[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అర్జునుడి అస్త్రసన్యాసం’ అనే రచనని అందిస్తున్నాము.]
అర్జునుడి జీవితం, శ్రీకృష్ణుడితో ఉన్న అద్భుతమైన బంధానికి నిలువుటద్దం. మహాభారత యుద్ధంలో అతను గెలిచింది తన ధనుర్విద్యా నైపుణ్యంతో కాదు, శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వం వల్ల. కృష్ణుడు రథసారథిగా, స్నేహితుడిగా, ఉపదేశకుడిగా, దైవస్వరూపుడిగా అర్జునుడి వెన్నంటే ఉన్నాడు. కానీ కృష్ణుడు భూలోకం విడిచి వెళ్ళగానే అర్జునుడి జీవితంలో గాఢాంధకారం ఆవరించింది.
ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం, యాదవ వంశం అంతరించిపోవడం, కృష్ణుడు దేహం వదిలి వెళ్ళిపోవడం – ఈ సంఘటనలు అర్జునుడి హృదయాన్ని తీవ్రంగా కలిచివేశాయి. అప్పటికే పాండవులు రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో అర్జునుడు, కృష్ణుడి భార్యలు, కుటుంబాన్ని హస్తినాపురానికి సురక్షితంగా చేర్చాలనుకున్నాడు. కానీ మార్గమధ్యంలోనే దొంగలు, గిరిజనులు దాడి చేసినప్పుడు అర్జునుడు తన శక్తిని కోల్పోయాడు. చేతిలో గాండీవం అనే అద్భుత ధనుస్సు ఉన్నప్పటికీ, బాణాలు పనికిరాకుండా పోయాయి. అప్పటివరకు గర్జించే ఆ బాణాలు ఇప్పుడు నిర్జీవంగా మారాయి.
అర్జునుడు ఎన్నిసార్లు బాణాలు సంధించినా, శత్రువులను ఓడించలేకపోయాడు. దొంగలు కృష్ణుడి భార్యలను అపహరించుకుపోయినప్పుడు అర్జునుడి హృదయం ముక్కలైపోయింది. ఆ సమయంలో అతను లోలోపల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. “ఇది నేను ఓడిపోవడం కాదు. ఇది నా బలహీనత కాదు. కృష్ణుడు ఇక నా వెంటే లేడనే దానికి ఇది ఒక సంకేతం” అని అనుకున్నాడు. గతంలో కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన విజయాలు, పొందిన కీర్తి అన్నీ తనవల్ల కాదని, కృష్ణుడి సాన్నిధ్యం వల్లనే అని గ్రహించాడు. భగవద్గీత బోధనలు విన్న తరువాత మనోధైర్యం పెరిగింది. కానీ ఇప్పుడు ఆ దివ్యవాణి వినిపించకపోవడంతో అర్జునుడి మనస్సు స్థిరంగా నిలవలేదు.
ఈ విషయాన్ని చాటిచెప్పే శ్లోకం:
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీ ర్విజయో భూతి ర్ధ్రువా నీతి ర్మతి ర్మమ॥
(భగవద్గీత, అధ్యాయం 18, శ్లోకం 78)
అర్థం:
ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే గాండీవం ధరించిన అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయం, సంపద, ఐశ్వర్యం, నీతి తప్పక ఉంటాయి. ఇది నా దృఢమైన నమ్మకం.
హస్తినాపురానికి చేరుకుని, తన అసమర్థతను అన్నదమ్ముల ముందు ఒప్పుకున్నాడు. “కృష్ణుడు లేక మనం ఏమీలేము. ఆయన దివ్యసాన్నిధ్యం వల్లే మేము యుద్ధంలో గెలిచాం. ఇప్పుడు ఆయన దూరమయ్యాడు. అందుకే మన బాణాలకు శక్తి లేదు, మన హృదయాలకు ధైర్యం లేదు” అని అన్నాడు. ఈ సంఘటన అర్జునుడికి ఒక మహత్తర సత్యాన్ని బోధించింది. మనిషి ఎంత శక్తివంతుడైనప్పటికీ, దైవకృప లేకుండా శూన్యుడే. కృష్ణుడు అర్జునుడికి కేవలం రథసారథి మాత్రమే కాదు, జీవసారథి.
కృష్ణుడు ఉండగా అర్జునుడు విజయశిఖరాన్ని అధిరోహించాడు. ఆయన వెళ్ళగానే పరాజయాన్ని చవిచూశాడు. చివరగా అర్జునుడు తన సోదరులతో కలిసి హిమాలయ యాత్రను ఆరంభించాడు. భౌతిక విజయాలు తాత్కాలికమని, దైవసాన్నిధ్యం మాత్రమే శాశ్వతమని గ్రహించాడు. అతని హృదయంలో కృష్ణుడి స్మరణే చివరి శ్వాస వరకు నిలిచిపోయింది. ఈ కథ మనకు కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది: మన ప్రతిభ, శక్తి, కీర్తి అన్నీ తాత్కాలికం. దైవానుగ్రహమే శాశ్వత బలం. కృష్ణుడు లేని అర్జునుడు శూన్యుడు అయినట్లు, దైవస్మరణ లేని మనిషి కూడా శూన్యుడే.
