[దేవులపల్లి విజయలక్ష్మి గారు రచించిన ‘అస్తిత్వం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
గాయత్రి బెదురుచూపులతో గేటులోకి అడుగుపెట్టింది. అది ఐదునక్షత్రాల హోటలు. పిల్లలు గుడ్లప్పగించి చుట్టూ చూస్తున్నారు. ‘ఫైవ్ స్టార్ అంటే ఇంతగొప్పగా ఉంటుందా!’ అనుకున్నాడు పదేళ్ళ రాజీవ్.
“అమ్మా! అమ్మా! మావయ్యది పే………ద్ధ ఇల్లు” రెండు చేతులు సాధ్యమైనంత దూరం చేసి పెద్దని సాగదీస్తూ అన్నాడు రిషి.
హోటలుకి అంతదూరాన ఆపిన ఆటోకి డబ్బులుఇచ్చి పంచ సవరించుకొని భార్యాపిల్లల్ని చేరాడు శ్రీధరశర్మ.
“ఏం ఇంకా ఇక్కడే ఉన్నారు? పదండి లోపలికి.” అంటూ గాయత్రిని చూశాడు.
“భయంగా ఉందండి.” అంది వానిటీ బ్యాగ్‌ని చేతిలో బట్టల ప్యాకెట్ సర్దుకుంటూ గాయత్రి.
***
అవధానులుగారు సంస్కృత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం ఎంతోమంది వేదపండితులకి ప్రాణం పోసిన ఆ పాఠశాల అవధానిగారికి గుడి వంటిది.
అవధానిగారు పధ్ధెనిమిదేళ్ల గాయత్రిని ఇరవైమూడేళ్ళ శ్రీధరశర్మకు ఇచ్చి వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా వివాహం చేశాడు.
శ్రీధరశర్మ వేదపాఠశాలలో ప్రధానాంశాలైన వేదాలు, వేదాంగాలు, ఆగమశాస్త్రాలు, మంత్రాలు, శ్లోకాలు తాత్విక బోధనల్లో ప్రథమస్థానంలో ఉండి ప్రధానోపాధ్యాయులైన అవధానుల అభిమానం చూరగొని వారి కుమార్తెనే పాణిగ్రహణం చేశాడు.
అనుకోని రీతిలో అవధానిగారి కుమారుడు చంద్రశేఖర్ సంస్కృతవిద్య మీద మక్కువ లేకపోవటంతో ఇంజనీరింగ్ చదివి విదేశాలలో పైచదువుకి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
పిలక పంచకట్టులో బావగారు అంటే చిన్నచూపు. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లల తల్లి అయిన చెల్లెలంటే ప్రేమకంటే జాలిఎక్కువ.
యాభైఏళ్లకే అవధానిగారి ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లితండ్రులను తనతోపాటు అమెరికాకు తీసుకెళ్లి వారికి గ్రీన్ కార్డు సంపాదించాడు చంద్రశేఖర్.
చేతకాని పరిస్థితుల్లో కొడుకు దగ్గరున్నా స్వంతఊరును, వేదపాఠశాలను, కన్నకూతురుని మరువలేకపోయారు అవధానులుగారు.
శ్రీధరశర్మ శ్రీకాళహస్తిలో దేవస్థానంలో పూజారి. మధ్యలో చంద్రశేఖర్ తల్లితండ్రిని తీసుకొనివచ్చినా చెల్లెలు గాయత్రి ఇంట్లో ఉండలేక మరుసటిరోజు భార్యపిల్లలతో హోటల్లో బసచేశాడు.
***
దాదాపు ఆరుసంవత్సరాల తర్వాత తండ్రి షష్టిపూర్తి సందర్భంగా తిరుపతి వచ్చి ‘మానస సరోవర్’ హోటల్లో ముఖ్యులను పిలిచి గ్రాండ్‌గా గెట్‌టుగెదర్ ఏర్పాటు చేశాడు.
హోమాలు వేదమంత్రాల మధ్య జరగాల్సిన తన షష్టిపూర్తి ఇలా హోటల్లో ససేమిరా ఇష్టంలేదు అవధానిగారికి.
కానీ తనవారందరినీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లిచూడలేని పరిస్థితి. ఈ విధంగానైనా వారందరినీ కలవవచ్చని ఒప్పుకున్నాడు.
‘పద్మాసనం వేసుకొని వేదమంత్రాలతో అగ్నికి ఆజ్యంతో హోమాలు నిర్వహించిన తాను ఇలా బుడబుక్కలాడిలా సూటు బూటుతో సింహాసనంలాంటి సోఫాలో భార్యతోపాటు కూర్చోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంది.’ అనుకున్నాడు అవధాని.
అవధాని, సువర్చల దంపతులను అభినందించడానికి చంద్రశేఖర్ భార్య తరపున బంధువులే చాలామంది వచ్చారు. అవధానిగారి ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నలు వచ్చారు. కానీ ఆ వాతావరణంలో ఇమడలేక మూలగా కూర్చున్నారు.
***
ఎదురుగా వేదికమీద ఠీవితోకూర్చున్న తల్లితండ్రులని చూసిన గాయత్రి బిడియం మటుమాయమయ్యింది. ఒక్క ఉదుటున వెళ్ళి తల్లిని తండ్రిని కౌగిలించుకుంది. అప్పటివరకు కట్టెబొమ్మల్లా ఉన్న ఆ దంపతులలో చైతన్యం వెల్లివిరిసింది.
శ్రీధరశర్మ అత్తమామలకు నమస్కారం చేయబోవ ఉండమని కాళ్లకున్న షూ, సాక్స్ విప్పి చేతులు ప్రక్షాళన చేసుకుని కాళ్లకు దండం పెట్టిన కూతుర్ని, అల్లుడ్ని, మనవలను కంచుకంఠంతో వేదఆశీర్వచనం చేశారు అవధానిగారు.
తల్లితండ్రులకు తాముతెచ్చిన పట్టుచీర, పట్టుపంచలు, గాయత్రి శ్రీధరశర్మ సమర్పించుకున్నారు.
వెంటనే శాస్త్రీయవస్త్రధారణతో అవధాని సువర్చలలు నేలమీద తివాసీలమీద కూర్చున్నారు.
తదుపరి కేక్ కటింగ్ అని చంద్రశేఖర్ ప్రకటించంగానే ఆ మైకు తీసుకొని అవధానులుగారు తదుపరి వేదపఠనం అని ప్రకటించటం, అంతలోనే గురువుగారిని సందర్శించుకోవటానికి పూర్వపు విద్యార్థులు శ్రీధరశర్మ ఆదేశానుసారం విచ్చేసిన ఘనాపాటీలు క్రింద తివాసి మీద పద్మసనాలతో కూర్చొని వేదఘోష చేశారు. మైకులేకుండానే వేదఘోషతో హాలంతా మారుమ్రోగింది.
అవధానిగారు వచ్చిన బ్రహ్మలకు మర్యాదలుచేసి వారి ఆశీర్వచనం పొందారు.
***
వచ్చినప్పటినుంచి బ్యాగు క్రిందపెట్టకుండా అవస్థలు పడుతున్న కూతుర్ని చూసిన సువర్చల, “ఏమిటమ్మా! అంత బ్యాగు? గూడలు పడిపోయేట్టు.” అంది.
“ఏం లేదమ్మా!” అని తప్పించుకుంటున్న కూతురు దగ్గర బ్యాగు లాక్కొని తెరిచింది.
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సువర్చలకు. తండ్రికిష్టమని జున్ను, తిరుపతి లడ్డు, పులిహోర బాక్సులలో పెట్టుకొని తీసుకొచ్చింది.
వచ్చినవారంతా భోజనాలకి తరలారు.
చంద్రశేఖర్ తండ్రి దగ్గరికివచ్చి, “మీరు నలుగురిలో ఈ విధంగా నన్నవమానిస్తారనుకోలేదు. భోజనానికి రండి.” అని చెల్లెల్ని, బావగారిని, తల్లి తండ్రిని ఆహ్వానించాడు.
“మాకు చిత్తశుద్ధితో నా బిడ్డ గాయత్రి తెచ్చిన ఈ ప్రసాదం చాలు. నేను వేసిన చిన్నవిత్తనం మర్రిచెట్టంత మహావృక్షమై నాకు వేదఘోషతో జరిగిన సన్మానం నాకు ఆత్మతృప్తినిచ్చింది. చిత్తశుద్ధిలేని ఈ ఆర్భాటాలు నాకు వద్దు. నా శేషజీవితం ఈ పుణ్యభూమి మీదనే.” స్థిరచిత్తంతో అన్నారు అవధానిగారు.
