Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అసామాన్య గానకోకిల: యస్ జానకి

[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీ సారధి మోటమఱ్ఱి.]

తన గాన మాధుర్యంతో, ఆ గొంతులోని ఆర్ద్రతతో తెలుగువారిని, దక్షిణాది వారిని దశాబ్దాలుగా అలరించిన గానకోకిల, యస్ జానకి గారు జూలై 11, 2026న స్వర్గారోహణ చేశారనే విషాద వార్త తెలిసింది. ఆమె ఆమెయే! మరి ప్రతిలేని గాయని అని మన అందరి భావన! అందులకే అందరి ఆవేదన. ఆమె మహాభినిష్క్రమణం పాటను ప్రేమించే ప్రతి దక్షిణాది వ్యక్తిని కలచివేసినది అనేది నిజం. ఆమెకు నివాళిగా ఒక ఆగష్టు 1, 2026 న ఒక ప్రత్యేక సంపుటి, అభిమానుల స్పందనలతో వెలువరించాలని, సంచిక సంపాదకవర్గం ఇచ్చిన పిలుపు మేరకు, స్పందించి, మాకు సకాలంలో తమ తమ రచనలు అందించిన వారందరికీ, మా ధన్యవాదాలు. జానకి గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని తెలియచేసే ఆ అనుభూతులు ఇక్కడ పొందుపరుస్తున్నాము. జానకి గారి, తెలుగు సినీ గాన ప్రస్థానంపై ఒక విహంగ వీక్షణ ఇక్కడ అందచేస్తున్నాము. ఇందు పొందుపరిచిన గణాంకాల కూర్పుకు మూల వివరాలు అందించిన వారు, తెలుగు సినిమాలపై, సినీపాటలపై అశేష కృషి చేసిన, మా సిడ్నీ వాస్తవ్యులు, డా. ఊటుకూరి సత్యనారాయణ గారు. వారికి మా ధన్యవాదాలు. జానకి గారు, తెలుగులోనే కాక, తమిళ, కన్నడ, మళయాళ, ఒరియా, హిందీ, తుళు లాంటి అనేక భాషలలొ వేలాది పాటలు పాడారు.

(యస్. జానకి గారి చిత్రాలను అందించినవారు, శ్రీ పెమ్మరాజు రవికిషోర్ గారు, వారికి మా ధన్యవాదాలు).

కె.బి. తిలక్ గారు రూపొందించిన యం. యల్. ఏ. చిత్రం ద్వారా 1957 లో తెలుగు చిత్రసీమలో అడుగిడక ముందే, టి. చలపతిరావు స్వరకల్పనలో తమిళ చిత్రంలో పాడారు. 44 సంవత్సరాల సుధీర్ఘ తెలుగు చలనచిత్ర ప్రయాణంలో, సుమారు 1,307 చిత్రాలలో, 2,765 పాటలు పాడారు (2001 – 2011 సంవత్సరాల మధ్య 5 సినిమాలకు 10 పాటలు మాత్రమే పాడారు, చూ. గణాంక పటం-2). ప్రతి పాటకు ఒక ప్రత్యేకత నింపుకున్న గాయని. నిజానికి, ప్రత్యేకత, ఒక మెరుపు, ఒక మలుపు, ఒక క్లిష్టత ఉన్న పాటలకు, జానకి గారే చిరునామా, ట్రేడమార్క్ అనేది అందరికి తెలిసిందే! తొలి పాట పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత నిర్దేశకత్వం లోని ఆరుద్ర గారి, “నీ యాస, అడియాస, చై జారే మణిపూస” నుండి, ప్రతి పాట మన మదిలో ఒక అనుభూతి నింపేవే!

అనితర సాధ్యమైన సాహిత్యం, సంగీతంతో మిళితమైన కొన్ని పాటలు:

ఆత్రేయ సాహిత్యం “కోడెకారు చిన్నవాడ, వాడి చూపుల వన్నెకాడ”;  “సిరిమల్లె పూవల్లే నవ్వు”; “కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు”; “పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు”;
ఆరుద్ర పద నర్తన “నీ లీల పాడెద దేవా”; “ఎవరేమన్నను తోడురాకున్నను”; “నీలి మేఘాలలో”;
సముద్రాల “నరవర ఓ కురువర”;
సి నా రే భావన “పగలే వెన్నెల, జగమే ఊయల”; “గున్న మామిడి కొమ్మ మీద”; “ఘల్లు ఘల్లున”;
దాశరధి సృజన “నడిరేయి ఏ ఝాములో”; “నీకేల ఇంత నిరాశ”; “పిలిచిన పలికే దేవుడవయ్యా”;
వేటూరి కలం నర్తన “సిరిమల్లె పూవా”; “సామ జవర గమన”: “గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన”; “ఈ దుర్యోధన దుశ్శాసన”; రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…”;
సిరివెన్నెల పులకింత “పారా హుషార్”; “కొత్తగా రెక్కలొచ్చేనా”;

మధురమైన గళంలో క్లిష్ట భావాలను అలవోకగా పలికించి, తెలుగువారి మదిలో కలకాలం నిలిచిపోయిన గాయనీ శిరోమణి, జానకి గారు, ఆది నుంచి ఆకాశం మూగదే అంటూ, ఆ గగన వీధుల్లోకి పయనమైన వేళ, అభిమానులు బాధ పడటం సహజం. కానీ, ఆమె లేకపోయినా,  ఆ పాటలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి, ఇది సత్యం! “నీ లీల పాడెద దేవా” పాటను, “నేనేల పాడెద” అని చిట్టి అరుణాచలం గారి సన్నాయికి ధీటుగా పాడి, అందరినీ ఆశ్చర్యంలో ముంచిన జానకిగారు, 2007 వ సంవత్సరంలో సిడ్నీ వచ్చినప్పుడు, మా తెలుగు అసోసియేషన్ ద్వారా ఆమెకు రాసిన జ్ఞాపికలో, నేను గాన కోకిల అని సంబోధిస్తే (చూ. చిత్రం-1), ఆ బిరుదు సుశీల గారికి ఉందికదా, బాగుండదేమోనని మొహమాట పడ్డ సౌజన్యశీలి ఆమె.

జానకి గారి పాటల ప్రస్థాన విశ్లేషణ

జానకి గారు పాడిన మొత్తం పాటల వివరాలు, సేకరించి, మదించి, వాటిని వార్షిక, రచయిత, సంగీత దర్శకులు, నిర్మాత, దర్శకులు విభాగాలుగా క్రోడీకరించి, చేసిన విశ్లేషణ మీ ముందు ఉంచుతున్నాను. గణాంక పటాలు 1 & 2, జానకి గానం చేసిన మొత్తం తెలుగు పాటల వివరాలు తెలియచేస్తుంది. దశాబ్దాల వ్యవధిలో, తెలుగులో ఆమే పాడినవి 2,765 పాటలు, 1,307 చిత్రాలకు. ఆమె పాటలు వేలల్లో ఉంటాయి అనుకునే వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, మూల అంకెల ఆధారంగా, ఘంటసాల ఇంచుమించు 2,500 పాటలు, బాలు 9,754 పాటలే పాడారు. ఆవిధంగా ఘంటసాల కన్న కొంచెం ఎక్కువ పాటలే పాడారు. ఇక మిగతా భాషలలో ఎన్ని ఉన్నాయనేది వేరే పరిశోధన. జానకి తన ప్రస్థానంలో సాలుకు సగటున 30 చిత్రాలకు, 63 పాటలు పాడారు (పట్టిక-1). ఆ వివరాలు ప్రకారం 1988 లో జానకి తెలుగులో  అత్యధికంగా 76 చిత్రాలకు 186 పాటలు పాడారు. కారాణాలు ఏమైనా, ఆ తరువాత సంవత్సరాలలో ఆమె పాడిన పాటల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది (గణాంక పటం-1). బహుశా, చిత్ర గారి చిత్ర ప్రవేశం కావచ్చు. తన గాన ప్రస్థానంలో ఆమె 137 గేయ రచయితలు, 123 సంగీత దర్శకులు, 133 సహ గాయకులతో పనిచేశారు. అది ఆమెకు అందిన చక్కటి అనుభవానికి సూచిక.

పట్టిక-2 ప్రకారం, గణనీయంగా ఆమె పాటలలో 28 శాతం (790 పాటలు) వేటూరి గారివే. ఆ తరువాత స్థానంలో సినారే (319 పాటలు, 12%), ఆత్రేయ (185 పాటలు, 7%) వస్తారు. ఒక విధంగా జానకి తెలుగుపాటలు అత్యధికంగా 1980 దశకంలోనే పాడారు (గణాంక పటం-1). అంటే అంతకు ముందు తరానికి పరిచయం అయినా, ఆమెకు అత్యధిక అవకాశాలు మలి దశలోనే వచ్చాయి. కె విశ్వనాధ్, చక్రవర్తి, ఇళయరాజా లాంటి వారి ప్రోత్సాహం, మారిన సాహిత్య, సంగీత, సాంఘిక పరిస్థితులు కూడా కారణం కావచ్చు.

ఇంకొక ముఖ్య విషయం, అందరూ అంటూ ఉంటారు, జానకి గారికి ఇళయరాజా అత్యధికంగా అవకాశాలు ఇచ్చారని. కానీ, గణాంకాలు చూస్తే, ఆమె చక్రవర్తి సంగీత సారధ్యంలో అత్యధికంగా 466 పాటలు పాడారు (అంటే 17% అన్నమాట). ఆ తరువాత సత్యం (393 పాటలు, 14%), మూడవ ర్యాంక్ లో ఇళయరాజా వస్తారు (288 పాటలు, 10.5%).

పట్టిక-3 ప్రకారం, జానకి గారు తాను పాడిన 1,302 చిత్రాలలో  వై. వి. రావు గారి నిర్మాణంలో వచ్చినవి అత్యధికం (18 చిత్రాలు). ఆ తరువాతి వరుసలో రామోజీ రావు (15), డి. రామానాయుడు (14), జయకృష్ణ (14) వస్తారు. అలాగే ఆమెకు అవకాశం ఇచ్చిన దర్శకులలో అగ్రస్థానంలో ఉన్నవారు దాసరి (48), ఆ తరువాత ఏ. కోదండరామి రెడ్డి (38), కె. యస్. ర్. దాస్ (38), కె. రాఘవేంద్ర రావు (34) గార్లు. జానకి గారు కె. విశ్వనాధ్ గారి 13 చిత్రాలలో మాత్రమే పాడారు.

పట్టిక-4 ప్రకారం, ఆమె బాలు గారితో అత్యధికంగా 1,085 పాటలు అంటే ఆమె పాటలలో 40 శాతం పాడారు. ఆ తరువాత వరుసలో సుశీల (113), పి. బి. శ్రీనివాస్ (107) వస్తారు. ఘంటసాల గారితో 82 పాటలు పాడారు.

రాబోయే రోజులలో, జానకి గారి గాన ప్రస్థానంపై మరింత లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏ నటులకు అత్యధికంగా పాడారో, ఆమె ప్రస్థానం 1980 దశకంలో శిఖరాన్ని అంది, స్వల్ప కాలంలో ఎందుకు క్రిందకు వచ్చిందో లాంటి అనేక కోణాల ఆవిష్కరణ చేయవలసి ఉంది. అది త్వరలో చేయాలని, డా. వూటుకూరి గారి మరియు నా అభిమతం. సశేషం!

గణాంక పటం-1 : జానకి గారు పాడిన పాటలు/చిత్రాల వివరాలు (వార్షిక క్రమంలో)

గణాంక పటం-2 : జానకి గారు పాడిన పాటలు/చిత్రాల వివరాలు (2000 వ  సంవత్సరం తరువాత)

పట్టిక-1: యస్. జానకి సినిమా పాటల ప్రస్థానం

పట్టిక-2: యస్. జానకి: గేయ రచయితలు మరియు సంగీత దర్శకులతో అనుబంధం

ర్యాంక్ గేయ రచయితలు (137) పాటలు సంగీత దర్శకులు  (123) పాటలు
  మొత్తం పాటలు (1957-2000) 2,755   మొత్తం పాటలు (1957-2000) 2,755
1 వేటూరి 790 చక్రవర్తి 466
2 సి. నారాయణ రెడ్డి 319 సత్యం 393
3 ఆత్రేయ 185 ఇళయరాజా 288
4 ఆరుద్ర 155 రాజ్-కోటి 163
5 రాజశ్రీ 134 కె. వి.  మహదేవన్ 117
6 వీటూరి 97 యస్. పి. కోదండపాణి 86
7 దాశరధి 81 యస్. రాజేశ్వర రావు 80
8 సిరివెన్నెల 81 పెండ్యాల 79
9 శ్రీ శ్రీ 80 రమేశ్ నాయుడు 72
10 గోపి 61 టి. చలపతిరావు 71
11 కొసరాజు 52 రాజన్-నాగేంద్ర 66
12 అనిశెట్టి 47 ఘంటసాల 51
13 జాలాది 40 జె. వి. రాఘవులు 49
14 దాసరి 38 యస్. పి. బి. 47
15 జొన్నవిత్తుల 38 హంసలేఖ 43
16 వెన్నెలకంటి 32 టి. వి. రాజు 36
17 సముద్రాల 28 జి. కె. వెంకటేష్ 35
18 దేవులపల్లి 26 యం. యస్. విశ్వనాధన్ 33
19 సముద్రాల జూనియర్ 26

 

పట్టిక-3: యస్. జానకి: నిర్మాతలు మరియు దర్శకులతో అనుబంధం

ర్యాంక్ నిర్మాతలు పాటలు దర్శకులు పాటలు
మొత్తం సినిమాలు (1957-2000) 1,302   మొత్తం సినిమాలు (1957-2000) 1,302
1 వై. వి. రావు 18 దాసరి నారాయణ రావు 46
2 రామోజీ రావు 15 ఏ. కోదండరామి రెడ్డి 38
3 డి. రామానాయుడు 14 కె. యస్. ర్. దాస్ 38
4 జయకృష్ణ 14 కె. రాఘవేంద్ర రావు 34
5 బి. విఠలాచార్య 10 కోడి రామకృష్ణ 25
6 శ్రీకాంత్ నహతా 10 వి. మధుసూధన రావు 23
7 సుందరలాల్ నహతా 9 పి. చంద్రశేఖర్ రెడ్డి 22
8 యు. విశ్వేశ్వరరావు 9 సింగీతం శ్రీనివాసరావు 22
9 యం. యస్. రెడ్డి 9 సి. యస్. రావు 21
10 అల్లు అరవింద్ 9 జంధ్యాల 21
11 కె. మహేంద్ర 8 బి. విఠలాచార్య 19
12 డూండీ 8 రేలంగి నరసింహా రావు 17
13 మిద్దే రామారావు 8 రవిరాజా పినిశెట్టి 15
14 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి 8 యస్. డి. లాల్ 14
15 బి.ఆర్. పంతులు 7 ఏ. మోహనగాంధీ 14
16 ఏ. వి. సుబ్బారావు 7 ముత్యాల సుబ్బయ్య 13
17 బి. యస్. రంగా 7 బి. వి. ప్రసాద్ 13
18 పి. బాబ్జీ 7 కె. విశ్వనాధ్ 13
19 కె. హేమంబరధర రావు 12

పట్టిక-4: యస్. జానకి: సహ గాయకులతో అనుబంధం

ర్యాంక్ సహ గాయకులు పాటలు
  మొత్తం పాటలు (1957-2000) 2,755
1 యస్. పి. బాలు 1,085
2 పి. సుశీల 113
3 పి. బి. శ్రీనివాస్ 107
4 ఘంటసాల 82
5 మనో 51
6 యస్. పి. శైలజ 25
7 మాధవపెద్ది 22
8 పిఠాపురం 21
9 రమేశ్ 21
10 ఆనంద్ 21
11 యల్. ర్. ఈశ్వరి 19
12 రామకృష్ణ 18
13 రాజ్ సీతారాం 17
14 బి. వసంత 17
15 వాణీ జయరాం 12
16 ఏసుదాసు 12
17 జిక్కి 12

 

చిత్రం-1: 2007 లో సిడ్నీ తెలుగు అసోసియేషన్ యస్. జానకి అందించిన జ్ఞాపిక

 చిత్రం-2: యస్. జానకి గారికి జ్ఞాపిక ప్రధానం, సిడ్నీ-2007

చిత్రం-3: యస్. జానకి, రూపకల్పన శ్రీ పెమ్మరాజు రవికిషోర్

Exit mobile version