Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అస్తిత్వం

[శ్రీమతి హిమజ రచించిన ‘అస్తిత్వం’ అనే కవితని అందిస్తున్నాము.]


సముద్రం ముందర నిలబడి
నేను అడిగిన మొదటి ప్రశ్న
నీవెంత లోతని కాదు –
నేనంటూ ఉన్నానా? అని
అలలు జవాబు చెప్పలేదు,
ఉన్నదానిని చెరిపేస్తూ
మళ్లీ రాసుకుంటూ పోయాయి –

అస్తిత్వం అంటే
ఒక నిరంతర సవరణ ప్రక్రియలాగ.
తీరం ఒక భ్రమ,
ఇక్కడ నిలబడ్డానని అనుకోవడమే
భద్రత.
లోపలికి అడుగుపెడితే
నేను అనే సరిహద్దులు
కరిగిపోతాయి.

లో లోతుల్లో
పేరు లేదు,
రంగు లేదు,
సాక్ష్యం లేదు –
అక్కడ నేను
నా గుర్తింపులన్నింటిని
తీసి పెట్టాల్సి వస్తుంది,

నిలిచిపోయినది నేను కాదు
మారుతున్న ప్రశ్నను.
సమాధానాల మధ్య
తుడిచివేతలతోనే నా ఆకృతి.
సవరణే నా శ్వాస.

మునిగిపోవడం అంటే
చనిపోవడం కాదు –
నిజానికి
నేనని అనుకున్నదానిని
వదిలేయడం.

సముద్రం
నన్ను ప్రశ్నిస్తుంది.
నీవు అలవా?
లేదా నీడవా?
నీవు లోతువా

తీరానికి తిరిగి వచ్చాక
నేను
మాట్లాడుతున్నాను,
నవ్వుతున్నాను,
జీవిస్తున్నాను..
కానీ లోపల ఎక్కడో
ఒక లోతు
ఇంకా నన్ను పిలుస్తూనే ఉంది.
అది సముద్రమా?
లేదా
నా అస్తిత్వం మిగిల్చిన
ఒక నిశ్శబ్ద ప్రశ్ననా..?

Exit mobile version