షరా .. బతకరా.. బతకరా పచ్చగా

చరణం 3:
నా కొంగు నీ చెంగూ ముడివేయరా.. నా చెయ్యి నీ చెయ్యి కలపరా
ఏడడుగులు నాతో నడవరా.. ఆ యముడైనా మనమద్దికి రాడురా

ఈ గీతంలో వివాహ క్రతువు సంప్రదాయాలను చెబుతూనే భారతీయ స్త్రీ వైవాహిక క్రతువును, సాంప్రదాయాలను ఎంతగా గౌరవిస్తుందో, విశ్వసిస్తుందో తెలిపారు.

.. పెళ్లి అయినాక మనస్పర్ధాలతో విడిపోతే ఏమీ చేయాలో..

ఇంటింటి రామాయణం

ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం
కలిసుంటే సల్లాపం విడిపోతే కల్లోలం..

అంటూ సంసార జీవన మహత్మ్యం కలిసి ఉంటే కలదు సుఖం అని యువతకు సందేశాన్ని ఇస్తారు.

(ఇంకా ఉంది)

Exit mobile version