Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్మథనానికి అక్షర రూపం ‘అసంగత’ కథాసంపుటి

[శ్రీమతి మణి వడ్లమాని గారి ‘అసంగత’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారి 4వ కథాసంపుటి ‘అసంగత’. ఇవి అబ్సర్డ్ కథలు. “The absurd is born of this confrontation between the human need for meaning and the unreasonable silence of the word.” అనే ఆల్బర్ట్ కాము కొటేషన్‌ని చివరి అట్టపై ఇచ్చారు.

అబ్సర్డ్ కథలంటే – సృష్టిలో ఎలాంటి అర్థం లేదని, జీవితంలో గమ్యాన్ని వెతకడం వృథా ప్రయాసని చూపే కథలు. మానవుడు ప్రతిదానికి ఒక లాజిక్ వెతుకుతుంటాడు, కానీ ఈ ప్రపంచం మాత్రం ఎంతో విచిత్రంగా, అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథల ముఖ్య ఉద్దేశం.

ఈ శైలి ఎందుకు పుట్టిందని తర్కిస్తే, రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో జరిగిన ఘోరాల తర్వాత, మనుషులకు దేనిమీద నమ్మకం లేకుండా పోయింది. అప్పుడు ఆల్బర్ట్ కాము (Albert Camus) లాంటి తత్వవేత్తలు ఈ ‘అబ్సర్డిజం’ సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. ప్రపంచంలో ఎలాంటి అర్థం లేదని గ్రహించి, ఆ విషయాన్ని అంగీకరిస్తూనే.. ధైర్యంగా, సంతోషంగా జీవించడమే దీని వెనుక ఉన్న అసలు తత్వం.

కొన్ని ప్రముఖ ఉదాహరణలు:

కాఫ్కా రాసిన ‘ది మెటమార్ఫసిస్’లో ఒక రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఒక వ్యక్తి పెద్ద పురుగులా మారిపోతాడు. అతను ఎందుకు అలా మారాడనే లాజిక్ కథలో ఉండదు. కానీ ఆ వింత పరిస్థితిని అతని కుటుంబం ఎలా చూసింది అనేదే కథ.

Samuel Beckett రచించిన ‘వైటింగ్ ఫర్ గోడో’లో ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన ‘గోడో’ అనే వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అతను ఎవరో, ఎందుకు రావాలో ఎవరికీ తెలియదు. చివరి వరకు అతను రాడు, వీరు నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు.

~

అబ్సర్డ్ కథలలో సాధారణ కథల్లో కనబడే పద్ధతి, కథానిర్మాణం ఉండవు. సాధారణంగా జరిగే కారణం-ఫలితం (Cause and effect) సూత్రం ఇక్కడ పనిచేయదు. ఏ సంఘటన అయినా అకస్మాత్తుగా, విచిత్రంగా జరిగిపోతుంది.

ఈ కథలలో పాత్రలు ఎంత కష్టపడినా చివరికి వారికి ఎలాంటి సమాధానాలు దొరకవు. జీవితం శూన్యం అనే భావన కనిపిస్తుంది. జీవితంలోని నిరాశను, కష్టాలను కొన్నిసార్లు విచిత్రమైన హాస్య రూపంలో చూపిస్తారు. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి ఉంటుంది (ఈ సంపుటి లోని కథల గురించి కాదు; జనరల్‍గా కొన్ని అబ్సర్డ్ కథలలో).

~

ఇక ఈ సంపుటిలోని కథలను పరిశీలిద్దాం. ఇందులో 12 కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే.

అంతుచిక్కని గందరగోళంలో ఉన్న వంశీ అనే చిత్రకారుడు, కాస్త ఉత్తేజం పొందడానికి ఎప్పుడూ వెళ్ళే క్లబ్‍కి వెళ్ళి తను ఎప్పుడూ కూర్చునే చోట కూర్చుంటాడు. ఇంతలో అక్కడి డాన్స్ ఫ్లోర్ మీద జరుగుతున్న నృత్య కార్యక్రమాన్ని చూస్తాడు. అందరిలోనూ ఒక యువతి భిన్నంగా కనిపిస్తుంది. కార్యక్రమం అయ్యాకా, ఆమెతో మాటలు కలుపుతాడు. ఆమె పేరు వర్ణ. ఆశ్చర్యంగా ఆమెకీ చిత్రలేఖనంలో ఆసక్తి/ప్రావీణ్యం ఉన్నట్టు, తమ ఇద్దరికీ ఫేవరెట్ పర్సన్ ఒకరేనని గ్రహిస్తాడు. అతనితో పాటు కారులో వస్తూ, వంశీకి ఎంతగానో ప్రేరణ కల్పించి, ఒక చోట కారు దిగి మాయమైపోతుంది వర్ణ. ఇప్పటి వరకూ జరిగినదంతా తన భ్రమా అని ఆశ్చర్యపోతాడు ‘వర్ణ’ కథలో.

‘రహస్య’ కథ మత్స్యకారులపై అల్లారు రచయిత్రి. నలుగురు జాలర్లు రాత్రి పూట సముద్రంలోకి వేటకి వెళ్తారు. వారి వలలో ఓ స్త్రీ చిక్కుతుంది. ఆమె మనిషనీ, లేదు మత్స్యకన్య అని వాదించుకుంటారు. ఆమె ఎవరైనా, సముద్రం గురించి బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఆమె రూపాన్ని చూసి కాంక్షించిన ముగ్గురిలో ఒకడు సముద్రానికే బలయిపోతాడు, మరొకడు ఒడ్డుకు చేరాకా గుండెపోటుతో మరణిస్తాడు. మరొకడికి మతి భ్రమించి సముద్రాన్నే కలవరిస్తూంటాడు. ఆమె బోధించిన జీవిత సత్యాన్ని అవగతం చేసుకున్న సత్తిబాబు మాత్రం రాత్రిళ్ళు ఒంటరిగా ఒడ్డు మీద కూర్చుని ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుని, హెచ్చరికని తలచుకుంటూంటాడు.

కొన్ని అరుదైన అనుభవాలకు అర్థం ఉండదంటూ ముగిసే ‘ఐ’ కథ అబ్సర్డ్ కథలకి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. తన నుంచి తాను విడివిడి, తనదైన ఆ రూపం తననే చూస్తూన్నట్లు అనిపించడం చిత్రమైన భావన. తర్వాతి కథ ‘వాడు – నేను’ ఇతివృత్తం, ‘ఐ’ కథ లానే ఉంటుంది, కొనసాగింపు అని కూడా అనుకోవచ్చు. బాహ్య రూపంలోని వ్యక్తి, లేమితో గడిచిన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడడు. ఎదిగిపోయి, పాత జీవితాన్ని అసహ్యించుకుంటున్న అతనికి – ఆనాటి ఆ వేదననీ, అతను జీవించిన విధానాన్ని గుర్తుచేస్తూ – గర్వం తలకెక్కకుండా చూడాలని ప్రయత్నిస్తుంది అతని ప్రతిరూపం.

కొందరు మిత్రులు, కారులో ప్రయాణం! ఒక చోట బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగుతారు. ఆ హోటల్ యాంబియెన్స్ బావుంటుంది. గోడలపై వ్రాయించిన కొటేషన్స్, హోటల్ యజమాని సాహిత్యాభిలాషని చాటుతాయి. ఏదైనా తిన్న తరువాత పది నిమిషాలు నడిచే అలవాటున్న స్వాతి, అక్కడే ఉన్న చిన్న పార్కులో నడిచి, కాసేపు ఓ బల్ల మీద కూర్చుంటుంది. చల్లని గాలికి ఆమెకి నిద్రపడుతుంది. అప్పుడామెకి కలిగిన అనుభవం పాఠకులకు గగుర్పాటు కలిగిస్తుంది. ‘రెప్పమూత’ కథ ఆసక్తిగా సాగుతుంది.

‘నైరూప్య’ కథ సెకండ్ పర్సన్ నెరటివ్‍లో సాగుతుంది. అనుభూతులను ఏవో హద్దుల పరిధిలో బంధించే ప్రయత్నం చేయకూడదంటుంది. లాక్‌డౌన్ కాలంలో ఎదురైన ఒంటరితనం నైరూప్యలో ఎన్నెన్నో భావాలను కలిగిస్తుంది, పురాస్మృతులను తట్టి లేపుతుంది. ఈ కథ గురించి రచయిత్రి ఏం చెప్పారో, ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవండి.

మృత్యుభయం ఎలా ఉంటుందో రేఖామాత్రంగా పరిచయం చేస్తుంది ‘ఇనుపచువ్వల దడి’ కథ. మరణానికి భయపడే మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ కథ చెబుతుంది.

ఓ ఈవెంట్ మానేజ్‌మెంట్ ఏజెన్సీలో కొత్త చేరిన దీప్తి, వాష్‌రూమ్‍లో అద్దంలో చూసుకుంటూండగా తన ప్రతిబింబం తనతో మాట్లాడుతుంది. మొదట దీప్తి భయపడినా, తానెక్కడికి వెళ్ళినా తన అంతరంగం తనతోనే ఉంటుందన్న వాస్తవం గ్రహిస్తుంది. స్వాతి అనే కొలీగ్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూంటే విని, ఆమెని చూడాలని ఎదురుచూస్తుంది దీప్తి. చివరికి ఆమె వచ్చాకా, ఆమెను చూసి భయంతో కేకపెడుతుంది. స్వాతితో పరిచయమై, ఆమె గతం తెలిసి, ఆమె చేసిన పోరాటం అర్థమైన తర్వాత, అద్దంలో చూసుకున్నప్పుడు తన ప్రతిబింబం – ‘నేను చెప్పాలనుకున్నవన్నీ స్వాతి చెప్పింది’ అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు ‘రిఫ్లెక్షన్’ కథలో.

ఒక నాటకంలో లేదా సాహిత్యంలో ఒక పాత్ర తన మనసులోని ఆలోచనలను ఎవరూ లేనప్పుడు గట్టిగా పైకి మాట్లాడుకోవడాన్ని ‘సోలొలోక్వీ’ అంటారు. తెలుగులో దీనిని ‘ఆత్మగతం’ లేదా ‘స్వగతం’ అని వ్యవహరిస్తారు. ఈ శీర్షికతో ఉన్న కథలో ఓ వ్యక్తి ఓ స్త్రీ గురించి, ఆమె కొడుకు గురించి తనలో తాను మాట్లాడుకుంటాడు. ఓ ముసలాయన కనబడి, ‘సశేషం’ అనే ఓ పుస్తకం ఇచ్చినట్టు, ఆ పుస్తకంలో ఆమె కథ ఉన్నట్టు అనిపిస్తుందతనికి. నిజానికి అతన్ని ఎవరీ కలవలేదు. కానీ పుస్తకం వచ్చింది. ఎలా? సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుందీ కథ.

‘రియాలిటీ పారడాక్స్’ కథలో రచయిత్రి ‘వాస్తవికత’, ‘భ్రమ’ల మధ్య ఉండే ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ కథ వ్రాయడం ఎందుకు కష్టమనిపించిందో రచయిత్రి ప్రత్యేక ఇంటర్య్వూలో చెప్పారు.

కష్టకాలంలో భరోసానిచ్చి, సాయం చేసిన వాళ్ళే దేవుళ్ళని అన్యాపదేశంగా చెబుతుంది ‘స్పర్శ – ది టచ్’ కథ. భీతావహుడై, ఉద్వేగం నిండి ఒత్తిడితో ఉన్న ఒక వ్యక్తి, తన వీపుపై ఏదో మానవాతీతమైన స్పర్శని గ్రహిస్తాడు. దాని వల్ల తనకెంతో సాంత్వన కల్గినట్టు గుర్తిస్తాడు. దాన్ని దేవుని స్పర్శగా భావిస్తాడు. అసలు రహస్యం తెలిసిన మిత్రుడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకుని మౌనంగా ఉండిపోతాడు.

‘మరో తలుపు’ మంచి కథ. జీవితంలోని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించే కథ. కలలో కనబడి ధైర్యం చెప్పిన వ్యక్తి, రోడ్డు మీద టీ షాపు వద్ద తారసపడినప్పుడు ‘అతను’ ఆశ్చర్యపోతాడు. ఆ విషయమే అడిగితే, మళ్ళీ కలుస్తాననీ చెప్పాను కదా అంటాడా వ్యక్తి. జీవితం నిజమైన విలువని స్ఫురింపజేస్తుందీ కథ.

~

మొదట ‘ఆఁ, ఏముందీ కథల్లో’ అనిపించినా, అన్నీ పూర్తి చేసే సరికి ‘అవును, ఏదో ఉందీ కథల్లో’ అని అనిపిస్తుంది. ప్రతీ కథకీ సముచితమైన శీర్షిక పెట్టారు. చక్కని సంభాషణలున్నాయి.

ఈ కథలు ఏవో నీతులు చెప్పడానికో లేదా అంతా బాగుందంటూ ముగియవు. కథ ముగిసినా, పాఠకుడి మనస్సులో ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.

కథల్లో హీరోలు, విలన్లు అంటూ ఎవరూ ఉండరు. నిజ జీవితంలో మనకు కనిపించే లోపాలు, బలహీనతలు ఉన్న సజీవమైన పాత్రలే ఇందులో కనిపిస్తాయి.

రచయిత్రి ఇతర పుస్తకాల్లో లానే, ‘అసంగత’ సంపుటిలో కూడా తాత్విక చింతన, మానసిక సంఘర్షణలు చాలా సహజంగా సాగుతాయి. కథల్లోని పాత్రల ప్రవర్తన, సమాజంలో మనుషుల మధ్య ఉండే అసంబద్ధమైన బంధాలు, ఆలోచనలను ఆసక్తికరంగా మలిచారు రచయిత్రి.

‘పాశ్చాత్య అస్తిత్వవాదం’ ఛాయలు కొన్ని కథల్లో కనబడతాయి. పాత్రలు తాము తీసుకునే నిర్ణయాలకు దేవుడినో, విధిని లేదా సమాజాన్ని నిందించవు. తాము తీసుకున్న కఠినమైన నిర్ణయాల తాలూకు బరువును, బాధను ఆ పాత్రలే అనుభవిస్తాయి. “మీ జీవితానికి మీరే బాధ్యులు” అనే అస్తిత్వవాద సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

మనిషి మనస్సులోని నిగూఢమైన ఆలోచనలు, భయాలు, ఇంకా అంతర్మథనాన్ని రచయిత్రి అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలో మనుషుల మధ్య పెరిగిపోతున్న కృత్రిమ బంధాలు, ఒంటరితనం, సామాజిక అంచనాల వెనుక ఉన్న అసంతృప్తిని ఈ సంపుటి పాఠకుల ముందుంచుతుంది.

***

అసంగత (అబ్సర్డ్ కథలు)
రచన: మణి వడ్లమాని
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 86
వెల: ₹ 120/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
అచ్చంగా తెలుగు ప్రచురణలు
8558899478 (వాట్సప్ మాత్రమే)
~
ఆన్‌లైన్‌లో:
https://books.ataka.in/products/asangata-%E0%B0%85%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%A4?

~
మణి వడ్లమాని గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mrs-mani-vadlamani/

Exit mobile version