[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 15వ అధ్యాయం 3, 4వ శ్లోకాలు:
న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా।
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్ అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా॥
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥
ఓ అర్జునా, ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిజ స్వరూపము గ్రహించడం ఈ జగత్తులో ఎవ్వరికీ సాధ్యం కాదు. దాని యొక్క మొదలు, చివర, లేదా దాని యొక్క సనాతన అస్తిత్వము కూడా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు యొక్క రహస్యం అంతా కూడా ఈ అశ్వత్థ వృక్షంలోనే వుంది. భగవంతుడిని పొందేందుకు లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే సాధకులు ఖండించి వేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. ఈ సకల చరాచర సృష్టికి కారణభూతుడైన ఆ భగవంతుడు ఈ వృక్షం యొక్క మొదలులో వుంటాడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము. అయితే ఈ మొదలు కాకుండా ఆ వృక్షం యొక్క ఆకులు, కాండంను వెదికేవారు ఈ భౌతిక జగత్తులో భోగభాగ్యాలను అనుభవించేవారితో సమానం. వారికి భగవంతుడిని పొందదం ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే భౌతిక ప్రపంచంలో శాశ్వతమైన స్థానాన్ని వెతకడం వ్యర్థమని, భౌతిక బంధనాలను ఛేదించి, భగవంతునిపై ఆధారపడటమే నిజమైన మోక్షమని ఈ శ్లోకాల ద్వారా భగవానుడు మానవాళికి బోధిస్తున్నాడు.
ఈ అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వేదాలలో చక్కగా వివరింపబడి వుంది. అశ్వత్థ వృక్షము ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడూ మార్పుకి లోనవుతూనే ఉంటుంది. భౌతికమైనవన్నీ అశాశ్వతములే. శాశ్వతమైనది, నిత్యమైనది కేవలం భగవంతుడు మాత్రమే. గాలి లేకపోయినా దీని ఆకులు కదులుతూనే ఉంటాయి. ఈ అశ్వత్థ వృక్షానికి వేళ్ళు పైన ఉంటాయి. దాని కొమ్మలు క్రింది వైపుగా ఉంటాయి. ఇది ఎప్పటికీ నాశనము అవ్వదు. ఈ వృక్షం యొక్క చిగుళ్ళు శబ్దము, స్పర్శ, రూపము, వాసన, రుచి అను ఐదు విషయములుగా ఉంటాయి. ఇవి నిరంతరము పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త శబ్దములు, అలాగే కొత్త కొత్త విషయాలన్నీ మన జీవితంలోకి వస్తూ, వెళ్తూ ఉంటాయి.
ఈ జగత్తు అనే వృక్షానికి ఏ రూపమూ ఉండదు. దీనికి మొదలు, చివర అనేవి ఉండవు. ఇది ఎక్కడా మనకు కనిపించదు. ఇది ఎక్కడా ఒకచోట ఉండదు. ఈ దృఢమైన వృక్షాన్ని మనము విషయాలన్నింటికీ దూరం అవడం వలన నరకవచ్చును. అనగా మనలోనున్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిని దూరం చేసుకుంటూ వెళ్లాలి. మంచి అలవాట్లు నేర్చుకోవడం, సత్ప్రవర్తన అలవరచుకోవడం వలన మనము భగవంతుడికి దగ్గరగా చేరుకుంటాము అనే అంశాని శాస్త్రం ఈ సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పింది.
ప్రకృతి త్రిగుణములను కలిగి ఉన్న నా దైవీ శక్తి మరియు మాయలను అధుగమించడం కడు దుర్లభం. అయితే ఎవరైన ప్రశాంత మనస్కులై, చిత్తశుద్ధితో మోక్షేచ్చతో నాకు శరణాగతి చేస్తారో వారు ఈ సంసారమును సులభంగా అధిగమించగలరు అని స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మానవాళికి ఒక చక్కని సులభతరమైన ఉపాయం చెప్పారు కాబట్టి ఆ సర్వేశ్వరుడిని ఆశ్రయించడం అంటే ఈ అశ్వత్థ వృక్షము కొట్టివేయడం. అప్పుడు తిరిగి ఈ భూలోకమునకు రావలసిన అవసరం లేదు అంటే తిరిగి పునర్జన్మ వుండదు, మరియు మనం మరణించిన పిదప ఆయన యొక్క దివ్య ధామమునకు చేరుకుంటాము.
