నలందరాజు విద్యాపతికి సాహిత్యం, కౕళల పట్ల ఎంతో ఆసక్తి. కవులు, రచయితలు, కళాకారులను ఎంతో ప్రోత్సహించేవాడు.
రచయితల రచనలు సేకరించి గ్రంథస్తం చేయిస్తే ఆ రచనలు కాలగర్భంలో కలసిపోకుండా కలకాలం నిలబడి భావితరాల వారికి తెలుస్తాయని ఆ రచయితల పేరు సుస్థిర మవుతుందని ఆయన ఆలోచించాడు. అనేకమంది రచయితల, కవుల గ్రంథాలు సేకరించి తన గ్రంథాలయంలో భద్రపరిచాడు. కొంతమందికి మంచి కథ చెప్పగల సత్తా ఉంటుంది, వారు వ్రాయలేక పోవచ్చు. అందుకే అటువంటి వారు రాజుగారి వద్దకు వచ్చి అద్భుతంగా తమ సొంత కథ చెబితే చెప్పినవారికి మంచి పారితోషికం, ఆ కథను గ్రంథస్తం చేయించి తన గ్రంథాలయంలో భద్రపరుస్తానని చాటింపు వేయించాడు. కానీ వేరే రచయితల కథలు, కవిత్వం చెప్పకూడదని, కేవలం స్వంతమైనవి మాత్రమే చెప్పాలని చాటింపు వేయించాడు.
అనేక మంది ఔత్సాహికులు రాజు గారి వద్దకు వచ్చి కథలు చెప్ప సాగారు. అత్యుత్తమంగా ఉన్న వాటిని గ్రంథస్తం చేయించి,తగిన పారితోషికం ఇచ్చి పంపసాగారు రాజు.
ఈ విషయం పక్క ఊరిలోని జలంధరుడుకి తెలిసింది. జలంధరుడు కథలు వ్రాయలేడు, కానీ చదివిన కథ చెప్పగలడు. ఏది ఏమైనా రాజుగారికి ఒక కథ చెప్పి మంచి బహుమతి పొందాలనుకున్నాడు. అందుకోసం తన ఊర్లోనే ఉన్న ఒక గ్రంథాలయంలో కథల పుస్తకాలను పరిశీలించాడు. అందరు రచయితలు రాజుగారికి తెలియదు కనుక ఏదో ఒక మంచికథ చదివి దానిని మార్చి రాజుగారికి చెబితే అది తన సొంత కథే అని నమ్మి రాజావారు మంచి బహుమతి ఇస్తారనే ఆలోచించి, కథల పుస్తకాలలో శివనాథుని కథల పుస్తకంలో ఓ మంచి కథను ఎంపిక చేసి శ్రద్ధగా చదివి అర్థం చేసుకుని గుర్తు పెట్టుకున్నాడు. అయితే కథలో పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు మార్చి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
మరునాడు రాజావారి వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని మంచి కథ చెబుతానని విన్నవించాడు.
రాజావారు జలంధరుణ్ణి తన ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టి కథ చెప్పమన్నారు.
జలంధరుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.
పూర్వం ఆరావళీ పర్వత ప్రాంతంలో ఉన్న శ్రీపురంలో జగపతి, గణపతి మంచి స్నేహితులు. వారు ఒక పురాతన గ్రంథం చదివితే ఆరావళీ పర్వతాలలో ఉత్తర శిఖరాగ్రాన బంగారం ఉన్నట్టు వారికి తెలిసింది. ఏది ఏమైనా ఆ బంగారు తాము తెచ్చుకుంటే ధనవంతులై పోవచ్చనని ఆలోచించి వారు ఉత్తర పర్వతం వైపు వెళ్ళసాగారు. అలా అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాక్షసుడు వారికి కనబడ్డాడు. ఆ రాక్షసుడు ఒక పెద్ద నవ్వు నవ్వి “ఆరావళిలో బంగారు పర్వతం దగ్గరకు వెళుతున్నారా? నేను మనిషిగా ఉన్నప్పుడు ఆ బంగారు పర్వతం దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు నన్ను బంగారం తీసుకుని ఏంచేస్తావు? అని అడిగాడు. నేను ధనవంతుడనయి అనేక సుఖాలు అనుభవిస్తానని చెప్పాను. అయితే నీ వలన ఎవరికీ మేలు లేదు, నీది స్వార్థ బుద్ధి. ఆ బుద్ధి వలన నీవు రాక్షసుడిగా మారిపోతావు అని చెప్పాడు. అందుకే రాక్షసుడిగా మారిపోయాను” అని చెప్పి, “ఇప్పుడు చెప్పండి, మీరు బంగారాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?” అని అడిగాడు.
“మా ఊరి వారికి ఉపయోగపడే పనులు చేస్తాం, బీదలకు సహాయం చేస్తాం” అని చెప్పారు.
“అలా చెయ్యకపోతే మీరిద్దరు రాక్షసరూపులై అడవిలో పడిపోతారు” చెప్పాడు రాక్షసుడు.
“ఆపు నీ కథ… మిగతా కథ నన్ను చెప్పనీ” అని రాజుగారు ఈ విధంగా చెప్పారు.
“నీ కథలో వారికి రాక్షసుడు తారసపడి బంగారం మంచికి ఉపయోగించకపోతే రాక్షసులుగా మారి పోతారని చెప్పాడు, కానీ వారికి అక్కడ రాక్షసుడు తారస పడడు. కౌండిన్య మహర్షి ఎదురుపడి “నాయనలారా మీరు ఎక్కడో కొండమీద ఉన్న బంగారం కోసం ప్రయాస పడిపోతున్నారు. నిజానికి అక్కడ బంగారం ఉందో లేదో ఎవరికీ తెలియదు. అసలు ఆ కొండ మీద రాళ్ళు సూర్యరశ్మికి బంగారంలా మెరుస్తూ ఉండవచ్చు, ఎందుకంటే బంగారు కేవలం భూమి గనుల్లో దొరుకుతుంది. కొండల మీద రాళ్ళ మీద పేరుకుని ఉండదు. ఆలోచించండి, కష్టపడి సంపాదించినదే నిజమైన బంగారం అని వారికి వివరించాడు కౌండిన్య మహర్షి.”
రాజుగారు చెప్పిన కథ మలుపు విని జలంధరుడు లేచి నిలబడి రాజుగారికి నమస్కారం పెట్టాడు. ఎందుకంటే రాజుగారు శివనాథుడు వ్రాసిన కథే చెప్పారు. అదే అసలు కథ.
“నన్ను క్షమించండి మహారాజా, అది శివనాథుడి కథే, బహుమతి కోసం బుద్ధి గడ్డి తిని కథ మార్చి చెప్పాను” అని తల వంచుకున్నాడు.
“నీవు కథ మొదలు పెట్టి పది వాక్యాలు చెప్పగానే అది నీ కథ కాదనీ శివనాథుని కథ అని గ్రహించాను. ఆ శివనాథుని కథల పుస్తకం నా దగ్గర ఉంది. నీవు కథ మార్చి చెప్పి నన్ను మోసం చెయ్యాలని చూశావు. బహుమతి కోసం కళలలో కానీ, జీవితంలో కానీ ఎవరినీ మోసంచెయ్యకూడదు. మోసం ఎప్పటికీ దాగదు. న్యాయంగా నీ ప్రతిభతో ఏ బహుమతినైనా, బిరుదైనా గెలుచుకోవాలి. అయినా నీకు బహుమతినిస్తున్నాను.ఎందుకంటే కథ మార్చి చక్కగానే చెప్పావు, కౌండిన్య ఋషి బదులు, రాక్షసుణ్ణి కథలో పెట్టావు. నీకు సృజనాత్మక శక్తి ఉంది, దానిని సక్రమంగా వినియోగించు. మంచి కథలు వ్రాయడానికి ప్రయత్నించు” అని జలంధరుడికి తగిన విధంగా చెప్పి పంపాడు.
అప్పటి నుండి జలంధరుడు అనేక కథల పస్తకాలు చదివి ఆయా రచయితల మెళకువులు తెలుసుకుని, తాను స్వంతంగా మంచి కథలు వ్రాయడానికి ప్రయత్నించసాగాడు.