[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘అ..సామాన్యుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అవును అతను అమాయకుడే
ఏ రాయితీలు ఇవ్వకున్నా
ఏ రిజర్వేషనుకు నోచుకోకున్నా
మోముపై చిరునవ్వు చెరగనీక
నిత్యం పరుగులు పెడుతున్నా అలుపెరుగడు!
అవును అతను ధీరుడే
ఆర్థిక మాంద్యం కమ్ముకున్నా
అక్రమార్కుల మధ్య అను నిత్యం ఉంటూనే
తన పొదుపు ఖాతానే నమ్ముకుని
బ్రతుకు బండిని లాగే నిత్య శ్రామికుడు!
అవును అతను స్థితప్రజ్ఞుడే
ఎన్ని సంఘర్షణలు చెలరేగినా
ఎందరు స్వార్ధానికి రెచ్చగొడుతున్నా
శాంతి, సహనమే తన అస్తిత్వముగా
నిలకడైన సమాజానికి కనిపించని పునాది!
క్రమం తప్పక సుంకమిచ్చుకొను విధేయుడు.
తాను ఓ పక్క వెలిసిపోతున్నా
తన వారి జీవితానికి మెరుగులద్దుతూ
అంతగా గుర్తింపుకు నోచుకోని
అసామాన్యుడు.. మధ్య తరగతి మానవుడు!!
