[శ్రీ జె. ఎస్. వి. ప్రసాద్ గారు రచించిన ‘అరుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
‘ఇక్ దిన్ బిక్ జాయేగా మాటీ కే మోల్, జగ్ మే రహ్ జాయేంగే ప్యారే తేరే బోల్..’ సెల్ ఫోన్లో పాట వింటూ అక్కడ జరుగుతున్న పనులు పర్యవేక్షిస్తున్నాడు. ఆ సూపర్వైజర్.
అక్కడ జరుగుతున్నది ఒక హృదయ విదారకమైన పని..! ఒక ఘోర కలి..! ఒక అమానుష కృత్యం..! ఆ పనికి అతను సూపర్వైజర్..!
అది మూడు తరాల క్రిందటి రావి చెట్టు. విశాలమైన కొమ్మలు చాచుకుని, పచ్చగా నిండుగా పెరిగి అందరినీ తన నీడకు రా.. రమ్మని ఆహ్వానిస్తూ కొన్ని వందల పక్షులకు, వ్యవసాయ పనుల రోజుల్లో పనులు వెతుక్కుంటూ వచ్చే కొన్ని పదుల వ్యవసాయ కూలీలకు తన ఒడిలో చోటిచ్చేది. ఆ చెట్టును ‘సూర్యం’ తాత నాటించాడు. సూర్యం తండ్రి ఆ చెట్టు చుట్టూ నాపరాళ్ళతో అరుగు వేయించాడు. వలస వచ్చిన కూలీలు ఆ చెట్టు క్రింద వండుకు తిని, ఆ అరుగు మీద నిద్రపోయేవారు. ఆ చెట్టు వెనుక ఉన్న పెద్ద చెరువు ఆ ఊరి నీటి అవసరాలు తీరుస్తుండేది. అంత సౌకర్యంగా ఉన్న కారణంగానే వలస కూలీలకు అది తల్లి ఒడిలా ఉండేది.. ఆ ఒడి ఇప్పుడు మరుస్థలం కాబోతోంది. నిప్పుల కుంపటిలా మారబోతోంది..!
ఆ చెట్టుకి కొంత దూరములో తన పాత పెంకుటింటి అరుగుమీద కూర్చుని జరుగుతున్న పనులు చూస్తున్నాడు సూర్యం. ఊరికి కాస్త ఎడంగా ఉన్న ఆ ఇరవై సెంట్ల స్థలం సూర్యానికి తండ్రి ద్వారా వచ్చింది. ఆ స్థలానికి ఇటు చివర ఉన్న పెంకుటిల్లూ సూర్యానిదే. ఇవి కాక పదిహేనెకరాల పొలం ఉంది. ఆ పొలంలో సూర్యం బంగారం పండిస్తూంటే.. అతని ఇద్దరు కొడుకులు అమెరికాలో డాలర్లు పండిస్తున్నారు.
ఇంటి నిండా గుట్టలుగా పేరుకుపోతున్న డబ్బు చూస్తుంటే సూర్యానికి పెంకుటిల్లు పడగొట్టి ఆ చుట్టు ప్రక్కల ఎక్కడాలేని అందమైన మేడ కట్టాలనే కోరిక కలిగింది. కానీ ఆ చెట్టుంటే ఇంటి అందం దెబ్బ తింటుంది. చెట్టు నిండా పిట్టలు చేరతాయి. రెట్టలు వేస్తాయి. చెట్టు క్రింద అలగా జనం చేరతారు. అలగా పనులు చేస్తారు. అంచేత ఆ చెట్టు కొట్టించెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ‘వాస్తు’ని సాకుగా తెచ్చుకుని..!
“ఆ చెట్టు కొట్టవలసిన అవసవరం లేదు. అది ఇంటి వాస్తుకేమీ అడ్డం కాదు.” అని సిద్ధాంతి గారు పంచాంగం గుద్ది మరీ చెప్పాడు. సూర్యం ఒకరు చెప్తే వినే రకం కాదు చిన్నప్పట్నించీ కూడా..!
“అన్నయ్యా ఆ చెట్టుని కొట్టవద్దు. అది మన తాతల నాటిది”. అని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడు సూర్యం సవతి తమ్ముడు భూషణం..! అతను చెప్పినందుకు అసలు వినలేదు సూర్యం.
చెట్టు కొట్టాక ఆర్నెల్లు వరకూ ఇంటి పని మొదలుపెట్టకూడదు. అందుకని ఆ చెట్టంటే అతనికి కోపం. తన తండ్రి వల్లే అయినా ఎవత్తికో పుట్టిన భూషణం అన్నింటిలో తనతో వాటాకొస్తున్నాడు. అందుకు అతనంటే కోపం.
వీరభద్రం రెండవ భార్య తన కొడుకునీ సవతి పిల్లల్నీ కూడా ఒక్కలాగే చూసింది. సూర్యం అక్క రాజ్యలక్ష్మి కూడా తమ్ముళ్ళీద్దర్నీ సమానంగానే ప్రేమించేది. కానీ, సూర్యం మనసులో ఎవరో నాటిన ‘సవతి’ అనే విషబీజం మొక్కై, మానై పెరిగి పోయింది. అతను సవతి తల్లి మీద తమ్ముడి మీద అకారణ ద్వేషం పెంచుకున్నాడు. దానికి తోడు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక అనారోగ్యంతో ఉన్న వీరభద్రం ఆస్తినంతా ఇద్దరికీ సమానంగా పంచడంతో ఆ ద్వేషం ఇంకా ఎక్కువైంది. భూషణం కన్నా తానే రెండు మెట్లు ఎత్తులో ఉండాలని తన ఇద్దరు కొడుకుల్నీ పట్టుదలగా చదివించి అమెరికా పంపించాడు. భూషణం పెంకుటింటి కంటే ఎత్తులో ఉండాలని రెండంతస్తుల మేడ నిర్మాణం మొదలుపెట్టాడు.
***
పచ్చగా కళకళలాడుతున్న ఆ రావి చెట్టుని రంపాలతోనూ, గొడ్డళ్ళతోనూ, విద్యుత్ యంత్రాలతోనూ ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు చాలా మంది కార్మికులు. తెగి క్రింద పడ్డ కొమ్మల్ని ఏరి లారీల్లో నింపుతున్నారు మరికొందరు. ఇంకొందరు రాలిన ఆకుల్ని దూరంగా పోగు పెట్టి నిప్పంటిస్తున్నారు.
రెండు రోజుల పాటు సాగిన ఆ రాక్షస క్రీడ సాయంత్రానికి ముగిసింది. చెట్టు స్వర్గానికి వెళ్ళిపోయింది. చెట్టు ఉన్న చోట యంత్రాలతో లోతుగా తవ్వించి వేరు ముక్క కూడా మిగలకుండా తీయించేసాడు. చెట్టు చుట్టూ ఉండే అరుగుని కూడా క్రెయిన్‌తో ముక్కలు చేయించి లారీల్లో దూరంగా పంపేసాడు సూర్యం.
గడ్డి మొక్క కూడా మిగలకుండా స్వార్థం అనే రాకాసి అహంకారపు చీపురుతో ఊడ్చేసిన నేలలా ఉంది ఆ నేలంతా..!
***
ఎప్పుడైనా అమెరికాలో ఉన్న తన కొడుకులు ఆ పల్లెటూరికి వస్తే, పల్లెటూరికి వచినట్టుండకూడదు. అసౌకర్యంగా ఉండకూడదు, దర్జాకి భంగం కలగకూడదు అనే ఉద్దేశంతో ఏ విషయం లోనూ రాజీ పడకుండా డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేసాడు సూర్యం. సింహద్వారానికే లక్ష ఖర్చయ్యింది. తూర్పు వైపు రోడ్ ఫేసింగ్ ఇల్లే కనుక అటువైపు ప్రహరీతో సహా కళాత్మకమైన ఎలివేషన్ కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. ఉత్తరాన కొట్టేసిన రావి చెట్టు దగ్గర్నుంచీ తూర్పున రోడ్డు వరకూ చాలా ఖాళీ స్థలం ఉంది, రకరకాల పూలమొక్కలు తెప్పించి దానిని అందమైన గార్డెన్‌గా మార్చాలనుకున్నాడు సూర్యం. ఆ చెట్టే ఉంటే అలగా జనం తోటను పాడుచేస్తారు, పూలు కోసేస్తారు. అందుకే ముందు చూపుతో చెట్టును కొట్టించేశాడు.
***
ఎక్కువమంది పనివాళ్ళను పెట్టి చాలా వేగంగా ఇంటి నిర్మాణం పూర్తిచేయించాడు సూర్యం. ఆ రెండంతస్తుల మేడ చుట్టు ప్రక్కల పది గ్రామాల్లో మరో తాజ్ మహల్ అంత పేరు తెచ్చుకుంది.
అందమైన భవనానికి పహరా కాసే ప్రహరీ కూడా అంతే అందంగా ఉండాలని ఆ గోడ కూడా చాలా ఖర్చుతో కట్టించాడు. ముఖ్యంగా – తోట వేద్దామనుకున్న ఉత్తరం వైపు గోడ మరింత సుందరంగా కళాత్మకంగా తయారయింది.
గ్రుహప్రవేశ మహోత్సవం కూడా అంతే అద్భుతంగా జరిగింది. అతని కొడుకులు, అథిథులు సూర్యాన్ని ఎంతో పొగిడారు. సూర్యం అక్క రాజ్యలక్ష్మి మాత్రం మరొకందుకు సన్నగా చివాట్లు వేసింది.
“ఒకరినొకరు తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, వాడి వల్ల నీకు వీసమెత్తు కష్టమూ కలగలేదు, నష్టమూ లేదు. తమ్ముడ్ని పిలవకపోవడం నాకు నచ్చలేదు రా సూర్యం..! ఇది చాలా తప్పు.” అంటూ.
“ఏం విమలా! ఈ మాత్రం నీకూ తెలియదా..? జీవితాంతం ఇలాంటి విరోధాలు ఉంచుకోకూడదని, ఇటువంటి శుభకార్యాల సంధర్భం లోనైనా అందరూ ఒక్కటవ్వాలనీ…!” అంటూ మరదలినీ మందలించింది.
“చాలా చాలా చెప్పి చూసానొదినా, మీ తమ్ముడి సంగతి మీకు తెలిసిందే కదా..!?” అంది విమల.
***
చుట్టూ తిరుగుతూ తన ఇంటి అందాన్ని తనివితీరా చూసుకుంటున్నాడు సూర్యం. చాలా మందికి అసూయ కలిగేటంత అందంగా తయారైంది ఆ భవనం. ఎంత వెతికినా ఏ లోపమూ కనిపించడం లేదు.
క్రమంగా ఎండ ఎక్కువవుతున్నది. టైం చూసుకున్నాడు. పదిన్నర..! కింద నేల, పైన తల వేడెక్కుతున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే తరువాత తరువాత ఎలా ఉంటుందో అనుకున్నాడతను.
“ఎంత సేపని అలా ఎండలో నిలబడి మురిసిపోతారు? చూసుకున్నది చాలు గానీ, లోపలికి రండి.” అంది అతని భార్య.
సూర్యం లోపలికి నడవబోతుండగానే జనంతో నిండిన రెండు ట్రాక్టర్లు వచ్చి తూర్పు రోడ్డు మీద ఆగాయి. ఒక దానిలో నుంచి గోని సంచుల్లో కట్టిన సామానుతో బాటు ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు కలిపి సుమారు పాతిక మంది వ్యవసాయ కూలీలు రణగొణ ధ్వనులతో దిగారు. వాళ్ళందరికీ మేస్త్రీలా ఉన్న ఒక వ్యక్తి రెండవ ట్రాక్టరులో వాళ్ళకి ఏదో అడ్రసు చెప్పి పంపేసాడు. అక్కడ దిగిన వాళ్ళంతా గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఎవరో గట్టిగా అరిచారు. “ఒరేయ్, ఇక్కడ చెట్టు లేదురోయ్..!”
అంతే, ఒక్కసారిగా అక్కడ అంతా సద్దుమనిగి పోయింది. కానీ, మరుక్షణం లోనే హాహాకారాలు మిన్నంటాయి. “సెట్టు లేదా..? సెట్టు లేదా..? సెట్టు ఏటయ్యింది..? అంత పెద్ద సెట్టేమైపోయింది..?” అన్నీ ప్రశ్నలే.
“రెడ్డెప్పన్నా.. ఇదేటన్నా? అడవిలోకి తెచ్చి పడేసావ్?” అడిగారెవరో వాళ్ళ మేస్త్రిని.
‘చెట్లుండే అడవిలో మనిషి హాయిగానే బ్రతకొచ్చు, మనుషులుండే అడవిలోనే మనుగడ కష్టం..!’
రెడ్డెప్ప మెడ రిక్కించి చూశాడటువైపు.. ఎడారి కనిపించింది. నిర్ఘాంతపోయాడు. పక్కనే కొత్తగా వెలసిన ఆ రెండంతస్తుల భవనాన్నీ, దానికి యజమానిలా కనిపిస్తున్న సూర్యాన్నీ చూడగానే ఏదో అనుమానం కలిగింది.
“అయ్యా..! కూలి పన్ల కోసం మేం నిరుడు రాలేదు. ముందటేడు వచ్చినప్పుడు అల్లదిగో.. అక్కడ పెద్ద రావి సెట్టుండేది. చుట్టూ అరుగుతో.. అమ్మ ఒడిలా చోటిచ్చేది. ఏమైపోయిందయ్యా?” అడిగాడు సూర్యం దగ్గరగా వెళ్ళి బాధగా.. జాలిగా..!
“ఈ ఇంటి వాస్తుకి అడ్డొచ్చిందని కొట్టేశాం..!” చెప్పాడు సూర్యం నిర్లక్ష్యంగా. “మీరంతా ఇక్కడ డేరాలు పాతొద్దు.. కడియం నుంచి పూల మొక్కల లారీలు వస్తున్నాయి. ఇక్కడ పూలతోట వేస్తున్నాం” అన్నాడు.
తను మాట్లాడుతున్నది ఆకులు, కొమ్మలు కనీసం నేలలో వేళ్ళు లేని చెట్టు మానుతోనని రెడ్డెప్పకు అర్థమైపోయింది. “ఒరే చలమయ్యా, సుందరం..!” అంటూ పిలిచాడు. “ఆ పడమర దిబ్బల మీద సుబ్బరాజు గారి పాత పెంకుటిసాల ఉంది. ఓ పది రోజులకి ఆర్ని బతిమాల్దాం రండ్రా” అంటూ తన వాళ్ళని తీసుకుని వెల్లిపోయాడు. అందరూ వెళ్ళిపోగా ఒక గర్భిణీ యువతి, ఆమె భర్తా, ఆమె తల్లిదండ్రులూ, మరికొందరు అక్కడ మిగిలిపోయారు.
“ఇల్లు లాంటి సెట్టుందన్నారని నీళ్ళోసుకున్న పిల్లని ఇంట్లో ఉంచకుండా ఎంట తీస్కొచ్చాం. పైన నీడా లేదు, కూసునే సోటూ లేదు. ఎవరెదాన కొట్టుకున్నారో..!” అంటూ కూతుర్ని దగ్గరకు తీస్కుంది తల్లి అచ్చమ్మ.
“ఎండ మండిపోతంది. ఆ గొడవలన్నీ ఎందుగ్గానీ, ముందు పిల్ల నెత్తి మీదకి కొంత నీడ సూడండి..” అన్నాడు ఆ అమ్మాయి తండ్రి. వెంటనే ఆ అమ్మాయి భర్త చెంగున లేచి వాళ్ళు తెచ్చుకున్న సామానులో నుంచి నాలుగైదు చేతి కర్రలు తెచ్చాడు. ఆ మేడ చివర ప్రహరీ గోడకు కొద్ది దూరం లో రెండు కర్రలు పాతి, మిగతా కర్రలతో ఆ గోడ సాయంగా పందిరి వేసాడు. పైన దుప్పటి కప్పి లోపల కొంత గడ్డీ గాదం పోగుచేసి పరిచాడు. దాని మీద మరో దుప్పటి వేసి భార్యని అపురూపంగా తీసుకెళ్ళి దాన్లో కూర్చోపెట్టాడు. తనకోసం భర్త కట్టిన ఆ తాజ్ మహల్‌ని చూసుకొని ఆ అమ్మాయి మురిసిపోయింది. అందరి ప్రాణాలూ కుదుటపడ్డాయి. ఇంటి నుంచి తెచ్చుకున్న పదార్దాలేవో తినడానికి ఉపక్రమించారు.
‘చెట్టూ.. అరుగూ ఉన్నప్పుడు భలేగుండేదిలే..! సొంతింట్లో ఉన్నట్టుండేది..!’ అనుకున్నారు.
గుమ్మంలో నుండి అదంతా గమనిస్తున్నారు సూర్యం దంపతులు. విమల ఆడ మనసు రెపరెపలాడసాగింది ఆ అమ్మాయిని చూస్తుంటే..! ఇంట్లోకి పిలిచి కూర్చోమందామంటే సూర్యం ఒప్పుకోడు.
తింటూ తింటూ ఆ అమ్మాయి “అమ్మా..!” అంటూ మెలితిరిగిపోసాగింది బాధతో.
“సీతా.. సీతాలూ.. ఏటయ్యిందే?” అంటూ కంగారు పడసాగారందరూ. అవి పురుటి నొప్పులని తల్లికి అర్ధమైపోయింది. ‘ఇంకో పది పదిహేను రోజులగ్గానీ కాన్పు రాదందే డాక్టరమ్మ…!?’ అని ఆశ్చర్యపోయింది.
అంతా చూస్తున్న విమలకు కూడా అర్థమై భర్తను లక్ష్యపెట్టకుండా ఆ ఊరిలోని ఒక నర్సు సక్కూబాయికి ఫోన్ చేసింది. “మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి పురుటి నెప్పులు వస్తున్నాయి. హాస్పిటల్‌కి తీసుకురమ్మంటారా?” అని.
“ఇక్కడ మేము పురుళ్ళు పోయకూడదండీ, అంబులెన్సుని పిలిపిస్తాను. టౌన్‌కి తీసుకుపోదాం” అందామె.
విమల మనసు కాస్త కుదుటపడింది, అంతా ఆమే చూసుకుంటుందిలే అన్న ధైర్యం కలిగింది.
పళ్ళ బిగువున బాధను అణచుకుంటున్న సీతాలు ఎందుకో తల తిప్పి చూసి, “అమ్మో.. పాం..!” అంటూ బిగ్గరగా అరచి చెంగున లేచి నిలబడిపోయింది. ఎండకు తాళలేని ఒక కట్ల పాము నీడను వెతుక్కుంటూ చెర చెరా ఆ పందిట్లోకే వస్తూ ఉంది, కూర్చోడానికి వేసిన ఆ పందిరి సీతాలు లేచి నిలబడడంతో చెల్లా చెదురైపోయింది. సీతాలు భయంతో బయటికి పరుగెత్తింది. ఎండకు కాళ్ళు భగ్గుమన్నాయి. భరించలేక, భయంతో సీతాలు చిందులు వేయడం ప్రారంభించింది. నిశ్చేష్టులైపోయిన తన వాళ్ళంతా తేరుకుని వారించే లోగానే జరగకూడని అనర్థం జరిగిపోయింది. సీతాలు రెండు కాళ్ళ మధ్యనుంచి రక్తస్రావంతో బాటు తలక్రిందులుగా బయటకు వచ్చిన ‘పిండం’ తల వేగంగా వేడి వేడి నేలను తాకి ‘ఠప్’ మంటూ చితికిపోయింది. మొదటి క్షణం ఏం జరిగిందో తెలియని ఆ తల్లి నిశ్చేష్టురాలైపోతే.. మరు క్షణమే జరిగింది అర్థమై ఆ తల్లి హృదయం పెఠిల్లున పగిలిపోయింది. వెర్రి కేక పెడుతూ విరిగిన కొమ్మలా నేలవాలిపోయింది సీత..! నీడ నెతుక్కోవడానికి వెళ్ళిన జనమంతా తిరిగివస్తూనే ఎదురుగా కనిపించిన ఆ ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా హాహాకారాలు చేసారు. నోట మాట లేక బిగిసిపోయిన సీతాలు తల్లిదండ్రులు, భర్త తేరుకుని గుండెలు బాదుకుంటుంటే ఆ రోదనలో శృతి కలుపుతూ అంబులెన్సు వచ్చింది.
***
ఆ వార్త క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. గుంపులుగా జనం పోగైపోతున్నారు. అందరి నోటివెంటా ఒకటే మాట.
‘అప్పుడలా జరిగి ఉండకపోతే ఇప్పుడిలా జరగకపోనేమో..?’ అనే. వేదాంత పరంగా ఆలోచిస్తే ఒకరి ఖర్మకు వేరొకరు కర్త కాదు. కానీ, ఇక్కడ మనుషుల ఆలోచన సామాజికమైనది, వ్యక్తిగతమైనది.
అక్కడ చేరిన వందల మంది మనుషుల చూపుల్లోని, ఆలోచనల్లోని భావం ఏకీక్రుతమై పొగలు కక్కుతూ రివ్వున వెళ్ళి శిలాప్రతిమల్లా నిలబడి చూస్తున్న సూర్యం విమలల చెవులనుంచి, కళ్ళనుంచి మనసుల్లో దూరి దావానలంలా దహించివేయసాగింది.
యథార్థాన్ని అంగీకరించలేని ‘అహం’ గతాన్ని తవ్వుకుంటూ వెనక్కి వెళితే ఎన్ని సార్లు ప్రయత్నించినా సూర్యం ఆలోచనలు అరుగు మీదే ఆగుతున్నాయి. చెట్టు మీదే కూర్చుంటున్నాయి.
అవును అరుగు, చెట్టు చాలా గొప్పవి. పూర్వం కాలినడకన ప్రయానించే బాటసారుల్ని ‘రండి. కాస్త ఆగి, విశ్రాంతి తీసుకుందురు గాని’, అంటూ పిలుస్తున్నట్టుగా ప్రతీ ఇంటికీ అరుగులుండేవి, దారి పొడవునా చెట్లుండేవి, బాటసారులకు చల్లని నీడనిచ్చి తల్లిలా లాలించేవి. మనిషి స్వార్థపు పరిధి విస్తృతమై పోయేకొద్దీ మనసులు కుంచించుకుపోయి చివరికి కావలిసింది ఆరడుగుల నేల మాత్రమే అని తెలిసి కూడా అరవై చేతులతో తన స్థలాన్ని తానే ఆక్రమించేసుకుంటున్నాడు. అదృశ్యమైపోతున్న అరుగులు, చెట్లు ప్రాచీన సంస్కృతికి, మానవతకు చిహ్నాలైతే ఇంటి వైశాల్యం నవీన నాగరికతకు హోదాకు గుర్తు ఐపోయింది.
మనసుతో ఓడిపోయిన సూర్యం నిస్సత్తువగా నేలపై కూలబడిపోయాడు. విమల అతన్ని బలవంతంగా లేపి లోపలికి తీసుకుపోయింది. చరిత్రలో పెను మార్పులన్నీ రక్త తర్పణం తోనే ప్రారంభమయ్యాయనడానికి సాక్ష్యంగా అతని కళ్ళ నుంచి రక్తాశ్రువులే కారాయి. “భూషణాన్ని పిలిపించు..!” అన్నాడు మంచం మీద పడుకుని మగతగా. విమల ఆడపడుచుకి ఫోన్ చేసి భూషణం నెంబరు తీసుకుని క్లుప్తంగా విషయం అంతా చెప్పింది. ఆఘమేఘాల మీద వచ్చిన భూషణం చేతులు తన చేతుల్లోకి తీసుకుని, “తమ్ముడూ..!” అన్నాడు సూర్యం. విమలను కూడా దగ్గరుండమని భూషణంతో.. ఏం చెయ్యాలో, చేయించాలో నెమ్మదిగా.. కానీ చాలా ఖచ్చితంగా చెప్పాడు. కొడుకులు ఈ పని కోసం అంత దూరాన్నుంచి రావడం కుదరదు కనుక “అంతా నీదే భారం” అంటూ బాధ్యతంతా తమ్ముడి చేతిలో పెట్టాడు.
“నన్ను తమ్ముడూ అన్నావ్.. చాలన్నయ్యా. ఎంత బరువైనా మోస్తాను.” అని హామీ ఇచ్చాడతను.
***
కొట్టివేయబడ్డ రావి చెట్టు స్థానంలో మరొక లేత చెట్టు ప్రత్యక్షమైంది. దాని చుట్టూ చతురస్రాకారం లో విశాలమైన ‘అరుగు’..! ఆ మొక్క పెరిగి నీడనిచ్చేలోగా సిమెంటు రేకులతో ఆ అరుగు పైన ‘కప్పు’ తయారైపోయాయి. అంతే కాదు, ఉత్తరం వైపు అందమైన ప్రహరీ గోడ గేటుకి ఇరువైపులా పెద్ద పెద్ద అరుగులుగా మారిపోయింది.
పూర్వం పాతిక కుటుంబాలకు నీడనిచ్చిన ఆ ప్రాంతం ఇప్పుడు ముప్పై, నలభై కుటుంబాలను తల్లిలా అక్కున చేర్చుకోగలదు. మహా ప్రళయం తరువాత సృష్టి ప్రారంభమైనట్టు, సాగరమథనం తరువాత అమృతం పుట్టినట్టు ఉందక్కడ..! చెట్టు కొట్టిన రోజు ఆ సూపర్వైజర్ సెల్ లోని పాటే ఇప్పుడు ప్రాణం పోసుకున్నట్టుంది.
“ఏదో ఒక రోజు ఈ భేదాలన్నీ సమసిపోతాయి, ప్రపంచంలో నీ మంచి మాత్రమే మిగిలిపోతుంది..!
ఇతరులు పాడుకునేలాగ నీ పాటలను జ్ఞాపకంగా ఇచ్చి పో..!”
