[ప్రముఖ కవి నీరజ్‌గారితో అశోక్ అంజుమ్ గారు జరిపిన ముఖాముఖిని అనువదించి అందిస్తున్నారు డా. టి. సి. వసంత.]
అశోక్ అంజుమ్: ‘గజల్’ అంటే ఏమిటి? పరిభాష చెప్పండి. దీనిని ప్రాణతత్వం ఏమిటి?
నీరసోజ్: ‘గజల్’ ఉర్దూ కావ్యంలోని ఒక ప్రక్రియ. మర్యాద దాని స్వభావం. శతాబ్దాల కింద నుండి గజల్ పరిభాషని ఈ విధంగా చెబుతూ వస్తున్నారు. ‘బదనామ్ గుఫ్తగూ కర్నన్’. అంటే ప్రియరాలితో మాట్లాడే ఒక కళ. ఈ పరిభాషలో గజల్ గుణాలన్నీ నిబిడీకృతం అయి ఉన్నాయి. ప్రేయసితో ఎప్పుడు ప్రేమగానే మాట్లాడుతారు. ప్రేమ అర్థమే ‘రసం’. రసం గజల్‌కి ఉండే ముఖ్యతత్వం. ప్రేయసితో మృదుమధురంగా వినమ్రంగా మాట్లాడతారు. బెత్తం పట్టుకుని బెదిరిస్తూ కాదు. అందువలన మర్యాద మృదు మధురత గజల్‌కి ఉండే రెండో గుణం. ప్రేమతో తక్కవగా మాట్లాడటం, కళ్ళతో సైగలు చేయడం దీని మూడో గుణం. అంటే అర్ధం గజల్ సంకేతాలతో సైగలతో చేస కవిత్వం. ప్రేమగా మాట్లాడేటప్పుడు మనస్సులోని మాట అంతర్లీనం అయి ఉంటుంది. అందువలన వ్యక్తిగతం అంటే పర్సనల్ ఎలిమెంట్ కూడా గజల్ నాలుగో గుణం. సూక్ష్మంగా, సంక్షప్తంగా ఉండాలి. ఇది ఐదో గుణం. ప్రేమగా మాట్లాడాలి అంటే సంకేతాలనే ఉపయోగిస్తారు. ఉపోద్ఘాతాలు, దీర్ఘ సంభాషణలు ఈ ప్రక్రియలో ఉండవు. ఉపదేశాలు అసలే ఉండవు. ఇంతేకాదు, ‘గజల్’కి ఎన్నో పరిభాషలు ఉన్నాయి. ‘గజల్’ శబ్దాన్ని ఆధారం చేసుకుని నేను నా పరిభాషను తయారు చేశాను. ‘గజల్’ శబ్దం ‘గజాలా’ నుంది వచ్చింది. ఫారసీలో ‘గజాలా’ అంటే జింక అని అర్ధం. పాత రోజులలో వేటగాడు జింకని పట్టుకోడానికి ఒక వాద్యాన్ని వాయించేవాడు. జింక వెనక పరుగెడుతూ వాద్యాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు జింక వాద్య సంగీతం విని మంత్రముగ్ధురాలైపోతుంది. అట్లాగే నిల్చుడిపోతుంది. ఈ సమయంలో వేడగాడు బాణం వేస్తాడు. బాణం వలన అది గాయపడుతుంది. దాని నోట్లో నుండి కేక వస్తుంది. నాను దీన్నే ‘గజల్ ప్రాణం’ అని అంటాను. వ్యక్తిగతమైన బాధ – దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని ప్రతిధ్వనించగల శక్తి ఉన్నప్పుడు, దానిని ‘గజల్’ అని అంటాను. ‘గజల్’ లాగా వ్యక్తిబాధ, అందరి బాధ అవుతుంది. దీన్ని కృష్ణబిహారి ‘నూర్’ ఒక షేరులో ఇట్లా చెప్పారు.
“మైతో గజల్ సునాకె, అకేలా ఖడా రహా
సబ్ అపనే – అపనే చాహ్నే వాలోంమే ఖోగయే.”
(నేనైతే గజల్ వినిపించి ఒంటరిగా నిల్చుండి పోయా. తక్కిన వాళ్ళందరూ తమ తమ ఇష్టమైన వారిని తలుచుకుంటూ మైమరచిపోయారు.)
అశోక్ అంజుమ్: మీరు గజళ్ళు చెప్పడం ఎప్పటి నుండి మెదలు పెట్టారు? మీకు ప్రేరణ ఎవరు కలిగించారు?
నీరజ్: 1944-45లో నేను రంగ్ గారి గజళ్ళను వినేవాడిని. అప్పటి నుండే నేను రాయడం మొదలు పెట్టాను. నేను రాసిన గజళ్ళు నా పాత పుస్తకాల్లో ఉన్నాయి. ఆ సమయంలోని ఒక గజల్ నాకు గర్తుకు వస్తోంది.
వహీ హై మర్కజ్-ఎ-కాబా – వహీ హై రాహే – బుత్‍ఖానా
జహాఁ దీవానే దో మిల్‌కర్ సనమ్ కీ బాత్ కర్‌తే హైఁ.
అక్కడే ఉంది మర్కజ్-ఎ-కాబా, అక్కడే ఉంది గుడి గోపురం. ఎక్కడైతే ఇద్దరు పిచ్చివాళ్ళు ప్రేయసి గురించి మాట్లాడుకుంటారో..
అశోక్ అంజుమ్: హిందీ ఉర్దూ గజళ్ళ మధ్య ఎటువంటి భేదం ఉంది? ఒక వేళ ఉంటే ఆ బేధం గురించి వివరించండి.
నీరజ్: హిందీ గజల్, ఉర్దూ గజల్ మధ్య భాషా వ్యాకరణ విషయంలో సమాసాల బేధం ఉంటుంది. పెద్దగా ప్రత్యేకమైన విశేషమైన తేడా లేదు. కాని భారతీయ ఆత్మ అభివ్యక్తం అయ్యేదే హిందీ గజల్ అని నేనంటున్నాను. ఆత్మ అంటే కేవలం హిందీ అయినా ఉర్దూ అయినా సామెతలు సూక్తులతో కూడినదే కాదు. బుద్ధుడు, మహావీరుడు, గీత, ఉపనిషత్తులు, వైష్ణవతత్వం వీటి గురించిన తత్వవిచారం ఇంకా ఇక్కడి పొలం, పుట్ర, గేదెలు, ధాన్యాగారాలు, రేవులు, నదీనాలాల ఒడ్డున ఉండే పరిమళం, ఆనందం ఏ గజళ్ళల్లో ఉంటాయో వాటినే హిందీ గజళ్ళు అని అంటారు. అంటే వేళ్ళు అందులో పాతుకునిపోయి ఉండాలి. హిందీలో ఎక్కువగా గేయ రచయితలే గజళ్ళు రాసారు. అందువలన గీతాల మాత్రా ఛందస్సుని గజల్‌లో ప్రయోగించే సమయంలో గేయ రచయిత స్వరాఘత్ (యతి) లో పరివర్తన చేస్తే దానిని కూడా నేను హిందీ గజల్ లేకపోతే గీతిక అని అంటాను. ఉర్దు గజళ్ళ ఛందస్సు – ఫైయిలాతున్, ఫాయిలున్, ఫైలున్‌ను ఉపయోగించకపోయినా సరే, ఉర్దు వాళ్ళు ‘ప్రసాద్’ని ‘పరసాద్’, ‘చంద్ర’ని ‘చందర్’, ‘ప్రకృతి’ని ‘పిరాకిత్’, ‘గంగా కే ధారా’ని ‘గంగా కా ధారా’ అని అంటారు. మరి వాళ్ళ ఈ ఉచ్చారణ వైపు, ఎవరు వేలెత్తి చూపరు. మరి హిందీ గేయ రచయితలు గజల్ స్వరాఘాత్‌లో లయ, సంగీతం కోసం అంతో ఇంతో మార్పు చేస్తే వాళ్ళు స్వీకరించరు. వాళ్ళు కూడా స్వీకరించాలి.
అశోక్ అంజుమ్: హిందీలో దుష్యంత్ కుమార్ తరువాత మరెవరూ గజళ్ళు రాయలేదని అంటారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
నీరజ్: ఈ అభిప్రాయం తప్పు. దుష్యంత కుమార్ గారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఆ సిద్ధాంతాన్నే గజళ్ళ ద్వారా వ్యక్తపరిచారు. గజల్ ఒక సిద్ధాంతానికి కట్టుబడి సమాప్తం అయిపోతుందా? కవిత్వానికి విషయం సమస్త అస్తిత్వం అని నేను భావిస్తాను. ఒక సిద్ధాంతానికి మాత్రమే పరిమితి అయితే కవిత్వం చాలా వరకు సీమితం అయిపోతుంది. అంటే దానికి సరిహద్దులు ఏర్పడుతాయి. ప్రేమ, సౌందర్యం విషయములే కాదు, ఈనాటి గజళ్ళల్లో ఎన్నో ఎన్నెన్నో విషయాలు నిబిడీకృతం అయి ఉంటున్నాయి. సమాజం, రాజనీతి, దర్శనం, ఆధ్యాత్మికం, సూఫీతత్వం, రాష్ట్రీయత మొదలైన విషయాలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది గజళ్ళు రాస్తున్నారు. దుష్యంత కుమార్ గజళ్ళ కన్నా ఈనాటి గజళ్ళు ఇంకా ముందుకు దూసుకు వెళ్తున్నాయి. వారి ముందు శ్రీ హృదయేష్, శ్రీ శంభునాథ్ శేష్, శ్రీ బలదీప్ సింహ్, ట్టుబటి ఉండేవారు. ఆ సిద్ధాంతాలమ‘రంగ్’ మొదలైన వారు మంచి మంచి గజళ్ళు రాసారు. సమీక్షకులు కొంత పక్షపాతం చేస్తున్నందు వలన ఇప్పుడు నేను చెప్పిన రచయితల రచనలు పరిశీలించబడలేదు. దుష్యంత్ కుమార్ గారి పేరు ప్రఖ్యాతలను చూసి చాలా మంది గజళ్ళ వైపు ఆకర్షితులయ్యారు. ఇది నిజం. కాని దుష్యంత్ కుమార్ గారు రాసిన గజళ్ళ తరువాత వాటికి భవిష్యత్తే లేకుండా పోయింది అని అనడం సరియైనది కాదు. గజల్ ప్రగతి ఆగిపోయింది అని అనడం సమంజసం కాదు.
అశోక్ అంజుమ్: హిందీ గజళ్ళ పై ఆరోపణ ఉంది – విషయాన్ని యథాతథంగా చెప్పడం, ఒకే రసం, చెప్పిందే చెప్పడం.
నీరజ్: ఇందతా కొంత వరకు మాత్రమే నిజం. కొంతమందిలో రాసే సామర్థ్యం కనిపించదు. కాని కొందరు హిందీ కవులు శ్రేష్ఠమైన గజళ్ళు రాస్తున్నారు.
అశోక్ అంజుమ్: మీరు ఈ సమయంలో గజళ్ళ విషయంలో సంతృప్తిగా ఉన్నారా?
నీరజ్: నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. గజళ్ళకి సంబంధించిన భాషపై హిందీ రచయితలు దృష్టి పెట్టాలి. ఉర్దు గజల్‌కి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రక్రియ చాలా పురాతనమైనది. అందువలన వాళ్ళు భాష మీద అధ్యయనం జరిపారు. భాష మీద పట్టు తెచ్చుకున్నారు. హిందీ కవులు 30, 40 సంవత్సరాల నుండి గజళ్ళు రాస్తున్నారు. ఇంకా వాళ్ళు భాష విషయంలో సాధన చేయాల్సిన అవసరం ఉంది.
అశోక్ అంజుమ్: ఉర్దూ కవుల షేర్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. హిందీ విషయంలో ఇట్లా అంతగా కనబడదు. మీ అభిప్రాయం చెప్పండి.
నీరజ్: నిజమే హిందీ గజల్ రచయితల షేర్లు ఉర్దూ షేర్లంతగా ప్రసిద్ధి పొందలేదు. కాని కొందరు రాసిన గజళ్ళు చాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రసిద్ధి పొందాయి. నేను రాసిన షేర్లు జనాదరణ పొందాయి.
అబ్ కె సావన్ మే షరారత్ మేరే సాథ్ హుయీ
మేరే ఘర్ ఛోడ్ కే కుల్ షహర్ మే బరసాత్ హుయీ
(ఈసారి వర్షాకాలంలో నా పట్ల వేళాకోళం అయింది. నా ఇంటి దగ్గర తప్పితే నగరం అంతటా వర్షం కురిసింది)
మరొకటి –
ఇత్‌నే బద్‌నామ్ హమే హమ్ ఇస్ జమానే మే
తుమ్ కో లగ్ జాయేంగే సదియోం హమేఁ భులానే మే
(ఈ యుగంలో నా పేరుకి ఎంతగా మచ్చ పడ్డదంటే మీరు నన్ను మరచిపోడానికి యుగయుగాలు పడతుంది)
రాజేష్ రెడ్డి పాపులర్ షేర్:
మేరే దిల్ కే కిసీ కోనే మే ఏక్ మాసుమ్ సా బచ్చా
బడోం కో దేఖకర్ దునియా బడా హోనేసే డరతా హై
(నా హృదయంలో ఒక మూల ఉన్న అమాయకుడైన బాలుడు ఈ పెద్దవాళ్ళ ప్రపంచం చూసి, పెద్దవాడవాలంటే భయపడుతున్నాడు)
సూర్యభాను షేర్:
కభీ ఆంసూ! కభీ అష్ ఆర్ మే ఢల్ కర్ ఆయీ
కల్ తేరీ యాద్ కయీ భేష్ బదల్ కర్ ఆయీ
(ఒకసారి కన్నీళ్ళలో మరోసారి ఉల్లాసంలో – నిన్న నీస్మృతి ఎన్నో వేషాలు మార్చి మార్చి వచ్చింది)
మీ షేర్ –
జబ్ సే డాలీ కటీ నీమ్ కీ ఆనా జానా భూల్ గయీ
సదమా ఖకర్ ఇక్ దివానీ బుల్ బుల్ గానా భూల్ గయీ
(వేప కొమ్మ కొట్టేసినప్పుటి నుండి రాకపోకలు మరచిపోయింది. నెత్తిన పిడుగు పడ్డట్లయింది, బుల్‌బుల్ పిట్ట పాడటం మరిచిపోయింది.)
ఇంకా ఇట్లు ఎన్నో విలువైన షేర్లు ఉన్నాయి. హిందీ వాళ్ళు ఉర్దూ షేర్లని ఎప్పుడు హమ్ చేస్తూనే ఉంటారు. కాని ఉర్దూ వాళ్ళు హిందీ షేర్లని ఏ మాత్రం నెమరు వేయరు. నిజానికి ఇది దురదృష్టం అనే చెప్పాలి. దేశంలోని గజల్ గాయకులు, గజళ్ళు రాయాలంటే ఉర్దూ గజల్ గాయకులే పనికి వస్తారు. హిందీ వాళ్ళు కాదు అన్న దురభిప్రాయం కొందరు కవులకి ఉంది. అందువలన మన వాళ్ళు అసలు హిందీ గజల్ గాయకుల దగ్గరికి రానే రారు.
అశోక్ అంజుమ్: జనాదరణ ప్రకారం గీతాన్ని గజల్‌ని ఒకే రకంగా చూడవచ్చా? గజల్ షేర్లని దోహలతో (రెండు పంక్తులుంటాయి) పోల్చవచ్చా?
నీరజ్: గీతం – గజల్ రెండింటిని ఒకే తీరుగా చూడలేము. అవి రెండు సమానం కావు. గీతం కూడా గజల్ అంత జనాదరణ పొందింది. కాకపోతే కోఠే (వేశ్యావాడలు)లలో పాడారు. సినిమాల ద్వారా గీతాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. కాని గజళ్ళకు అంతగా ప్రసిద్ధి రాలేదు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాల తరువాత కూడా కవి ప్రదీప్ గారు రాసిన రాష్ట్రీయ గీతం ఇంకా జనాదరణ పొందుతూనే ఉంది. గీతం రాయడం, గజల్ రాయడం కన్నా ఎంతో కష్టం. గీతంలో ఒకే అనుభూతిని వివిధ చరణాలలో చేర్చి స్వానుభూతిని చరమబిందువు దాకా తీసుకు రావాలి. గజల్ ప్రక్రియ దీనికి భిన్నంగా ఉంటుంది. ఒక షేర్‌తో మరో షేర్‌కి ఎటువంటి సంబంధం లేదు. రెండు పంక్తులు ఉంటాయి. దోహేతో దీనిని పోల్చవచ్చు. షేర్ అంటే కుండలో సాగరం. నీటి చుక్కలో సముద్రం లాంటిది. దోహా కూడా అంతే. రసతీన్, బిహారీ, కబీర్, రహీమ్, తులసి జాయసీ, భారతేందు హరిశ్చంద్ర మొదలైన వారి దోహాలు శ్రేష్ఠమైన గజళ్ళలాంటివే. తరచి చూస్తే దోహాలే గజళ్ళ కన్నా ఎక్కువ విలువైనవి. రస్‌లీన్ దోహే లాంటి గజల్, గజళ్ళ సాహిత్యంలో ఎక్కడా లభించదు.
అమియ హలాహల్ మద్ భరే, శ్వేత శ్యామ రస్‌నార్
జయతీ, మరత్ ఝుకి ఝుకి పరత్ జూహి చితనన్ ఏక్ బార్
ఇదే విధంగా తులసి అర్ధాలీలలో ఉన్న సౌందర్య వర్ణన ఏ షేర్ లోనూ కనిపించదు.
గిరా అనయన్ నయన్ బినుబానీ
నయనాలను వర్ణించే శబ్దలే లేవు.
తులసీదాసు ఆత్మలో సీత ఒక తల్లిగా ప్రతిష్ఠింపబడ్డది. పుత్రుడు తల్లి సౌందర్యాన్ని వర్ణించడం భారతీయ సంస్కృతిలో ఒక నేరం. అందువలన సీతమ్మ తల్లి సౌందర్యాన్ని ఆయన వర్ణించలేదు. సీతమ్మ తల్లి కళ్ళు ఆమె సౌంద్రయాన్ని వ్యక్తం చేస్తాయి కాని ఈ సౌందర్యాన్ని వర్ణించేందుకు మాటలు లేవు. ఒకవేళ వర్ణించగల సామర్థ్యం ఉన్నా దృష్టి లేదు.
నేను ఇదే భావాన్ని ఈ విధంగా వ్యక్తం చేసే ప్రయత్నం చేశాను.
బయనె హస్న్ కా ఉన్ కే హీ కిస్ తరహ్ నీరజ్
జుబాం ఆంఖో నహీఁ, ఆంఖేకి జుబాన్ నహీఁ.
(ఆ సౌందర్యాన్ని ఎట్లా వర్ణించాలి నీరజ్? భాషకు కళ్ళు లేవు, కళ్ళకి భాష లేదు.)
ఆశోక్ అంజున్: మీకు ఇష్టమైన కొందరు హిందీ గజళ్ళ రచయితల పేరు చెప్పండి.
నీరజ్: హిందీ గజళ్ళ రచయితల సూచికలో చాలా మంది రచయితలు ఉన్నారు. ఎంతో సమృద్ధి ఉన్న సూచిక ఇది. సూర్యభాను గుప్త, రాజేష్ రెడ్డి, కువర్ బే జైన్, రోహితాష్య, ఆస్థానా, ఉదయ ప్రతాప్, రాజగోపాల్ సింహ్, అశోక్ అంజుమ్, పవన్ దీక్షిత్, ఓంకార్, గుల్షన్, ప్రమోద్ తివారి, రాజేంద్ర తివారీ, ఊర్మిలేష్, చంద్రసేన్ విరాట్, బాలస్వరూప్ రాషీ, షేర్ జంగ్ గర్గ, సురేంద్ర చతుర్వేదీ, జహీర్ కులైషీ మొదలైన వారి గజళ్ళు నాకు ఎంతో ఇష్టం.
(♠)
