[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘అరుణోదయ కిరణాలు.. అక్షర తోరణాలు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అరుణోదయ కిరణాలు –
ఆకాశ గర్భాన ఆశల
అరచేతిని తెరిచే వెలుగుబాటలు
అక్షర తోరణాలు –
అంతరంగ గుమ్మాన ఆనందాన్ని
ఆహ్వానించే కవితామాలలు॥
ఆశల కిరణాలు –
అంధకార అంచులపై
ఉదయ కాలపు ఉత్సాహరేఖలు
ఆకలి మరణాలు –
అన్నం లేని కన్నీటి గడపలపై
ఆర్తనాదం రాసే వేదనలు॥
అనురాగ కిరణాలు –
ఆత్మల మధ్య ఆప్యాయతను
ఆవిష్కరించే వెచ్చని వెన్నెలలు
అనుభవాల ఆభరణాలు –
జీవితపు గుండెలపై తీపి జ్ఞాపకాల్ని
జతచేసే మల్లెల మాలలు॥
వేద కిరణాలు –
విశ్వవీధుల్లో ధర్మదీపాన్ని
వెలిగించే జ్ఞాన జ్యోతులు
శ్రీహరి చరణాలు –
శరణాగతి హృదయాల్లో
శాంతి పరిమళం చల్లే పుణ్యపదాలు॥
వెలుగు కిరణాలు –
వెలిసిన మనసులపై విశ్వాసాన్ని
విరజిమ్మే జ్యోతిర్మాలలు;
తెలుగు తోరణాలు –
తేనెలొలికే తల్లి భాషకు
తిలకమయ్యే అక్షరవల్లులు॥
మమతల కిరణాలు –
మనుషుల మధ్య
మధురమైన
బంధాల్ని బలపరిచే
బంగారు వెలుగులు
మంగళ తోరణాలు –
ముంగిట మానవత్వాన్ని నిలిపే
శుభసూచక పచ్చని హారాలు॥
కలల కిరణాలు –
కనురెప్పల గడపపై కాంతి
పూలను కురిపించే
ఇంద్రధనుస్సులు
అలల తోరణాలు –
సముద్ర హృదయంలో సంగీత
తరంగాలను అల్లే సజీవ స్వప్నాలు॥
విజ్ఞాన కిరణాలు –
విద్యా మార్గాల్లో విచక్షణను
వెలిగించే విజేత దీపాలు;
విజయ తోరణాలు –
విరమించని ప్రయత్నాలకు
గుమ్మాన కట్టే గౌరవ హారాలు॥
అక్షర తోరణమంటే –
పదాలను పేర్చిన పంక్తులు కాదు
మనసుల ముంగిట మంగళకరంగా
వేలాడే మానవత్వ స్వాగతమాల॥
జయీభవ విజయీభవ –
జ్ఞాన దీప్తితో జనజీవనాన్ని వెలిగించు…
అక్షర తోరణాలతో ఆశల ఆవరణం అల్లుతూ
సాహిత్య సౌరభం ప్రపంచమంతా పరుచు॥
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
